ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
అతివృష్టి, అనావృష్టి, ఆకాల వర్షాలు, కరువులతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకాన్ని తీసుకొచ్చింది. 2016 జనవరి 13న కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు రైతులు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో కేవలం 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా రబీ ఆహారధాన్యాలు, నూనె గింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో కేవలం 1.5 శాతం చెల్లిస్తే చాలు. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. 2016 జూన్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ప్రకృ తి వైపరీత్యాలవల్ల జరిగిన పంట నష్టానికి పూర్తి బీమా అందిస్తారు. వాణిజ్య, ఉద్యాన పంటలకు రైతులు 5 శాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయించారు.
పథకంలోని ముఖ్యాంశాలు
-పొలంలో పంటకు జరిగిన నష్టంతో పాటు, విత్తనాలు వేయలేకపోవడం, పంటకోత తర్వాత జరిగే నష్టాలకు, వరద ముంపు వంటి విపత్తులకు బీమా వర్తిస్తుంది. పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతాన్ని నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమచేస్తారు.
-క్లెయిమ్ సెటిల్ కోసం పంటనష్టాన్ని అంచనా వేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతారు. స్మార్ట్ఫోన్ల ద్వారా పంటకోత సమాచారాన్ని ఫొటోలు తీసి, అప్లోడ్ చేస్తారు.
-బ్యాంకు రుణాలు తీసుకున్నవారు పంట బీమా చేయడం ప్రస్తుతం తప్పనిసరి. కొత్త పథకం కింద రుణం తీసుకున్నవారూ, తీసుకోనివారూ తమ అభీష్టం మేరకు బీమా చేయించుకోవచ్చు.
-ప్రభుత్వ రాయితీపై గరిష్ట పరిమితి లేదు. ప్రీమి యం 90 శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం భరిస్తుంది.
-ప్రీమియం ధరపై పరిమితిని విధిస్తున్న నిబంధనవల్ల రైతులకు తక్కువ క్లెయిమ్లు చెల్లిస్తుండటంతో ఆ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. బీమా చేసిన పూర్తి మొత్తాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా పొందుతారు.
-వచ్చే మూడేండ్లలో మొత్తం పంటల విస్తీర్ణంలో బీమా కవరేజీని 50 శాతానికి పెంచనున్నారు. ఇందుకు ఏడాదికయ్యే రూ. 17,600 కోట్ల వ్య యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
-తొలి ఏడాది 2016-17లో మొత్తం పంట విస్తీర్ణంలో 30 శాతానికి బీమా వర్తింపజేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రూ. 5,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
-మొత్తం రాష్ర్టానికి ఒక బీమా కంపెనీ ఉంటుంది. విపత్తులతో జరిగే, కోతల తర్వాత జరిగే నష్టాలకు పొలం స్థాయిలో అంచనా వేస్తారు. భారత వ్యవసాయ బీమా సంస్థతోపాటు ప్రైవేటు బీమా కంపెనీలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్
-ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్/యోజన (PMSMA) పథకాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి 2016 నవంబర్ 4న ప్రారంభించారు. పేదరికంలో ఉన్న గర్భిణుల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపర్చే లక్ష్యం తో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ప్రతినెల 9న గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు చేస్తారు.
లక్ష్యాలు
గర్భిణులు కొన్నిసార్లు రక్తంలో హెచ్చు చెక్కర స్థాయిలు, హైబీపీ, ఇతర హార్మోన్ సమస్యలకు సంబంధించిన అన్ని పరీక్షలు, చికిత్సలు పేద మహిళలకు ఉచితంగా చేయడం ద్వారా గర్భిణుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం దీన్ని ప్రవేశపెట్టారు. ఇంకా బాలింతల మరణాల శాతాన్ని తగ్గించడం, గర్భిణులకు వారి ఆరోగ్య/వ్యాధుల పరిస్థితుల గురించి తెలియజెయ్యడం, సురక్షితంగా కాన్పు (డెలివరీ) జరిగేలా చూడటం, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం మొదలైన లక్ష్యాల కోసం దీన్ని అమలు చేస్తున్నారు.
ప్రధానాంశాలు
-ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్/యోజన గర్భిణులందరికీ వర్తిస్తుంది.
-ప్రతి నెల 9న ఉచిత వైద్య పరీక్షలు జరుగుతాయి.
-దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లలో ఈ సదుపాయం ఉంది.
-ఆరోగ్య సమస్యల ఆధారంగా మహిళలను విభజిస్తారు. తద్వారా వైద్యులు కాన్పు సమయంలో తేలికగా సమస్యల గురించి తెలుసుకోగలుగుతారు.
-గర్భిణులకు 3-6 నెలల మధ్య కాలంలోనే ఈ పథకం వర్తిస్తుంది. నగరాల్లో నివసించే వారికంటే, ఉప పట్టణ ప్రాంతాలు, పేద, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.
-ఈ పథకం కింద బీపీ, డయాబెటిస్ (చెక్కర స్థాయి), బరువు, రక్తంలో హిమోగ్లోబిన్, పూర్తి రక్త పరీక్ష తదితరాలన్నీ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో లభిస్తాయి. గర్భిణుల ఆరోగ్య కార్డులపై ఎర్ర స్టిక్కర్ అతికిస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు. నీలం స్టిక్కర్ అతికిస్తే హైబీపీ (అధిక రక్తపోటు) ఉన్నట్లు గుర్తించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు