ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తావు లేదు : చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
– వర్సిటీ ఆచార్యుల భర్తీపై నమ్మకం కలిగిస్తాం
– వర్సిటీ రిక్రూట్మెంట్ కామన్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
– ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ
బంధుప్రీతి.. ఆశ్రితపక్షపాతం.. అవినీతికి తావులేకుండా ఉద్యోగాల భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. అందులో ఒకటి.. గ్రూప్-1 ఇంటర్వ్యూల రద్దు కాగా, తాజాగా ఏర్పాటు చేసిన వర్సిటీ రిక్రూట్మెంట్ కామన్ బోర్డు మరొకటి. వర్సిటీ ఉద్యోగాల భర్తీ వివాదాస్పదం కానొద్దన్న సదుద్దేశంతోనే సర్కారు ఈ కీలక అడుగు వేసింది. గత పదేండ్లలో జరిగిన నియామకాన్నీ వివాదాస్పదమయ్యాయి. కాకతీయ, మహత్మాగాంధీ, తెలంగాణ వర్సిటీల్లో ఆచార్యుల నియామకాలపై వివాదాలు చెలరేగాయి. తమను సరిగా ఇంటర్వ్యూలు చేయలేదని, ఇలా పిలిచి అలా పంపించేశారని, మార్కులు తక్కువగా వేశారని కోర్టును ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. జేఎన్టీయూ, ఆర్జీయూకేటీల్లో కొన్ని నియామకాలను ప్రభుత్వం రద్దు కూడా చేసింది. కొత్త బోర్డు ఏర్పాటుతో వీటన్నింటికీ పరిష్కారం దొరకనున్నాయి. ప్రభుత్వం ఈ బోర్డుకు తొలి చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని నియమించింది. ఈ సందర్భంగా వర్సిటీ ఉద్యోగాల భర్తీపై ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పైరవీలకు తావు లేకుండా పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే..
త్వరలో మార్గదర్శకాలు
కామన్ బోర్డు, నియామక ప్రక్రియ మార్గదర్శకాలు త్వరలోనే విడుదలవుతాయి. విధివిధానాలు ఖరారైన తర్వాత ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. బోర్డులో ఆర్థికశాఖ, విద్యాశాఖ కార్యదర్శులు, కళాశాల విద్య కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. త్వరలో చేపట్టబోయే నియామకాలన్నీ ఈ బోర్డు ద్వారానే జరుగుతాయి. అవకతవకలకు ఆస్కారమే ఉండదు. గతంలో ఓ వర్సిటీలో నియామకాల ప్రక్రియ చేపడితే పూర్తి చేసేందుకు సంవత్సరం పట్టింది. ఇప్పుడు జాప్యానికి తావు లేకుండా త్వరితగతిన నియమకాలు పూర్తి చేస్తాం. వీలైనంత త్వరగా పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. నిర్ణీత గడువు పెడతాం. నోటిఫికేషన్ సమయంలోనే అన్ని వివరాలను ప్రకటిస్తాం. ఆయా షెడ్యూల్స్, వివరాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.
దీర్ఘకాలిక ప్రయోజనాలు
బోర్డు ఏర్పాటు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. గతంలో వర్సిటీల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తుండటంతో పది వర్సిటీలకు నోటిఫికేషన్ ఇస్తే పదింటికి వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉండేది. నెలల తరబడి ఇంటర్వ్యూలు జరిగేవి. ఒక అభ్యర్థి రెండు వర్సిటీలకు ఎంపికై, ఏదో ఒకటి ఎంచుకొంటే.. మిగతా వర్సిటీలో చేపట్టిన భర్తీ ప్రక్రియ అంతా వృథా అయ్యేది. ఇప్పుడు ఆ సమస్య ఉండదు. ఒకే నోటిఫికేషన్తో అభ్యర్థుల రోస్టర్, ప్రతిభ, అభ్యర్థులు ఎంచుకొనే ఆప్షన్ల ఆధారంగా భర్తీ ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థి ఒకే దరఖాస్తుతో 15 వర్సిటీలకు పోటీపడవచ్చు. అయితే రోస్టర్ పాయింట్లు కీలకం. తమ రోస్టర్ ఉంటేనే ఆయా వర్సిటీలో పోస్టులకు పోటీపడొచ్చు.
యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే
పలు రాష్ట్రాల్లో బోర్డుల ద్వారా భర్తీ ప్రక్రియ చేపడుతున్నారు. బోర్డు ఏర్పాటు చేసినా, నియామకాలు యూజీసీ మార్గదర్శకాలను అనుసరించే జరుగుతాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోం. న్యాయపరమైన చిక్కులకు ఆస్కారం లేకుండా, పకడ్బందీగా నియామకాలు చేపడుతాం. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అభ్యర్థులకు అందజేస్తాం. సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తిచేస్తాం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు