సుదీర్ఘ ప్రస్తావన
-సామాజిక అవగాహన అంటే మానవుడు తాను నివసిస్తున్న సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని, జ్ఞానాన్ని, స్పృహను, చేతనాన్ని కలిగి ఉండటం. మెకైవర్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం సామాజిక సంబంధాల సాలెగూడును (Web of Social relations) సమాజం అంటారు. అంటే సమాజంలోని సభ్యులు ఒకరితో మరొకరు తప్పనిసరిగా సామాజిక సంబంధాలను కలిగి ఉంటేనే దాన్ని మానవ సమాజం అంటారు. ఈ సామాజిక సంబంధాలే సామాజిక అవగాహనకు ప్రాతిపదిక. సమాజశాస్త్రం ఇటీవల కాలంలోనే ఆవిర్భవించినప్పటికీ మానవుని సామాజిక జీవనం గురించి ఎన్నో వందల ఏండ్లకు పూర్వమే అనేకమంది తత్వవేత్తలు అధ్యయనం చేశారు. మానవుని సామాజిక జీవనానికి సంబంధించిన క్రమబద్ధమైన చర్చలు మొదట గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్తల నుంచి మొదలయ్యాయి. ప్లేటో (క్రీ.పూ. 427-347), అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) వంటి గ్రీకు తత్వవేత్తలు మానవుడి సామాజిక జీవనానికి సంబంధించిన తార్కిక పద్ధతి (logical method)లో అనేక సిద్ధాంతాలను రూపొందించే ప్రయత్నం చేశారు. మన దేశంలో క్రీస్తు పూర్వమే కౌటిల్యుని అర్థశాస్త్రంలో మానవుని జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించారు.
మానవుని సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవనాన్ని క్రమబద్ధం చేసే అనేక సూత్రాలు, సిద్ధాంతాలను కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. పాణిని, పతంజలి వంటి భారతీయ తత్వవేత్తలు వారి రచనల్లో మానవుని సామాజిక జీవనానికి సంబంధించిన అనేక అంశాలను వివరించారు. 16వ శతాబ్దం వరకు మానవ సామాజిక జీవనానికి సంబంధించిన వాస్తవికమైన శాస్త్రీయ అధ్యయనాలు జరగలేదనే చెప్పవచ్చు. 16వ శతాబ్దానికి చెందిన మాకియవెల్లి రచించిన ప్రిన్స్ అనే గ్రంథం రాజ్యం రాజకీయత అనే విషయాలను వాస్తవానికి దగ్గరగా చర్చించింది. ఇదే కాలానికి చెందిన సర్ థామస్ మూవ్ అనే మరో తత్వవేత్త రచించిన ఉటోపియా అనే గ్రంథంలో మానవుని దైనందిన సామాజిక సమస్యల గురించి వివరించింది. భారతదేశంలో 1920 నుంచి సమాజశాస్త్రం వైజ్ఞానిక విషయంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది. ఈ అభివృద్ధిలో రాధాకమల్ ముఖర్జీ, జి.ఎస్. ఘార్వే, డీపీ ముఖర్జీ, ఎంఎన్ శ్రీనివాస్ వంటి సామాజిక శాస్త్రవేత్తల కృషి అనిర్వచనీయం. అనేక మిలియన్ ఏండ్ల క్రితం ఆరంభమైన జీవన యాత్రలో మానవుడు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ సంచార జీవనం గడుపుతూ వేట ఆహార సేకరణ, పశుపోషణ, మారక/పోడు వ్యవసాయం చివరకు స్థిర వ్యవసాయానికి చేరుకొని స్థిర నివాసాన్ని ఏర్పాటుచేసుకొని సహజీవనం గడపటం వల్ల సామాజిక సంబంధాలు అంకురించాయి. ఫలితంగా నూతన మానవ సమాజం అవతరించింది. సమాజంలో మానవ కార్యకలాపాలు బహుముఖంగా ఉంటాయి. వీటిని అధ్యయనం చేయడానికిగాను ఆవిర్భవించిందే సమాజశాస్త్రం.
-19వ శతాబ్దంలో ఆవిర్భవించిన సమాజశాస్త్రం 20వ శతాబ్దంలో బాగా అభివృద్ధి చెందింది. ప్రత్యేక బోధనాశాస్త్రంగా స్థిరపడింది. శాఖోపశాఖలుగా విస్తరించింది.
దేశంపేరు బోధనాశాస్త్రంగా చేర్చిన సంవత్సరం
అమెరికా 1876
ఫ్రాన్స్ 1889
బ్రిటన్ 1907
మెక్సికో, ఈజిప్టు 1925
స్వీడన్ 1947
సామాజిక అవగాహన అవసరం?
-మానవుడు సంఘజీవి. మానవ జననం మొదలు మరణం వరకు వ్యక్తిని తీర్చిదిద్దేది సమాజమే. వ్యక్తి తన లక్ష్యాలను చేరుకోవడానికి సమాజం మీద పూర్తిగా ఆధారపడతాడు. అదే సమయంలో సమాజాభివృద్ధికి ఔన్నత్యానికి తన వంతు కృషిని అందిస్తాడు. ప్రతి సమాజంలోనూ ఆ సమాజ సభ్యుల మధ్య విభిన్న పరస్పర చర్యలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. సమాజ సభ్యుల మధ్య పరస్పర సామాజిక సంబంధాలు ఉండడం వల్ల పరస్పరాశ్రయులై ఉండటమే కాకుండా ఒకరికొకరు సహకార భావంతో కూడా మెలగుతున్నారు. సమాజంలోని సభ్యులు తాము నివసించు ప్రాంతంలోని ఇతర సభ్యుల పట్ల సంఘటిత లేదా ఐక్య భావాన్ని కలిగి ఉంటారు. ఈ భావం వారిని ఆత్మీయులుగా ఉంచడానికి ఒకరికొకరు కలిసికట్టుగా జీవించడానికి మేము అనే భావనను, మనం అనే అనుభూతిని కల్పించడానికి దోహదపడుతుంది. తద్వారా సభ్యుల్లో సంఘీభావం ఏర్పడి సామరస్యంతో జీవించగలుగుతాడు.
-మానవుడు తన అవసరాలన్నింటిని తీర్చుకోవడానికి ఇతర సభ్యుల సహకారాన్ని తప్పనిసరిగా పొందాలి. ఇతరుల సహకారం లేకుండా మానవ మనుగడ అసాధ్యం. కాబట్టి సామాజిక అవగాహన తప్పనిసరి. మానవ సామాజిక జీవనం వ్యక్తి లక్ష్యాలను సాధించడానికి దోహదపడుతుంది.
-మిగతా ఏ జీవికి లేని భావవ్యక్తీకరణ శక్తి మానవునికి మాత్రమే ఉంది. తన భావాలను, ఆలోచనలను మితంగా సమాజ సభ్యులతో పంచుకోగలడు. ఆనంద, విషాద భావాలను వ్యక్తం చేయగలడు. మాట్లాడగలగడమే కాకుండా ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడం అనేది మానవుడు సాధించిన అపురూప విజయం. భౌతికంగా తనకు ఏర్పడిన సదుపాయాలతో మానవుడు చక్కటి సహజీవనానికి అవసరమైన సామాజిక పరిసరాలను సృష్టించుకొన్నాడు. ఇదే ప్రస్తుతం సకల చరాచర జగత్తులో మానవుడే ఉన్నతజీవి మేథో సంకల్పితం సాధించలేనిది ఏది లేదు. కొన్ని సందర్భాల్లో అపజయాలు ఎదురైనా వాటిని విజయాలకు సోపానాలుగా మలుచుకొంటూ అవిచ్ఛిన్నంగా ముందుకు సాగుతున్నాడు.
-ప్రతి వ్యక్తి ఆత్మాభివృద్ధికి (Growth of Selfwood), మూర్తిమత్వ అభివృద్ధికి (Personality Development) సమాజంపై ఆధారపడక తప్పదు. ప్రతి వ్యక్తి శైశవదశ నుంచి మరణం వరకు ప్రతి దశలో సమాజంలోని సభ్యుల సహాయాన్ని తప్పనిసరిగా పొందుతాడు. మొదట తల్లిదండ్రులు, అనంతరం సమాజ సభ్యుల ద్వారా వ్యక్తి ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి. ఈ ప్రక్రియను సాంఘికీకరణం (Socialization) అంటారు. ఇది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది.
పోలీసులకు సామాజిక అవగాహన
-సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసు యంత్రాంగానికి సమాజం పట్ల పూర్తిస్థాయి శాస్త్రీయ అవగాహన తప్పనిసరిగా ఉండాలి. సమాజంలో జరిగే సంఘర్షణ, ఆందోళన, దోపిడీలు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు వాటికి గల కారణాలు, పర్యవసనాలు, పరిష్కారమార్గాలు తెలియాలంటే మొదట ఆ సమాజ మౌలిక నిర్మాణం, సమస్యల గురించి శాస్త్రీయ అవగాహన ఉండాలి.
-సమాజంలోని సభ్యులు విభిన్న సామాజిక నేపథ్యాలకు చెందినవారు కావడం, సామాజిక జీవనపరంగా వైవిధ్యం ఉండటం వల్ల అనమానతలు తలెత్తి సామాజిక సమస్యలకు కారణమవుతున్నాయి. సామాజిక సంఘర్షణ (Social Conflict), సామాజిక పోటీ ( Social Competition) సమాజంలో సర్వసాధారణమైన అంశాలే అయినందున సామాజిక అవగాహనతోనే వీటికి పరిష్కారమార్గాలను కనుగొనే అవకాశం ఉంటుంది.
సామాజిక అవగాహనతో ఎలాంటి ప్రయోజనం?
-మిగతా ఉద్యోగులకన్నా పోలీసులకు సమాజంతో ఎక్కువ సామాజిక సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే సామాజిక భద్రత లేకపోతే ఏ సమాజం మనుగడ కొనసాగించలేదు. ఆ సామాజిక భద్రతను కల్పించేది పోలీసు యంత్రాంగమే.
-సామాజిక సమస్యల పట్ల కనీస శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండటమే సామాజిక అవగాహన. అందువల్ల సమాజంలో నెలకొన్న సామాజిక సమస్యలకు గల కారణాలు వాటి పర్యవసనాల పట్ల పోలీసులకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి. సామాజిక వికాసం అనేది సామాజిక సుస్థిరత (శాంతిభద్రత)పై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. ప్రతి సామాజిక సమస్య పట్ల హేతుబద్ధమైన (Rational), తార్కికమైన (Logical) , ప్రజాస్వామ్యబద్ధమైన (Democratic), మానవాతావాదం (Humanistic) కలిగి ఉన్నప్పుడే సామాజిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందువల్ల పోలీసులకు ఈ అవగాహన ఉండాలి.
-సమాజం శాశ్వతం, గతికం (Dynamic). సమాజంలో నిరంతరం మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. ఈ మార్పులు కొన్నిసార్లు సమాజ మనుగడను సైతం ప్రశ్నించే విధంగా ఉండవచ్చు. ఈ మార్పుల పట్ల శాస్త్రీయ అవగాహనను కలిగి ఉండడంతో పాటు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించడం కోసం కొన్ని సామాజిక ప్రయోగాలు కూడా చేయాలి.
సమాజ శాస్త్రంలోని ప్రధాన విభాగాలు
1. గ్రామీణ సమాజ శాస్త్రం (Rural Sociology)
2. నగర సమాజ శాస్త్రం (Urban Sociology)
3. పారిశ్రామిక సమాజ శాస్త్రం (Industrial Sociology)
4. నేర శాస్త్రం (Criminology)
5. జనాభా శాస్త్రం (Demography)
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమాజశాస్త్రం ప్రాముఖ్యం పెరుగుతున్నది. సమాజం సంక్లిష్టమవుతున్నకొద్దీ మానవ సంబంధాల్లో మరింత సంక్లిష్టత నెలకొంటున్నది. భౌతిక శాస్ర్తాల మాదిరిగానే శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమాజాన్ని సమాజంలోని మానవుని చర్యలను అధ్యయనం చేయడమే మానవ సమాజ శాస్త్ర ప్రధాన లక్ష్యమని అగస్ట్కామ్టే పేర్కొన్నాడు. సమాజంలో విభిన్న సామాజిక నిర్మితుల మధ్య సమైక్యత, క్రమ వికాసానికి దోహదం చేసే మూల సూత్రాలను అన్వేషించేందుకు సమాజ శాస్త్రం ప్రయత్నిస్తున్నదని మెకైవర్ అభిప్రాయపడ్డాడు. మొత్తం మీద సమాజంలో మానవ సంబంధాలు సమాజ శాస్ర్తానికి కేంద్రబిందువని అర్థమవుతున్నది. మానవ సంబంధాల్లో సామాజికతకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. సామాజిక అవగాహన అంటే సామాజికతను అర్థం చేసుకోవడమే.
ఏయే అంశాలపై అవగాహన ఉండాలి
1) బాలకార్మిక వ్యవస్థ
2) బాలికల విక్రయం
3) మానవ అక్రమరవాణా
4) వెట్టిచాకిరి, కట్టుబానిసత్వం
5) జోగిని, దేవదాసి వ్యవస్థలు
6) బాల్యవివాహాలు
7) వరకట్న దురాచారం
8) మహిళలపై హింస
9) మహిళలపై అత్యాచారాలు, హత్యలు
10) పరువు హత్యలు
11) మాదక ద్రవ్యాల అక్రమరవాణా
12) వృద్ధుల నిరాదరణ
13) కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం
14) సామాజిక విలువల పతనం
15) కులతత్వం
16) మతతత్వం
17) ప్రాంతీయతత్వం
18) దివ్యాంగులు
19) వలసలు
20) అవినీతి
21) ఉగ్రవాదం
22) నిరుద్యోగం
23) కార్మికుల సమస్యలు
24) కులవ్యవస్థ
25) సామాజిక ఉద్యమాలు
26) విప్లవ పోరాటాలు
27) నిరక్షరాస్యత
28) ప్రపంచీకరణ ప్రభావం
29) సామాజిక,ఆర్థిక అసమానతలు
30) ప్రభుత్వ విధానాలు వంటి అంశాలపై పోలీసులు తప్పనిసరిగా అవగాహనను కలిగి ఉండాలి.