సరైన ప్లానింగ్‌తో విదేశీ విద్య
తల్లిదండ్రులను అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటని అడిగితే, వారి నుంచి ప్రముఖంగా వినిపించే సమాధానం పిల్లల గెలుపు, భవిష్యత్తు. పిల్లల చదువుకు వారు అంత ప్రాముఖ్యం ఇస్తారు. ఆ చదువుకోసం ఫైనాన్షియల్ రెడీనెస్, ప్లానింగ్ అవసరం. ద్రవ్యోల్బణ ప్రభావం అన్ని రంగాలతో పాటు విద్యారంగం పై కూడా ఉంటుంది. విద్యార్జనతో పాటు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా సన్నద్ధంగా ఉండటం అవసరం.
ఆర్థిక స్థితిగతుల అవగాహన
- ఇది 5జీ కాలం. విద్యార్థులకు అంతర్జాలంలో ఎంతో సమాచారం ఉంటుంది. వారు తలుచుకుంటే చాలా విషయాలు ఆలోచించగలరు. ఉన్నత విద్య చదివించాలన్న ఆలోచన వచ్చినప్పుడే, దానికి ఎంత ఖర్చవుతుందన్న దాని పై కూడా అవగాహన తెచ్చుకోవాలి.
- టికెట్ ఖర్చులు, ట్యూషన్ ఫీజు, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి తప్పవు. కొన్ని సందర్భాల్లో ముందు పరీక్ష రాద్దాం ఆ తరువాత ఆలోచిద్దాం అని అనుకుంటారు. నిజమే మంచి మార్కులు సాధించడం అవసరం. కాకపోతే ఈ అవగాహన ఉండటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
- ఎంత ఖర్చవుతుందో విద్యార్థులు తెలుసుకోవాలి.
- ప్రతి యూనివర్సిటీకి కనీస మార్కులు ఎన్ని ఉంటే అప్లయ్ చెయ్యొచ్చనేది ఉంటుంది. అలాగే అప్లికేషన్ చివరితేదీలు ఉంటాయి. ముందే ఆలోచన ఉంటే విద్యార్థులు కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు.
- ప్రతి కాలేజీ ఫీజు ఒకేలా ఉండదు. ఉదాహరణకు అమెరికాని తీసుకుంటే.. ఒక కాలేజీ లో క్రెడిట్స్ ప్రకారం కోర్సులు ఉంటాయి. ఒక చోట 400 డాలర్స్/క్రెడిట్ ఉంటే ఇంకో కాలేజీలో 900 డాలర్స్/క్రెడిట్ ఉంటుంది. కాబట్టి దీనిని బట్టి ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవచ్చు.
- టికెట్ ధరలు కూడా సమయాన్ని బట్టి మారుతుంటాయి. ప్లానింగ్ సరిగ్గా ఉంటే బెటర్ ధరకి టికెట్ కొనుక్కోవచ్చు.
- భారత దేశానికే వస్తే ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులను అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఫీజు మినహాయింపు లేదా తగ్గింపు అన్నది ఉంది. కొద్దిలో అలాంటి అవకాశాలు పోతే తరువాత తెలుసుకొని బాధపడతారు.
ఫైనాన్షియల్ సపోర్ట్
- విదేశీ విద్య చదవాలనుకునే వారు వీసా ఇంటర్వ్యూకి వెళ్లాల్సిందే. ఆయా ఇంటర్వ్యూల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుందన్నది పరిశీలిస్తారు. విద్యార్థుల చదువుకు ఎవరు ఆర్థిక మద్దతు ఇస్తున్నారు? వారికి వీరికి ఉన్న సంబంధమేంటి అని కూడా చూస్తారు. వీసా ఇంటర్వ్యూలో విద్యార్థులను ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, వారు మీకెందుకు సపోర్ట్ చేస్తున్నారన్న ప్రశ్నలు అడగవచ్చు. మన దేశంలో కొన్ని సందర్భాల్లో తల్లి దండ్రులతో పాటు బంధువులు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవారున్నారు. పేరెంట్స్ కాకుండా ఇంకో రిలేషన్ ఉంటే ఎక్కువ ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలి.
- మీరు చూపించిన ఫైనాన్షియల్ సపోర్ట్ డాక్యుమెంట్స్, అక్కడ అవసరమయ్యే ఖర్చులకు డబ్బును సమకూర్చే విధంగా ఉండాలి. ఒకవేళ ఆ నమ్మకం వారికి కలగకపోతే ఇంకా ఇతర ఫైనాన్షియల్ సపోర్ట్ డాక్యుమెంట్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లేకుంటే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
- డాక్యుమెంట్స్
- బ్యాంకు స్టేట్మెంట్స్ కచ్చితంగా అవసరముంటుంది. కనీసం 6 నెలల నుంచి గత సంవత్సరం ఒరిజినల్ బ్యాంక్ రికార్డులు (బ్యాంక్ స్టేట్మెంట్లు లేదా పాస్ బుక్ లేదా బ్యాంక్ బుక్) లేదా పేరెంట్ లేదా స్పాన్సర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్టేట్మెంట్.
- ఎంత మొత్తం డబ్బులు ఉన్నాయన్నదానితో పాటు లావా దేవీలు చూస్తారు. చెల్లింపు స్లిప్పులు, ఉపాధి ఉత్తరాలు కూడా తీసుకెళ్లి అడిగినప్పుడు ఇవ్వాలి.
- చార్టర్డ్ అకౌంటెంట్ స్టేట్మెంట్లు రిపోర్ట్, అఫిడవిట్ ఉపయోగపడుతుంది.
- గత 3 సంవత్సరాలుగా పన్ను రిటర్నులు (ప్రత్యేకంగా ఫారం 16).
- చాలామంది ఆస్తులు చూపించే ప్రయత్నం చేస్తారు. ఆడిటర్ రిపోర్ట్‌లో అవి ఉండవచ్చు. కానీ లిక్విడ్ అసెట్స్ అవసరం. కనీసం ఒక సంవత్సరానికి ట్యూషన్, లివింగ్ ఎక్స్పెన్సెస్కి సరిపడే డబ్బులు ఉండాలి. అలాగే ఇంకో సంవత్సరం ఖర్చులకు డబ్బు సమకూరుతుందన్నది కూడా అవసరం.
- కొన్ని కాలేజీలు అప్లికేషన్‌తో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ డాక్యుమెంట్ అడిగేతే పూర్తి చదువుకు డబ్బు సమకూర్చుకోగలరన్నది డాక్యుమెంట్స్ ద్వారా స్పష్టంగా తెలియజేయాలి.
- ఉదాహరణకు రెండేళ్ల మాస్టర్స్ ప్రోగ్రామ్ అయితే ఐ-20లో ట్యూషన్ కోసం $ 15,000, జీవన వ్యయాల కోసం $ 5,000, ఇతర ఖర్చుల కోసం $ 500 (ఉదా: పుస్తకాలు, సామగ్రి) అని ఉంటే అప్పుడు $ 20,500 తక్షణమే అందుబాటులో ఉందని నిరూపించాలి. అదనంగా మరో $ 20,500 రెండవ సంవత్సరం కవర్ చేయడానికి అందుబాటులో ఉండవచ్చని కూడా చూపాలి.
- ట్యూషన్ ఫీజు కవర్ చేయడానికి బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నట్లయితే రుణ దరఖాస్తు పత్రం మాత్రమే కాకుండా, రుణ ఆమోదాన్ని ధృవీకరించే అధికారిక పత్రాలను వీసా ఇంటర్వ్యూకి తీసుకెళ్లండి.
- రుణ మొత్తం పూర్తి అవసరాలకు సరిపోయేలా లేకపోతే ఇంకా అదనపు లిక్విడ్ ప్రాపర్టీ చూపించగలగాలి.
విద్యా పథకాలు
- అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం
- విదేశాల్లో చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీల కోసం ఈ పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ అమలు చేస్తుంది. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాలో పీజీ ఆపై చదువులకు రూ.20 లక్షల వరకు ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దీనికి కుటుంబ ఆదాయం, మార్కులు వంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది.
- మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ బీసీ సంక్షేమ శాఖ ధరఖాస్తులు స్వీకరిస్తుంది.
- మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖ సాంస్కృతిక/విద్యా ఎక్స్చేంజీ కార్యక్రమాల కింద విదేశాలందించే స్కాలర్షిప్లు/ఫెలోషిప్‌ల ప్రక్రియను ఫెసిలిటేట్ చేస్తుంది. చాలా స్కాలర్షిప్లు పరిశోధన, మాస్టర్స్, డాక్టోరల్ అధ్యయనాల కోసం ఉంటాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, శ్రీలంక, న్యూజిలాండ్, UK (కామన్వెల్త్), మెక్సికో, ఇటలీ స్కాలర్షిప్ ఆఫర్ల కోసం ఆన్లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ చూడండి. https://www.education.gov.in/en/scholarships-education-loan-2
- యునైటెడ్ కింగ్డమ్ కామన్వెల్త్ స్కాలర్షిప్ ఒక సంవత్సరం మాస్టర్స్ లేదా మూడు సంవత్సరాల పీహెచ్డీ చేసేవారు మినిస్ట్రీ అఫ్ హ్యూమన్ రిసోర్స్ వెబ్సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 20 మందికి అవకాశం లభిస్తుంది. చైనాలో 70-80 మందికి వివిధ కోర్సుల్లో స్కాలర్‌షిప్‌లకు అవకాశముంది. https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/countries.pdf
- ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు కూడా స్కాలర్షిప్పులు అందిస్తున్నాయి. ఉదాహరణకు టాటా స్కాలర్షిప్. ఇది కార్నెల్ యూనివర్సిటీలో చదువుతున్న 20 మంది భారతీయ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇస్తారు. 25 మిలియన్ డాలర్ల ఫండ్ దీనికోసం టాటా గ్రూప్ కేటాయించింది.
బ్యాంకు రుణాలు
- బ్యాంకు రుణాలకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు విదేశీ విద్యారుణాలు తీసుకోవచ్చు.
- మేనేజ్మెంట్, ఇంజినీరింగ్, మెడిసిన్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, సైన్స్ మొదలైన వాటి కోసం విద్యా రుణాలు పొందవచ్చు.
- లోన్ ఇంటరెస్ట్ రేట్, లోన్ రీపేమెంట్, లోన్ టైంలైన్ వంటివి చూసుకోవాలి.
- కనీసం 5% నుంచి 15% ఖర్చు విద్యార్థి పెట్టుకోవాలని బ్యాంకులు చూస్తాయి.
- రుణ చెల్లింపు నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు. సాధారణంగా బ్యాంకులు మారటోరియం కాలంతో సహా ఏడు సంవత్సరాల వరకు విద్యా రుణాలను మంజూరు చేస్తాయి.
- సహ దరఖాస్తుదారులు తోబుట్టువులు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఉండవచ్చు.
- మారటోరియం కాలం ఉన్న లోన్లు గరిష్టంగా రూ.20 లక్షల వరకు, మారటోరియం వ్యవధి లేని రుణాలు రూ.10 లక్షల వరకు ఉంటాయి.
- చిన్న మొత్తంలో లోన్ ఉన్నప్పుడు కొలాటరల్ (భద్రత కోసం) బ్యాంకులు తీసుకోవు. కానీ కొలాటరల్ తీసుకొని ఇచ్చిన లోన్ల ఇంటరెస్ట్ రేట్ తక్కువ ఉండే అవకాశం ఉంది.
- రూ.4 లక్షల రుణానికి ఎలాంటి భద్రతను సమర్పించాల్సిన అవసరం లేదు. రూ.4 లక్షలు, రూ.7.5 లక్షలు మధ్య రుణానికి థర్డ్ పార్టీ గ్యారెంటీ ఇవ్వాలి. రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తానికి కొలాటరల్ అవసరముంటుంది.
- మారటోరియం పీరియడ్ అంటే లోన్ రీపే చేయడానికి కొంతకాలం వరకు లీగల్‌గా డిలే చేయవచ్చు. కాకపోతే ఈ సమయంలో బ్యాంకులు వడ్డీ చార్జ్ చేసి ప్రిన్సిపల్ అమౌంట్‌కి కలిపితే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ సమాచారం క్షుణ్ణంగా చూసుకోండి.
- రీపే చేయడం త్వరగా మొదలు పెట్టడం వల్ల బ్యాంకులు కొన్ని కన్సెషన్స్ ఇవ్వవచ్చు.
- లేటెస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. బ్యాంకు రుణ మొత్తం, నిబంధనలు మారవచ్చు.
- కొవిడ్-19 పాండమిక్ వల్ల ఎడ్యుకేషన్ లోన్స్ చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు బ్యాంకుతో చర్చించి లోన్ రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు.
- ఆన్ క్యాంపస్ జాబ్స్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్, రిసెర్చ్ అసిస్టెన్స్‌షిప్ లేదా కాలేజీ వారు ఇచ్చే స్కాలర్షిప్ అవకాశాల గురించి కూడా చూసుకోండి. కాలేజీ స్కాలర్షిప్ ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్‌లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరితేదీ వరకు ఆగకుండా అప్లై చేసుకోండి. జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని బాగా చదువుకోండి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
- nipuna
- nipuna news
Previous article
దేశంలో తొలి హరిత ఎస్ఈజడ్ ఏది?
Next article
అసఫ్‌జాహీల తొలి రాజధాని ఏది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు