ఎకనామిక్స్ ఎలా?
గ్రూప్-2 మూడో పేపర్లో పూర్తిగా అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశాలుంటాయి. సిలబస్‌ను లాజికల్ విధానంలో చదివితే విజయం సులభంగా సాధించవచ్చు. అన్ని టాపిక్‌లు ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలు అనే మూడింటిపై ఆధారపడి ఉంటాయి.ద్రవ్యం (డబ్బు)తో ముడిపడిన అంశాల నుంచి వాటికి అనుబంధంగా ఉండే రంగాలను ఒక్కొక్కటిగా చదివితే పూర్తి అవగాహన వస్తుంది.
సెక్షన్-1: భారతర ఆర్థిక వ్యవస్థ- వివిధ అంశాలు, సమస్యలు, సవాళ్లు
ఇందులో మొదటి టాపిక్ జనాభా అధ్యయనం (డెమోగ్రఫీ) గురించి ఉంటుంది. జనాభా అనేది ఒక దేశానికి సంబంధించిన జాతక చక్రంగా భావిస్తారు. భారత్ 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో జనాభా అనే టాపిక్‌ను కీలకంగా భావించాలి. దేశం, రాష్ట్రం జనాభా పరంగా ఎలా వృద్ధి చెందుతాయి. స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి, పెరుగుదల అంశాలను కూలంకషంగా అధ్యయనం చేయాలి. జనాభా వృద్ధి రేటు ఎలా ఉంది అనే అంశాలు చదవాలి. అక్షరాస్యత, నిరక్షరాస్యత, లింగ అసమానతలు, జన సాంద్రత, పట్టణ, గ్రామీణ జనాభా పెరుగుదల వంటి అంశాలను పూర్తిగా అధ్యయనం చేయాలి.
నోట్: ఈ పరీక్షలో దేశ జనాభా, రాష్ట్ర జనాభా అంశం నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి రెండింటిపై పూర్తి అవగాహన ఉండాలి.
రెండు, మూడు, నాలుగో టాపిక్‌లు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక భావనలు అంటే జాతీయాదాయం గణన, భావనలు, స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం, వివిధ రంగాలు, వాటి వాటా గురించి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అన్ని అంశాలు ఒకదానితో ఒకటి లింక్డ్గా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు దేనికదే కాకుండా ఒక క్రమపద్ధతిలో చదవాలి. ఉత్పత్తి అనేది ప్రాథమిక రంగం (వ్యవసాయం, పంటలు), పరిశ్రమల రంగం, సేవల రంగాల్లో ఉంటుంది. ఒక్కొక్క రంగం దేశ ఆదాయంలో ఎంత వాటాను కలిగి ఉన్నాయి అనేది వాటి ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. అన్ని రంగాల్లో దేశం వృద్ధి ఎలా ఉంది. వినియోగానికి తగినంత ఉత్పాదకత ఉందా లేదా అనే అంశాలను విశ్లేషించుకుంటూ ఆయా రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై పట్టు సాధించాలి. ఈ మూడు రంగాలకు అనుబంధంగా ఉన్న రంగాల పనితీరుపై అధ్యయనం చేయాలి. అదేవిధంగా పారిశ్రామిక, సేవల రంగాల్లో పురోగతి ఎలా ఉంది. వాటి ఉపరంగాలు, భారత ఆర్థిక మౌలిక సదుపాయాల గురించి లోతుగా చదవాలి. వీటన్నింటిపై పూర్తి అవగాహన కోసం జాతీయ ఎకనామిక్ సర్వేను అధ్యయనం చేయాలి. ఈ నివేదికను ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.
సెక్షన్-1 లో ప్రత్యేకమైన టాపిక్ బడ్జెట్, ప్రణాళికలు, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్. ఇందులో 1950-2017 నుంచి వరకు గల 12 పంచవర్ష ప్రణాళికలు, ప్రతి పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగిన అభివృద్ధి, లక్ష్యాలు, వైఫల్యాలు అనే అంశాలు చదవాలి. 2017లో పంచవర్ష ప్రణాళికల స్థానంలో ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ గురించి తెలుసుకోవాలి. నీతి ఆయోగ్ లక్ష్యాలు, నివేదికలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్ అంచనా, భావనలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ వివరాలు పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇందులో ముఖ్యమైన రంగాలకు ప్రభుత్వాలు కేటాయించిన బడ్జెట్ శాతాలను గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం, ప్రభుత్వ వ్యయం, అప్పులు, ఫైనాన్స్ కమిషన్ల గురించి చదవాలి. FRBM (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) చట్టం-2003 ఉద్దేశం, భావనలు, లక్ష్యాల గురించి తెలుసుకోవాలి.
సెక్షన్-2: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
ఈ సెక్షన్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిలో వ్యత్యాసం, రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రశ్నలు అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవాలి. ఆయా పథకాలకు కేటాయించిన నిధులు, లబ్ధిదారులు, అర్హులు, ప్రజలకు ఏ మేరకు చేరువయ్యాయి వంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు అంటే 1956-2014 మధ్య తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉండాలి. ఇందుకోసం 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వాటా, అభివృద్ధిపై అధ్యయనం చేయాలి. ఈ కాలానికి చెందిన వివిధ నివేదికలు, కమిటీల గురించి చదవాలి.
2014 తర్వాత గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణ ఆర్థికాభివృద్ధి, రంగాల వారీగా రాష్ట్ర ఆదాయంలో వాటా, తలసరి ఆదాయం గురించి విపులంగా తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాలకు కేటాయించిన నిధుల వివరాలపై అవలోకనం చేసుకోవాలి.
ఆర్థికంగా దేశంలో తెలంగాణ స్థానం, తలసరి ఆదాయం, దేశ తలసరి ఆదాయంలో తెలంగాణ వాటా వంటి అంశాలు విపులంగా నేర్చుకోవాలి.
సెక్షన్-3: అభివృద్ధి, పరివర్తన సమస్యలు
దేశానికైనా, రాష్ర్టానికైనా అభివృద్ధి అంతిమ లక్ష్యం కాదు. పెరిగిన జీడీపీ ఎంతవరకు ఉపయోగపడిందనేది ముఖ్యం. ఆర్థిక వృద్ధి మానవాభివృద్ధికి తోడ్పడాలి. ఇవన్నీ నెరవేరాలంటే అభివృద్ధి పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలి. ఈ సెక్షన్లో సమాజం, పర్యావరణం, ఆర్థిక అంశాలు కలగలిపి ఉంటాయి. ఇవి మూడు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇందులో మానవాభివృద్ధి, మానవాభివృద్ధి సూచీలు, నివేదికల గురించి ప్రశ్నలు అడుగుతారు. ప్రభుత్వాలు ఏటా మానవాభివృద్ధి సూచీలను విడుదల చేస్తాయి. వాటిని సమూలంగా అధ్యయనం చేయాలి. అభివృద్ధి క్రమంగా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అంచనా వేస్తూ చదవాలి. వీటిని పర్యావరణానికి లింకు పెడుతూ పర్యావరణానికి హాని కలగడం వల్ల కలిగే కాలుష్యాలు, వాటి రకాలు, సూచీలు, నివేదికలను చదవాలి. అభివృద్ధిలో పట్టణీకరణ ముఖ్యమైనది. రోజురోజుకు పట్టణీకరణ పెరుగుతుంది.
2050 వరకు గ్రామీణ జనాభా, పట్టణ జనాభా సమానమయ్యే అవకాశం ఉంది. ఇందుకు గల కారణాలు, నష్టాలు, లాభాలను అంచనా వేస్తూ పట్టణీకరణ వల్ల పర్యావరణానికి కలిగే హాని గురించి చదవాలి. దేశం, రాష్ట్రం పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన పథకాలు, విధానాల గురించి ప్రశ్నలు అడుగుతారు. అభివృద్ధి అంశంలో మరో కీలక భాగం నిరుద్యోగం, పేదరికం. ఈ రెండింటిపైనా పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పేదరికం, నిరుద్యోగం పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అందుకు గల కారణాలను విశ్లేషించాలి. వీటిని గణించే విధానాల గురించి తెలుసుకోవాలి. ఆరోగ్యం, విద్య, వైద్యం కూడా అభివృద్ధిలో భాగాలే వీటిని కూడా క్షుణ్నంగా చదవాలి.ఎకానమీలో అన్ని అంశాలు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. మరే సబ్జెక్టులో ఇలా ఉండదు. అన్ని టాపిక్‌లను అనుసంధానం చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.
-బావండ్ల వినయ్ కుమార్
విషయ నిపుణులు హైదరాబాద్
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు