రాచకొండ రాజుల పాలనా విధానం
వెలమరాజుల పాలనా విధానంలో కాకతీయులను అనుసరించారు. వైదిక ధర్మరక్షణ, ప్రజా శ్రేయస్సే తమ లక్ష్యాలుగా పాలించారు. వైదిక ధర్మాన్ని రక్షించడం కోసం, వర్ణ వ్యవస్థ కాపాడటం కోసం హేమాద్రి రచించిన వ్రతఖండ కల్పతరువు అనే గ్రంథంలో వివరించిన పద్ధతుల ప్రకారం రాజ్య పరిపాలనను నడిపారు. పరిపాలనా వ్యవహారాల్లో రాజులకు ప్రధానమంత్రులు, పురోహితులు, సేనాధిపతులు సలహాలనిచ్చేవారు. వెలమరాజులు తమ మంత్రివర్గంలో బ్రాహ్మణులను కూడా నియమించుకున్నారు. పెద్దన, పోతన, బాచన, సింగన, అయ్యలార్యుడు మొదలైన మంత్రుల పేర్లు నాటి శాసనాలు, సాహిత్యం ద్వారా తెలుస్తుంది. మంత్రులు, పురోహితులు, దేవారికులు కూడా తమ ప్రభువులతో పాటు యుద్ధాలకు వెళ్లేవారు. పరిపాలనలో యువరాజుకు ప్రత్యేక స్థానం ఉండేది. రాజులకు సంతానం లేకపోతే అతని కుమారులు చిన్నవారు అయినప్పుడు సోదరులు, సమీప బంధువులు రాజ్యభారం నిర్వహించేవారు.
పరిపాలనా వికేంద్రీకరణ
- పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సీమలుగా విభజించారు.
- సీమకు అధిపతులుగా రాజవంశస్థులను మాత్రమే నియమించేవారు.
- యువరాజులు కూడా దుర్గాధిపతులుగా నియమితులయ్యారు.
- దుర్గాధిపతులు, సామంత రాజులు, మండలాధీశులు తమ తమ ప్రాంతాల్లో పన్నులు వసూలు చేయడం, సైనిక రక్షణ ఏర్పాటు చేయడం, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం మొదలైన విధులు నిర్వహించేవారు.
దుర్గాలు
- వీరి రాజ్యంలో రాచకొండ, దేవరకొండ, అనుముల, పొడిచేడు, ఆమనగల్లు, అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, స్తంభగిరి, ఓరుగల్లు, భువనగిరి, జల్లపల్లి, పానగల్లు మొదలైన దుర్గాలు ఉండేవి.
- వీరి కాలంలో నిరంతర యుద్ధాలు జరిగినందువల్ల అనేక శత్రు దుర్బేధ్యమైన దుర్గాలను నిర్మించారు.
- దుర్గాలకు అధిపతులుగా దుర్గాధ్యక్షులు ఉండేవారు.
- వీరు సైన్యాన్ని పోషించి పద్మనాయకులకు యుద్ధాల్లో తోడ్పడేవారు.
- యుద్ధ సమయాల్లో దుర్గంలో ఆహార ధాన్యాలు నిలువ ఉంచేవారు.
గ్రామ పరిపాలన
- గ్రామంలో ద్వాదశ వృత్తులవారు ఉండేవారు.
- వీరిలో కరణం, తలారి ముఖ్య ఉద్యోగులు. వీరు గ్రామ రక్షణ, పన్నుల వసూలు మొదలైన విధులను నిర్వహించేవారు.
న్యాయపాలన
- రాజ్యంలో తీర్పులు చెప్పడానికి ధర్మాసనాలు ఉండేవి. శిక్షలు కఠినంగా ఉండేవి.
- దివ్య పరీక్షల ద్వారా నేరారోపణ చేసేవారు.
- అంగవిచ్ఛేదనం, గానుగలో తల ఆడించడం, గుండెలపై పెద్ద బండలను ఎత్తడం, గడ్డిని శరీరానికి చుట్టి నిప్పంటించడం, ఎండలో నిలబెట్టి పొగ దండలు వేయడం, కొరడాతో కొట్టించడం వంటివి శిక్షలుగా ఉండేవి.
- బ్రాహ్మణులు మరణదండన విధించతగ్గ తప్పు చేస్తే వారిని చంపకుండా వారి ముఖాలపై కుక్క పాదాన్ని ముద్రించి గాడిదపై ఊరేగించేవారు.
పన్నులు
- రాజ్యానికి భూమిశిస్తు ప్రధాన ఆదాయం. పంటలో 1/6వంతు శిస్తుగా వసూలు చేశారు.
- బ్రాహ్మణ అగ్రహారాలకు పన్ను మినహాయింపు ఉండేది.
- వ్యాపార సుంకాలు, వృత్తి పన్నులు ఇతర ఆదాయాలుగా వచ్చేవి.
- పద్మనాయకులు పక్క రాజ్యాలైన విజయనగర, రెడ్డి, గజపతుల, బహమనీ సుల్తానులతో నిరంతర యుద్ధాలు చేయడంవల్ల ప్రజల మీద పన్నుల భారం ఎక్కువగా పడింది.
- చనుబాలపై పన్ను కూడా విధించడం లాంటివి ఇందుకు నిదర్శనం.
- దండయాత్రలు చేసి శత్రు రాజ్యాలను దోచుకునేవారు. అది కూడా రాజ్యానికి ఆదాయంగా ఉండేది.
ఆర్థిక పరిస్థితులు
వ్యవసాయం
- వెలమరాజుల కాలంలో కాకతీయుల ఆర్థిక పరిస్థితులే కొనసాగాయి. వ్యవసాయం నాడు రాజ్యంలోని ప్రజలకు ప్రధాన వృత్తి. అదే ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయం.
- ఈ కాలంలో కూడా భూ యాజమాన్యం నాలుగు రకాలుగా ఉండేది. 1. రైతుల భూములు, 2. గ్రామభూమి, 3. దేవాలయాలు, మరాఠాలు, ధర్మసంస్థలు, వృత్తిమాన్యాలు, అగ్రహార భూములు, 4. రాజులు-వారి సామంతుల భూములు అని నాలుగు తరహాలుగా ఉండేవని ఆధారాలు తెలుపుతున్నాయి.
- రైతులు సాగు చేసుకొనే భూమిపై వారికి సంపూర్ణ హక్కులు ఉండేవి. వారు భూములు అమ్ముకోవడానికి, ఇతరులకు దానం చేయడానికి అధికారం ఉండేది.
- గ్రామాల్లో రైతులు, దేవాలయాల భూములు పోను మిగిలిన భూమి అంతా గ్రామానికి చెందుతుంది. అది గ్రామసమితి అధికారం కింద ఉంటుంది.
- ఒకవేళ ఆ భూమిని అమ్మాలన్నా దేవాలయాలకు దానంగా ఇవ్వాలన్నా గ్రామసమితి ఇష్టంపై ఆధారపడి ఉండేది. ఒక్కొక్కప్పుడు రైతులతో ఈ భూమిని సాగు చేయించేవారు.
- సాగువల్ల వచ్చిన ఆదాయం గ్రామ సమితికి చెందుతుంది. ఈ ఆదాయాన్ని సమితి గ్రామాభివృద్ధికి వినియోగించేవారు.
- అగ్రహార భూములపై పన్నులు ఉండవు. దానిపై వచ్చే ఆదాయం బ్రాహ్మణులకు పోతుంది. అగ్రహారాల్లో అంతా బ్రాహ్మణులే ఉంటారు. కాబట్టి అగ్రహార భూములు సాగు చేసేందుకు అనుబంధంగా శివారు గ్రామాలు ఉండేవి. అందులో రైతులు, ఇతర పనివారు నివసిస్తూ అగ్రహార భూములను సాగుచేసి పంటలు పండించేవారు.
- అగ్రహారికులు వారికి పంటలో భాగం ఇచ్చేవారు. దేవాలయ భూములకు పన్నులు ఉండేవి కావు. ఆ భూములను రైతులకు కౌలుకు ఇచ్చేవారు.
నీటిపారుదల సౌకర్యాలు
- వెలమరాజులు వ్యవసాయాన్ని అభివృద్ధిచేసే క్రమంలో నీటిపారుదల సౌకర్యాలను కూడా వృద్ధి చేశారు.
- మొదటి అనపోతానాయుడు. అనపోత సముద్రాన్ని, రావు మాధవ నాయుని భార్య నాగాంబిక నాగసముద్రాన్ని, రెండో అనపోతానాయుడు రాయసముద్రాన్ని నిర్మించారు.
- ఇవేకాకుండా పర్వతరావు తటాకం, వేదగిరి తటాకం, మాధవరావు చెరువు మొదలైనవి కూడా ఈ కాలంలోనే నిర్మించారు.
- చెరువులు, తటాకాలే కాకుండా బావులు, కాలువలు కూడా తవ్వించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ఏతాము, రాట్నాల ద్వారా కూడా పొలాలకు నీటి వసతి కల్పించుకునేవారు.
- నాటి కాలంలో మెట్ట, తరి, తోట భూములు అనే మూడు రకాల వ్యవసాయ భూములుండేవి.
- విస్తీర్ణంలో మెట్ట భూములు ఎక్కువ. ఇవి వర్షాధారమైనవి. తరి, సాగు భూములు సారవంతమైనవి. అందువల్ల వరి విస్తారంగా పండించేవారు.
- ఏడాదికి రెండు పంటలు వైశాఖ మాసంలో, కార్తీక మాసంలో పండించేవారు.
- శిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని నిలువ చేయడానికి రాచగాదెలు ఉండేవి.
- వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లను కమ్మరులు, కంసాలులు తయారుచేసేవారు.
- వరిలో కలమ, శాలి, శిరాముఖి, పతంగహొయన అనే రకాలు పండించేవారు. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి మెట్టపంటలు, నువ్వులు, పత్తి, మిరప మొదలైన వ్యాపార పంటలు కూడా పండించేవారు.
- కొబ్బరి, అరటి, పనస, పోక, చెరకు మొదలైనవి కూడా పండించినట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి.
- ఉద్యోగాలు దొరకని బ్రాహ్మణులు కూడా వ్యవసాయం చేశారు. వారిలో బమ్మెర పోతన ముఖ్యుడు. వ్యవసాయం తరువాత ముఖ్యమైన వృత్తి పశుపోషణ.
- రైతులేగాక, రాజులు, సామంతులు కూడా పశువులను పోషించారు.
- ప్రతి దేవాలయానికి కిలారులు అనే పేరుతో పశుశాలలు ఉండేవి. బ్రాహ్మణులు గోవులను ఎక్కువగా పోషించారు.
పరిశ్రమలు
- వీరి కాలంలో అనేక రకాలైన పరిశ్రమలు అభివృద్ధిలో ఉండేవి.
- ప్రధాన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. ఓరుగల్లు, రాచకొండ, దేవరకొండలు వస్త్ర పరిశ్రమకు ఆనాడు ప్రసిద్ధిచెందాయి.
- దీంతోపాటు కలంకారి, అద్దకపు పరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. చీరలపైన, అంచులపైన రాజ హంగులు, లేళ్లు, గుర్రాలు, ఏనుగులు, నెమలి పింఛాలు, రాజ ఖడ్గాలు, ఢమరుకాలు మొదలైనవి చిత్రించేవారు. కొన్ని చీరలను రామ సింగారం, వసంత సింగారం, రామ విలాసం, వసంత విలాసం, శ్రీకృష్ణ విలాసం అనే పేర్లతో పిలిచేవారు.
- హేమపట్టు, వజ్రపట్టు, పులిగోరుపట్టు, ఉదయ పట్టు, వెలపట్టు వంటి మొదలైన రకాల పట్టు చీరలు కూడా ఉన్నట్లు సింహాసన ద్వాత్రింశిక పేర్కొంటుంది.
- వస్త్ర పరిశ్రమలకు అనుబంధంగా రంగుల పరిశ్రమలు కూడా వెలుగొందాయి. ముఖ్యంగా నీలిరంగు తయారీ ప్రతి ఇంట్లో ఉండేది.
- రత్న కంబళ్లు, తివాచీల నేత కూడా పేరొందింది. గ్రామాల్లో స్త్రీలు రాట్నాలమీద నూలు వడికేవారు.
- పంచానం వారు గంటలు, స్తంభాలు, చీలికలు తయారు చేసేవారు. వంట పాత్రలు, పంచలోహాలతో గజగంటలు, జయస్తంభాలు, దీప స్తంభాలు, దేవతా విగ్రహాలు, వ్యవసాయ పరికరాలు, స్త్రీలకు బంగారు, వెండి ఆభరణాలను కూడా పంచానం వారు తయారుచేసేవారు.
- గాజులు, అద్దాల పరిశ్రమలు కూడా ఉండేవి. గాజు రెక్కల ప్రస్తావన సాహిత్యంలో ఉంది. కాగితం వాడుకలోకి వచ్చింది.
- ఆయుధాల పరిశ్రమలు కూడా అభివృద్ధిలో ఉన్నాయి. నిర్మల్ ఉక్కు కత్తులు గొప్ప పేరొందాయి. దంతపు పరిశ్రమ కూడా అమల్లో ఉన్నట్లు రుక్మాంగద చరిత్రలో వివరించి ఉంది.
వర్తక-వ్యాపారం
- వీరి కాలంలో బలిజలు, వైశ్యులు విదేశీ వ్యాపారం చేసేవారు. సుగంధ ద్రవ్యాలు, పట్టు బట్టలు దిగుమతి చేసుకునేవారు.
- కృష్ణాతీరంలోని వాడపల్లి వీరి నౌకా కేంద్రం. వాడపల్లిపై ఆధిపత్యం కోసం వెలమ రాజులు-రెడ్డి రాజులకు తరచు ఘర్షణలు జరిగేవి.
- కాకతీయుల కాలంలో ఉన్న నాణేలు, తూకాలు, కొలతలు అమల్లో ఉన్నాయి. పుణ్య క్షేత్రాల్లో పండుగలు, జాతరలప్పుడు అంగడి జరిగేది. వారాంతపు అంగడి కూడా ఉండేది.
సామాజిక పరిస్థితులు
వర్ణవ్యవస్థ
- వెలమ నాయకుల పరిపాలనా కాలం నాటికి సామాజిక పరిస్థితుల్లో కొంతమార్పు వచ్చింది. ముస్లింల దండయాత్రల వల్ల బ్రాహ్మణులు కులవృత్తికి దూరమయ్యారు.
- రాజాస్థానాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. ఉద్యోగాలు లభించనివారు వ్యవసాయం కూడా చేశారు. బ్రాహ్మణుల్లో వైదిక, నియోగి అనే శాఖలు ఏర్పడ్డాయి.
- ఈ కాలంలో క్షత్రియ కులం ఉన్నట్లు ఆధారాలు లేవు. చాళుక్య వంశాలు అక్కడక్కడా ఉన్నాయి. కానీ వారు తమ కుల స్వచ్ఛతని కాపాడుకోలేదు.
- శూద్రకులాలైన రెడ్డి, వెలమ, కమ్మ కులాల ప్రభావం పెరిగింది. వీరు రాజ్యస్థాపకులై పాలక కుటుంబాలుగా మారారు. అందువల్ల ఈ కులాలు, ఒకరిపై ఒకరు ఈర్ష్యాద్వేషాలు పెంచుకున్నారు.
- మిగిలిన శూద్ర కులాలువారు ఎవరి వృత్తిని వారు కొనసాగించారు. వైశ్యులు, బలిజలు సంప్రదాయకమైన వ్యాపారాన్ని కొనసాగించారు.
- ప్రజల్లో మూఢనమ్మకాలు ఉండేవి. శకునాలపై అధిక నమ్మకం ఉండేదని పంచాగం వాడుకలో ఉండేది. పంచాంగ చూసి ముహుర్తాలు పెట్టించుకొని ప్రతి పని చేసేవారు.
- రాజులు కూడా ముహూర్తాలు నిర్ణయించుకుని యుద్ధాలు ప్రకటించేవారు.
వినోదాలు
- గ్రామాల్లో కోలాటాలు, భజనలు, దేవాలయాల్లో ఉత్సవాలు, మేకలు, పొట్టేళ్ల పందెం, వీధి నాటకాలు, పురాణ శ్రవణం, గచ్చకాయలు, పులి జూదాలు నాటి ప్రజలకు వినోదాలు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు