స్పీడ్ రీడింగ్‌కు స్వీపింగ్
వేగంగా చదవడానికి ముఖ్యమైన కనుపాపల కదలికల వేగంలో మార్పులను తీసుకురావడం, ఒక దృశ్యంలోని అన్ని వస్తువులను కలియజూసినట్లే, ఒక మ్యాటర్లోని పదాలన్నింటిని ఏకకాలంలో ఒక క్రమ పద్ధతిలో కనుపాపల దృష్టికి తీసుకురావడమే స్వీపింగ్ ప్రధాన లక్ష్యం.
మీ రీడింగ్ స్పీడ్‌ను పెంపొందించుకోవడానికి ఉపయోగపడే టెక్నిక్స్‌లో ప్రధానమైనది స్వీపింగ్ టెక్నిక్. ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టే విధంగా చదవడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదుగానీ, ప్రస్తుతం మీరు నిమిషానికి 400 పదాలను చదువుతూ ఉన్నట్లయితే ఈ సామర్థ్యాన్ని 800 పదాలకు విస్తరింపజేయవచ్చు.
స్పీడ్‌ను అలవాటు చేయాలి. మొదటి ప్రపంచయుద్ధంలో వైమానిక దళాధిపతులకు శిక్షణనిచ్చిన టెచిస్టోస్కోప్ అవసరం లేకుండానే మీరు కంటికి స్పీడ్‌ను అలవాటు చేయవచ్చు. మీ చేతిలో ఒక కాంతివంతమైన టార్చిలైట్ ఉంటే చాలు మీ మిత్రుని సాయంతో దీన్ని ఇంట్లోనే రోజూ ప్రాక్టీస్ చేయవచ్చు. మీ గదిలో లైట్ ఆఫ్ చేయండి. మీ ఎదురుగా గోడమీద బొమ్మనుగానీ, గ్రీటింగ్ కార్డునుగానీ, మరేదైనా ఉంచండి. టార్చిలైట్‌ను దానిపై ఫోకస్ చేయండి. సరిగ్గా ఒక సెకన్ తర్వాత దాన్ని ఆపేయండి. ఆ సెకన్ కాలంలో మీరు గుర్తించిన అంశాలను రాసుకోండి. తర్వాత లైటు వెలిగించి గోడపై పెట్టిన ఇమేజ్ను గమనిస్తూ మీరు రాసుకున్న అంశాలను సరిపోల్చండి. తర్వాత వివిధ రకాల ఇమేజ్‌లను, ఇంతకుముందు మీరు చూడని విచిత్రమైన ఆకృతులను గోడపై అమర్చడం ద్వారా, టార్చిలైట్‌ను ఆర్పి, వెలిగించడం ద్వారా మీ కంటికి స్పీడ్‌ను అలవాటు చేయవచ్చు.
ముందుగా ప్రీవ్యూ చేయండి
ఫొటోగ్రఫీలో టైం టాప్స్ అనే టెక్నిక్ ఒకటి ఉంది. తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేయడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇటీవలి కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, ఇటు మనదేశంలోనూ వివిధ చలనచిత్రాల్లో, విభిన్న దృశ్యాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఒక మొగ్గ వికసించి పువ్వుగా మారడం, దానిపై ఒక భ్రమరం వచ్చి వాలడం అనే దృశ్యాన్ని తీసుకుందాం. ఈ దృశ్యాన్ని యధాతథంగా చూపడానికి న్యాచురల్ స్పీడ్‌లో చిత్రీకరిస్తే.. ప్రేక్షకుడికి తన ఎదురుగా మొగ్గ విచ్చుకుని తేనెటీగ వాలిన అనుభూతి కలుగుతుంది. కాగా, ఆ దృశ్యంలో పువ్వు వికసించడం, భ్రమరం వాలడం మాత్రమే ప్రేక్షకుడికి చెప్పదల్చుకున్న సందేశం అయినప్పుడు, ఈ దృశ్యాన్ని వీలైనంత తొందరగా ప్రొజెక్ట్ చేయడం మంచిది. అందుకు టైమ్ లాప్స్ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఒక అధ్యాయాన్ని చదివేటప్పుడు అసలు సంగతి ఏమిటో ప్రీవ్యూ చేయడం ద్వారా కొంత సమయం ఆదా చేయవచ్చు.
స్వీపింగ్ ఫస్ట్ స్టెప్
రిలాక్స్డ్గా కూర్చోండి. మీ ఎడమ చేతివైపు నుంచి కాంతి మీ పుస్తకంపై పడేవిధంగా జాగ్రత్త పడాలి. కుర్చీలో కూర్చుని చదివేటప్పుడు మీ రెండు పాదాలు నేలమీద ఆనాలి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచుకోవాలి. మీరు చదివే పుస్తకాన్ని మీ కంటికి 50 సెం.మీ. దూరంలో ఉంచాలి. అప్పుడే ఎక్కువ పదాలు మీ దృష్టికి వస్తాయి. మీ చేతిలో ఒక ఇండికేటర్‌ని పెట్టుకోండి. ఒక పెన్సిల్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ప్రతి లైన్ కింద పెన్సిల్ని ఒక క్రమబద్దమైన వేగంతో కదుపుతూ దానివెంట మీ చూపు కదిలేలా ప్రాక్టీస్ చేయండి.
మొదట్లో మీరు ప్రాక్టీస్ చేయడానికి తేలికగా ఉండే పుస్తకాలను తీసుకోండి. ఒకేసైజు అక్షరాలు కలిగిన సమాచారాన్ని తీసుకోవడం మంచిది. మొదట్లో మీరు స్వీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ మేరకు తీసుకునే పేజీల నిండా రన్నింగ్ మ్యాటర్ ఉండేలా జాగ్రత్తపడాలి. ఒకవేళ అక్కడక్కడ బొమ్మలు, లేదా గ్రాఫ్‌లు వచ్చినప్పటికీ ఆ ప్రదేశంలో వాక్యాలు ఉన్నట్లుగానే ఊహించుకుంటూ అదే వరుస క్రమంలో ఇండికేటర్‌ను కదిలిస్తూ స్వీపింగ్ చేయాలి. ఒక్కొక్క పేజీని ఐదారు సెకన్లలోపే స్వీపింగ్ చేయాలి.
ఈ పద్ధతి పాటించే సమయంలో మీకు పేజీలో ఏదో ఒకవైపున ఎక్కువ పదాలు ఒక గుంపుగా కనబడుతున్నట్లు అనిపిస్తుంది. దాంతో మీరు కంగారుపడుతారు. ఏదీ అర్థంకానట్లు ఫీలింగ్ ఏర్పడుతుంది. అంతమాత్రం చేత మీకు ఈ స్వీపింగ్ టెక్నిక్ అలవాటు కాలేదేమోనని బాధపడనక్కర్లేదు. మొదట్లో ఇది ఎవరికైనా సహజమే. కలత చెందకుండా ఒక వారం రోజులపాటు ఈ టెక్నిక్‌ను అనుసరించండి. కొన్నాళ్లకు మీకు ఈ టెక్నిక్ బాగా అలవాటై, ఇదివరకటికంటే త్వరగా, వేగంగా చదవగలుగుతారు. చదివిన పదాలనే మళ్లీమళ్లీ చదవడం వంటి వృథా ప్రయాసలు తగ్గుతాయి. ఈ టెక్నిక్‌లో మీరు ఉపయోగించే ఇండికేటర్ కీలకమైన పాత్ర పోషిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు