ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్
సామాజిక, ఆర్థిక కారణాల వల్ల రెగ్యులర్ విద్యకు దూరమైన వారికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించేందుకు ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) ఎంతో ఉపయోగపడుతుంది. అవసరాల దృష్ట్యా నేటి పరిస్థితులకు అవసరమయ్యే రీతిలో విద్యను అందించే స్థాయికి ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థ చేరుకుంది. కాలేజీకి వెళ్లి చదువుకునే పరిస్థితులు లేనివారికి.. పూర్తిగా చదువుకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన పనిలేదు. ఇంటి వద్దే ఉంటూ ఆసక్తి, అభిరుచి ప్రకారం విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చు. ఇంటర్మీడియట్ అర్హతతో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులను పలు విశ్వవిద్యాలయాలు దూరవిద్యలో అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ఉద్యోగాలకు పోటీ పడటంతో పాటు.. ఉన్నత చదువులు
చదవుకోవచ్చు.
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. విద్యార్థులతో పాటు ఉద్యోగులు యూనివర్సిటీ అందించే వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. స్టడీ సెంటర్లు సమీపంలో ఉండటం, మెటీరియల్ నాణ్యత, తక్కువ ఫీజులు… ఇలా పలు కారణాలతో ఈ సంస్థ అందరికి దగ్గరైంది. 1982లో స్థాపించిన ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్యా విధానాన్ని (Distance Education) దేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలతో పాటు కొన్ని కోర్సులు ఉర్దూ మీడియంలో కూడా ఈ యూనివర్సిటీ అందిస్తుంది.
రెగ్యులర్‌తో సమానంగా..
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనగానే కొద్దిగా చిన్నచూపు చూస్తుంటారు. ఓపెన్ డిగ్రీలతో పరిజ్ఞానం ఎక్కువగా ఉండదని భావన ఉంది. కానీ అది వాస్తవం కాదు. అంబేద్కర్ యూనివర్సిటీ సహా పలు ఇతర సంస్థలు నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందిస్తున్నాయి. తమ స్టడీ సెంటర్లలో నిర్దేశిత రోజుల్లో ప్రభుత్వ సీనియర్ డిగ్రీ లెక్చరర్లతో క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తికి అవకాశం కల్పిస్తున్నాయి. టీ శాట్, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా తరగతులను నిర్వహిస్తుంది. సైన్స్ విద్యార్థులకు ప్రయోగాల కోసం స్టడీ సెంటర్లలో తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. దీంతో డిస్టెన్స్‌లో చదివినవారు రెగ్యులర్ విధానంలో చదువుకున్నవారితో సమానంగా పోటీపడుతున్నారు. దూరవిద్యలో డిగ్రీకి విలువ ఉంటుందా అనే సందేహం చాలామందికి తలెత్తుతుంది. కానీ యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ తదితర పరీక్షలతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకులు, రైల్వేలు, పోలీసు, రాష్ట్రస్థాయిలో గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు ఉద్యోగ పరీక్షల్లో డిస్టెన్స్‌లో చదివిన వారు కొలువులు
సాధిస్తున్నారు.
యూజీ కోర్సులు
యూజీ కోర్సులను చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ విధానంలో యూనివర్సిటీ అందిస్తుంది.
బీఏ, బీఎస్సీ, బీకాం (ఇంగ్లిష్, తెలుగు మీడియం)
బీఏ, బీఎస్సీ (ఉర్దూ మీడియం)
డిగ్రీ కోర్సు కాలవ్యవధి
మూడేండ్లు. మొత్తం ఆరు సెమిస్టర్లు. ఈ కోర్సులను మూడేండ్లలో పూర్తిచేసుకోలేకపోయినవారికి నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించి ఆరేండ్ల కాలవ్యవధిలో
పూర్తిచేసుకోవచ్చు.
యూజీ కోర్సులకు అర్హతలు
ఇంటర్ లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులైన వారు లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ లేదా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి 10+2 ఉత్తీర్ణులు లేదా రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణులు లేదా పదోతరగతి తర్వాత రెండేండ్ల వొకేషనల్ కోర్సులను పూర్తిచేసిన వారు అర్హులు.
తరగతుల వివరాలు
కాంటాక్ట్ కమ్ కౌన్సెలింగ్ క్లాసులు సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతాయి. మొదటి సెమిస్టర్ పరీక్షలను డిసెంబర్లో, రెండో సెమిస్టర్ పరీక్షలు జూన్ 2022లో నిర్వహిస్తారు.
సీబీసీఎస్ కోర్సులు
డిగ్రీ మొత్తం చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ విధానంలో ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున మొత్తం ఆరు సెమిస్టర్లు ఉంటాయి.
ఈ విధానంలో మూడు రకాలైన కోర్సులు ఉంటాయి. అవి కోర్ సబ్జెక్టు, ఎలక్టివ్ సబ్జెక్టులు, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ సబ్జెక్టులు
కోర్ సబ్జెక్టులు: ఇవి తప్పకుండా చదవాల్సిన కోర్సులు.
ఎలక్టివ్ సబ్జెక్టులు: విద్యార్థులు ఎంపిక చేసుకున్న డిగ్రీ (బీఏ/బీకాం లేదా బీఎస్సీ)కి సంబంధించిన కోర్సుల నుంచి తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఈ ఎలక్టివ్ కోర్సుల ద్వారా ఉంటుంది. ఇవి ఆయా డిగ్రీ కోర్సుల లోతైన జ్ఞానాన్ని సమకూరుస్తాయి.
ఎన్హాన్స్మెంట్ కోర్సులు: అంటే సామర్థ్యం పెంపొందించే కోర్సులు. ఈ కోర్సులు రెండు రకాలు అవి ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులు. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు వారి జ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించుకుంటారు.
డిగ్రీ పూర్తిచేయాలంటే మూడు సంవత్సరాల్లో అంటే ఆరు సెమిస్టర్లలో 160 క్రెడిట్స్‌ను చదవాల్సి ఉంటుంది. డిగ్రీ పట్టా రావాలంటే 160 క్రెడిట్ల కోర్సులను పూర్తిచేయాలి.
విద్యార్థులకు సౌకర్యాలు
రాష్ట్ర వ్యాప్తంగా 180 అధ్యయన కేంద్రాల ద్వారా విశ్వవిద్యాలయం వివిధ కోర్సులను అందజేస్తుంది. వీటిలో 177 అధ్యయన కేంద్రాల్లో డిగ్రీ కోర్సు ఉంది.
స్వయం బోధనా పద్ధతిలో టెక్ట్స్‌బుక్స్‌ను ఇస్తారు. దృశ్య, శ్రవణ పద్ధతుల్లో పాఠ్యాంశాలను బోధిస్తారు.
ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు టెలీకాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తుంది. వీటితోపాటు సలహా సంసర్గ తరగతులను నిర్వహిస్తారు. ఆయా కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్స్‌ను కూడా నిర్వహిస్తారు.
పీజీ కోర్సులు
ఎంబీఏ
ఎంఏ (ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్)
ఎంకాం
ఎమ్మెస్సీ (బోటనీ, మ్యాథ్స్, సైకాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ)
ఎంఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ వీటితోపాటు పలు పీజీ డిప్లొమాలు, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను యూనివర్సిటీ అందిస్తుంది.
పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 12
వెబ్సైట్: http://www.braou.ac.in/UGPGAdmissions.aspx
తక్కువ ఫీజుతో కోర్సులను అందిస్తున్నాం: వీసీ, ప్రొఫెసర్ కే సీతారామారావు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నిపుణకు తెలిపిన వివరాలు ఆయన మాటల్లో….
- దేశంలోనే మొట్టమొదటిసారిగా దూరవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన యూనివర్సిటీ డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. అంతేకాకుండా 2013 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్న మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా, 2017 నుంచి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా డిగ్రీని అందిస్తున్న యూనివర్సిటీగా రికార్డులకెక్కింది. మూడేండ్లుగా అడ్మిషన్ల సంఖ్య చూస్తే అన్ని కోర్సుల్లో 2018-19లో 1,31,688 మంది, 2019-20లో 1,18,043 మంది, 2020-21లో 1,13,821 మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు.
- సార్వత్రిక విశ్వవిద్యాలయం అందించే కోర్సులు చదివి దేశ, రాష్ట్రస్థాయిలో పోటీపరీక్షలు రాయవచ్చు.
- తెలుగు రాష్ర్టాల్లో యూనివర్సిటీ సేవలను అందిస్తున్నాం. డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి మల్టీమీడియా అప్రోచ్ అంటే టీవీ, యూనివర్సిటీ యూట్యూబ్, పీడీఎఫ్, టెక్ట్స్‌బుక్స్, జూమ్ యాప్ వంటి అనేక రకాల మాధ్యమాల ద్వారా కోర్సులకు సంబంధించిన తరగతులను నిర్వహిస్తున్నాం.
- అతి తక్కువ ఫీజుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద విద్యార్థులు, మహిళలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో యూనివర్సిటీ పనిచేస్తుంది. ఏటా లక్షకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందడం దీనికి నిదర్శనం. కేవలం రెండువేలతో డిగ్రీ కోర్సులను
- అందిస్తున్నాం.
- ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు అనేకమంది ప్రస్తుతం ఉన్నతస్థానాల్లో ఉన్నారు. వారిలో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎంఎల్ఏలు, ఎంపీలు ఉన్నారు. ఈ ఏడాది యూజీసీ నిబంధనల ప్రకారం ఎటువంటి అర్హత లేని వారికి డిగ్రీ ప్రవేశాలను నిలిపివేశాం. పదోతరగతి తర్వాత రెండేండ్ల ఫుల్‌టైం కోర్సులు అంటే ఇంటర్, డిప్లొమా లేదా ఐటీఐ లేదా వొకేషనల్ కోర్సులు చేసినవారికి నేరుగా డిగ్రీ ప్రవేశాలను కల్పిస్తున్నాం. ఎటువంటి అర్హత లేనివారికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి ప్రవేశాలు కల్పించే విధానాన్ని తిరిగి పునరుద్ధరించడానికి
- ప్రయత్నిస్తున్నాం.
- ప్రవేశాలు, తరగతులు తదితర అంశాలకు సంబంధించిన సందేహాలు ఉంటే యూనివర్సిటీ కార్యాలయ పనివేళల్లో ఫోన్ ద్వారా లేదా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు