విదేశీ విద్యార్థులకు అపరిమిత సీట్లు
#ఎంత మంది వస్తే అంత మందికి సీట్లు
# సూపర్ న్యూమరరీ కోటాలో సీట్ల పెంపు
# అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు
#తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు
విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులకు అన్లిమిటెడ్ సీట్లను కేటాయించాలని నిర్ణయించింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఎంత మంది వస్తే అంత మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నది. అవసరమైతే సూపర్ న్యూమరరీ కోటాలో సీట్లను పెంచి అడ్మిషన్లు ఇవ్వనున్నది. మన దగ్గర డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్, సీపీగెట్‌ను నిర్వహిస్తు న్నారు. ఈ ప్రవేశ పరీక్షల ర్యాంక్‌ల ఆధారంగానే సీట్లను కేటాయిస్తున్నారు. విదేశీ విద్యార్థులకు మాత్రం ప్రవేశ పరీక్షతో నిమిత్తం లేకుండా ఎంత మంది వచ్చినా సీట్లు కేటాయిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఈవిధానం అమలవుతుందని వెల్లడించారు. 2019-20లో మన రాష్ట్రంలో పలు దేశాలకు చెందిన 2,261 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరిలో అబ్బాయిలు 1,784 మంది ఉండగా, అమ్మాయిలు 477 మంది ఉన్నారు. వీరిలో 32 మంది పీహెచ్డీ, 223 పీజీ, 1,908 డిగ్రీ, 10 పీజీ డిప్లొమా, 16 డిప్లొమా, 72 విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ కోర్సుల్లో చేరారు. 2020-21లోనూ సుమారు 2 వేల మంది ప్రవేశాలు పొందారు. ఓయూ, జేఎన్టీయూ వంటి వర్సిటీల్లోనే అత్యధి కులు చేరుతున్నారు. భారత్‌కు ఏటా 50 వేలకు పైగా విద్యార్థులు చదువుకొనేందుకు వస్తున్నారు. వారిలో అత్యధిక శాతం మందిని హైదరాబాద్‌కు వచ్చేలా ప్రోత్సహించేందుకు అన్లిమిటెడ్ సీట్లను అమలు చేస్తున్నారు.
డిగ్రీలోనూ నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా
దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సీట్లను కేటాయించే నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను డిగ్రీ కోర్సుల్లో సైతం అమలుచేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు అన్ని పీజీ కోర్సుల్లో ఈ కోటాను అమలుచేస్తుండగా, తాజాగా దోస్త్ ద్వారా చేపడుతున్న డిగ్రీ అడ్మిషన్లలోనూ అమలుచేయాలని నిర్ణయం తీసుకొన్నారు. దానికోసం కోటాను 20 శాతానికి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఈ కోటాలో సీట్లు కేటాయిస్తారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్ : ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
హైదరాబాద్ ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో వేగంగా దూసుకుపోతున్నది. అమెజాన్, ఫేస్బుక్ వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు తరలివస్తున్నాయి. ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు, పరిశోధనా సంస్థలు కొలువుదీరాయి. హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఇప్పటికే అనేక విద్యాసంస్థలు ఎంతో మందికి నాణ్యమైన విద్యనందిస్తున్నాయి. ఈ ఒరవడిని కొనసాగించడంలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులను మరింత ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకొని అమలుచేస్తున్నాం. అంతర్జాతీయంగా విద్యార్థులందరికీ హార్థిక స్వాగతం పలుకుతున్నాం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు