ఎన్విరాన్మెంట్ ఎలా చదవాలి?
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష పాసవడమే లక్ష్యంగా ఉన్న అభ్యర్థుల రివిజన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలనే దానికి సంబంధించి గత వారం పాలిటీ, హిస్టరీ సబ్జెక్టులను చర్చించాం. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు చూద్దాం.
ప్రిలిమ్స్ పరీక్ష పరంగా చూసినప్పుడు పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. మిగతా సబ్జెక్టులతో పోల్చినప్పుడు ఈ రెండు సబ్జెక్టుల ప్రత్యేకత ఏమిటంటే మిగతా సబ్జెక్టుల్లో కోర్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడిగితే ఈ సబ్జెక్టుల్లో మాత్రం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుంటాయి. ప్రశ్నల సంఖ్య పరంగా చూసినప్పుడు పర్యావరణానికి సంబంధించి 2017 నుంచి ప్రతి ఏటా కనీసం పది ప్రశ్నలు వస్తున్నాయి. గత ప్రిలిమ్స్ పరీక్షలో కూడా 10 ప్రశ్నలు ఈ విభాగం నుంచి అడిగారు. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఏటా కనీసం 7 ప్రశ్నలు ఇస్తున్నారు.
పర్యావరణం
ఈ సబ్జెక్ట్ విభాగం నుంచి మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. నాన్ సైన్స్ అభ్యర్థులు ఈ సబ్జెక్ట్ గురించి కొంచెం భయంతో ఉంటారు. దీనికి కారణం పదజాలం. అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో ఇచ్చే ప్రశ్నలు అభ్యర్థుల ప్రాథమిక అవగాహనని అంచనా వేసే విధంగా ఉంటాయి. కాబట్టి దీనిపై పట్టు సాధించడం కష్టమేమీ కాదు. అభ్యర్థులు ఇప్పటికే ఈ సబ్జెక్ట్ ని ఒకసారైనా చదివే ఉంటారు. ముందుగా నిర్వచనాలు (డెఫినిషన్స్) ఒకసారి చూసుకోవాలి. ఉదాహరణకు Niche, Habitat వంటివి. దీనికి NCERT పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి.
గత ప్రశ్నపత్రాలను విశ్లేషించడం ద్వారా గుర్తించిన అంశం ఏమిటంటే ఈ సబ్జెక్టులో కొన్ని టాపిక్ల నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. అలా చూసినప్పుడు మనకు నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చువరీలు, బయోస్పియర్ రిజర్వులు, వివిధ కన్జర్వేషన్లు ఇలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి.
ముందుగా నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చువరీలు, బయోస్పియర్ రిజర్వులు అంటే ఏంటో తెలుసుకోవాలి. వాటి మధ్య ఉన్న తేడా గుర్తించాలి. ఏదైనా జీవజాతుల గురించి చదువుతున్నప్పుడు అవి ఏ నేషనల్ పార్కులో ఉంటాయి లేదా ఏ బయోస్పియర్ రిజర్వులో ఉంటాయో కూడా తెలుసుకుని ఉండాలి. ఆయా జీవజాతులకు ఐయూసీఎన్ రెడ్ లిస్టులో ఏ కేటగిరీలో ఉన్నాయి. అంటే అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయా? అనేది గుర్తించాలి. జీవజాతుల హ్యాబిటాట్ గురించి చదువుతున్నప్పుడు సంబంధిత జీవజాతి కేవలం భారత్‌లోనే ఉంటుందా? భారత్‌లో ఏయే రాష్ర్టాల్లో ఉంటుంది. ఒకవేళ ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా ఉంటుందా? ఎలాంటి శీతోష్ణస్థితిలో జీవించగలుగుతుంది? ఇలా ఒక్కో అంశాన్ని విశ్లేషిస్తూ చదవాలి. ఉదాహరణకు ఒంటికొమ్ము ఖడ్గమృగం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉండదు, అసోం పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.
దీంతోపాటు వివిధ రకాల జీవజాతుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందిస్తుంది. అలాంటివి కూడా తెలుసుకుని ఉండాలి. పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ ఏర్పాటుచేసింది. అలాగే ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణని నివారించడానికి ‘హాథీ మేరా సాథి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలాంటి వాటి గురించి పరీక్ష దృక్కోణంలో అవగాహన ఉండాలి.
కొన్నిసార్లు ప్రత్యేక కేటగిరీలను రూపొందించుకుని పరీక్షకు సిద్ధమవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. పర్యావరణానికి సంబంధించిన వివిధ కన్వర్జేషన్లు, ప్రోటోకాల్స్ లిస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఉదాహరణకు బోన్ కన్జర్వేషన్, వియన్నా కన్జర్వేషన్, క్యోటో ప్రోటోకాల్ మొదలైనవి.
చిత్తడి నేలలు ఎక్కడెక్కడ ఉన్నాయి. రామ్సర్ సైట్స్ ఏంటి? అటవీ రకాలు, విస్తరించిన ప్రాంతాలు, సతతహరిత అరణ్యాలు, సవన్నాలు, స్టెప్పీలు మొదలైనవి.సాధారణ కాలుష్య కారకాలు, వాటి ప్రభావాలు ఉదాహరణకు కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్.వివిధ రకాల కాలుష్యాలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఉదాహరణకు వాయుకాలుష్యానికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రూపొందించడం.వార్తల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు. ఉదాహరణకు పారిస్ ఒప్పందం. ఇది ఐదేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంతోపాటు అమెరికా మళ్లీ ఈ ఒప్పందంలోకి వచ్చిన కారణంగా ఇది వార్తల్లో ఉంది.పర్యావరణ సంరక్షణ కోసం పనిచేసే చట్టబద్ధ సంస్థలు ఉదాహరణకు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మొదలైనవి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
కాస్త ఫోకస్ చేసి చదివితే చాలు ఈ విభాగం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్‌ని స్థూలంగా స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా విభజించుకోవచ్చు. అయితే ఇందులో ఏ అంశంపై యూపీఎస్సీ ఎక్కువగా దృష్టిపెడుతుందనేది అంచనా వేయడం కాస్త కష్టం. దాదాపు అన్ని విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు కూడా అన్నింటిపైనా అవగాహన కలిగి ఉండటం మంచిది.
స్పేస్ టెక్నాలజీ
ఈ విభాగం దాదాపు నిత్యం వార్తల్లో ఉంటుంది. అభ్యర్థులు ముందుగా వివిధ రకాల ఉపగ్రహాల గురించి తెలుసుకుని ఉండాలి. ఉదాహరణకు కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ మొదలైనవి. అలాగే ఏ దేశం ఏ శాటిలైట్లని ప్రయోగించింది. ఏ గ్రహాల మీద ఏ శాటిలైట్లు పనిచేస్తున్నాయి. రోవర్లు వంటి పరికరాల ద్వారా ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి తెలుసుకుని ఉండాలి. మన దేశం చంద్రుడిపైకి చంద్రయాన్ ప్రయోగాన్ని చేపట్టింది. అమెరికా అంగారక గ్రహంపైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్ రోవర్లని పంపింది. ఇలాంటి అంశాలు తెలుసుకుని ఉండాలి.
న్యూక్లియర్ టెక్నాలజీ
ఈ విభాగంలో ముందుగా ప్రాథమిక అంశాలపై అవగాహన ఉండాలి. న్యూక్లియర్ రియాక్టర్ నిర్మాణం, దాని విభాగాలు, పని తీరు మొదలైన అంశాలు. అలాగే ముఖ్యమైన న్యూక్లియర్ రియాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. దాదాపు ఏడాది కాలం నుంచి వార్తల్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ల గురించి తెలుసుకుని ఉండాలి.
డిఫెన్స్ టెక్నాలజీ
రక్షణ సాంకేతిక రంగానికి సంబంధించి భారత్‌లో దాని పరిణామ క్రమం ఎలా జరిగింది. అందుబాటులో ఉన్న అధునాతన ఆయుధ సంపత్తి ఏంటి? వాటి అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సంస్థలేవి? ఏయే దేశాల సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం? ఇలాంటి అంశాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా గతేడాది కాలంగా భారత్‌లో చేపట్టిన ప్రయోగాలు, ముఖ్యమైన మిలిటరీ ఎక్సర్ సైజులు, ఆయా ఎక్సర్ సైజులు ఎక్కడెక్కడ జరిగాయి? ఎవరెవరు పాల్గొన్నారు? వంటి అంశాలు తెలుసుకుని ఉండాలి.
బయోటెక్నాలజీ
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇందులో నిర్వచనాలు, ప్రాథమిక అంశాలు ముఖ్యం. ఉదాహరణకు వృక్ష, జంతు కణాలకు మధ్య తేడా వంటివి, వివిధ రకాల వ్యాధులు, వాటిని అరికట్టడానికి తయారుచేసిన వ్యాక్సిన్లు, ఆయా వ్యాక్సిన్లలో కాంపోజిషన్ వంటివి తెలుసుకుని ఉండాలి. అలాగే బయోటెక్నాలజీకి సంబంధించిన పరిశోధనలు జరిపే పరిశోధనా కేంద్రాలు ముఖ్యంగా వార్తల్లో ఉన్నవాటి గురించి తెలుసుకుని ఉండాలి.
సైబర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ప్రస్తుత ప్రపంచంలో సైబర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యం అంతకంతకూ పెరిగింది, పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీకి సంబంధించి పరీక్షల కోణంలో అవగాహన కలిగి ఉండాలి.నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ, వివిధ రకాల మాల్వేర్స్, వాటి పేర్లు, సైబర్ సురక్షిత్ భారత్ వంటి కార్యక్రమాలు, ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ ఇలాంటి వాటి గురించి చదివి ఉండాలి.ఆర్డిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిట్ కాయిన్స్, సూపర్ కంప్యూటర్స్, రోబోటిక్స్ ఇలాంటి వాటి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.
టెక్నాలజీ పరమైన అంశాలు చదివేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.
వివిధ రకాల టెక్నాలజీల అనువర్తనాలు కచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఉదాహరణకు ఒక కొత్త టెక్నాలజీ ఏయే రంగాల్లో పనికి వస్తుందో తెలుసుకుని ఉండాలి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, వైద్యం ఇలా వీటిపైన ఎలాంటి ప్రభావం చూపగలుగుతుంది, సాధారణ ప్రజల అవసరాలు ఎంతమేరకు తీర్చగలుగుతుందో తెలుసుకోవాలి.ఇలా పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీని విభాగాల వారీగా విభజించి చదవడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.
–బాలలత ,సివిల్స్ ఫ్యాకల్టీ
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు