విజ్ఞానశాస్త్రం- ప్రాముఖ్యత
పరిచయం: మానవుడు తన చుట్టూ ఉన్న భౌతిక జీవ వాతావరణాన్ని నిశితంగా పరిశీలించడం, పరిశీలించిన అంశాల మధ్య అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచడం ద్వారా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన భావనలను రూపొందించుకున్నాడు.
-ఈ మానవ ప్రయత్నమే విజ్ఞానశాస్ర్తానికి దారి తీసింది. ప్రకృతిలోని రహస్యాలు తెలుసుకోవడానికి ఎందరో శాస్త్రజ్ఞులు నిర్విరామంగా కృషిచేసి మనకు ఈ విజ్ఞానశాస్ర్తాన్ని అందించారు.
-సాంఘిక, ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, ఆరోగ్య, రవాణా రంగాలన్నింటిలో విప్లవాత్మక మార్పులు శాస్త్రీయ విజ్ఞాన అభివృద్ధి ద్వారా జరుగుతున్నవే.
విజ్ఞానశాస్త్ర నిర్వచనాలు
-విజ్ఞానశాస్త్రం- సైన్స్ అనే పదం లాటిన్ భాషలో Scientia లేదా Scire అనే పదాల నుంచి వచ్చింది. సైన్షియా లేక సైర్ అంటే జ్ఞానం అని అర్థం. ఈ పదం నుంచి విజ్ఞానశాస్త్రం అంటే క్రమబద్ధమైన విజ్ఞానం అని అనుకోవచ్చు.
-శాస్త్రం అంటే చేయడం అని అర్థం.శాస్త్రమనేది సంచిత జ్ఞానమే కాకుండా సమస్యలను పరిష్కరించే ప్రక్రియ కూడా. వివిధ శాస్త్రజ్ఞులు విజ్ఞాన శాస్ర్తాన్ని వివిధ రకాలుగా నిర్వచించారు.
రిచర్డ్సన్: శాస్త్రమనేది ఒక ఆలోచనా పద్ధతి -సమస్యాపూరాణం, అందులో ఒక దృక్పథం, అందులో సమస్యాపూరణానికి ఉపయోగించే సాధన, ప్రకృతిలోని సంభవాలను పరిశోధించగా ఏర్పడే జ్ఞానం.
కార్ల్ పియర్సన్: విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వాసం, దాని పూర్వచరిత్ర, అందులోని జీవ ప్రపంచం ఒక ముడిపదార్థమే.
విజ్ఞానశాస్త్ర స్వభావం
-భావి శాస్త్రజ్ఞులను తయారుచేసే ఉపాధ్యాయులుగా విజ్ఞానశాస్త్ర స్వభావాన్ని తప్పక తెలుసుకోవాలి.
-విజ్ఞానశాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి పాయింకేర్ విజ్ఞానశాస్ర్తాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చాడు. శాస్త్ర అభివృద్ధిలో భావనలు, ప్రక్రియలు, సామాన్యీకరణాలు ఈ మూడూ ముఖ్యాంశాలు.
-శాస్త్ర నిర్మాణానికి భావనలు పునాది. పద్ధతులు ప్రక్రియలు అడ్డు స్తంభాలు. కొత్త పరిశీలనలు, పరిశోధనల ద్వారా కొత్త సామాన్యీకరణాలను ఏర్పరచడం మరొక నిలువు స్తంభం చేర్చడం వంటిది. (శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చడం విజ్ఙానశాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే.)
-శాస్త్రజ్ఞులు నిర్మించిన విజ్ఞానశాస్త్రం కేవలం సత్యాలనే కాక, సాధారణీకరణాలు సిద్ధాంతాలను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి విజ్ఞానశాస్త్ర స్వరూపాన్ని కచ్చితంగా చెప్పడం కష్టం.
-శాస్త్రజ్ఞులు స్తబ్ధ దృష్టి, గతిశీల దృష్టి అనే రెండు కోణాల్లో విజ్ఞానశాస్ర్తాన్ని చూస్తారు. స్తబ్ధ దృష్టిలో విజ్ఞానశాస్త్రం అంటే యథార్థాలు, భావాలు, సిద్ధాంతాలు, నియమాలు మాత్రమే. అంటే విజ్ఞానశాస్త్రం ఒక ఉత్పన్నం మాత్రమే. గతిశీల దృష్టితో చూసిన విజ్ఞానశాస్త్రం ఒక నిరంతర ప్రక్రియ.
-విజ్ఞానశాస్త్ర నిర్వచనాన్ని బట్టి శాస్త్ర స్వభావాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు.
-శాస్త్రం= పద్ధతులు+ జ్ఞానం
-ప్రక్రియ + ఫలితం
-జ్ఞానం + జ్ఞానం సముపార్జించేమార్గం
-శాస్త్రీయ పద్ధతి+ శాస్త్రీయ వైఖరి + శాస్త్రజ్ఞానం
-కాబట్టి విజ్ఞానశాస్త్రం అంటే సూత్రాలు, నియమాలు, భావనలు, సిద్ధాంతాలు వంటి ఫలితాలు మాత్రమేకాక నిరంతరం కొనసాగే ప్రక్రియ. యథార్థాలు తాత్కాలికలు మాత్రమే అని తెలుస్తుంది.
-విజ్ఞానశాస్త్ర లక్షణాలు: విజ్ఞానశాస్త్ర లక్షణాలను షోఆల్టర్ కింది విధంగా వివరించారు.
-శాస్త్రం అనుభవాత్మకం: పరిశీలనల ద్వారా, ప్రయోగాల ద్వారా సంపాదించే జ్ఞానం విజ్ఞానశాస్త్రంతోనే సాధ్యం.
-శాస్త్రీయ జ్ఞానం సాపేక్ష సత్యమే: శాస్త్రీయ స్వభావాన్ని పరిశీలిస్తే రాశీభూతమైన జ్ఞానం సాపేక్ష సత్యమని తెలుస్తుంది.
-శాస్త్రీయ జ్ఞానం మాపనీయమైనది: మానవుడి కృషి వల్ల ఉత్పత్తి అయ్యే సత్యాల సముదాయం.
-శాస్త్రీయ జ్ఞానం అసమానమైంది: ఇతర శాస్ర్తాలతో సరిపోలిస్తే శాస్త్రీయ పరిజ్ఞానానికి ప్రత్యేక స్థానం ఉన్నది.
-శాస్త్రీయాభివృద్ధి శాస్త్రీయ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది: శాస్త్రీయ పద్ధతిలో సమస్యను కనుక్కొన్న దగ్గర నుంచి సామాన్యీకరణం చేసే వరకు గల వివిధ సోపానాలు దీనిలో ఉంటాయి.
-శాస్త్రీయ విజ్ఞానం పునరావర్తనమై ఉంటుంది: శాస్త్రీయ జ్ఞానం రుజువుల మీద ఆధారపడి ఉంది. అవే పరిస్థితులు కల్పించి పరిశోధనలు చేస్తే అవే ఉత్పత్తులు రావచ్చును.
-శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైంది: వివిధ శాఖల నుంచి పొందిన జ్ఞానాలను సమన్వయ పరుచడం ద్వారా సమగ్ర భావనా రూపురేఖల్ని తీసుకొనిరావడం శాస్త్రం లక్షణం.
-శాస్త్రం విలువలతో కూడింది: లక్ష్యాత్మకత, హేతువాదం, తటస్థలక్షణం, మానవీయత మొదలైన లక్షణాలు శాస్ర్తానికి ఉన్నాయి.
-పరిసరాలపై విజ్ఞానశాస్త్ర ప్రభావం: విజ్ఞానశాస్త్రం మన చుట్టూ ఉండే భౌతిక వాస్తవాలను అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తుంది. వీన్ బర్గు అనే శాస్త్రవేత్త చెప్పినట్లు ఈ యుగానికి సంబంధించిన సాంఘిక సమస్యలను ఎదుర్కొని సాధించడం విజ్ఞానశాస్త్రం వల్లనే సాధ్యమవుతుంది.
వ్యవసాయరంగంలో ఆధునిక పోకడలు: వ్యవసాయ క్షేత్రాల్లో వాడే యంత్రాలు, వ్యవసాయ పద్ధతులలో ఎరువుల తయారీ మొదలైనవి. వ్యవసాయ కార్యక్రమాలు టీవీ, రేడియోల ద్వారా ప్రసారం చేయడం, ఆహారకొరత తీర్చడం కోసం నీలివిప్లవం, క్షీరవిప్లవం, హరితవిప్లవం, పశుగణాభివృద్ధి మొదలైనవి శాస్ర్తాభివృద్ధి ఫలితాలే.
ఆరోగ్యరంగంలో నూతన విధానాలు: వ్యాధికారక జన్యువును గుర్తించడం, రేడియాలజీ, రేడియోథెరపీ, క్రిస్టలోగ్రఫీ మొదలైన రంగాలలోఎక్స్రేలు, కృత్రిమ ఇన్సునిల్, కృత్రిమ రక్తం మొదలైన వాటిని తయారు చేయడం.
పారిశ్రామికరంగంలో అభివృద్ధి: అనేక యంత్రాలు, ముడిసరుకులు, వాటి సరఫరా, ఉత్పత్తి పారిశ్రామిక కాలుష్య నివారణ మొదలైన వాటిలో విజ్ఞానశాస్త్రం ముఖ్యపాత్ర వహిస్తుంది.
విద్యారంగంలో అభివృద్ధి: బోధనా పద్ధతుల్లో వివిధ బోధనాపకరణాలు ఉపయోగించడం, విద్యాప్రణాళికలో మార్పులు, అనియత విద్యాబోధనలో విజ్ఞానశాస్త్ర పరిచయం, పరిజ్ఞానం కల్పించారు.
పరిశోధనా రంగంలో మార్పులు: పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మొదలైన చోట పరిశోధనలు చేసేవారికి ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లు, అవార్డులు ఇస్తున్నారు.
-రవాణారంగంలో రవాణా సాధనాలు: నీటి లోపల, నీటిపైన, ఆకాశంలో, నేలపైన, వేగంగా ప్రయాణించే సాధనాలు విజ్ఞానశాస్త్ర ఫలితాలే.
ప్రసారరంగంలో మార్పులు: రేడియో, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, కృత్రిమ ఉపగ్రహాలు, చిత్రరంగం ఎంతో అభివృద్ధి చెందాయి.
కాలుష్య సమస్య: కాలుష్య నివారణ కోసం వేప వంటి చెట్లను పెంచడం, జీవసంబంధ విధానాల ద్వారా చీడపురుగులను నివారించడం, అడవులను పెంచడం, సహజవనరుల సంరక్షణ మొదలైన విషయాల్లో విజ్ఞానశాస్త్రం ప్రధానపాత్ర పోషిస్తుంది.
సాంఘిక సమస్య పరిష్కారం: జనాభా, దారిద్య్రం, అందరికీ విద్య, ఆహార సమస్య, విజ్ఞానశాస్త్రం వల్లనే పరిష్కారమయ్యాయి. పరిశ్రమలు, రవాణా, సమాచార రంగం మొదలైన వాటినీ విజ్ఞానశాస్త్రమే పరిష్కరించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు