పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
పార్లమెంట్ సమావేశాలు
- ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను సంవత్సరానికి రెండుసార్లు ఏర్పాటు చేస్తారు.
- రెండు సమావేశాల మధ్య కాలం 6 నెలలకు మించరాదు. అయితే సాధారణంగా 3 సమావేశాలు జరుగుతుంటాయి. సమావేశాలపై గరిష్ఠ పరిమితి లేదు.
బడ్జెట్ సమావేశం: జనవరి చివరి వారం/ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారం దీర్ఘ కాల సమావేశం
వర్షాకాల సమావేశం : జూలై నుంచి ఆగస్టు
శీతాకాల సమావేశం : నవంబర్ నుంచి డిసెంబర్ అతిస్వల్పకాల సమావేశం
పార్లమెంట్ కార్యకలాపాల నిర్వహణ
- పార్లమెంట్ సమావేశాలను హిందీ లేదా ఇంగ్లిష్‌లో నిర్వహిస్తారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి 15 సంవత్సరాల తర్వాత ఇంగ్లిష్ భాష అధికార భాషగా కొనసాగాలంటే పార్లమెంట్ చట్టం చేయాలి. ఈ మేరకు 1963లో పార్లమెంట్ అధికార భాష చట్టాన్ని రూపొందించింది. ఇంగ్లిష్‌ను శాశ్వత అధికార భాషగా మార్చారు.
- స్పీకర్ లేదా చైర్మన్ పార్లమెంట్ సభ్యులు తమ మాతృభాషలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. దాన్ని తర్జుమ చేసే ఏర్పాట్లు చేయాలి.
పార్లమెంట్ ఉపయోగించే భాష పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం: ఆర్టికల్ 86
- లోక్‌సభను, రాజ్యసభను లేదా రెండు సభలను సంయుక్తంగా సమావేశ పరిచి రాష్ట్రపతి ప్రసంగించవచ్చు.
- లోక్‌సభకు లేదా రాజ్యసభకు గానీ రాష్ట్రపతి సందేశాలను పంపవచ్చు. సభలో చర్చిస్తున్న ఏవైనా బిల్లుల గురించి లేదా మరేదైనా విషయాల గురించి గానీ సందేశాలను పంపవచ్చు. అప్పుడు ఆ సభ సదరు సందేశాల్లోని విషయంపై వెంటనే చర్చించాలి.
పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం- ఆర్టికల్ 87
- లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.
- ఆ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేస్తారు. ఈ సమావేశాల ఆవశ్యకతను రాష్ట్రపతి వివరిస్తారు.
- అదే విధంగా ప్రతి సంవత్సరం పార్లమెంట్ తొలి సమావేశాల్లో కూడా ఉభయ సభలను సంయుక్తంగా సమావేశ పరిచి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు, పథకాలను గురించి సూచన ప్రాయంగా తెలియజేస్తారు.
- ఇది ఒక సంప్రదాయం. రాజ్యాంగ రచన జరిగినప్పుడు ప్రతి సమావేశం ప్రారంభంలోను రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ప్రసంగించేవారు.
- అదే విధంగా 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి సంవత్సరం ఒకసారి పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంపై లోక్‌సభలో, రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
- రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉభయ సభలు ఆమోదిస్తే చర్చ ముగుస్తుంది. రాజ్యసభ తీర్మానాన్ని తిరస్కరించినా, సవరణలు ప్రతిపాదించినా ప్రభుత్వంపై ప్రభావం ఉండదు. కానీ లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించకపోయినా లేదా సవరించిన ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.
పార్లమెంట్లో మంత్రులు అటార్నీజనరల్ హక్కులు- ఆర్టికల్ 88:
- మంత్రులు, అటార్నీ జనరల్ పార్లమెంట్ ఉభయ సభల సమావేశాల్లో పాల్గొనవచ్చు.
- మంత్రులు ఏ సభలో సభ్యులుగా ఉంటారో ఆ సభలో మాత్రమే వారికి ఓటుహక్కు ఉంటుంది. మరొక సభలో ఓటుహక్కు ఉండదు. అటార్నీ జనరల్‌కు ఏ సభలోనూ ఓటుహక్కు ఉండదు.
- ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా ఒక వ్యక్తి గరిష్ఠంగా ఆరు నెలల వరకు మంత్రిగా కొనసాగవచ్చు. అప్పుడు అతనికి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి హక్కు ఉంటుంది. కానీ ఓటు వేయడానికి హక్కు ఉండదు.
న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంట్లో చర్చించరాదు-ఆర్టికల్ 121
- తమ అధికార విధుల నిర్వహణలో భాగంగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంటులోని ఏ సభలోనూ చర్చించరాదు. అయితే సదరు న్యాయమూర్తిని తొలగించాలనే అభ్యర్థనను రాష్ట్రపతికి అందజేసిన తర్వాత మాత్రం వారిపై పార్లమెంట్లో చర్చించవచ్చు.
పార్లమెంట్ కార్యకాలాపాలపై న్యాయస్థానాలు విచారణ జరపరాదు-ఆర్టికల్ 122
- పార్లమెంట్ నిర్వహణ సరిగ్గా లేదనే కారణంతో ఏ న్యాయస్థానం విచారణ చేపట్టరాదు. పార్లమెంట్ సభ్యులు తమ అధికార విధి నిర్వహణలో వ్యవహరించిన తీరుపై కూడా న్యాయస్థానాలకు ఎటువంటి నియంత్రణ ఉండదు.
పార్లమెంట్ సచివాలయ ఉద్యోగులు
- ఆర్టికల్ 98 ప్రకారం పార్లమెంట్‌లోని ఉభయ సభలకు విడివిడిగా సచివాలయ ఉద్యోగులుంటారు.
- ఉభయ సభలలోని సచివాలయ ఉద్యోగుల భర్తీ, ఉద్యోగ నిబంధనలు మొదలైన అంశాలకు సంబంధించి పార్లమెంట్ శాసనాలను రూపొందించవచ్చు.
- పార్లమెంట్ శాసనం చేసే వరకు పార్లమెంటరీ సెక్రటేరియట్ ఉద్యోగుల నియామకం, ఉద్యోగ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి జారీ చేయాలి. ఆ ఉత్తర్వులను జారీ చేయడానికి ముందు లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్లను రాష్ట్రపతి సంప్రదించాలి.
సభా నాయకులు : leader of the house
- లోక్‌సభ, రాజ్యసభలో వేర్వేరుగా సభా నాయకులు ఉంటారు.
- ప్రధానమంత్రి ఏ సభలో సభ్యుడో ఆ సభకు నాయకుడిగా వ్యవహరిస్తాడు.
- ప్రధానమంత్రి సభ్యుడు కాని సభలో సీనియర్ కేబినెట్ మంత్రి నాయకుడిగా వ్యవహరిస్తారు. ఇతడిని ప్రధానమంత్రి నామినేట్ చేయాలి.
- సభా నాయకుడు ఉపనాయకుడిని కూడా నియమించవచ్చు.
ప్రతిపక్ష నాయకులు
- పార్లమెంట్ ఉభయ సభల్లోను ప్రతిపక్ష నాయకులు ఉంటారు. సాధారణంగా ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమర్శ చేయడం వీరి విధి
- ఉభయ సభల్లో కనీసం 1/10 వ వంతు సీట్లు సాధించి మిగిలిన ప్రతిపక్ష పార్టీల కన్నా అత్యధిక సీట్లు పొందిన పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా పేర్కొంటారు.
- జనతాపార్టీ హయాంలో 1977లో ప్రతిపక్ష నాయకులకు చట్టబద్ధ హోదా కల్పించారు. అప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులకు కేబినేట్ మంత్రి హోదా కల్పించారు. జీతభత్యాలు కూడా కేబినేట్ మంత్రి వలె ఉంటాయి. అయితే వాస్తవానికి అధికారికంగా 1969లోనే ప్రతిపక్ష నాయకుడిని గుర్తించారు.
పార్టీ విప్
- విప్ అనే పదానికి అధిపతి లేదా ఆదేశం అని అర్థం.
- పార్లమెంటరీ పార్టీ అధికారిని పార్టీ విప్ అంటారు. ఈ అధికారి ప్రతిపక్షంలోను, అధికార పక్షంలోనూ ఉంటాడు. ఆయన అసిస్టెంట్ ఫ్లోర్ లీడర్‌గా ఉంటాడు.
- ఇతని ప్రధాన బాధ్యత పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సభ్యులు అందరూ హాజరయ్యేలా చూడటం. ఏదైనా సమస్యపై మద్దతు కూడగట్టేలా చూడటం.
- ఇతను సభ్యుల ప్రవర్తనను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తూ ఉంటాడు.
- ఇతని మార్గదర్శకాలను పార్టీ సభ్యులు తప్పనిసరిగా అనుసరించాలి. లేనిచో పార్టీ ఫిరాయింపుల చట్టం ఆధారంగా ఆ సభ్యులు పార్లమెంటరీ సభ్యత్వం కోల్పోతారు.
ఓటింగ్ విధానం, కోరం- ఆర్టికల్ 100
- రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప సాధారణ పరిస్థితుల్లో సభలో ఉండి, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో మెజార్టీ ప్రాతిపదికపై నిర్ణయించబడతాయి. అయితే, చైర్మన్ లేదా సభాపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మొదటిసారి జరిగిన ఓటింగ్‌లో పాల్గొనరాదు.
- ఒక అంశంపై అనుకూలంగా, వ్యతిరేకంగా, సమానమైన ఓట్లు పోలయినప్పుడు సభాపతి తమ ఓటు హక్కును వినియోగించి తీరాలి. దీన్ని నిర్ణయాత్మక ఓటు అంటారు.
- లోక్‌సభ లేదా రాజ్యసభలో కొన్ని సీట్లు ఖాళీగా ఉండి ఉండవచ్చు. అంత మాత్రాన సదరు సభల నిర్వహణకు ఎటువంటి అవరోధం ఉండదు.
- ప్రత్యేకంగా పార్లమెంట్ శాసనం చేస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో లోక్‌సభ లేదా రాజ్యసభలకు సంబంధించి ఆయా సభల్లో గల మొత్తం సభ్యుల సంఖ్యలో 10వ వంతు కోరం అవుతుంది. సభా కార్యక్రమాలు సాగాలంటే కోరం ఉండి తీరాలి. అంటే కనీసం 55 మంది లోక్‌సభలో, 25 మంది రాజ్యసభలో ఉండాలి.
- లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కొనసాగుతున్నప్పుడు ఏ దశలోనైనా సభలో సభ్యుల సంఖ్య కోరం కన్నా తక్కువగా ఉన్నదని స్పీకర్ లేదా అధ్యక్షుడు గమనించినట్లయితే సభను వెంటనే వాయిదా వేయాలి లేదా కోరం పూర్తి సభను సస్పెండ్ చేయాలి.
రాజ్యసభ అధ్యక్ష, ఉపాధ్యక్షులు: ఆర్టికల్ 89
- భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ ఆఫీషియో చైర్మన్‌గా ఉంటారు.
- రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అంటే ఉపాధ్యక్షుడు తప్పనిసరిగా రాజ్యసభ సభ్యుడై ఉండాలి.
1) ఒక బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రకటించడం.
2) ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించడం - ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులు నిర్వహించవలసి వచ్చినపుడు, రాజ్యసభ చైర్మన్ విధులను నిర్వహించలేడు.
- రాజ్యసభ చైర్మన్ అయినప్పటికీ రాజ్యసభ సభ్యుడై ఉండవలసిన అవసరం లేదు.
- లోక్‌సభ స్పీకర్ వలె రాజ్యసభ చైర్మన్‌కి కూడా నిర్ణయాత్మక ఓటు ఉంటుంది.
- ఉపరాష్ట్రపతి అలంకార ప్రాయ అధ్యక్షులు, ఆచరణలో మొత్తం కార్యకలాపాలను రాజ్యసభ ఉపాధ్యక్షుడు నిర్వహిస్తారు.
జీతభత్యాలు
- స్పీకర్ వలె చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల జీత భత్యాలను కూడా పార్లమెంట్ నిర్ణయిస్తుంది. జీత భత్యాలు భారత సంఘటిత నిధి నుంచి చెలిస్తారు. ఒక వేళ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా విధులను నిర్వర్తించినపుడు రాజ్యసభ చైర్మన్‌గా జీత భత్యాలు స్వీకరించరు. అయితే ఆ సమయంలో రాష్ట్రపతి జీతభత్యాలను పొందుతారు.
ఉపాధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడటం,రాజీనామా, తొలగింపు- ఆర్టికల్ 90:
- రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతూ అర్హత కోల్పోయినట్లయితే, ఆ సభ్యుడు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి.
- రాజ్యసభ అధ్యక్షునికి లిఖిత పూర్వకంగా తెలియజేయడం ద్వారా ఉపాధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయవచ్చు.
- రాజ్యసభ సాధారణ మెజారిటీ తీర్మానం ద్వారా ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించవచ్చు. అయితే రాజ్యసభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఈ తీర్మానాన్ని బలపరచాలి
- అయితే ఉపాధ్యక్షుడిని తొలగించాలనుకుంటే అతనికి 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి.
అధ్యక్ష విధులను ఉపాధ్యక్షుడు నిర్వహించడం: ఆర్టికల్ 91
- కొన్ని సందర్భాల్లో అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడవచ్చు రాష్ట్రపతి విధులను ఉపరాష్ట్రపతి నిర్వర్తిస్తుండవచ్చు. అటువంటి సందర్భాల్లో రాజ్యసభ అధ్యక్షుని విధులను ఉపాధ్యక్షుడే నిర్వహిస్తాడు.
- రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు చైర్మన్ లేని సమయంలో సభ నిర్వహణ బాధ్యతను ఉపాధ్యక్షులు స్వీకరిస్తారు.
- ఉపాధ్యక్షుడు అధ్యక్షునికి అధీనుడు కాదు. ఇతను ప్రత్యక్షంగా రాజ్యసభకు బాధ్యత వహిస్తాడు.
- రాజ్యసభ అధ్యక్షుడు సభకు అధ్యక్షత వహించే సందర్భంలో ఉపాధ్యక్షుడు సాధారణ రాజ్యసభ సభ్యుడిగా పరిగణించబడతాడు.
- ఉపాధ్యక్షుడు గైర్హాజరు అయినట్లయితే రాజ్యసభ నిబంధనానుసారం అర్హత గల వ్యక్తి ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తారు.
అధ్యక్ష ఉపాధ్యక్ష తొలగింపు తీర్మానాలు
- రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడిని తొలగించే తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు, ఆ తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు.
- రాజ్యసభ ఉపాధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరిగే సందర్భంలో ఉపాధ్యక్షుడు చర్చలో పాల్గొనవచ్చు. ప్రసంగించవచ్చు అయితే ఓటింగ్‌లో మాత్రం పాల్గోనకూడదు.
Previous article
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?
Next article
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు