క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి రెడీనా!
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాల భర్తీ కోసం కళాశాలలకు వచ్చి వారి సంస్థ అవసరాలకు సరిపడే నైపుణ్యంగల విద్యార్థులను ఎంచుకోవడం. ఈ సెలక్షన్ ప్రక్రియ ఆ సంస్థకు అనుగుణంగా ఉంటుంది. కళాశాలలు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటాయి. అందులో వారు ఆహ్వానం అందించిన కంపెనీలు వారి ఆసక్తిని బట్టి పాల్గొంటాయి. కంపెనీకి సంబంధించిన అధికారులు కళాశాలలకు వచ్చి సెలక్షన్ ప్రక్రియ నిర్వహిస్తారు. క్యాంపస్ ప్లేసెమెంట్స్‌లో పాల్గొనడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
- గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఎక్కువగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. దీనిలో పాల్గొనేందుకు ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవాలి. అకడమిక్ ఉత్తీర్ణత శాతం, చదువుతున్న బ్రాంచ్ లేదా ప్రోగ్రాంని బట్టి ఇవి ఉంటాయి. సాధారణంగా ఈ ఎంపిక ఆప్టిట్యూడ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రైటింగ్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, జస్ట్ ఏ మినిట్ వంటి స్పీకింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
- క్యాంపస్ ప్లేస్మెంట్ మెరుగైన వృత్తిపరమైన అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. అందువల్ల క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం ఎక్కువగా ప్రిపేర్ కావాలి.
రాత పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి?
- రాత పరీక్ష లేదా స్కిల్ అసెస్మెంట్ అనేది సాధారణంగా ఆప్టిట్యూడ్ బేస్డ్ టెస్ట్. ఇది లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మ్యాథమెటికల్ నాలెడ్జ్, లాజికల్ & అనలిటికల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది.
- ఇవి ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటాయి. అలాగే ఫీల్డ్కి సంబంధించిన జ్ఞానం ఎంత ఉందో తెలుసుకునే విభాగాలు కూడా ఉండే అవకాశం ఉంది.
- ప్రాక్టీస్ పుస్తకాలు, ప్రాక్టీస్ పేపర్లు వంటి వనరులతో ఆప్టిట్యూడ్‌కి సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి.
- మీరు పాల్గొనాలనుకునే కంపెనీ రిటన్ పరీక్షకు సంబంధించిన ప్రస్తుత పరీక్ష ప్యాటర్న్, మునుపటి ఆప్టిట్యూడ్ పరీక్ష పత్రాలను సేకరించి నిర్ధారిత సమయంలో వాటిని పరిష్కరించాలి.
- ఏ ప్రోగ్రాం అయితే చేస్తున్నారో అందులో నిపుణులు/ గురువులు/ సీనియర్లతో మాట్లాడాలి. కంపెనీకి లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకోవాలి.
- గ్రాడ్యుయేషన్‌లో చదివిన సబ్జెక్టులను ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఇష్టమైన సబ్జెక్టుపై ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రోగ్రామింగ్ లాజిక్, కోడింగ్ వంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది.
- దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవాలి.
- ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా సాధన చేయాలి.
- ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి. ఆంగ్ల పదజాలం, గ్రామర్ రూల్స్, ఆంగ్లంలో వ్యాసం రాయడం వంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. కొన్ని సందర్భాల్లో రిటన్ టెస్ట్‌లో ఈ-మెయిల్ రైటింగ్ వంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రైటింగ్ టాస్క్‌లో ఇచ్చిన విషయానికి అనుగుణంగా ఎన్ని పదాల్లో రాయాలన్నది చూసుకొని సమాధానం రాయాలి.
- ఉదాహరణకు ఈ-మెయిల్ రైటింగ్ టాస్క్‌లో కొన్ని కీలకపదాలు ఇస్తారు. వాటన్నిటిని ఇచ్చిన సూచనలను బట్టి ఉపయోగించి రాయాలి. స్పెల్లింగ్ లోపాలు, అక్షరదోషాలు రాకుండా చూసుకోవాలి. వాక్యాలు స్పష్టంగా ఉండాలి. రాసిన తరువాత జవాబును మళ్లీ చదవాలి. కొన్ని సందర్భాల్లో అన్ని ప్రశ్నలకు ఒకే మార్కు ఉండకపోవచ్చు. ముందు సులువుగా ఉన్న ప్రశ్నలు చేసి ఆ తరువాత కష్టమైనవి ప్రయత్నించాలి.
గ్రూప్ డిస్కషన్
- క్యాంపస్ ప్లేస్మెంట్లో కొంతమందిని ఒక గ్రూప్ చేసి, వారికి గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా రిక్రూట్మెంట్ మేనేజర్ ప్రతి అభ్యర్థి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని, కాన్ఫిడెన్స్, టీంలో పనిచేయగల క్వాలిటీస్‌ని, ప్రాబ్లమ్‌ని ఎదుర్కొనే స్కిల్స్‌ని గమనిస్తారు.
- దీనికి కూడా సరైన ప్రిపరేషన్ అవసరం. కళాశాలలో జరిగే డిబేట్లలో పాల్గొనేవారు ఇందులో ఎక్కువగా రాణిస్తారు.
- డిస్కషన్ ప్రారంభించే ముందు కొంత సమయం ఇస్తారు. ఆ సమయంలో ఇచ్చిన టాపిక్ గురించి ఎలా మాట్లాడాలనుకుంటున్నారో, లోతైన పాయింట్ల గురించి కూడా ఆలోచించాలి. ఇచ్చిన సమస్య గురించి మాట్లాడటమే కాకుండా దానికి పరిష్కార మార్గాల గురించి కూడా ఆలోచించాలి.
- కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. మీ కోసం ఎవరు ఆగరు. చెప్పాలనుకునేది స్పష్టంగా చెప్పాలి. ఎక్కువగా చదవాలి. అవకాశం దొరికినప్పుడు స్పష్టంగా ఆంగ్లంలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. సమాధానాలు రికార్డు చేసుకొని వినాలి. గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్ వంటి కార్యక్రమాలు చూడాలి. స్నేహితులతో కలిసి సాధన చేస్తే చాలా మంచిది.
- గ్రూప్ డిస్కషన్లో పాల్గొనడం రిక్రూట్మెంట్ మేనేజర్ గమనించాలి. అంటే మాట్లాడాలి. అవకాశం కల్పించుకోవాలి. డిస్కషన్ ప్రారంభించడం లేదా ఇతరులు చెప్పిన దానికి మీ అభిప్రాయాలను, ఉదాహరణలను జతచేయడం వంటివి చేయాలి. సంబంధిత విషయాలు మాత్రమే మాట్లాడాలి. ఎదుటివారివి కూడా వినాలి. ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి.
- డిస్కషన్ ఎటువైపు వెళ్తుంది, ఎటువంటి విషయాలు చర్చలోకి వస్తున్నాయనేది గమనించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చివరికి సారాంశం అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
- ఇంటర్వ్యూ ప్యానెల్ రౌండ్
- ఇందులో ప్రొఫెషనల్ రిక్రూటింగ్ మేనేజర్ల ప్యానెల్ ముఖాముఖిగా ఇంటర్వ్యూ చేస్తుంది. రాత పరీక్షలో అర్హత పొందినవారిని మాత్రమే దీనికి పిలిచే అవకాశం ఉంది.
- ఈ రౌండ్ మన దరఖాస్తును ముందుకు తరలించాలా వద్దా అని నిర్ణయిస్తుంది. అందువల్ల ఈ రౌండ్ చాలా ముఖ్యం.
- ఇందులో రాణించాలంటే మనపై మనకు విశ్వాసం కలిగి ఉండాలి. చేయగలం అని నమ్మాలి. స్నేహితులు లేదా గురువులతో మాక్ ఇంటర్వ్యూలు చేయాలి. అది పూర్తయిన తరువాత వారి అభిప్రాయం తీసుకొని దాని మీద పని చేయాలి.
- ఇంటర్వ్యూల్లో ఎక్కువగా అడిగే ప్రశ్నలతో సాధన చేయాలి. ఆ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నారు, దానికి ఎందుకు అర్హులనుకుంటున్నారో అన్న దాని మీద స్పష్టత కలిగి ఉండాలి. కంపెనీ గురించి రిసెర్చ్ చేయాలి. అందులో తెలిసిన సీనియర్లు ఉంటే వారిని సంప్రదించాలి.
- ఇంటర్వ్యూలో పలు భాగాలు ఉంటాయి. ముఖ్యంగా టెక్నికల్ రౌండ్ హెచ్ ఆర్ రౌండ్.
- టెక్నికల్ రౌండ్ క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం సిద్ధమవుతున్నప్పుడు, డొమైన్ / కోర్స్ సాంకేతిక అంశాలను తేలికగా తీసుకోకూడదు. సబ్జెక్టు నాలెడ్జ్‌తో పాటు టెక్నికల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ వంటివి కూడా ప్రిపేర్ కావాలి. కొన్ని విషయాల్లో అయినా లోతైన జ్ఞానం కలిగి ఉండాలి. చదువు తున్న పుస్తకాలతో పాటు ఆ రంగాల్లో లేటెస్ట్ ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలి. ఆయా సంస్థల ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగే అన్ని సాంకేతిక ప్రశ్నలు, వివిధ జాబ్ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకోవాలి. ఎక్కువగా అడిగిన ప్రశ్నలను గుర్తించాలి. అలాంటి ప్రశ్నలకు ముందుగానే సమాధానం సిద్ధం చేసుకోవాలి.
- మీరు చేసిన ఇంటర్న్‌షిప్ గురించి, ప్రాజెక్ట్స్ గురించి పూర్తిగా చదివి ఉండాలి. ఏవైనా ప్రోగ్రామ్స్, ప్రశ్నలు సాల్వ్ చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉండాలి.
హెచ్ఆర్ రౌండ్
ఇందులో సంస్థ వర్క్ కల్చర్‌లో ఇమడగలుగుతారో లేదో అన్నది చూస్తారు. ప్రశ్నలు మీ గురించి, మీ ఆటిట్యూడ్ గురించి తెలుసుకునే విధంగా ఉంటాయి.
సమాధానాలను క్లుప్తంగా ఉంచాలి. ప్రశాంతంగా ఉండాలి. చిరునవ్వును కోల్పోవద్దు. ఆలోచించి సమాధానం ఇవ్వాలి. ఒకవేళ జవాబు చెప్పలేక పోతే కంగారు పడవద్దు.
నమూనా ప్రశ్నలు
- మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి? మీరు ఈ డిగ్రీ ఎందుకు చేశారు? మీ బలాలు, బలహీనతలు ఏమిటి? మీ పాఠ్యేతర కార్యకలాపాల గురించి చెప్పండి? మీకు డబ్బు లేదా పనిలో ఏది మరింత ముఖ్యమైనది? మీరు ఓవర్ టైం, నైట్ షిఫ్టులు, వారాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏ లొకేషన్లోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా?
- కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ రౌండ్‌ను కూడా నిర్వహించవచ్చు. ఇందులో క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారన్నది చూస్తారు.
రెడీనెస్
- కాలేజీ ఇచ్చిన టెంప్లేట్లో రెజ్యూమె రెడీ చేసుకోవాలి. లేకపోతే అకడమిక్ క్వాలిఫికేషన్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్పీరియన్స్ వంటి వివరాలతో సిద్ధం చేయాలి. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్‌లు సరిగ్గా ఇవ్వాలి. సర్టిఫికెట్స్ ఫైల్లో సరిగా పెట్టుకోవాలి. ముఖ్యమైన సర్టిఫికెట్లు ముందు పెట్టాలి.
- ఇంటర్వ్యూకి ప్రొఫెషనల్‌గా కనిపించేలా దుస్తులు, పాద రక్షలు ధరించాలి.
- ప్రశాంతంగా, నమ్మకంగా, ధైర్యంగా ఉంంటేనే ఉద్యోగాన్ని సాధించగలుగుతారు.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు