అర్థం సంకోచం చెందడమే ?


అర్థవిపరిణామం
విపరిణామం అంటే మార్పు భాషలో కాలక్రమాన వర్ణాలూ, ధ్వనులూ, వాక్యనిర్మాణమూ, వ్యాకరణ నిర్మాణమూ మారినట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి.ఇలా కాలక్రమంలో అర్థాల్లో కలిగిన మార్పునే అర్థవిపరిణామం అంటారు.అర్థ విజ్ఞానానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథం- ‘La Semantique’. దీనిని 1897లో ఫ్రెంచి భాషావేత్త మైఖేల్ బ్రెయిల్ రచించాడు.
తెలుగు భాషలో అర్థ పరిమాణం మీద వచ్చిన మొట్టమొదటి పరిశోధన గ్రంథం- ‘A Study of Telugu Semantics’. దీనిని రచించినది ఆచార్య జీఎన్ రెడ్డి. ఈయన 1964లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ డిగ్రీ పొందారు. ఇది గ్రంథరూపంలో 1966లో వచ్చింది.
ఆచార్య జీఎన్ రెడ్డి: పదజాలానికి సంబంధించినట్టి అర్థంలో కలిగే మార్పును అర్థవిపరిణామం అంటారు.
ఆచార్య పీఎస్ సుబ్రహ్మణ్యం: ఒక భాషలో కాలక్రమాన వర్ణాలు, వ్యాకరణ నిర్మాణమూ మారినట్టుగానే పదాల అర్థాలు కూడా మారుతాయి. ఒక భాషలో పదాల్లోగల అర్థాల్లో వచ్చిన మార్పును అర్థవిపరిణామం అంటారు.
అర్థవిపరిణామం రకాలు
1) అర్థవ్యాకోచం: అర్థం వ్యాకోచం అవడమే అర్థవ్యాకోచం.
మొదట పరిమితార్థాన్ని బోధించేటటువంటి ఒక పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించేటట్లయితే అది అర్థవ్యాకోచం.
అర్థవ్యాకోచానికి ఇంగ్లిష్‌లోని పేర్లు- Semantci Extension, Extension of Meaning, Expansion of meaning, widening of meaning, Generalisation of meaning
ఉదా: 1. చెంబు, 2. నూనె, 3. కమ్మ, 4. ధర్మరాజు, 5 భీముడు, 6. నారదుడు, 7. మహారాజు, 8. రాక్షసుడు, 9. అవధాని, 10. గంగ, 11. అష్టకష్టాలు, 12. ఐష్టెశ్వర్యాలు, 13. తైలం, 14. గ్లాసు, 15. వారం
చెంబు: కెంపు అంటే ఎరుపు. ఈ వర్ణం రంగులో ఉండే లోహం రాగి. వర్ణవ్యత్యయం వల్ల కెంపు>చెంపు>చెంబుగా మారింది. చెంబు అంటే రాగి లోహంతో చేసిన ఒక ప్రత్యేక ఆకారంలోని పాత్ర. కానీ నేడు ఇత్తడి చెంబు, కంచు చెంబు, స్టీల్ చెంబు, ప్లాస్టిక్ చెంబు అనే ప్రయోగాలు వాడుకలో ఉన్నాయి.
నూనె: నువ్వుల నూనెకు మాత్రమే వాచకమైన ‘నూనె’ శబ్దం నేడు సామాన్యవాచిగా వాడబడుతుంది. ఉదా: వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, విప్పనూనె, వేపనూనె.
కమ్మ: కమ్మ శబ్దం తాటి కమ్మతో చేసిన ఆభరణ విశేషంగానే మొట్టమొదట వ్యవహరించబడింది. చెవులకు ధరించే ఆభరణం అని నేడు అర్థం. ఉదా: వజ్రపు కమ్మలు, ముత్యాల కమ్మలు.
ధర్మరాజు: ధర్మరాజు అనే పదం వ్యక్తి వాచకం. కానీ నేడు ‘మంచివాడు’ అనే అర్థంలో వ్యవహారంలో ఉంది.
భీముడు: భీముడు అనే పదం వ్యక్తి వాచకం. నేడు ఇది బలవంతుడు అనే అర్థంలో ప్రయోగించబడుతుంది.
నారదుడు: నారదుడు అనే పదం వ్యక్తి వాచకం. నేడు ఈ పదానికి తగవులు పెట్టేవాడని, తంటాలు పెట్టేవాడని, చాడీలు చెప్పేవాడని అర్థం.
మహారాజు: మహారాజు అంటే రాజులకు రాజు అని అర్థం. అంటే రారాజు అని అర్థం. కానీ నేడు ధనవంతుడు, గొప్పవాడు, స్థితిపరుడు అని అర్థవ్యాకోచం పొందింది.
రాక్షసుడు: రాక్షసుడు అనే పదం జాతి వాచక శబ్దం. నేడు ఈ పదం క్రూరకర్ముడు, మంచి పట్టుదలగలవాడు అనే అర్థంలో వాడుతున్నారు.
అవధాని: అవధాని అంటే అవధానం చేసే వ్యక్తి అని అర్థం. నేడు ఈ పదం వ్యక్తుల పేర్లలో కులసూచికార్థ విస్తృతిని పొందింది.
గంగ: గంగ అంటే భాగీరథి అని అర్థం. కానీ ఇది నేడు సామాన్య జల వాచకమైంది.
అష్టకష్టాలు: అష్టకష్టాలు అంటే 8 రకాలైన కష్టాలు అని అర్థం. 1) దేశాంతరగమనం 2) భార్యావియోగం 3) ఆపత్కాల బంధు దర్శనం 4) ఉచ్ఛిష్ట భోజనం 5) శత్రుస్నేహం 6) పరాన్న ప్రతీక్షణం 7) అప్రతిష్ట 8) దారిద్య్రం. కానీ ఎక్కువ కష్టాలని సామాన్యమైన అర్థం.
ఐష్టెశ్వర్యాలు: ఐష్టెశ్వర్యాలు అంటే 8 రకాలైన ఐశ్వర్యాలు అని అర్థం. 1) దాసి 2) ధనం 3) ధాన్యం 4) బంధువు 5) భృత్యువు 6) వస్త్రం 7) వాహనం 8) సుతుడు. నేడు ఏ ఐశ్వర్యానికైనా మనం ఐష్టెశ్వర్యాలు అనే పదం వాడుతున్నాం.
తైలం: తిలల (నువ్వులు) నుంచి తీసిన తైలం. కానీ నేడు తైలం అంటే లంచం, మందార తైలం, నారికేళ తైలం, భృంగామలక తైలం అనే అర్థాల్లో వాడుతున్నాం.
గ్లాసు: గాజుతో చేసింది మొదట గ్లాసు. నేడు ఏ లోహంతో చేసిందైనా గ్లాసుగానే పిలుస్తున్నాం.
వారం: కావ్యభాషలో రోజు అని అర్థం. నేడు 7 రోజులు అనే అర్థంలో వాడుతున్నాం.
నంజుడు: ప్రాచీనార్థం మాంసం. నేడు కూరలు, పచ్చళ్లు అని వ్యాకోచం పొందింది.
2) అర్థసంకోచం: అర్థం సంకోచం చెందడమే అర్థ సంకోచం.
విశాలమైన అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచితార్థాన్ని లేక తక్కువ అర్థాన్ని బోధిస్తే అది అర్థసంకోచం.
అర్థసంకోచానికి ఆంగ్లంలోని పేర్లు- Sematic Narrowing, Restriction of meaning, Reduction of meaning, Specialisation of meaning
ఉదా: 1) చీర, 2) కోక, 3) మధుపర్కాలు, 4) వస్తాదు, 5) ఉద్యోగం, 6) పత్రం, 7) ఆరాధ్యుడు, 8) సంభావన, 9) పెద్ద, 10) వ్యవసాయం, 11) మృగం, 12) తద్దినం, 13) శ్రాద్ధం, 14) సాంవత్సరీకం, 15) నెయ్యి, 16) సాహెబు, 17) చాడీ, 18) సందూక.
చీర: రామాయణంలో ‘శ్రీరాముడు నార చీరలు ధరించెను’ అని ఉంది. అంటే పూర్వం ‘చీర’ అంటే స్త్రీ, పురుష భేదం లేకుండా కట్టుకునే వస్త్రవిశేషం. కానీ నేడు ‘చీర’ అనే పదం స్త్రీలకు మాత్రమే పరిమితం.
కోక: చీర శబ్దం సంస్కృతం కాగా, కోక తెలుగు మాట. కోక పూర్వం అందరూ కట్టుకునే వస్త్ర విశేషం. నేడు స్త్రీలకే పరిమితం.
మధుపర్కాలు: పూర్వం మధుపర్కాలు అంటే ‘తియ్యని పానీయాలు’ అని అర్థం. నేడు ‘తెల్లని వస్ర్తాలు’ అని అర్థం వచ్చింది.
వస్తాదు: పర్షియాలో ఉస్తాద్ అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. కొంతకాలం తర్వాత ఈ పదానికి కుస్తీలు పట్టే విద్యను నేర్పే ఉపాధ్యాయుడని అర్థం వచ్చింది. నేడు కుస్తీలు పట్టేవాడు/మల్లుడనే అర్థంలో సంకోచం చెందింది.
ఉద్యోగం: ఉద్యోగం అంటే ఒకప్పుడు ప్రయత్నం అనే అర్థం ఉంది. ఉదా: పాండవోద్యోగం. కానీ నేడు జాబ్‌కి సమానార్థకంగా వాడుతున్నాం.
పత్రం: పత్రం అంటే ఆకు, పర్ణం అని అర్థం. ఇది అర్థసంకోచం కలిగి తాటియాకు, కాగితం అనే అర్థాలు ఏర్పడ్డాయి. నేటి వ్యవహారంలో ‘రుణపత్రం’ అనే అర్థం కూడా వచ్చింది.
ఆరాధ్యుడు: పూజనీయుడు అని అర్థం. కానీ శైవుల్లో ఒక తెగను మాత్రమే సూచించే పదంగా తెలుగులో దీనికి పరిమితార్థం ఏర్పడింది.
సంభావన: పూర్వం సంభావన అంటే గౌరవించడం. నేడు దక్షిణ అనే అర్థంలో స్థిరపడింది.
పెద్ద: నన్నయ ప్రయోగాల్లో పెద్ద అనే పదానికి అనేక అర్థచ్ఛాయలున్నాయి. నేడు ఈ పదం ‘జ్యేష్ఠ’ అనే అర్థంలో వాడుతున్నారు.
వ్యవసాయం: వ్యవసాయం అనే పదానికి పని అని అర్థం. నేడు ఈ పదం పొలంలో చేసే పనికి మాత్రమే పరిమితమైంది.
మృగం: ఇది జంతుసామాన్య వాచకమైంది. వేటాడబడేది. మృగం అంటే జింక అని అర్థం.
తద్దినం: తద్దినం- తత్+దినం= అంటే ఆ రోజు, ఆ దినం అని అర్థం. నేడు అశుభకర్మ అనే అర్థం స్థిరపడింది.
శ్రాద్ధం: శ్రద్ధతో చేసే దానిని శ్రాద్ధం అని అంటారు. కానీ నేడు సాంవత్సరీకానికి తర్వాత జరిగే తద్దినాన్ని శ్రాద్ధం అంటున్నారు.
సాంవత్సరీకం: సాంవత్సరీకం అంటే సంవత్సరం అని అర్థం. కానీ నేడు వ్యక్తి చనిపోయిన సంవత్సర కాలానికి జరిగే అశుభకర్మ అనే అర్థంలో వాడబడుతుంది.
నెయ్యి: నెయ్యి సామాన్య వాచి. నేడు ఈ పదం కేవలం ఘృతవాచకం. అంటే పిండిన సారం అని అర్థం. (పాల నుంచి తీసింది)
సాహెబు: సాహెబు పదానికి చెలికాడు. సహచరుడని అర్థం. నేడు సాహెబు అంటే మహ్మదీయుడని అర్థం.
చాడీ: మరాఠీ పదమైన ‘చాడీ’ కి నింద అనే అర్థం ఉండగా, తెలుగులోకి ఆదాన పదంగా గ్రహించబడే ఈ పదానికి ‘కొండెం’ అనే అర్థం మాత్రమే స్థిరపడింది.
సందూక: సందూక అనే పదం సందూక్ అనే ఉర్దూ పదం నుంచి వచ్చింది. ఈ పదానికి పెట్టె అని అర్థం. నేడు రత్నపేటిక అని అర్థం.
3) అర్థ సౌమ్యత/అర్థోత్కర్ష/అర్థ గౌరవం: ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడిన పదాలూ, సామాన్య అర్థంలో వాడిన పదాలు కొన్ని నేడు గౌరవార్థాన్ని సంతరించుకున్నాయి. ఇలా మారడమే
అర్థగౌరవం.
అర్థసౌమ్యతకు ఆంగ్లంలోని పేర్లు- Evaluation of Meaning, Aneliorative Extension
ఉదా: సభికులు, ముహూర్తం, మర్యాద, వైతాళికుడు, అదృష్టం, అంతస్తు
సభికులు: సభికులు అంటే పూర్వం జూదం ఆడేవారు జూదగాండ్రు అని అర్థం. కానీ నేడు సభలోని వారు/రాజుగారి కొలువులోనివారు అని అర్థం.
ముహూర్తం: ముహూర్తం అంటే నిమిషకాలం. తక్కువ కాలం/అల్పకాలం/స్వల్పకాలం అని అర్థం.
అమరంలో 12 క్షణాల కాలం ముహూర్తం అని ఉంది.
నేడు ముహూర్తం అంటే శుభకార్యాలకు నిర్ణీతమైన పవిత్రమైన కాలం అనే అర్థగౌరవం పొందింది.
మర్యాద: మర్యాద అనే పదానికి హద్దు అనే అర్థముంది. నేడు మర్యాద అనే పదానికి గౌరవం అనే అర్థం వచ్చింది.
వైతాళికుడు: ప్రాచీన కాలంలో రాజుల్ని మేలుకొలిపే వారిని వైతాళికులు అనేవారు. కానీ నేడు ప్రజలను అజ్ఞానం నుంచి, అమాయకత్వం నుంచి, సనాతన మూఢాచార సంప్రదాయాల నుంచి మేల్కొలిపేవాడని అర్థంలో వాడుతున్నాం. ఉదా: వేమన, కందుకూరి వీరేశలింగం.
అదృష్టం: చూడబడనిది, ఎరుగబడనిది, కర్మజన్యములై సుఖదుఃఖ హేతువులగు ధర్మాధర్మాలు అనే అర్థాలు సంస్కృతంలో ఉన్నాయి.
తెలుగు భాషలో భాగ్యం, మేలు అనే ఉన్నతార్థాలు ఉన్నాయి. ఉదా: వాడు అదృష్ట జాతకుడు.
అంతస్తు: రహస్యం, మరుగుచోటు, మేడపై భాగం అని అర్థం.
తెలుగులో మేడపై భాగం అనే అర్థంతో పాటు గౌరవం, పరువు, హోదా అనే అర్థాలు వ్యవహారంలో ఉన్నాయి.
4) అర్థగ్రామ్యత/అర్థాపకర్ష: పాతకాలంలోని అర్థం కంటే తర్వాత కాలంలో అర్థం నీచమైంది, చెడు అయిందీ అయితే దాన్ని ‘అర్థాపకర్ష’ అంటారు.
జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి, బాధ కలిగి పరిహాసార్థంలో కానీ, నిందార్థంలో కానీ, నిమ్నార్థంలో కానీ పదం వాడితే దాన్ని అర్థగ్రామ్యత అంటారు.
అర్థగ్రామ్యతకు ఆంగ్లంలోని పేర్లు- Degradation of meaning, pajorative extension
ఉదా: 1) కర్మ 2) ఛాందసుడు 3) వ్యంగ్యం 4) కంపు 5) సన్యాసి 6) స్వాహా 7) దేవదాసి 8) కళావంతులు 9) కైంకర్యం 10) అసహ్యం 11) సాని 12) విధవ 13) ముండ 14) గ్రహచారం 15) పూజ్యం 16) నిండుకొన్నవి 17) శనిగ్రహం 18) ఘటం
లోక్‌నాథ్ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
- Tags
- Education News
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు