మొదటి సాలార్జంగ్ సంస్కరణలు
సాలార్ జంగ్-1
1853-83 వరకు హైదరాబాద్ రాజ్యానికి దివాన్ (ప్రధాని)గా పనిచేశాడు. ముగ్గురు నిజాంలు నాసీరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మెహబూబ్ అలీఖాన్ వద్ద సాలార్ జంగ్-1 దివాన్‌గా విధులు నిర్వహించాడు. అసలు పేరు మీర్ తురబ్ అలీఖాన్. బీజాపూర్‌లో జన్మించాడు. ఉన్నత విద్య అభ్యసించి 24 ఏళ్ల వయస్సులోనే హైదరాబాద్ రాజ్యానికి దివాన్‌గా చేరాడు. పాలనాపరమైన మెలకువలను ఇంగ్లిష్ అధికారి ‘డైసన్’ వద్ద నేర్చుకున్నాడు.
ప్రధానిగా నియమితులయ్యే సమయంలో నిజాం రాజ్యంలోని పరిస్థితులు: సాలార్ జంగ్-1 ప్రధానిగా నియమితులయ్యే సమయానికి సంస్థాన ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ఉద్యోగులు, సైనికుల్లో క్రమశిక్షణ లోపించి బంధుప్రీతి, లంచగొండితనాలు పెచ్చుమీరాయి. 1853లో బ్రిటిష్ వారికి చెల్లించాల్సిన బకాయల కింద బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ వంటి సారవంతమైన ప్రాంతాలను వారికి ఇవ్వాల్సి వచ్చింది. నిజాం సొంత ఖర్చులకు కూడా నిధులు లేక భూములు, వజ్రాలు, నగలను ‘రోహిలా’ వర్తకులకు తాకట్టు పెట్టి రూ.3 కోట్లు అప్పు చేశాడు. రాజ్యంలో రెవెన్యూ అధికారులు రైతులను పీడించడం, శాంతి భద్రతలు లోపించి దొంగతనాలు వంటివి చోటుచేసుకున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న నిజాం రాజ్యాన్ని తన సంస్కరణలతో సాలార్ జంగ్-1 గొప్ప స్థాయిలో నిలిపారు.
సాలార్ జంగ్ సంస్కరణలు
రెవెన్యూ సంస్కరణలు: 1864-65లో సాలార్ జంగ్ జిలా బందీ విధానాన్ని రాజ్యంలో ప్రవేశ పెట్టారు. దీని ద్వారా రాజ్యాన్ని 5 సుభాలు, 17 జిల్లాలుగా, జిల్లాలను తాలూకాలుగా విభజించారు. సుభాకు సుబేదార్, జిల్లాకు అవ్వల్ తాలూక్దార్ (కలెక్టర్), తాలూకాకు పన్నులు వసూలు చేసేందుకు తహసీల్దార్‌ను నియమించాడు. అంతకుముందు పన్ను వసూలు చేసేందుకు కాంట్రాక్టర్లు (గుత్తేదార్) ఉండేవారు. వీరు కొన్ని ప్రాంతాలను కాంట్రాక్టులకు తీసుకొని మొత్తం వసూలైన పన్నుల్లో రూపాయికి 2 అణాలు/8వ వంతు తాము తీసుకొని మిగిలినది ప్రభుత్వాలకు చెల్లించేవారు. ఇందులో చాలా అవినీతి చోటు చేసుకునేది. సాలార్ జంగ్ నియమించిన సుబేదార్, తాలూక్దార్, తహసీల్దార్లకు ప్రభుత్వం జీతమిచ్చి పనులు చేయించుకునేది. ఈ అధికారులు వసూలు చేసే శిస్తు పర్యవేక్షణకు 1864లో రెవెన్యూ బోర్డ్లను సాలార్ జంగ్ ఏర్పాటు చేశారు. శిస్తు వసూలుకు ఇంతకుముందు వేలం ద్వారా కాంట్రాక్టర్లకు అధికారమిచ్చే పద్ధతిని తొలగించి సాలార్ జంగ్ రైత్వారీ విధానాన్ని ప్రవేశ పెట్టారు. రైతులకు భూములపై హక్కులను కల్పించి, భూములను సర్వే చేయడానికి 1875లో సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని ఏర్పర్చారు. భూమి శిస్తు ధన, ధాన్య రూపంలో చెల్లించడానికి అనుమతించడంతో ఆదాయం వృద్ధి చెందింది.
ఆర్థిక సంస్కరణలు
సాలార్ జంగ్కు పూర్వం ప్రధానిగా ఉన్న చందూలాల్ ఆర్థిక విధానాలతో నష్టపోయిన రాజ్యాన్ని సంస్కరించి, వ్యయాలను తగ్గించేందుకు అధిక జీతాలు తీసుకుంటున్న అధికారుల జీతాలను తగ్గించారు. వారితో పాటు తన జీత భత్యాలను కూడా తగ్గించుకున్నారు. అనవసరంగా వివిధ హోదాల్లో కొనసాగుతున్న 100 మంది ఉద్యోగులను తొలగించి వారి హోదాలను రద్దు చేశారు. నిజాంకు మునుపటిలానే చుట్టుపక్కల రాజ్యాలైన మరాఠీలు, మైసూరు పాలకుల నుంచి ప్రమాదం లేనందున బొల్లారంలో ఉన్న బ్రిటిష్ సైన్యం సరిపోతుందని భావించి సొంత సైన్యాన్ని తగ్గించారు. 1857లో తొలి స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి ప్రజలు, సంస్థానాధీశుల నుంచి ప్రతిఘటన ఏర్పడిన సమయంలో సాలార్ జంగ్-1 బ్రిటిష్ వారికి దన్నుగా నిలబడి హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిష్ రెజిమెంట్‌పై దాడి చేసిన తుర్రెబాజ్ ఖాన్‌ను చంపడంతో, హైదరాబాద్ ప్రజలను రెచ్చగొడుతున్న అల్లావుద్దీన్ మౌల్వాను అండమాన్ దీవులకు పంపడంలో సహాయం చేశాడు.
అదేవిధంగా షోలాపూర్ రాజు రాజా వెంకటప్ప నాయక్‌ను బంధించాడు. వీటి ఫలితంగా 1961లో రాయచూర్, షోలాపూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను బ్రిటిష్ నుంచి పొందారు. అదేవిధంగా బ్రిటిష్ వారి అప్పు రూ.50 లక్షలు మాఫీ చేయించాడు. తమ రాజు అఫ్టలుద్దౌలాకు బ్రిటిష్ వారు స్టార్ ఆఫ్ ఇండియా బిరుదును ప్రదానం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 1855లో కేంద్ర ప్రభుత్వం టంకశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి గద్వాల, నారాయణ పేటలో ప్రాంతీయ ముద్రణాలయాలను ఏర్పాటు చేశారు. ఇందులో నిజాం సొంత నాణెం ‘హోలిసిక్కా’ ముద్రించేవారు. 1858 నుంచి నిజాం నాణాలపై మొఘల్ చక్రవర్తి పేరు తొలగించి నిజాం పేరుతో నాణాలను ముద్రించి చెలామణి చేశారు. 1861లో స్టాంప్ పేపర్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించారు.
విద్యా సంస్కరణలు
సాలార్ జంగ్-1 తన వ్యక్తిగత కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రాం సహాయంతో రాజ్యంలో అనేక విద్యాలయాలు నెలకొల్పారు.
సాలార్ జంగ్ కాలంలో నెలకొల్పిన విద్యాలయాలు
1. దారుల్ ఉలూం- 1855
2. సిటీ హైస్కూల్- 1870
3. చాదర్‌ఘాట్ హైస్కూల్- 1872
4. మదర్సా ఆలియా (ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం)- 1873
5. మదర్సా-ఎ-ఐజా (రాజ కుటుంబీకుల పిల్లల కోసం)- 1878
6. గ్లోరియా గర్ల్స్ హైస్కూల్-1881
రాజ్యంలో సాంకేతిక నిపుణులను తయారు చేయాలన్న ఉద్దేశంతో 1870లో ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు. ఈ విధంగా అనేక విద్యాలయాలను నెలకొల్పి పాశ్చాత్య విద్య (ఇంగ్లిష్) బోధించారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి సాలార్ జంగ్ ఆర్థిక సహాయం చేశారు. హైదరాబాద్ రాజ్యాధికారులైన వికార్ ఉల్ ముల్క్, మొహిసిన్ ఉల్ ముల్క్ అలీఘర్ విశ్వవిద్యాలయానికి ఎన్నో సేవలందించారు. సాలార్ జంగ్ మరణానంతరం 1887లో చాదర్‌ఘాట్ హైస్కూల్, మదర్సా ఆలియా రెండిటినీ విలీనం చేసి ఆంగ్ల మాధ్యమంతో నిజాం కాలేజీని స్థాపించారు. ఈ నిజాం కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా సరోజినీ నాయుడు తండ్రి అఘోర నాథ్ ఛటోపాధ్యాయను నియమించారు.
పోలీస్ సంస్కరణలు
సాలార్ జంగ్ మహకాయ-ఇ-కొత్వాలి అనే పోలీస్ శాఖను ఏర్పాటు చేశారు. దొంగతనాలు, దారిదోపిడీలను అణిచివేసేందుకు ‘నిజామత్’ అనే పోలీస్ దళాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 1865లో పటిష్టమైన పోలీస్ వ్యవస్థను రూపకల్పన చేసి 5 సుభాలకు 5 నాయిబ్-సదర్-ముహతమీన్ (DIG) లను, వారి పైన ఐజీ (IG) అధికారిని ఏర్పాటు చేశారు. 17 జిల్లాలకు 17 ముహతమీన్ (SP)లను తాలూకాలకు అమీన్ (CI) అనే అధికారులను ఏర్పాటు చేశారు. 1867లో పోలీస్, రెవెన్యూ శాఖలు విభజించిన తరువాత పోలీసు శాఖ మంత్రిగా తరువాతి కాలంలో నవాబ్ షంషేర్ జంగ్ బహరుద్దీన్ను నియమించారు. ‘సోవర్స్’ అనే పోలీస్ దళం ఏర్పాటు చేసి తాలూకా, జిల్లా ప్రజా సంబంధాల కార్యాలయాల వద్ద రక్షణ విధుల్లో నియమించారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్‌ను ‘చౌకీలు’ అని పిలిచేవారు. సాలార్ జంగ్ ప్రతిభ, సామర్థ్యం అధారంగా పోలీసులకు జీతాలు ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇది తరువాతి కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పోలీస్ శాఖల్లో ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా ఇస్తున్న ‘ఆగ్జిలరీ’ విధానానికి ఆధారంగా కొనసాగుతుంది.
న్యాయ సంస్కరణలు
సాలార్ జంగ్ చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని ప్రవేశపెట్టాడు. శరీర భాగాల ఖండన వంటి కఠిన శిక్షలను రద్దు చేశాడు. ఈ కాలంలో సుప్రీంకోర్టును ‘మజ్లిస్-ఇ-మురఫా’, హైకోర్టును ‘మహకాయ-ఇ-సదర్’, ప్రధాన న్యాయమూర్తిని ‘నజీమ్’ అని పిలిచేవారు. ముస్లిం చట్టాల అమలుకు దారుల్ కాజీ అనే కోర్టు ఉండేది. న్యాయస్థానాల సమన్వయానికి 1862లో ప్రధాని నేతృత్వంలో ఒక న్యాయ సెక్రటరీని ఏర్పాటు చేశారు. నిజాం రాజ్యంలో తొలి న్యాయశాఖ మంత్రి బషీరుద్దౌలా.
పరిపాలనా సంస్కరణలు
హైదరాబాద్ రాజ్యంలో పాశ్చాత్య ఉదారభావ విధానాలను సాలార్ జంగ్ ప్రవేశపెట్టారు. సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామ్, సయ్యద్ అలీ బిల్ గ్రామ్, అఘోరనాథ్ ఛటోపాధ్యాయ వంటి ఉదార హోదా అధికారులకు ఉన్నత స్థానం కల్పించారు. క్రమశిక్షణ లోపించిన ఉద్యోగుల స్థానంలో బ్రిటిష్ ఇండియాలో శిక్షణ పొంది ప్రతిభ కలిగిన వ్యక్తులను ఆ ఉద్యోగాల్లో నియమించేవారు. కేంద్ర ప్రభుత్వాన్ని 4 శాఖలుగా విభజించి 1868 ‘సదర్ ఉల్ మహల్’ పేరుతో నలుగురు మంత్రులను నియమించారు. అవి పోలీస్, న్యాయ, రెవెన్యూ, ప్రజాసంక్షేమం విద్య ఆరోగ్యం స్థానిక సంస్థలు. ఆ తరువాత పాలనా సౌలభ్యం కోసం ఈ శాఖలను కూడా విభజించి కొత్తగా 14 మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశారు.
ఇతర సంస్కరణలు
- 1866లో బొంబాయి నుంచి రాయచూర్‌కు రైల్వే లైన్ నిర్మించారు.
- బ్రిటిష్ వారితో చందా రైల్వే ఒప్పందం కుదుర్చుకొని 1874లో సికింద్రాబాద్-వాడి మధ్య మొదటి రైల్వే లైన్‌కు కృషి చేశారు.
- 1874లో సతీసహగమనాన్ని రాజ్యంలో నిషేధించారు.
- చాదర్‌ఘాట్‌లో పారిశ్రామిక వస్తు ప్రదర్శక శాలను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది.
- 1882లో చంచల్‌గూడ జైలును నిర్మించారు.
- సాలార్ జంగ్ కృషి ఫలితంగా 1884లో రాజ భాష పర్షియన్ నుంచి ఉర్దూ ప్రకటించారు.
- సాలార్ జంగ్ గొప్పతనం : 1853లో ఆర్థికంగా పతనపు అంచుల్లో ఉన్న రాజ్యాన్ని తన సంస్కరణలతో గొప్పస్థాయిలో నిలబెట్టారు. ఇంతగొప్ప సేవలందించినప్పటికీ నిజాం రాజుల అభిమానాన్ని పొందలేకపోయారు.
- విలియం డిగ్బీ: సాలార్ జంగ్ నిజాం రాజ్య వ్యవస్థలను పునర్జీవింపజేశారు.
- వహీద్ ఖాన్: 19వ శతాబ్ద ఉత్తమ భారతీయ పాలనావేత్తల్లో సాలార్ జంగ్ ఒకరు.
- 1883, ఫిబ్రవరి 8న కలరా వ్యాధితో 56 సంవత్సరాల వయస్సులో సాలార్ జంగ్ మరణించాడు.
1. సాలార్ జంగ్-1 అసలు పేరు? (B)
A) మీర్ మహమ్మద్ ఖాన్
B) మీర్ తురబ్ అలీ ఖాన్
C) అహ్మద్ షా అలీ
D) నవాబ్ జంగ్
2. సాలార్ జంగ్-1 ఏ బ్రిటిష్ అధికారి వద్ద పరిపాలనా మెలకువలు నేర్చుకున్నాడు? (C)
A) కల్నల్ డేవిడ్ సన్
B) విట్టన్ ప్రభువు
C) డైసన్ D) వెల్లింగ్టన్
3. హైదరాబాద్ రాజ్యానికి చెందిన బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్‌లను బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో తమ అధికారంలోకి తీసుకున్నారు? (D)
A) 1856 B) 1961
C) 1864 D) 1853
4. సాలార్ జంగ్-1 తన జిలా బందీ విధానం ద్వారా రాజ్యాన్ని ఎన్ని భాగాలుగా విభజించాడు? (A)
A) 5 సుభాలు-17 జిల్లాలు
B) 6 సుభాలు – 20 జిల్లాలు
C) 5 సుభాలు-9 జిల్లాలు
D) 6 సుభాలు-17 జిల్లాలు
5. హైదరాబాద్ రాజ్యంలో రెవెన్యూ బోర్డులను ఏ సంవత్సరంలో సాలార్ జంగ్ ఏర్పాటు చేశాడు? (C)
A) 1856 B) 1866
C) 1864 D) 1867
6. 1857 జూలై 17న హైదరాబాద్ రెసిడెన్సీపై దాడి చేసిన ఘటనకు ఎవరు నాయకత్వం వహించారు? (C)
A) కుర్బాన్ అలీ
B) ఖాసిం మహమ్మద్
C) తుర్రెబాజ్ ఖాన్
D) మహమ్మద్ గవాన్
7. హైదరాబాద్ రాజ్యంలో ప్రాంతీయ టంకశాలను (ద్రవ్య ముద్రణాలయం) ఏ ప్రదేశంలో నెలకొల్పారు? (A)
A) గద్వాల B) మెదక్
C) తూప్రాన్ D) రాయచూర్
8. రాజకుటుంబీకుల పిల్లల చదువుకు నిజాం రాజ్యంలో నెలకొల్పిన విద్యాసంస్థ? (B)
A) దారుల్ ఉలూం
B) మదర్సా-ఎ- ఐజా
C) మదర్సా ఆలియా
D) సిటీ హై స్కూల్
9. కింది వాటిలో సరికానిది? (D)
1. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన అలీఘర్ విశ్వవిద్యాలయానికి సాలార్ జంగ్-1 సహాయం చేశాడు
2. హైదరాబాద్ రాజ్య అధికారులైన వికార్ ఉల్ ముల్క్, మొహిసిన్ ఉల్ ముల్క్ అలీఘర్ విశ్వవిద్యాలయానికి ఎన్నో సేవలు అందించారు
3. సాలార్ జంగ్ మరణానంతరం 1887లో ఏర్పడిన నిజాం కాలేజీకి తొలి ప్రిన్సిపల్‌గా అఘోరనాథ్ ఛటోపాధ్యాయను నియమించారు
4. హైదరాబాద్ రాజ్యంలో సయ్యద్ హుస్సేన్ బిల్గ్రాం విద్యాలయాల స్థాపనకు కృషి చేశారు
A) 1, 3 B) 3 C) 2 D) ఏదీకాదు
10. నిజాం కాలంలో ‘నిజామత్’ అంటే? (C)
A) జాగీరు భూములు
B) రాజుల హోదాలు
C) పోలీస్ దళం
D) భూమి కొలత
11. చంచల్‌గూడ జైలు ఏ సంవత్సరంలో నిర్మించారు? (A)
A) 1882 B) 1898
C) 1903 D) 1833
12. 19వ శతాబ్దపు ఉత్తమ భారతీయ పాలనావేత్తల్లో సాలార్ జంగ్ ఒకరు అని సాలార్ జంగ్‌ను ఎవరు ప్రశంసించారు? (B)
A) విలియం డిగ్బీ
B) వహీద్ ఖాన్
C) మహ్మద్ గలాన్
D) అఫ్సర్ అలీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు