నదీజలాలపై ట్రిబ్యునల్స్ ఏం చేస్తాయి?
ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమవుతున్న అంశాల్లో ముఖ్యమైనది, అత్యంత ఆవశ్యకమైనది, అందరూ తెలుసుకోవల్సింది నీటిపై వివాదాల గురించి. ఎన్నో రాష్ర్టాలు, వివాదాలు, ఎంతో ఉత్కంఠ కలిగించేవే నీటి వివాదాలు. అసలు నీటి గురించి, నీటి వనరుల పంపిణీ గురించి రాజ్యాంగం ఏం చెబుతుంది? నీటి వివాదాల ట్రిబ్యునళ్ల అధికార పరిధి ఎంత? ఎందుకు ఆ ట్రిబ్యునళ్లు సరైన పరిష్కార మార్గాలు సూచించలేకపోతున్నాయి? ఎందుకు ప్రతిసారి సుప్రీంకోర్టు తలుపుతట్టాల్సి వస్తుంది? మొదలైన విషయాల్లో స్పష్టత ఉండటం పోటీ పరీక్షల దృష్ట్యా అత్యంత ముఖ్యమైన అంశం.
మన రాష్ట్రంలో 60-70 ఏండ్ల నుంచి నదీ జలాల పంపకం వివాదాస్పద అంశంగా వస్తూ ఉంది. ప్రాజెక్టు కట్టిన ప్రాంతమో, రిజర్వాయర్ ఎత్తో, కేటాయించిన నీళ్లో, అయకట్టో, ముంపు పరిణామమో ఏదో ఒకటి కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అభివృద్ధిలో ఇప్పటికే స్థిరపడ్డ ప్రాంతీయ అసమానతలే కాక ఇరిగేషన్ ఆధారిత వ్యవసాయమొక్కటే రైతుకు ఎంతో కొంత గిట్టుబాటయ్యే పరిస్థితులు నెలకొనడం.
నీటి వివాదాలకు కారణం
-నీరనేది ప్రకృతి సిద్ధంగా వచ్చేది. ఒకరు కల్పించేది కాదు. ఒకరు తయారుచేసేదీ కాదు. గాలి, నేల లాంటిదే నీరుకూడా. అది అందరికీ వాళ్ల అవసరాన్ని బట్టి అందుబాటులో ఉండాలి. అది తప్పవేరే ఏ ప్రమాణాలు ఉండటానికి వీలులేదు.
-నేను తయారుచేస్తే నాకుంటుందనుకోవచ్చు ఎవరైనా. నేను కనిపెట్టింది నాకుండాలని కూడా అంటారు అప్పుడప్పుడు. నేను మొదట చూసింది నాకే చెందుతుందని తెల్లవాడు అంటాడు. నీరు ఒకరు మొదట చూసింది కాదు. ఒకరు కనిపెట్టిందికాదు. ఒకడు తయారుచేసిందీ కాదు. ఇది ప్రకృతి ఇచ్చింది.
-కాబట్టి వాళ్ల వాళ్ల అవసరాన్ని బట్టి మాత్రమే నీటిపై హక్కులుండాలి. ఆచరణలో అనేక సమస్యలుండవచ్చు. అయినప్పటికీ ఈ సూత్రం లేక విలువ ప్రాతిపదికనే నీటి పంపకం జరగాలన్న అవగాహనే ఎన్నో రకాల నీటి వివాదాల పరిష్కారాలకు మార్గం చూపుతుంది.
రాజ్యాంగానికి పూర్వం నీరు, నీటిపై హక్కులు
-నదీ జలాలపై హక్కులు అనేవి ఒక చట్టమంటూ ఏదీలేని రోజుల్లోనే పుట్టడం మొదలైంది. బ్రిటిష్‌వారు పరిపాలిస్తున్న కాలంలో వారి పాలనావసరాల కోసం కొన్ని ఆనకట్టలు కట్టారు. వాళ్లే మొదట కొన్ని హక్కులు కూడా కల్పించారు. 1) వరదల్ని ఆపడానికి, 2) జల రవాణాకు వాటిని నిర్మించారు.
-ఒకసారి డ్యాములు కట్టిన తరువాత నీళ్లు ఉంటాయి. కాబట్టి పంటలకు కూడా ఇచ్చారు. దానివల్ల పంటలు పండాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలం అయింది. ఇదంతా 19వ శతాబ్దం మధ్యభాగంలో జరిగింది. అప్పట్లో నీటి పంపకాల్లో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి, వివిధ ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం లేదు. ఒక చట్టమూ లేదు. అడగాలన్న ఆలోచన కూడా బహుశా ఆ రోజుల్లో లేకపోవచ్చు.
-బ్రిటిష్‌వారు చేసినటువంటి చట్టాల్లో ఎక్కడ కూడా ఒక నది నీటిపై ఎవరికెంత హక్కు ఉంటుందనేది లేదు. వీళ్ల హక్కులెట్ల, వాళ్ల హక్కులెట్ల అని విభజించే చట్టమేది బ్రిటిష్‌వాళ్లు చేయలేదు. వాళ్లు తమ పాలనా సౌలభ్యం ప్రకారం మాత్రమే చేసుకుంటూపోయారు.
నది అంటే ఏమిటి?
-నది, దాని ఉపనదులు, దానిలోకి వచ్చే వాగులు, వంకలు అన్ని కలిపితే నది.
-అంతర్రాష్ట్ర నది (ఇంటర్ స్టేట్ రివర్): ఒక రాష్ట్రంలో పుట్టి ఒకటికంటే ఎక్కువ రాష్ర్టాల్లో ప్రవహిస్తూ ఉండే నదిని అంతర్రాష్ట్ర నది అని అంటారు.
-రాష్ట్ర అంతర్గత నది (ఇంట్రా స్టేట్ రివర్): ఒక రాష్ట్రంలో పుట్టి అదే రాష్ట్రంలో ప్రవహిస్తూ సముద్రంలో కలిసే నదిని ఇంట్రా స్టేట్ నది అంటారు.
జలవివాదాల పరిష్కార చట్టం-రాజ్యాంగం
-ఒక రాష్ట్రంలో పుట్టి ఆ రాష్ట్రంలోనే సముద్రంలో కలిసిపోయే నది గురించి రాజ్యాంగం పేర్కొనలేదు. కానీ అంతర్రాష్ట్ర నది గురించి, దాని వినియోగం, ఆ బేసిన్ అభివృద్ధి, దాని వివాదాల పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని చేయొచ్చు.
-ఆ చట్టం ద్వారా వివాద పరిష్కారానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించవచ్చు. అది తప్ప ఏ కోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదని నియమం పెట్టవచ్చు.
-పై అంశాల ఆధారంగా 1956లో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ (అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం) చేశారు.
ఈ చట్టం ప్రకారం..
-అంతర్రాష్ట్ర నదీ జలాల వినియోగ విషయంలో సంబంధిత రాష్ర్టాల్లో ఏ ఒక్క రాష్ట్రమైనా (నదీ పరీవాహం ఉన్న రాష్ర్టాలు) తమ వివాదాన్ని పరిష్కారం చేయడానికి ఒక ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేయమని కోరవచ్చు.
-దీనిప్రకారం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేయాల్సిందే. తన ఇష్టానుసారం చేస్తామని చెప్పడానికి వీల్లేదు. ట్రిబ్యునల్
-ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వానికి చాలా పరిమిత అధికారాలు ఉన్నాయి.
నదీజలాల ట్రిబ్యునళ్లు-వాటి నియమాలు
-ట్రిబ్యునల్‌కి చైర్మన్‌గా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఉంటారు.
-చైర్మన్‌తోపాటు నీటిపారుదల రంగానికి సంబంధించిన వ్యక్తులు, జల నిర్వహణపై అవగాహన ఉన్న నిపుణులు సభ్యులుగా ఉంటారు.
-ఈ తీర్పు మీద అప్పీలు ఉండదు.
-అంటే తీర్పు సరైనదేనా, తప్పా అని మళ్లీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేయడానికి ఆస్కారం ఉండదు.
-అంటే ట్రిబ్యునల్ తీర్పే అంతిమం. ఈ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పునే అవార్డు అంటారు.
సుప్రీంలో నీటి వివాదాలు..
-ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును పాటించకపోవడం, ఆచరించకుండా అడ్డదారులు తొక్కడం వల్ల ఎన్నో వివాదాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అంటే ఒక రాష్ర్టానికి 100 టీఎంసీలు కేటాయించాలని అవార్డు ఇస్తే దానికి 100 టీఎంసీలు వదలకపోవడం, అడ్డుగా బ్యారేజీలు కట్టడం, కొత్త పద్ధతుల్లో నీటిని అడ్డుకోవడం మొదలైన చర్యల వల్ల అన్యాయానికి గురైన రాష్ర్టాలు సుప్రీంకోర్టుకు వెళ్తున్నాయి.
అంతర్రాష్ట్ర వివాదాలకు కారణం..
-నదీ రాజకీయ పరిధులను, భౌగోళిక పరిధులను పాటించదు.
-నదీ జలాల పంపిణీల్లో అసమానత
-రుతుపవనాల్లో తీవ్ర ఒడిదుడుకులు, క్రమం తప్పకుండా వస్తున్న కరువుకాటకాలు.
-నీటికి డిమాండ్, వినియోగం పెరగడం.
-దేశమంతా ప్రాంతాల వారీగా విడిపోతుండటం.
వివాదాల పరిష్కార యంత్రాంగం – రాజ్యాంగం
రాజ్యాంగబద్ద అంశాలు
1. Entry 17 in the state list:
నీరు, నీటి పారుదల, కెనాల్, నీటీ అభివృద్ధి స్టోరేజీ అన్ని రాష్ట్ర జాబితాలోనివే. ఈ అంశాలన్నీ యూనియన్ లిస్ట్‌లో ఉన్న ఎంట్రీ 56లో ఉన్న ముడిపడి ఉంటాయి.
2. Entry 56 in Unin state:
నీటి వనరుల అభివృద్ధి, దాని నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని చేయవచ్చు.
3. ఆర్టికల్ 262:
Entry 56కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయవచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టుకు ఎక్కువ అధికారాలు ఇవ్వవచ్చు. పై అంశాలకనుగుణంగానే 1956లో అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టాన్ని కేంద్రం రూపొందించింది. పై చట్టానికి అనుగుణంగానే వివిధ నీటి వివాదాల పరిష్కారం కోసం ఒక యంత్రాంగం ఏర్పర్చింది. ఆ యంత్రాంగమే నీటి వివాదాల ట్రిబ్యునల్
ముగింపు:
ప్రస్తుతం నీటి వివాదాలపై వస్తున్న వివాదాలన్నింటిని ఒకవేళ హెల్సింకీ నియమాలు పాటిస్తూ.. ప్రజా అవసరాలే ధ్యేయంగా పరిష్కరించుకుంటే, రాజకీయ విద్వేశాలకు తావివ్వకుండా మరో పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పర్చడానికి మేధోవర్గం ఆలోచించాలి.
అంతర్జాతీయ హెల్సింకీ నియమం
-నీటిని ఎలా పంచుకోవాలనే విషయంపై ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. అదే హెల్సింకీ నియమం. దానిప్రకారం నీటిని కింది అంశాల ప్రాతిపదికగా పంచుకోవాలి.
1. నదీ పరీవాహక ప్రాంతం, వర్షపాతం
2. ఆ నదిపై ఆధారపడి చేసే వ్యవసాయ పొలం విస్తీర్ణం
3. ఆ ప్రాంత వెనుకబాటుతనం
4. వేరే ఇతర మార్గాల ద్వారా లభ్యమయ్యే నీటి ఆధారంగా
5. ఆ ప్రాతంలో నీటిపై ఆధారపడిన జనసంఖ్య
-కానీ నీటి పంపిణీలో పై అంశాలను ప్రాతిపదికగా తీసుకోకుండా, తీసుకున్నా దాన్ని ఆచరించకపోవడం వల్ల ఎన్నో వివాదాలు నీటి చుట్టూనే తీరుగుతున్నాయి.
వివిధ నదీ జలాల వివాదాలపై వేసిన వివిధ ట్రిబ్యునళ్లు
నది రాష్ర్టాలు – ట్రిబ్యునల్ ఏర్పర్చిన తేదీ – అవార్డులు ఇచ్చిన తేదీ
కృష్ణా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ – 1969 ఏప్రిల్ – 1976 మే
గోదావరి మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా – 1969 ఏప్రిల్ – 1980 జూలై
నర్మదా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర – 1969 అక్టోబర్ – 1979 డిసెంబర్
కావేరి కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి – 1990 జూన్ – 2013 ఫిబ్రవరి
కృష్ణా మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – 2004 ఏప్రిల్ – 2010 డిసెంబర్
మహాదేవి గోవా, కేరళ, మహారాష్ట్ర – 2010 నవంబర్ – పెండింగ్
వంశధార ఆంధ్రప్రదేశ్, ఒడిశా – 2009 జూన్ – పెండింగ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు