వీరే మన తెలంగాణ కవులు..!
గుండేరావు హర్కారే
-బహుభాషావేత్త, రచయిత, ధర్మశాస్త్ర పండితుడు. 1887, మార్చి 13న హైదరాబాద్‌లో జన్మించారు. నిజాం కాలంలో న్యాయస్థానంలో గుమస్తాగా పనిచేసి అరబ్బీ, పార్శీ, తెలుగు, మరాఠీ, కన్నడం, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో విశేష ప్రజ్ఞ సంపాదించారు.
-ఇతనికి విద్యాభూషణ్ అనే బిరుదు ఉంది. ఇంగ్లిష్ కవి గోల్డ్‌స్మిత్ రాసిన ట్రావెలర్‌కు సంస్కృత పద్యానువాదం చేశారు. థామస్ గ్రే రాసిన ఎలీజీ, గోల్డ్ స్మిత్ రాసిన The Deserted Village, వర్డ్స్ వర్త్ రాసిన ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, పార్శీ భాషలో మన్నవీ షరీఫ్, బాబా బెహర్ కావ్యం, అరబ్బీలోని ఖురానే షరీఫ్, షేక్స్పియర్ నాటకాలు హామ్లెట్, ది మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ తెలుగులో ప్రభావతి ప్రద్యుమ్నం మొదలైన గ్రంథాలను సంస్కృత పద్యానువాదం చేశారు.
-యాజ్ఞవల్క్య స్మృతి మితాక్షరను ఖురానే మితాక్షర పేరిట అనువదించారు. యాస్కుని నిరుక్తమును కొంతవరకు తెనిగించారు. మరాఠీ సాహిత్య చరిత్రను తెలుగులో అనువదించారు. ఈశ, కౌన, కఠోపనిషత్తులపై కారికలు.. రాశారు. ప్రత్యయకోశము అనే పేరుతో సంస్కృత వ్యాకరణ గ్రంథం రాశారు.
-పాణిని సంస్కృత వ్యాకరణశాస్త్రం అష్టధ్యాయిని ఆధునిక విజ్ఞాన శాస్ర్తాల వంటిదని ఈయన అభిప్రాయం. ఈయన రచనలు భారతి, మధురవాణి, ఎడ్యుకేషనల్ రివ్యూ, సంస్కృతం, ఇస్లామిక్ కల్చర్ మొదలైన పత్రికల్లో అచ్చయ్యాయి. మద్రాస్‌లోని కుప్పుస్వామిశాస్త్రి పరిశోధన సంస్థ, రాష్ట్రప్రభుత్వం, తెలుగు రచయితల సంఘం ఈయనను సన్మానించాయి. రాష్ట్రపతి సర్టిఫికెట్ ఆఫ్ ఆనర్‌ను పొందారు. 92వ ఏట 1979, డిసెంబర్ 3న మరణించారు.
గౌరీశంకర వర్మ-నాంపల్లి
-జాతీయవాది, భాషాపోషకుడు, సంఘసంస్కర్త. ఈయన స్వగ్రామం వరంగల్ జిల్లాలోని పెద్దపెండ్యాల గ్రామం. తల్లిదండ్రులు లింగమాంబ, శేషయ్య. తెలుగు భాష, సంస్కృతులపై ఇతనికి అభిమానం ఎక్కువ. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించినవారిలో వర్మ ఒకరు. ఈయన సుల్తాన్‌బజార్‌లో బాలికల కోసం మాధ్యమిక పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు. నారాయణగూడలో ఆంధ్రబాలికా పాఠశాలను స్థాపించినవారిలో ఈయన ఒకరు. హైదరాబాద్‌లోని అన్ని విద్యాసంస్థలకు నిస్వార్థ సేవ చేశారు. తన స్వగృహాన్ని ఆంధ్రబాలికా పాఠశాలకు దానం చేశారు.
దిగంబర్ రావు బిందు (1896-1983)
-నిజాం సంస్థానంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. నాందేడ్ జిల్లాలో 1896, జూలై 12న జన్మించారు. ఈయన వ్యాసాలు నిజాం సంస్థానంలోని ఏకైక మరాఠీ పత్రిక నిజాం విజయలో ప్రచురితమయ్యాయి. ఈ పత్రిక సంపాదకుడిగా 1920-24 మధ్య పనిచేశారు. నాగరిక అనే మరాఠీ పత్రిక నడిపారు. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో దేశీయ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 85వ ఏట 1983లో మరణించారు.
చరిగొండ ధర్మన
-16వ శతాబ్ద ప్రారంభపు ప్రౌఢ కవి. ఈయనకు శతలేఖిన్యవ్యవధాన పద్యరచనా నంధాసురత్రాణ అనే బిరుదు ఉంది. దీని అర్థం శతావధాని.
-ధర్మన రాసిన చిత్రభారతంను వరంగల్‌లోని ఎనుములపల్లి పెద్దనామాత్యునకు అంకితమిచ్చాడు. ఈ పెద్దనామాత్యుడు షితాబ్‌ఖాన్ మంత్రి. చిత్రభారత కథను బ్రహ్మాండ పురాణం నుంచి గ్రహించారు.
వడ్లకొండ నరసింహారావు (1893-1955)
-1893లో హన్మకొండలో జన్మించారు. తండ్రి శివరామయ్య. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1951లో ఆంధ్రోద్యమం-ఆయుర్వేదం అనే పుస్తకాన్ని రాశారు. ఈయనకు ప్రజాసేవ వక్త అనే బిరుదు ఉంది.
బొజ్జ నర్సింహులు (1895-1977)
-సంఘసేవకుడు, సంస్కరణవాది, స్వాతంత్య్రయోధుడు. ఇబ్రహీంపట్నంలో 1895లో జన్మించారు. కొంతకాలం గోల్కొండ పత్రికకు మేనేజర్‌గా పనిచేశారు. రిఫాహె ఆమ్ పాఠశాలను నెలకొల్పారు. జీవరక్షా జ్ఞానప్రచార మండలి, జీవకారుణ్య సంఘానికి గౌరవ కార్యదర్శిగా పనిచేశారు.
తూము రామదాసు కవి (1853-1904)
-పండితుడు, కవి. 1853లో ఓరుగల్లులో జన్మించారు. 28 ఏండ్లు సాహిత్య జీవితం గడిపారు. ఇతని గురువు ప్రతాపపురం రంగాచార్యులు. రుక్మిణీ కల్యాణం అనే గేయకావ్యం, గోపికా……..వాట్య, మిత్రవిందోద్వాహం రచనలు, సటికా శుద్ధాంధ్ర పద్య నిఘంటువును రూపొందించారు. తెలంగాణ భాషలోని దేశీ శబ్దాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి (1911-81)
-మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సంస్థానంలో 1911, జూలై 2న జన్మించారు. దేశంలోని సంస్కృత మహా వక్తల్లో ఒకరైన లక్ష్మణశాస్త్రి తెలంగాణ గర్వించదగిన వ్యక్తి. తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషల్లో గొప్ప పండితుడు. అనర్గళంగా ప్రసంగించేవారు. ఈయన కవితలు ప్రాచీన కావ్య ప్రబంధ ధోరణిలో ఉండేవి. తండ్రి శ్రీనివాసశాస్త్రి, తల్లి పద్మావతి. తిరుపతి, అన్నామలై, మద్రాస్ సంస్కృత కళాశాలలో విద్యనభ్యసించారు. ఈయనకు వేదాంతశిరోమణి, సాహిత్యశిరోమణి అనే బిరుదులు
ఉన్నాయి. తిరుపతిలో ఈయనకు ఆంధ్రబిల్వణ అనే బిరుదును ప్రదానం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మదన్ మోహ న్ మాలవ్యా ఈయనకు సురేంద్ర మౌళి అనే బిరుదునిచ్చారు. బ్రహ్మభూషణ, మహామహోపాధ్యాయ బిరుదులు ఉన్నాయి. తిరువాన్కూరు మహారాజు, గ్వాలియర్ మహారాజు, జగద్గురు శంకరాచార్యులు ఈయనను ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలలో, ఇతర సాహిత్య, సాంస్కృతిక సంస్థలలో సన్మానించారు.
-మాదిరాజు విశ్వనాథరావుతో కలిసి ఈయన బిల్హణుని విక్రమాంకదేవ చరిత్రను, కర్ణసుందరీ నాటకాన్ని ప్రౌఢప్రబంధ శైలిలో తెలుగులో రాశారు. సంస్కృత మహాభారతాన్ని యథావిధిగా తెలుగు వచనంలోకి మార్చారు. తెలుగు సంస్కృత కోశం, సంస్కృత వాచకం రాశారు. విజ్ఞాన సర్వస్వం, సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం మొదలైన వాటిలో అనేక వ్యాసాలు రాశారు. ఉర్దూ, హిందీ, మరాఠీ భాషల్లోని చాలా గ్రంథాలను అనువదించారు. ఈయన మంచి స్నేహశీలి. రిక్షావాడి నుంచి గవర్నర్ వరకు అందరూ ఈయనకు మిత్రులే. ఈయన 1981, జనవరి 10న మరణించారు.
ఎన్కే రావు
-విద్యావేత్త, సంఘసేవకుడు, లాయర్, మేధావి, జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు. నాగులపల్లి కోదండ రామారావు మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపురం తాలూకా చిక్కేపల్లి గ్రామంలో 1903లో జన్మించారు. ఈయన తండ్రి పట్టాభి రామారావు. సీతారామ్‌బాగ్‌లో ఒక సంస్కృత పాఠశాల నెలకొల్పారు. ఆంధ్రవిద్యాలయం స్థాపకులలో ఒకరు. తెలంగాణ గ్రంథాలయోద్యమం వ్యాప్తికి ఎనలేని కృషిచేశారు. హైదరాబాద్ గౌలిగూడ చమన్లోని బాలసరస్వతి ఆంధ్రభాషా నిలయానికి అనేక ఏండ్లు కార్యదర్శిగా పనిచేశారు. దానికి ఒక భవనాన్ని ఏర్పాటు చేసింది ఈయనే.
-1937లో నిజామాబాద్‌లో జరిగిన మతకలహాల కేసులో నిజాం ప్రభుత్వం సమాచారశాఖ డైరెక్టర్ విడుదల చేసిన ప్రకటన కోర్టు ధిక్కారం కింద వస్తుందని వాదించి, హైకోర్టు ఫుల్ బెంచ్ ద్వారా ఆ విధంగా తీర్పు చెప్పించగలిగిన ధీశాలి. 1938లో సత్యాగ్రహం చేసి గుల్బర్గా జైలులో శిక్ష అనుభవించారు. పోలీస్ చర్యకు ముందు భారత ప్రభుత్వ ప్రతినిధి కేఎం మున్షీకి, రామానంద తీర్థకు మధ్య సంధానకర్తగా, నిజాంను ధిక్కరించి, హైదరాబాద్ విమోచనోద్యమానికి తోడ్పడ్డారు. 1952, డిసెంబర్ 6న మరణించారు.
చేమకూర సత్యనారాయణరావు (1901-70)
-తెలంగాణలో సుప్రసిద్ధ చిత్రలేఖకుడు. హైదరాబాద్ జిల్లా గంజూటిలో 1901, ఏప్రిల్ 8న జన్మించారు. తండ్రి సీవీ స్వామి. సత్యనారాయణరావు దామెర్ల రామారావు వద్ద శిష్యరికం చేశారు. బొంబాయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి డిప్లొమా పొందారు. ప్రసిద్ధ వ్యక్తుల చిత్రాలు 150 వరకు గీశారు. ఈయన గీసిన చిత్రాలు మద్రాస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, వెంకటేశ్వర, అన్నామలై, మద్రాస్, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు, పార్లమెంట్, మద్రాస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలు, మద్రాస్ మ్యూజియం, బొంబాయిలోని ఆర్బీఐ, ఆర్ట్ గ్యాలరీల్లో ఉన్నాయి.
-ఈయన సౌత్ ఇండియన్ సొసైటీ ఆఫ్ పెయింటర్, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీలకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన గీసిన బుద్ధభగవానుడు చిత్రం ప్రముఖమైనది. ఇది తమిళనాడు రాజ్‌భవన్‌లో ఉంది. ఈయన మద్రాస్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యునిగా పనిచేశారు. చిత్రకళను గురించి ఈయన అనేక పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆర్ట్ అండ్ బ్యూటీ అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారు. అనేక కథానికలు రాశారు. మద్రాస్‌లో చేమకూర ఆర్ట్ అకాడమీని స్థాపించారు.
అక్షింతల శాస్త్రి
-జటప్రోలు సంస్థానంలో ఉన్న అయ్యవారిపల్లె గ్రామంలో సుబ్బశాస్త్రి, సుబ్బమ్మలకు జన్మించారు. గద్వాల, వనపర్తి, జటప్రోలు, గోపాలరావుపేట, ఆత్మకూరు సంస్థానాల్లో పండితునిగా పనిచేశారు. అన్నపూర్ణాష్టకం స్తోత్రం రాశారు. శ్రీశైల మల్లికార్జున రత్నపంచకం (ముద్రితం), భాస్కరఖండం, ద్వాదశమంజరి స్తోత్రం రచించారు. ఈయన తన తండ్రి వద్దనే తర్కవేదాంత శాస్ర్తాలు అభ్యసించారు. వెంకటగిరి సంస్థాన ప్రభువైన బంగారు యాచమ నాయకుడు ఇతనిని సన్మానించారు. 1906లో మరణించారు. ఈయనకు అపర గౌతముడు అనే బిరుదు ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు