సమగ్రంగా చదువుదాం.. సత్తా చాటుదాం!
- గ్రూప్-2 ప్రిపరేషన్ ప్లాన్
గ్రూప్-1 మెయిన్స్…. ఇంతలో గ్రూప్-2 నోటిఫికేషన్… దేనికి సన్నద్ధం అవ్వాలి… ఎలా ప్రణాళిక రచించుకోవాలి… వేలాది మంది అభ్యర్థుల మదిలో మెదలుతున్న ప్రశ్న ఇది. సమీకృతం
(ఇంటిగ్రేటెడ్)గా సిద్ధం కావడం ద్వారా ఈ సంశయాన్ని అధిగమించవచ్చు.అదేవిధంగా గ్రూప్-2లో ఏ సబ్జెక్టులు ఎలా చదవాలో తెలుసుకుందాం..
సిలబస్‌పై పట్టు: గ్రూప్-1 మెయిన్స్‌తో పాటు ఇతర ఆబ్జెక్టివ్ తరహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లు సిలబస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ముందుగా ఉమ్మడి అంశాలను పరిశీలించాలి. ఆయా అంశాలు డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ తరహాలో సన్నద్ధం కావాలి. రాజ్యాంగానికి సంబంధించి ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు గ్రూప్-1, 2 సిలబస్‌లలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మెయిన్స్‌లో ఎలా అడగొచ్చు, ఆబ్జెక్టివ్ పరీక్షలో ఎలా వస్తాయో చూద్దాం. కొలీజియం వ్యవస్థ పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ తొలగింపును రాజ్యసభ చైర్మన్ సరికాదన్నారు. దీనిపై ప్రశ్నలు అడగవచ్చు.
మెయిన్స్: రాజ్యాంగ సవరణను సమీక్షించవచ్చా? దీనితో ముడిపడి ఉన్న కోర్టు తీర్పులు, రాజ్యాంగ సవరణలను పేర్కొనండి?
నమూనా సమాధానం: రాజ్యాంగ తొలి సవరణ చట్టం ద్వారా తొమ్మిదో షెడ్యూల్‌ను చేర్చారు. సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించేందుకు భూసంస్కరణలు చేస్తే, న్యాయ స్థానాలు సమీక్షించరాదని ఈ షెడ్యూల్లో పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చట్టాలు సమీక్షించాలని ఆర్టికల్ 13లో నిర్దేశించలేదని శంకరి ప్రసాద్ కేసుతో పాటు సజ్జన్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే గోలక్‌నాథ్ కేసులో ఈ తీర్పులను సుప్రీంకోర్టు మార్చింది. రాజ్యాంగ సవరణ చట్టాలను సమీక్షించవచ్చని, వాటిని సమీక్షించకుండా రాజ్యాంగంలో ఎలాంటి నిర్దేశం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 13 (4) చేర్చారు. రాజ్యాంగ సవరణ చట్టాలను సమీక్షించరాదని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత కేశవానంద భారతి కేసులో మరో సంచలన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. రాజ్యాంగ సవరణ చట్టాలు మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుంటే వాటిని కూడా సమీక్షించవచ్చని పేర్కొంది. ఆ తర్వాత పార్లమెంట్ 42వ రాజ్యాంగ సవరణ చేసింది. మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినా సరే, రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయ స్థానాలు సమీక్షించరాదని పేర్కొన్నారు. అయితే మినర్వా మిల్స్ కేసులో మరోసారి కోర్టు మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని పేర్కొంది. మౌలిక స్వరూపం ఉల్లంఘనకు గురైతే సమీక్షించవచ్చని తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఐఆర్ కోయల్హో కేసులో సుప్రీంకోర్టు మరో తీర్పు వెలువరించింది. తొమ్మిదో షెడ్యూల్‌ను కూడా న్యాయస్థానం సమీక్షించవచ్చని, అయితే ఏప్రిల్ 24, 1973కు ముందు చేర్చిన వాటిని సమీక్షించమని చెప్పింది (కేవలం ముఖ్య అంశాలతో కూడిన నమూనా సమాధానం ఇది).
ఇంకా ఈ అంశానికి సంబంధించి మెయిన్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చని పరిశీలిస్తే…
- భారత దేశంలో న్యాయ నియామకాల ప్రక్రియను వివరించండి? దీనితో ముడిపడి ఉన్న త్రీ జడ్జెస్ కేసులను పేర్కొనండి?
- 99వ రాజ్యాంగ సవరణ, ఆ సవరణ సమీక్షకు సంబంధించి విశ్లేషించండి?
- గ్రూప్-2లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చో చూద్దాం..
- తొలిసారిగా ఏ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగపు మౌలిక స్వరూపాన్ని ప్రతిపాదించింది (కేశవానంద భారతి కేసు)
- తొమ్మిదో షెడ్యూల్లో ఏ అంశాన్ని పేర్కొన్నారు (భూ సంస్కరణలు)?
- తొమ్మిదో షెడ్యూల్‌ను చేర్చినప్పుడు, అది ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగించింది (ఆర్టికల్ 31, ఆస్తిహక్కు, ఇప్పుడు ఈ హక్కును సవరించి, చట్టబద్ధమైన హక్కుగా మార్చారు)?
- తొమ్మిదో షెడ్యూల్‌ను కూడా సమీక్షించవచ్చని ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది (ఐఆర్ కోయల్హో)?
- ఏ కేసుల్లో మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తే, ఆయా రాజ్యాంగ సవరణ చట్టాలను సమీక్షించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది (కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసు)?
నిశితంగా గమనిస్తే డిస్క్రిప్టివ్‌లో చెప్పిన అంశాలనే, గ్రూప్-2లో ఆబ్జెక్టివ్ రూపంలో ఎలా అడుగుతారో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సిలబస్, అందులోని అంశాలు ఒకేలా ఉన్నప్పుడు రెండింటికి కలిపి సిద్ధం కావాలి. ముందుగా ఆ అంశానికి సంబంధించి డిస్క్రిప్టివ్ కోణంలో ప్రిపేర్ కావడం మంచిది. ఆ తర్వాత గ్రూప్-2 లేదా గ్రూప్-3 కోణంలో అభ్యర్థులు ప్రశ్నలను సంధించుకుంటూ వెళ్లాలి. ఈ తరహా ప్రిపరేషన్ కేవలం పాలిటీకే కాకుండా, అన్ని అంశాలకు వర్తింపజేయాలి. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి జనరల్ ఎస్సే కోణం కూడా పరిశీలించాలి. తెలంగాణ గ్రూప్-1 ఎస్సేలో ‘డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’ అని పేర్కొన్నారు. అంటే భారత రాజకీయాల్లో గతిశీలత అంశాలు. న్యాయ, శాసన వ్యసస్థల మధ్య వస్తున్న వైరుధ్యాల కోణంలో జనరల్ ఎస్సే కూడా చదవాలి. ఇలా చదివేటప్పుడు గ్రూప్-2కు అవసరమైన ఆబ్జెక్టివ్ అంశాలను కూడా పరిశీలించవచ్చు. తెలంగాణలో గ్రూప్ పరీక్షలో తెలంగాణ ఉద్యమం, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం బాగా ఉంది. ఆయా సబ్జెక్టులను విభిన్న కోణాల్లో సన్నద్ధం అవసరం. వాటిని కూడా రెండు తరహా పరీక్షల కోణంలో సిద్ధమైతే విజయం తథ్యం.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు