కోర్ట్ ఆఫ్ రికార్డ్‌గా ఉండటం అంటే..?
జీతభత్యాలు
సుప్రీంకోర్టు జడ్జిల జీతభత్యాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. దీన్ని 54వ రాజ్యాంగ సవరణ-1986 ప్రకారం చేర్చారు. వీటిని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇతర సందర్భాల్లో వీటిని తగ్గించడానికి అవకాశం లేదు. వీరి జీతభత్యాల గురించి IIవ షెడ్యూల్లో పేర్కొన్నారు. 2009లో వీరి జీతభత్యాలను పెంచారు.
జీతంతోపాటు ఉచిత నివాసం, ఇతర సౌకర్యాలు, పదవీవిరమణ తరువాత పింఛన్ సౌకర్యం ఉంటుంది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
-126 ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు, గైర్హాజరైనప్పుడు లేదా అనివార్య కారణాల వల్ల తన విధులను నిర్వర్తించలేని సందర్భంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.
తాత్కాలిక న్యాయమూర్తులు
-127 ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు విధులు నిర్వహించేందుకు తగినంత న్యాయమూర్తుల కోరమ్ లేనప్పుడు రాష్ట్రపతి అనుమతితో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి హైకోర్టులోని న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించవచ్చు. తాత్కాలిక న్యాయమూర్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి. వీరి పదవీకాలం రెండేండ్లు ఉంటుంది.
-పదవీవిరమణ పొందిన న్యాయమూర్తిని తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించేటప్పుడు ఆ న్యాయమూర్తి, రాష్ట్రపతిల అనుమతి అవసరం. కానీ సర్వీసులో ఉన్న హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించినప్పుడు రాష్ట్రపతి ఆదేశాన్ని సంబంధిత న్యాయమూర్తి తప్పనిసరిగా పాటించాలి.
-127(2) ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితుడైన హైకోర్టు న్యాయమూర్తి పూర్వ పదవికంటే ప్రస్తుత పదవికి ప్రాధాన్యమివ్వాలి. సుప్రీంకోర్టులో నిర్దేశితకాలం వరకు న్యాయమూర్తిగా విధులు నిర్వహించాలి. ఆ సమయంలో అతడు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండే అధికారాలు, ప్రత్యేకాధికారాలు, సౌకర్యాలను కలిగి ఉంటాడు.
-128 ప్రకరణ ప్రకారం కేసులు అధికంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో పదవీవిరమణ చేసిన జడ్జిలను కూడా రాష్ట్రపతి అనుమతితో పదవిలో కొనసాగమని ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు.
-129 ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్. అంటే ఒక ప్రత్యేక ముద్రను కలిగి ఉంటుంది. కోర్టు ధిక్కారం కింద జరిమానా లేదా శిక్ష విధించే అధికారం కలిగి ఉంటుంది. తన జరిపిన విచారణలను భద్రపరుస్తుంది.
-130 ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఉండాలి. అయితే రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం సమయానుసారం దేశంలోని ఏ ఇతర ప్రదేశం నుంచైనా కార్యకలాపాలు కొనసాగించవచ్చు.
హోదా – పాత వేతనం – కొత్త వేతనం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి – రూ. 33,000 – రూ. 1,00,000
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు – రూ. 30,000 – రూ. 90,000
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – రూ. 30,000 – రూ. 90,000
హైకోర్టు న్యాయమూర్తులు – రూ. 26,000 – రూ. 80,000
సుప్రీంకోర్టు అధికారం – విధులు
దీని పరిధి దేశవ్యాప్తంగా, విస్తృతమైన అధికారాలు కలిగి ఉంటుంది. అందుకే భారత సుప్రీంకోర్టు ప్రపంచంలోని అన్ని న్యాయస్థానాల్లోకెల్లా అత్యుత్తమైనదని రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అన్నారు.
సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుగా, అత్యున్నత అప్పీలు కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా విధులను నిర్వర్తిస్తుంది. సుప్రీంకోర్టు అధికారాలు ఈ విధంగా ఉన్నాయి..
1) స్వతఃసిద్ధ/ప్రాథమిక అధికార పరిధి
2) అప్పీళ్ల విచారణ పరిధి
3) సలహాపూర్వక విచారణ పరిధి
4) కోర్ట్ ఆఫ్ రికార్డు
5) రిట్ పరిధి
6) న్యాయసమీక్షాధికారం
131 ప్రకరణ ప్రకారం సమాఖ్య స్వభావాన్ని కాపాడటం సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తుంది. సమాఖ్య వివాదాలన్నింటిని సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి.
కేంద్ర, రాష్ట్ర, అంతరాష్ట్ర వివాదాలు, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరిస్తుంది.
కొన్ని వివాదాలను సుప్రీంకోర్టు ప్రాథమిక పరిధి నుంచి మినహాయించారు. అవి..
1) కేంద్ర, రాష్ర్టాల మధ్య కుదిరే ప్రత్యేక ఒప్పందాలు (సుప్రీంకోర్టు ప్రాథమిక పరిధి నుంచి మినహాయింపు ఉంటుందనే షరతు పెట్టుకున్నప్పుడు)
2) కేంద్ర ఆర్థికసంఘం పరిధిలో వచ్చే విషయాలు
3) కేంద్ర జాబితాలోని అంశాలపై వివాదాలు
4) అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలు
5) సుప్రీంకోర్టు ఏర్పడకముందు కుదుర్చుకున్న ఒప్పందాలు, సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చిన తరువాత సమకాలీన పరిస్థితుల్లో వివాదమైన అంశాలు
6) కేంద్రం నుంచి రాష్ర్టాలు నష్టపరిహారం పొందే వివాదాలు
7) ప్రధాని విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో తలెత్తే వివాదాలు
8) కేంద్రం, రాష్ర్టాల మధ్య ఏర్పడే సాధారణ, వాణిజ్య లక్షణం కలిగిన వివాదాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు