జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్
1) కరెంట్ అఫైర్స్ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, వర్తమాన అంశాలు
2) అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3) జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగం (సైన్స్ అండ్ టెక్నాలజీ)లో భారతదేశం సాధించిన విజయాలు
4) పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ- నివారణ, ఉపశమన వ్యూహాలు
5) ప్రపంచ, భారతదేశ, తెలంగాణ భూగోళ శాస్త్రం.
6) భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
7) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
8) తెలంగాణ రాష్ట్ర విధానాలు
9) బలహీన వర్గాలు: సామాజిక వైమనస్యత (సోషల్ ఎక్సక్లూజన్), హక్కుల సమస్యలు, సమగ్ర విధానాలు
10) లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్
11) ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానం (10వ తరగతి స్థాయి)
గ్రూప్ 1, 2, 3, 4, టీఎస్పీఎస్సీ నిర్వహించే ఇతర పరీక్షల్లోనూ జనరల్ స్టడీస్కు సంబంధించిన సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. ఈ పదకొండు అంశాలను కింద తెలిపిన విధంగా విభజించి అధ్యయనం చేయాలి.
కరెంట్ అఫైర్స్ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
పరీక్ష జరిగే నాటికి కనీసం ఏడాది ముందు నుంచి జరిగిన సంఘటనలను ఒక క్రమపద్ధతిలో చదవాలి. ప్రతిరోజూ వార్తాపత్రికల్లో ప్రముఖంగా కనిపించే అంశాలను విధిగా నమోదు చేసుకోవడంతో పాటు ఏదైనా కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్ను ఫాలో కావాలి. అంతర్జాతీయ అంశాల నుంచి దాదాపు 20 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. కాబట్టి ఈ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశ విజయాలు, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ-నివారణ, ఉపశమన వ్యూహాలు, ప్రపంచ, భారతదేశ , తెలంగాణ భూగోళ శాస్త్రం
జనరల్ సైన్స్కు సంబంధించి పదో తరగతి స్థాయి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలను అధ్యయనం చేయాలి. అధిక ప్రాధాన్యం టెక్నాలజీ అంశాలకు కేటాయించాలి. బయోటెక్నాలజీ (జన్యుపరివర్తిత మొక్కలు, వ్యాక్సిన్లు మొదలైనవి), స్పేస్ టెక్నాలజీ (ఉపగ్రహ ప్రయోగాలు, గ్రహాంతర యాత్రలు, నూతన ఆవిష్కరణలు), రక్షణరంగ సాంకేతికత (డ్రోన్లు, మిసైల్స్, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, శతఘ్నిలు మొదలైనవి) చదవాలి. సమాచార ప్రసార సాంకేతికత (కమ్యూనికేషన్ టెక్నాలజీ)కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెటావర్స్, సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి వాటిని అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (పేటెంట్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ మొదలైనవి) గురించి తెలుసుకోవాలి.
భౌగోళిక శాస్త్ర అంశాలను తులనాత్మక (కంపారేటివ్) పద్ధతిలో అధ్యయనం చేస్తే మంచిది. ఉదాహరణకు భారతదేశ నైసర్గిక స్వరూపంతో పాటు తెలంగాణ నైసర్గిక స్వరూపాన్ని సమాంతరంగా చదివి నోట్స్ రాసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమల భౌగోళిక వ్యాప్తిని, భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పిన ప్రదేశాలు, తెలంగాణలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అభివృద్ధి చేసిన ప్రదేశాలతో కలిపి చదవాలి. తద్వారా శ్రమ తగ్గి, సమయం ఆదా అవుతుంది. పర్యావరణానికి సంబంధించి మౌలిక అంశాల (వివిధ ఆవరణ వ్యవస్థలు, ఆహార జాలకం, కాలుష్యం, నియంత్రణ చర్యలు, పర్యావరణ చట్టాలు, విధానాలు, పథకాలు, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు, వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించేందుకు అంతర్జాతీయంగా, దేశీయంగా చేపట్టిన వివిధ చర్యలు మొదలైనవి)పై ప్రశ్నలు వస్తాయి. విపత్తు నిర్వహణపై 3-4 ప్రశ్నలు రావచ్చు. తెలుగు అకాడమీ, మరేదైనా పబ్లిషర్ సమగ్రంగా వెలువరించిన పుస్తకాన్ని చదవాలి.
భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు, బలహీన వర్గాలు: సామాజిక వైమనస్యత (సోషల్ ఎక్సక్లూజన్), హక్కుల సమస్యలు, సమగ్ర విధానాలు
వీటిని జనరల్ స్టడీస్ పేపర్-2, జనరల్ స్టడీస్ పేపర్-3లో ఉన్న అంశాలకు సంక్షిప్త రూపంగా లేక కొనసాగింపుగా పరిగణించాలి. అందువల్ల వీటి అధ్యయనం పేపర్-2, పేపర్-3తో పాటు పూర్తి చేయాలి. ఇందుకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపకరిస్తాయి. తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథకాలను ప్రభుత్వం ప్రచురించే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం ఆధారంగా అధ్యయనం చేయాలి.
లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానం (10వ తరగతి స్థాయి)ఈ విభాగంలో నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, కాలం-వేగం-దూరం, వడ్డీ, సంభావ్యత, వయసు, బంధుత్వం, క్యాలెండర్ మొదలైన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ విభాగంలో పదో తరగతి స్థాయి వ్యాకరణం, కాంప్రహెన్షన్ సంబంధిత అంశాలపై ప్రశ్నలు వస్తాయి. కేవలం రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఈ విభాగంపై పట్టు సాధించవచ్చు. గరిష్ట స్థాయిలో ప్రశ్నలు సాధన చేయాలి.
అన్నింటికంటే కీలకమైన అంశమేమిటంటే క్రమం తప్పకుండా నమూనా ప్రశ్నలను సాధన చేయడం. రోజుకు కనీసం 100 నమూనా ప్రశ్నలను, వారానికి ఒక పూర్తిస్థాయి (150) మార్కుల పేపరును సాధన చేయాలి. నమూనా ప్రశ్నపత్రాల సాధన వల్ల మనం చదివే క్రమంలో వదిలేసినవి, ఇంకా స్పష్టంగా చదవాల్సినవి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సమయ పాలన, జవాబులు గుర్తించడంలో వేగం, కచ్చితత్వం, మెలకువలు అలవాడుతాయి. ఈ పేపర్ దాదాపు అన్ని పోటీపరీక్షలకు ఉమ్మడిగా ఉండటం వల్ల గతంలో నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సాధన చేస్తే మంచిది. ఏదైనా కోచింగ్ సంస్థ నిర్వహించే మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఎంచుకోవచ్చు. సిలబస్ విస్తృతి ఎక్కువగా ఉండటం, ఎక్కువ అధ్యయనాంశాలు ఉండటం వల్ల ఆందోళన చెందకుండా క్రమపద్ధతిలో సాధన చేస్తే గరిష్ట మార్కులు తెచ్చుకోవచ్చు.
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు