దేశంలో తొలి హరిత ఎస్ఈజడ్ ఏది?


- రామప్ప ఆలయానికి సంబంధించి కింది వాటిలో సరైనవి? (డి)
ఎ) ఆలయ శిఖరాన్ని నీళ్లలో తేలియాడే తేలికపాటి ఇటుకలతో రూపొందించారు
బి) శాండ్ బాక్స్ పరిజ్ఞానాన్ని వినియోగించారు
సి) తెలుగు రాష్ర్టాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప దేవాలయం
డి) పైవన్నీ సరైనవే
వివరణ: తెలంగాణలో ములుగు జిల్లాలో పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఇది కాకతీయుల కాలం నాటిది. రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ ఆలయం భిన్న శైలి, శిల్పకళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం వంటి ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది. నీళ్లలో తేలియాడే తేలికపాటి ఇటుకలతో నిర్మించారు. భూకంపాలు వచ్చినా కుంగిపోకుండా పునాదిలో ఇసుకను ఉపయోగించారు. దీనినే శాండ్ బాక్స్ పరిజ్ఞానం అంటారు. - రామప్ప దేవాలయంతో పాటు కింద పేర్కొన్న ఏ నగరానికి యునెస్కో గుర్తింపు దక్కింది? (బి)
ఎ) లోథాల్ బి) ధోలవీర
సి) కాలీబంగన్ డి) సుర్కటోడా
వివరణ: సింధు నాగరికత కాలం నాటి నగరం ధోలవీరకు కూడా యునెస్కో వారసత్వ సంపద హోదా లభించింది. ఇది గుజరాత్ రాష్ట్రంలో, కర్కాటక రేఖపై ఉంది. ఈ నగరాన్ని జేపీ జోషి కనుగొన్నారు. హరప్పా నాగరికతకు సంబంధించిన నగరాల్లో ఇది అయిదో పెద్ద నగరం. దీర్ఘ చతురస్రాకారంలో ఈ నగరాన్ని నిర్మించారు. - ప్రస్తుతం దేశంలోని ఎన్ని ప్రదేశాలు యునెస్కో జాబితాలో ఉన్నాయి? (సి)
ఎ) 38 బి) 39 సి) 40 డి) 41
వివరణ: ప్రస్తుతం భారత్‌కు చెందిన 40 ప్రదేశాలను వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. అతి ఎక్కువగా మహారాష్ట్ర నుంచి 6 ఉన్నాయి. చైనాలో 44వ యునెస్కో సమావేశం నిర్వహించారు. ఇందులోనే రామప్ప దేవాలయం, ధోలవీర ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో అత్యధిక ప్రాంతాలను కలిగి ఉన్న దేశం ఇటలీ. - కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి (డి)
- సి. నారాయణరెడ్డి పేరిట తెలంగాణ సారస్వత పరిషత్తు ఇస్తున్న సాహితీ పురస్కారం ఈ ఏడాది జూకంటి జగన్నాథానికి లభించింది
- దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి ఎల్లూరి శివారెడ్డికి ప్రకటించారు
ఎ) 1 బి) 2 సి) ఏదీకాదు డి) 1, 2
వివరణ: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి పేరిట తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేస్తున్న సాహితీ పురస్కారానికి ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథం ఎంపికయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. అలాగే దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
- ఒలింపిక్ పోటీలు నిర్వహించనున్న ప్రదేశాలను జతపరచండి? (ఎ) దేశం సంవత్సరం
- 2024 ఎ. ఆస్ట్రేలియా
- 2028 బి. అమెరికా
- 2032 సి. ఫ్రాన్స్
ఎ) 1-సి, 2-బి, 3-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి
సి) 1-సి, 2-ఎ, 3-బి
డి) 1-బి, 2-సి, 3-ఎ
వివరణ: 2024లో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో, 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నారు. ఇంతకుముందే ఇవి ఎంపికయ్యాయి. 2032లో నిర్వహించే ఒలింపిక్స్‌కు తాజాగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో 1956లో తొలిసారి, 2000లో మరోసారి ఈ క్రీడలను నిర్వహించారు. 1956లో మెల్బోర్న్లో ఇవి జరిగాయి. దక్షిణార్ధగోళంలో నిర్వహించిన తొలి ఒలింపిక్స్ అవే. 2000లో సిడ్నీలో ఈ పోటీలు జరిగాయి. 2032లో బ్రిస్బేన్‌లో జరగనున్నాయి. వేసవి ఒలింపిక్స్‌ను మూడు వేర్వేరు నగరాల్లో నిర్వహించిన రెండో దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి దేశం అమెరికా.
- కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి? (సి)
- ఒలింపిక్స్‌లో నిర్వహించే వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వెండి పతకాన్ని గెలిచిన తొలి భారత క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి
- ఒలింపిక్స్‌లో నిర్వహించే వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వెండి పతకాన్ని గెలిచిన తొలి భారత క్రీడాకారిణి మీరాబాయి చాను
- ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన రెండో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను
ఎ) 1, 3 బి) 3 సి) 2, 3 డి) 1
వివరణ: టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో వెండి పతకాన్ని గెలిచింది. ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణి ఆమె. మణిపూర్ రాష్ర్టానికి చెందిన మీరాబాయికి 2018లో కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర అవార్డ్ ఇచ్చింది.
- దేశంలోని సాంస్కృతిక కేంద్రాలు, ఆయా జోన్లతో జతపరచండి (బి) కేంద్రం ప్రాంతం
- దక్షిణ జోన్ ఎ. తంజావుర్
- ఉత్తర జోన్ బి. పాటియాల
- పశ్చిమజోన్ సి. ఉదయ్‌పూర్
- తూర్పు జోన్ డి. కోల్‌కతా
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
వివరణ: భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు దేశంలో ఏడు జోనల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రదేశాలు, ప్రాంతాలు దక్షిణ జోన్-తంజావుర్, ఉత్తరజోన్-పాటియాలా, పశ్చిమజోన్-ఉదయ్‌పూర్, దక్షిణ మధ్యజోన్-నాగ్‌పూర్, తూర్పుజోన్-కోల్‌కతా, ఉత్తర మధ్య జోన్-ప్రయాగ్ రాజ్, ఈశాన్యజోన్-దిమాపూర్
- 2019లో ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (డి)
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
వివరణ: 2019లో ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆ సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో భారత్ వాటా 3.1%. ఈ జాబితాలో యూరోపియన్ యూనియన్ అగ్రస్థానంలో ఉంది. బియ్యం ఎగుమతిలో అగ్రస్థానంలో, పత్తిలో మూడో స్థానంలో భారత్ నిలిచింది. తొలి 10 స్థానాల్లో నిలిచిన దేశాలు మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 96% వాటాను కలిగి ఉన్నాయి. - దేశంలో తొలి హరిత ఎస్ఈజడ్ ఏది? (సి)
ఎ) హైదరాబాద్
బి) కీ స్టోన్ నాలెడ్జ్ పార్క్
సి) కాండ్ల
డి) మాన్యటా ఎంబసీ
వివరణ: దేశంలో తొలి హరిత జోన్‌గా కాండ్ల ఘనత సాధించింది. ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ దీనిని ప్రకటించిది. ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పర్యావరణ అనుకూల అంశాల ఆధారంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. భారత్‌లోనే కాదు ఆసియాలోనే కాండ్ల మొదటి ప్రత్యేక ఆర్థిక మండలి. గుజరాత్లో గాంధీధామ్ పట్టణంలో ఉంది. ఇది భారత దేశపు మొదటి బహుళ ఉత్పత్తుల ఎస్ఈజడ్గా కూడా చెప్పొచ్చు. - కింద పేర్కొన్న ఏ రెండు ఈశాన్య రాష్ర్టాల్లో ఇటీవల సరిహద్దు వివాదం చోటు చేసుకొని కాల్పులకు దారి తీసింది? (బి)
ఎ) అస్సాం, మణిపూర్
బి) అస్సాం, మిజోరం
సి) అస్సాం, మేఘాలయా
డి) అస్సాం, త్రిపుర
వివరణ: ఈశాన్య రాష్ర్టాలైన అస్సాం, మిజోరంల మధ్య బ్రిటిష్ కాలం నుంచి ఘర్షణ ఉంది. దీనికి నాడు బ్రిటిష్ విడుదల చేసిన రెండు నోటిఫికేషన్లే కారణం. 1875లో ఒకటి, 1933లో మరొకటి అప్పట్లో విడుదలయ్యాయి. బ్రిటిష్ పాలన కాలంలో మిజోరం రాష్ర్టాన్ని లుషాయ్ పర్వత ప్రాంతంగా పిలిచేవారు. 1875లో ఈ లుషాయ్ పర్వతాలను, అస్సాంలోని కచార్ పర్వతాలను వేర్వేరు ప్రాంతాలుగా విభజించారు. మిజోరం వాసులు ఇప్పటికీ దీనిని ప్రామాణికంగా వ్యవహరిస్తారు. అయితే 1933లో మరో నోటిఫికేషన్ వచ్చింది. దాని ప్రకారం లుషాయ్ పర్వతాలు, మణిపూర్‌ల మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. దీనిని అస్సాం సమర్థిస్తుంది. ఈ రెండు నోటిఫికేషన్లలో గందరగోళం ఉండటం, ఇప్పటికీ ఇది సర్దుబాటు కాకపోవడం ఇటీవల వివాదానికి దారి తీసింది. - సౌరకుటుంబంలోని ఏ ఉపగ్రహంలో ఇటీవల నీటి ఆవిరిని నాసా గుర్తించింది? (ఎ)
ఎ) గనిమేడ్ బి) యురోపా
సి) కాలిస్టో డి) లిస్థియా
వివరణ: గనిమేడ్ అనేది గురుగ్రహానికి ఉపగ్రహం. మొత్తం సౌరకుటుంబంలోని అన్ని ఉపగ్రహాల కంటే పెద్దది ఇది. దీని వాతావరణంలోని నీటి ఆవిరి ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన హబుల్ టెలిస్కోప్ అందించిన కొత్త, పాత సమాచారాన్ని విశ్లేషించగా ఈ అంశం స్పష్టమయ్యింది. ఈ ఉపగ్రహ ఉపరితలం మీద ఉన్న మంచు ఘన రూపం నుంచి నేరుగా వాయు రూపంలోకి మారినప్పుడు నీటి ఆవిరి ఏర్పడుతున్నట్లు గుర్తించారు. - 7827170170.. ఈ ఫోన్ నంబర్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? (సి)
ఎ) ప్రభుత్వ పథకాలను వివరించే టోల్ ఫ్రీ నంబర్
బి) టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులకు సహాయంగా ఉండే టోల్ ఫ్రీ నంబర్
సి) మహిళలకు సహాయం చేయడానికి ఉద్దేశించింది
డి) ఆన్లైన్ మోసాలు జరిగిన వెంటనే ఫిర్యాదుకు సంబంధించింది
వివరణ: మహిళలకు సాయం చేయడానికి జాతీయ మహిళా కమిషన్ ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. పైన పేర్కొంది ఆ నంబరే. ఈ ఫోన్ ఆస్పత్రులు, డాక్టర్లు, వైద్యులు, మానసిక వైద్య నిపుణుల ఫోన్ నంబర్లతో అనుసంధానం అయి ఉంటుంది. అలాగే జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ కూడా దీంతో అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. మహిళలకు భద్రత పెంచడం కోసం ఉద్దేశించిన ఫోన్ నంబర్ ఇది. 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. - ఏ రాష్ట్రంలో ఇటీవల ‘గ్రీన్ సోహ్రా ఏ ఫారెస్టేషన్ క్యాంపెయిన్ (సోహ్రా హరిత అటవీకరణ కార్యక్రమం)’ను
ప్రారంభించారు? (డి)
ఎ) అస్సాం బి) మిజోరం
సి) త్రిపుర డి) మేఘాలయా
వివరణ: మేఘాలయాలోని చిరపుంజిలో సోహ్రా అటవీకరణ కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ప్రారంభించారు. దీని నినాదం ‘సతత హరిత ఈశాన్యం’. అస్సాం రైఫిల్స్ సహాయంతో మేఘాలయా దీనిని అమలు చేయనుంది. చిరపుంజిని స్థానికంగా సోహ్రాగా పిలుస్తారు. ఇక్కడ సంవత్సరం అంతా వర్షం పడేది. అయితే ఇష్టారీతిన అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడంతో వర్షపాతం తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకొని అటవీకరణ చేపట్టారు. అలాగే సోహ్రా నీటి సరఫరా పథకాన్ని కూడా ప్రారంభించారు. - ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ కేటలిస్ట్
ప్రోగ్రామ్‌లో ఎంపికయిన ఏకైక
భారత నగరం? (బి)
ఎ) పూరీ బి) ఇండోర్
సి) ప్రయాగ్ రాజ్ డి) భోపాల్
వివరణ: ఒక ప్రాంతంలోని వాయువును స్వచ్ఛంగా మార్చేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను మధ్యప్రదేశ్‌లో ఉన్న ఇండోర్‌ను ఎంపిక చేశారు. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్‌లో ఇది అతి పరిశుభ్రమైన నగరంగా ఉంది. దీనిని యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ ఎయిడ్) సంస్థ, వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, ఎన్విరాన్మెంట్ డిఫెన్స్ ఫండ్ అనే సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. వాయు స్వచ్ఛతను పెంచేందుకు ఉద్దేశించింది ఇది. అయిదు సంవత్సరాల పాటు ప్రాజెక్ట్ కొనసాగనుంది. - ఏఎంఎల్ఈఎక్స్ (AMLEX) ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)
ఎ) ఉసిరికకు సంబంధించిన కొత్త జాతి
బి) కరోనా కొత్త వేరియంట్
సి) ఆక్సిజన్ సిలిండర్ జీవితకాలాన్ని పెంచే పరికరం
డి) కరోనాను వేగంగా పరీక్షించేందుకు ఉద్దేశించింది
వివరణ: ఆక్సిజన్ సిలిండర్ జీవిత కాలాన్ని పెంచే పరికరాన్ని ఏఎంఎల్ఈ ఎక్స్ పేరుతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (రోపర్) అభివృద్ధి చేసింది. ఒక ఆక్సిజన్ సిలిండర్ జీవిత కాలాన్ని ఇది మూడు రెట్లు పెంచుతుంది. ఏ వాతావరణ పరిస్థితిలో వ్యక్తి ఉన్నా సరే అతడి ఉశ్వాస, నిశ్వాసలను ఇది సెన్సార్ల ద్వారా గుర్తించి, అనుగుణంగా ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. బ్యాటరీతో లేదా విద్యుత్‌తో కూడా దీనిని నిర్వహించవచ్చు. కరోనా మూలంగా శ్వాస ఇబ్బందులు పడే వాళ్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
- Tags
- nipuna
Previous article
career guidance-ఆట.. ఉపాధికి బాట
Next article
సరైన ప్లానింగ్‌తో విదేశీ విద్య
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు