వివిధ దేశాలతో భారత్ సంబంధాలు
- ఈ ఏడాది వివిధ ఖండాల్లోని దేశాలతో భారత్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఒక్కొక్క ఖండంలోని ఒక్కొక్క దేశాన్ని పరిశీలిద్దాం.
ఆసియా
జపాన్
దౌత్య సంబంధాలు: భారత్, జపాన్ దేశాల మధ్య 70 సంవత్సరాల దౌత్య సంబంధాలు ఈ ఏడాది పూర్తయ్యాయి. రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలే. బలమైన ఆర్థిక సంబంధాలు రెండు దేశాల మధ్య ఉన్నాయి. జీ-20, జీ-4, క్వాడ్ కూటముల్లో రెండు దేశాలకు సభ్యత్వం ఉంది.
జపాన్ ప్రధాని పర్యటన
- మార్చి 19, 20 తేదీల్లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత్‌ను సందర్శించారు. రానున్న అయిదేళ్లలో దేశంలో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడికి అంగీకరించారు. జోకాశౌ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు ఇవ్వనున్నారు. మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థ ఇది. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్‌కు కూడా సాయం చేయనుంది జపాన్.
- ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్, జపాన్ బంగాళాఖాతంలో జిమెక్స్ నౌకాదళ ఎక్సర్సైజ్ను సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు నిర్వహించారు.
- జూలైలో భారత్, జపాన్ నావికా దళానికి సంబంధించి మారిటైమ్ పార్ట్‌నర్‌షిప్‌ను అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించాయి.
- ధర్మ గార్డియన్ పేరుతో మిలిటరీ ఎక్సర్సైజ్ భారత్, జపాన్ దేశాలకు చెందిన సైన్యాలు కర్ణాటకలోని బెలగావిలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు నిర్వహించాయి.
షింజో అబే మృతి
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే జూలై 8న హత్యకు గురయ్యారు. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలోనే భారత్, జపాన్ సంబంధాలు మెరుగయ్యాయి. 2014 జనవరి 26 భారత గణతంత్ర వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ వేడుకలకు వచ్చిన ఏకైక జపాన్ ప్రధాని ఆయనే. బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్ట్, భారత్, జపాన్ పౌర అణు సహకార ఒప్పందం కూడా ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో కుదిరింది.
సింగపూర్
సింగపూర్‌లోని పడాంగ్ అనే ప్రాంతాన్ని జాతీయ కట్టడంగా గుర్తించింది. ఇక్కడే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతలను స్వీకరించారు. ఆ దేశ 57వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది.
సింబెక్స్
భారత్ సింగపూర్ దేశాలు సింబెక్స్ పేరుతో నావికా దళ విన్యాసాలను నిర్వహించాయి. ఇందులో రెండు దశలు ఉన్నాయి. హార్బర్ దశను అక్టోబర్ 26, 27 తేదీల్లో విశాఖపట్నం తీరంలో, సముద్రపు దశను అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో బంగాళాఖాతంలో నిర్వహించాయి.
దక్షిణ కొరియా
నాటోకు చెందిన సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దక్షిణ కొరియా చేరింది. ఈ వ్యవస్థలో చేరిన తొలి ఆసియా దేశం ఇదే.
సారంగ్ ఉత్సవం
భారత్, దక్షిణ కొరియాల మధ్య జరిగే సాంస్కృతిక వేడుక ఇది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకు ఇది కొనసాగింది. దక్షిణ కొరియా భాషలో సారంగ్ అంటే ప్రేమ అని అర్థం. భారతీయ భాషల్లో భిన్న రంగులను చూపడం అని అర్థం.
చైనా
అరుణాచల్ ప్రదేశ్‌లోకి డిసెంబర్ 9న ప్రవేశించేందుకు చైనా బలగాలు యత్నించడంతో భారత సైన్యం ప్రతిఘటించింది. ఈ రాష్ర్టాన్ని తమదిగా ఎప్పటి నుంచో చెబుతూ చైనా ఈ చొరబాట్లకు ప్రయత్నిస్తుంది. భారత్ ప్రతిఘటిస్తుంది.
శీతాకాల ఒలింపిక్స్
ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు చైనా దేశంలో శీతాకాల ఒలింపిక్స్ నిర్వహించారు. భారత్ అధికారికంగా బహిష్కరించింది. గల్వాన్ యుద్ధంలో పాల్గొన్న క్యూ ఫబావ్ అనే సైనికుడిని టార్చ్ బేరర్‌గా ప్రకటించినందుకు భారత్ నిరసన వ్యక్తం చేసింది. అయితే భారత్ తరఫున ఆరిఫ్ ఖాన్ అనే లఢక్‌కు చెందిన యువకుడు పాల్గొన్నాడు.
నేపాల్
భారత్, నేపాల్‌ల మధ్య మహాకాళి నదిపై కొత్త వంతెనను నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ జనవరి 6న ఆమోదం తెలిపింది. దీన్ని శారద నది అని, కాళి గంగా అని కూడా పిలుస్తారు.
ప్రధానుల పర్యటనలు
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటించారు. బీహార్‌లోని జయనగర్ నుంచి నేపాల్‌లోని కుర్తా వరకు రైల్వేలైన్‌కు ఇరు దేశాలు అంగీకరించాయి. రూపే కార్డ్‌ను నేపాల్‌లో అనుమతిస్తారు. అంతర్జాతీయ సౌర కూటమిలో నేపాల్ చేరేందుకు అంగీకరించింది.
భారత ప్రధాని పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ నేపాల్‌ను మే 16న సందర్శించారు. లుంబినీలో కార్బన్ తటస్థత భవనాన్ని నిర్మించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు భారత్‌లో పర్యటించారు. కుశియార నదీ జలాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది.
ఇండోనేషియా
2024 నాటికి ఇండోనేషియా తన రాజధానిని నుసాంతరాకు మార్చనుంది.
గరుడశక్తి
ఇండోనేషియాలోని కరవాంగ్లో భారత్, ఇండోనేషియాలో గరుడశక్తి పేరుతో మిలిటరీ ఎక్సర్సైజ్లు నవంబర్ 21 నుంచి 23 వరకు నిర్వహించారు.
శ్రీలంక
శ్రీలంక దేశానికి అత్యధికంగా రుణం ఇచ్చిన దేశంగా భారత్ అవతరించింది. గత అయిదేళ్ల నుంచి చైనా ఈ స్థానంలో ఉంది. ఇప్పటివరకు శ్రీలంక దేశానికి భారత్ ఎనిమిది సార్లు లైన్ ఆఫ్ క్రెడిట్‌ను అందించింది.
సంక్షోభం
పర్యాటక రంగం పడిపోవడంతో పాటు పరిపాలన సమర్థంగా లేకపోవడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ దేశంలో కీలక పదవుల్లో ఉన్న రాజపక్స కుటుంబ సభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. చివరకు అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే, ప్రధానిగా దినేష్ గుణవర్ధనే బాధ్యతలు స్వీకరించారు.
మలేషియా
భారత్‌కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన తొలి విదేశీ కార్యాలయాన్ని మలేషియాలోని కౌలాలంపూర్‌లో ప్రారంభించేందుకు ఆగస్ట్ 18న ఒప్పందం కుదిరింది. భారత్ తయారు చేసిన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కొనేందుకు మలేషియా ఆసక్తి చూపుతుంది.
ఉదార్ శక్తి
ఉదార్ శక్తి పేరుతో భారత్, మలేషియా సైన్యాలు ఆగస్ట్ 13 నుంచి 16 వరకు విన్యాసాలు నిర్వహించాయి.
ఫిలిప్పీన్స్
భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పీన్స్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్షిపణిని భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
మాల్దీవులు
భారత ఆర్థిక సాయంతో మాల్దీవుల దేశంలో నేషనల్ కాలేజ్ ఫర్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ను నిర్మించారు. దీన్ని మార్చి 27న ప్రారంభించారు.
పాకిస్థాన్‌లోకి బ్రహ్మోస్
బ్రహ్మోస్ అనే క్షిపణిని భారత్ పరిశీలిస్తుండగా, మార్చి 9న ప్రమాదవశాత్తు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లింది. ఇరు దేశాల మధ్య క్షిపణి పరీక్షలకు సంబంధించి 2005 అక్టోబర్ 3న ఒక ఒప్పందం కుదిరింది.
మంగోలియా
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు మంగోలియాలో పర్యటించారు. రక్షణ రంగంలో సహకారానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. తేజస్ అనే గుర్రాన్ని ఆయనకు బహుమతిగా మంగోలియా దేశం ఇచ్చింది.
తుర్క్మెనిస్థాన్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏప్రిల్ 1 నుంచి 3 వరకు తుర్క్మెనిస్థాన్లో పర్యటించారు. విపత్తు నిర్వహణలో సహకారం, తాపి (టీఏపీఐ.. తుర్క్మెనిస్థాన్-అఫ్గానిస్థాన్-పాకిస్థాన్-ఇండియా) పైప్‌లైన్‌కు సంబంధించి ఇరు దేశాలు చర్చించాయి. తుర్క్మెనిస్థాన్ను సందర్శించిన భారత తొలి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
యూఏఈ
భారత్, యూఏఈల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో ఉన్న ఒక దేశంతో ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లుగా ఉంది. దీన్ని రానున్న అయిదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఈ ఒప్పందంలో భాగంగా అంగీకరించారు.
ఖతార్
జూన్ 4 నుంచి 7 వరకు ఖతార్ దేశంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించారు. వాణిజ్యంలో పరస్పర సహకారానికి ఇరు దేశాలకు ఒప్పందం కుదిరింది.
ఆఫ్రికా ఖండం
గబాన్
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మే 30 నుంచి జూన్ 1 వరకు గబాన్ దేశంలో పర్యటించారు. సాంకేతిక అంశాల్లో ఇరు దేశాలు సహకరించుకున్నాయి.
సెనెగల్
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూన్ 1 నుంచి 3 వరకు సెనెగల్‌లో పర్యటించారు. వాణిజ్యంలో సహకారానికి అంగీకారం కుదిరింది.
నోట్: గబాన్, సెనెగల్, ఖతార్‌లను సందర్శించిన భారత తొలి ఉప రాష్ట్రపతి- వెంకయ్యనాయుడు.
ఈజిప్ట్
భారత్, ఈజిప్ట్‌ల మధ్య ఈ ఏడాదితో దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారత్‌ను స్వతంత్ర దేశంగా ఆగస్ట్ 18, 1947లో ఈజిప్ట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒక స్మారక స్టాంప్‌ను ఈజిప్ట్ దేశం విడుదల చేసింది.
విద్యుత్ ప్రాజెక్ట్
ఈజిప్ట్‌లోని సూయజ్ కాలువలో భారత్‌కు చెందిన రెన్యూ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఇందుకు 8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనుంది.
గణతంత్ర దినోత్సవం
ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి భారత్‌కు రానున్నారు. 2023 గణతంత్ర వేడుకులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.
బుర్కినా ఫాసో
ఆఫ్రికాలోని ఈ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగి, చివరికి ఇబ్రహీం ట్రావోర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ప్రపంచంలో రాజ్యాధినేతల్లో అతనే అందరికంటే చిన్న వయస్కుడు. కేవలం 34వ ఏట ఈ పదవిని చేజిక్కించుకున్నాడు.
యూరప్
నెదర్లాండ్స్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏప్రిల్ 4 నుంచి 7 వరకు నెదర్లాండ్స్‌లో పర్యటించారు. తీర రంగంలో సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అక్కడ ఉండే యెల్లో తులిప్నకు రాష్ట్రపతి కోరిక మేరకు మైత్రి అని నామకరణం చేశారు.
నోట్: ప్రస్తుతం రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసింది.
భారత ప్రధాని పర్యటన
- జర్మనీ: ప్రధాని నరేంద్రమోదీ మే 2న జర్మనీని సందర్శించారు. ద్వైపాక్షిక సహకారంలో భాగంగా పది బిలియన్ యూరోలను ఇచ్చేందుకు జర్మనీ అంగీకరించింది. అలాగే హరిత విద్యుత్ ఉత్పత్తికి 10.5 బిలియన్ డాలర్ల సాయాన్ని ఆ దేశం చేయనుంది.
- డెన్మార్క్: మే 3, 4 తేదీల్లో నరేంద్రమోదీ డెన్మార్క్‌లో పర్యటించారు. వేర్వేరు రంగాల్లో ఇరు దేశాలు సహకారానికి అంగీకరించాయి.
- ఫ్రాన్స్: మే 4న మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నిలిపేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.
- గరుడ-7: గరుడ-7 పేరుతో భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ద్వైపాక్షిక విన్యాసం అక్టోబర్ 26 నుంచి నవంబర్ 12 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించారు.
- యూకే: భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటిష్ ప్రధానిగా బాధ్యతలను అక్టోబర్ 25న స్వీకరించారు. బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉండేవారు. వివిధ ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత లిజ్ ట్రస్ ప్రధాని అయ్యారు. 50 రోజుల పాటు మాత్రమే పదవిలో కొనసాగారు.
బ్లూ ప్లేక్
స్వాతంత్య్ర సమర యోధుడు దాదాభాయ్ నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుంది. బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికయిన తొలి ఆసియా వాసి కూడా ఆయనే. లండన్‌లో ఆయన నివసించిన గృహానికి బ్లూ ప్లేక్ గౌరవాన్ని ఇచ్చారు. గొప్ప వ్యక్తి ఉండే ఇంటికి ఇది గౌరవ సూచిక.
75 మందికి స్కాలర్షిప్లు: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా 75 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు బ్రిటిష్ అంగీకరించింది.
రష్యా: పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యాలో చమురు మిగిలిపోవడంతో భారత్‌కు విక్రయిస్తుంది. ఈ నేపథ్యంలో నవంబర్ నాటికి భారత్‌కు అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశంగా ఇరాక్‌ను దాటుకొని తొలి స్థానంలోకి వచ్చింది.
ఎరువులు: భారత్‌కు అత్యధికంగా ఎరువులు రష్యా నుంచి దిగుమతి అవుతున్నాయి.
వోస్టోక్-22: సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు వోస్టోక్ పేరుతో రష్యాలో సైనిక విన్యాసాలు జరిగాయి. 13 దేశాలు పాల్గొన్నాయి. ఇవి భూమిపై, నీటిలో కూడా జరుగగా, భారత్ నీటిలో జరిగిన విన్యాసాల్లో పాల్గొనలేదు. కారణం విన్యాసాలు జరిగిన ప్రాంతం జపాన్‌కు దగ్గరగా ఉండటం. భారత్‌కు, జపాన్‌కు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో భారత్ ఇందులో పాల్గొనలేదు.
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు