ప్రపంచ విపత్తుల్లో వరదలు ఎంత శాతం ఉంటాయి?
- ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఒక చోట, ఏదో ఒక విపత్తు సంభవిస్తూనే ఉంటుంది. దీనికి భారతదేశం కూడా అతీతం కాదు.
- విపత్తులు సంభవించడానికి భౌగోళిక, వాతావరణ కారణాలతో పాటు మానవుడి చర్యలు, కార్యకలాపాలు కారణం అవుతున్నాయి.
- ఎత్తైన పర్వత శ్రేణులు విశాలమైన ద్వీపకల్ప పీఠభూమి, వేల కిలోమీటర్లు ప్రవహించే జీవనదీ వ్యవస్థల వల్ల భారతదేశం విపత్తుల బారిన పడుతుంది.
- ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, చెట్లను నరికివేయడం, తత్ఫలితంగా కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యం దెబ్బతినడం, వాతావరణం వేడెక్కడం మొదలైనవి ప్రధాన కారణాలు. కాబట్టి ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది.
- ప్రకృతిని అనుసరించాలే కాని శాసించకూడదన్నది దృష్టిలో పెట్టుకుని మానవ కార్యకలాపాలు ఉంటే విపత్తుల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు.
- భూకంపాలు, తుఫానులు, సునామీలు, అగ్నిప్రమాదాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు అకస్మాత్తుగా సంభవించి ఊహించని అధిక నష్టాన్ని కలిగిస్తున్నాయి.
నిర్వచనం
ఒక సమాజం తిరిగి కోలుకోలేని విధంగా, సాధారణ సామర్థ్యానికి మించి ప్రాణనష్టం, ఆస్తి నష్టం, మౌలిక
సౌకర్యాలు, పర్యావరణం, నిత్యావసర సేవలు, జీవనోపాధి మార్గాలను విధ్వంసమొనర్చే ఒక సంఘటన లేదా వరుస ఘటనలను విపత్తు
అంటారు.
కేంద్ర హోంమంత్రిత్వశాఖ
సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని కాపాడి, సంరక్షించడానికి అసాధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉపద్రవ పరిస్థితినే విపత్తు అంటారు.
విపత్తు నిర్వహణ చట్టం- 2005 విపత్తును, ఏదైనా ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా లేదా మానవ కల్పిత కారణాలవల్ల లేదా ప్రమాదవశాత్తు లేదా నిర్లక్ష్యం వల్ల సంభవించి, సంబంధిత ప్రాంతం తనంతట తాను కోలుకోలేని విధంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి విధ్వంసానికి లేదా పర్యావరణ నష్టానికి లేదా విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవం, ప్రమాదం, తీవ్రవిపత్తు లేదా దుర్ఘటనగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వచించింది.
విపత్తు- ప్రాథమిక అంశాలు
అకస్మాత్తుగా సంభవించే ప్రకృతి లేదా మానవ తప్పిదాల వల్ల సమాజానికి జరిగే ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించే సంఘటలను ‘విపత్తు’ గా వ్యవహరిస్తారు. దీన్ని ఆంగ్లంలో ‘డిజాస్టర్’ అంటారు. (డిస్ అంటే దుష్ట, ఆస్టర్ అంటే నక్షత్రం). ఈ పదం గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ఈ పదానికి కీడు లేదా నష్టం కలిగించే నక్షత్రం అని అర్థం. విపత్తులు అనేవి ఆదిమకాలం నుంచి సంభవిస్తున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇవి అధికమయ్యాయి. వీటి వల్ల ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉండటమే కాకుండా పర్యావరణ హాని కూడా అధికం అవుతుంది.
ఐక్యరాజ్యసమితి (UNO)
విపత్తును ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) సమాజం లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణాన్ని, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపదగా నిర్వచించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం కోలుకోవడానికి వెలుపలి నుంచి అసాధారణమైన ప్రతిస్పందన అవసరమయ్యే విధంగా నష్టానికి, ఆర్థిక విధ్వంసానికి, మానవ ప్రాణ నష్టానికి, ఆరోగ్యం, ఆరోగ్య సేవలను పతనం చేసే ఏదైనా ఘటనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ విపత్తును నిర్వచించింది.
విపత్తులు అనేవి…
- ఆకస్మికంగా సంభవిస్తాయి.
- అతివేగంగా సంభవిస్తాయి.
- మానవ సమాజాల, సామాజిక, సాంస్కృతిక,ఆర్థికపరమైన వనరులను ధ్వంసం చేస్తాయి.
- ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తాయి.
- పర్యావరణ వనరులను ధ్వంసం చేసి ఒక ప్రాంత సుస్థిరాభివృద్ధిని దెబ్బతీస్తాయి.
విపత్తు సంభావ్యత
విపత్తు సంభావ్యత అంటే ఒక సమాజం, వ్యవస్థ, నిర్మాణం, భౌగోళిక ప్రాంతంలో ప్రమాదానికి లేదా విపత్తుకు గురయ్యే అవకాశం ఉండే పరిస్థితి. ఇది ఆ ప్రాంతంలో నివసించే ప్రజల ఆర్థిక పరిస్థితి, నిరక్షరాస్యత, సరైన అవగాహన లేకపోవడం, పట్టణీకరణ, జనాభా పెరుగుదల మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది.
విపత్తుల రకాలు-వర్గీకరణ
విపత్తులు సంభవించే కారణాలను బట్టి విపత్తులను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి
1. ప్రకృతి సిద్ధమైనవి
2. మానవ కారకమైనవి
1. ప్రకృతి సిద్ధమైనవి
- ఇవి మానవుల దైనందిన జీవితంలోని కార్యకలాపాల కారణంగా సంభవించి వారి సాధారణ జీవితానికి తీవ్ర అంతరాయాన్ని కలుగజేస్తాయి.
- ఉదాహరణకు: వరదలు, నీటి ముంపు, తుఫానులు, చక్రవాతాలు, సైక్లోన్స్, టోర్నడోలు, హరికేన్లు, కరువులు, సునామీలు, వేడిగాలులు, అతి శీతల గాలులు, సముద్రకోత, ఉరుములు, మెరుపులు, హిమపాతాలు, వడగళ్లవాన, కుండపోతవాన
2. మానవ కారకమైనవి
- ప్రభావిత ప్రజలు ఎదుర్కోలేని విధంగా మానవ, ఆర్థిక, పర్యావరణ నష్టాలకు దారితీసే మానవ ప్రేరేపిత వైపరీత్యం సాధారణ జీవితానికి కలుగజేసే తీవ్ర అంతరాయాన్ని మానవ కారక విపత్తు అంటారు.
- ఉదాహరణకు: అగ్నిప్రమాదాలు, రసాయన లేదా పారిశ్రామిక ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, రోడ్డు లేదా రైలు వంటి రవాణా ప్రమాదాలు. జల ప్రమాదాలు, రాజకీయ అశాంతి
ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించిన డిస్ ఇన్వెంటర్ విపత్తు సమాచార నిర్వహణ వ్యవస్థ ప్రకారం విపత్తుల వర్గీకరణ
1.భౌగోళిక విపత్తులు
2. జల లేదా వాతావరణ శీతోష్ణస్థితి విపత్తులు
3. సహజ, సామాజిక విపత్తులు
4. పర్యావరణపరమైన విపత్తులు
5. జీవసంబంధ విపత్తులు
6. మానవ ప్రేరేపిత విపత్తులు
భౌగోళిక విపత్తులు
ఇవి భూనిర్మితిలో సంభవించే మార్పుల వల్ల సంభవిస్తాయి. ఉదా: భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు, ఆనకట్టలు తెగిపోవడం, భూపాతాలు మొదలైనవి.
జల లేదా వాతావరణ శీతోష్ణస్థితి విపత్తులు
ఇవి వాతావరణంలో సంభవించే మార్పులవల్ల ఏర్పడతాయి. ఉదా: తుఫానులు, టోర్నడోలు, హిమపాతాలు, కుండపోత వర్షాలు, వేడిగాలులు, శీతల గాలులు, కరువు లేదా దుర్భిక్షం వంటివి ఈ కోవలోకి వస్తాయి. పిడుగులను కూడా ఇటీవల ఈ విపత్తుల్లో చేర్చారు.
సహజ, సామాజిక విపత్తులు
ఇవి ప్రకృతి పరమైన, మానవ ప్రేరేపిత పరమైన కారణాల వల్ల అంటే ఈ రెండింటి వల్ల సంభవిస్తాయి. ఉదా. భూతాపాలు, వరదలు మొదలైనవి.
పర్యావరణపరమైన విపత్తులు
ఇవి పర్యావరణంలో మార్పులవల్ల సంభవిస్తాయి. ఉదా: పర్యావరణ క్షీణత, ఎడారీకరణ, కీటకాల వ్యాప్తి మొదలైనవి.
జీవసంబంధ విపత్తులు
ఇవి పర్యావరణంలో మార్పులవల్ల, మానవుని నిర్లక్ష్యం వల్ల సంభవిస్తాయి. ఆహారం కలుషితం కావడం, అంటువ్యాధుల వ్యాప్తి, పంటలకు పట్టే చీడ వ్యాప్తి, పశువులకు వచ్చే మహమ్మారి వ్యాధులు మొదలైనవి.
మానవ ప్రేరేపిత విపత్తులు
ఇవి మానవ తప్పిదాల వల్ల, నిర్లక్ష్యం వల్ల, స్వార్థపూరిత చర్యలవల్ల సంభవిస్తాయి. ఉదా. ఉగ్రవాద దాడులు, రోడ్డుప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, తొక్కిసలాటలు, పరిశ్రమల్లో విషవాయువుల లీకేజీ, ఆయిల్ ట్యాంకర్ల లీకేజీ, పడవ ప్రమాదాలు మొదలైనవి.
విపత్తులపై వెలువడిన నివేదికలు
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యునైటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్స్ (UNISDR): ప్రపంచవ్యాప్తంగా సంభవించిన విపత్తుల్లో అధికంగా విపత్తులన్ని వాతావరణ సంబంధమైన వరదలు, తుఫానులు, వేడిగాలులు, కరువు లాంటి వైరీత్యాలవల్ల సంభవించాయని తెలుస్తుంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా వరదలకు గురవుతున్న వారిలో 90శాతానికి పైగా దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల వారు ఉన్నారు. అంతేకాకుండా ఈ రెండు దశాబ్దాల్లో దాదాపు 250 నుంచి 300 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేరకు ఆస్తి నష్టం జరిగింది. UNISDR రిపోర్టు ప్రకారం ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో విపత్తులు సంభవించిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా తరువాత స్థానాల్లో చైనా, భారత్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా ఉన్నాయి.
వైపరీత్యాలు
- భౌగోళిక వైపరీత్యాలు
- భూకంపాలు
- సునామీలు
- అగ్నిపర్వత విస్ఫోటాలు
- భూతాపం
- ఆనకట్టలు తెగిపోవడం
- జల, వాతావరణాలకు (శీతోష్ణస్థితి)
- సంబంధించిన వైపరీత్యాలు
- వరదలు, నీటిముంపు
- తుఫాన్, చక్రవాతాలు, సైక్లోన్స్
- టోర్నడోలు, హరికేన్లు
- కరువులు
- వేడిగాలులు, అతిశీతల గాలులు
- సముద్రకోత
- ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు
- హిమపాతాలు
- వడగళ్లవాన
- కుండపోత వాన
- రసాయన పారిశ్రామిక అణు సంబంధిత
వైపరీత్యాలు
- అణు వైపరీత్యాలు
- ప్రమాదాలకు సంబంధించిన వైపరీత్యాలు
- అడవుల్లో చెలరేగే కార్చిచ్చు
- పట్టణాల్లో అగ్నిప్రమాదాలు
- గనుల్లో వరద ప్రమాదాలు
- నూనె, చమురు వలికిపోవడం
- భవంతులు కూలిపోవడం
- వరుస బాంబు పేలుళ్లు
- ఉత్సవాల సందర్భంగా జరిగే ప్రమాదాలు
- విద్యుత్ కారణంగా ప్రమాదాలు
- విమాన, రహదారి, రైలు ప్రమాదాలు,
- పడవల మునక
- గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు
- జీవ సంబంధ వైపరీత్యాలు
- బయాలజికల్ వైపరీత్యాలు
మోడల్ బిట్స్
1. ప్రపంచ విపత్తుల పంపిణీలో భూకంపాలు, సునామీలు ఎంత శాతం వరకు ఉంటాయి?
1) 6శాతం 2) 7శాతం
3) 8శాతం 4) 9శాతం
2. ప్రకృతి విపత్తుకు ఉదాహరణ?
1) తుఫాను 2) భూకంపం
3) సునామీ 4) పైవన్నీ
3. కింది వాటిలో మానవ కారక విపత్తు?
1) వరద 2) భూకంపం
3) కరువు 4) బాంబు పేలుడు
4. ప్రమాదం ఒక అపాయకరమైన సంఘటన. అవి?
1) భూకంపం 2) సునామీ
3) వరదలు 4) పైవన్నీ
5. విపత్తు ఒక సంఘటన. దానివల్ల?
1) మానవ నష్టం కలుగుతుంది
2) ఆస్తి నష్టం కలుగుతుంది
3) జంతువుల నష్టం కలుగుతుంది
4) పైవన్నీ
6. విపత్తు నిర్వహణ కార్యకలాపాలు ఎప్పుడు నిర్వహించవచ్చు?
1) విపత్తుకు ముందు
2) విపత్తు జరుగుతున్న సమయంలో
3) విపత్తు తర్వాత
4) పైవన్నీ
7. ప్రపంచ విపత్తుల్లో వరదలు ఎంత శాతంగా ఉంటాయి?
1) 30శాతం 2) 35శాతం
3) 40శాతం 4) 45శాతం
8. భారత భూభాగంలో ఎంతశాతం వరదలకు గురయ్యే అవకాశం ఉంది?
1) 22శాతం 2) 20శాతం
3) 18శాతం 4) 12శాతం
9. భారత్లో ఉన్న రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతాయి?
1) 18 2) 28 3) 22 4) 25
10. 1980-2010 మధ్యకాలంలో భారత్లో ప్రకృతి విపత్తుల వల్ల మరణించినవారు ఎంతమంది?
1) 1,43,039 2) 1,23,039
3) 1, 13, 039 4) 1, 03, 039
11. విపత్తు (డిజాస్టర్) అనే మాట ఏ భాష నుంచి వచ్చింది?
1) అరబిక్ 2) చైనీస్
3) గ్రీకు 4) రష్యన్
12. విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రధాన లక్షణాలు ఏమిటి?
1) లక్ష్యశుద్ధి 2) సరళత
3) ఆచరణ సాధ్యం 4) పైవన్నీ
13. భారత తీరప్రాంతాల్లోని ఎంతభాగం గాలివానలు, తుఫానులు, సునామీలకు గురవుతుంది?
1) 3700కిమీ 2) 4700కిమీ
3) 6700కిమీ 4) 5700కిమీ
14. విపత్తు నిర్వహణ అంతర్భాగాలు?
1) పునర్ నివాసం 2) నివారణ
3) పునర్ నిర్మాణం 4) పైవన్నీ
15. విపత్తుల ప్రభావాన్ని దేని ద్వారా అధికంగా తగ్గించవచ్చు?
1) మెరుగైన ప్రణాళిక ద్వారా
2) మెరుగైన సంసిద్ధత ద్వారా
3) మెరుగైన నివారణ చర్యల ద్వారా
4) పైవన్నీ
సమాధానాలు
1-3 2-4 3-4 4-4 5-4 6-4 7-1 8-4 9-4 10-1 11-3 12-4 13-4 14-4 15-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు