ఇంజినీరింగ్ కోర్సులు.. ఉపాధి బాటలు
20వ శతాబ్దంలో వచ్చిన సాఫ్ట్వేర్ బూమ్ తర్వాత దేశంలో ఎన్నో ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. హెచ్ఆర్డీ మినిస్ట్రీ వారి 2018-19 సర్వే రిపోర్ట్ ప్రకారం సుమారు 37 లక్షల మంది ఇంజినీరింగ్ అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో సుమారు 17 విభాగాలు ఉన్నాయి. అందులో కంప్యూటర్ ఇంజినీరింగ్ 8.8 లక్షలు, మెకానికల్ ఇంజినీరింగ్ 7.8 లక్షలు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 6.31 లక్షలు, సివిల్ ఇంజినీరింగ్ 5 లక్షలు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 3.94 లక్షలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్లో 7.47 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఇంజినీరింగ్‌లోని కొన్ని ప్రముఖ బ్రాంచీలే కాకుండా ఇతర కోర్సులకు డిమాండ్ పెరిగింది. అదేంటో చూద్దాం
ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ ఇంజినీరింగ్
పెరుగుతున్న రిసెర్చ్, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎయిర్‌క్రాఫ్ట్, ఏవియేషన్ ఇంజినీరింగ్ పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరిగింది. ఏరోస్పేస్లో ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ రెండు ప్రథమ విభాగాలు ఉన్నాయి. ఈ ఇంజినీరింగ్ చదివినవారు ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ని తయారు చేసి, అభివృద్ధి చేయగలరు. ఏవియానిక్స్ ఇంజినీరింగ్ అంటే ఏరోస్పేస్‌కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ గురించి ఉంటుంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ఐఐటీ బొంబాయి (79 సీట్లు), ఐఐటీ ఖరగ్‌పూర్ (41 సీట్లు), ఐఐటీ కాన్పూర్ (55 సీట్లు), ఐఐటీ మద్రాస్ (62 సీట్లు) లు అందిస్తున్నాయి. ఐఐఎస్టీ బెంగుళూరు లో 60 సీట్లు ఏరోస్పేస్లో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఏవియానిక్స్)లో 60 సీట్లు ఉన్నాయి. ఇవి దేశంలోని టాప్ కాలేజీలు.
బయోటెక్నాలజీ ఇంజినీరింగ్
సాంకేతికతో అభివృద్ధి వల్ల ఎన్నో విభాగాలు కొత్త రూపం దాల్చాయి. బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌లో బయాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ సూత్రాలపై ఆధారపడి ఉంది. దీని ఆధారంగా పంటలు, పశుసంరక్షణ ఉత్పత్తి పెంచవచ్చు. ఇంకా ఫార్మాస్యూటికల్, మెడిసిన్, పర్యావరణం, టెక్స్టైల్, జంతు శాస్త్రంలో ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్ వంటి అనేక భాగాలు ఉన్నాయి.
బయోటెక్నాలజీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ఐఐటీ రూర్కీ (44), నిట్ జలందర్ (58), నిట్ అలహాబాద్ (57), నిట్ కాలికట్ (37), నిట్ దుర్గాపూర్ (75), బిట్ మిశ్రా (62), రాయ్‌పూర్ (79), నిట్ రూర్కెల (38), నిట్ వరంగల్ (78), నిట్ ఆంధ్రప్రదేశ్ (36) కాలేజీలు అందిస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లో బయోమెడికల్ ఇంజినీరింగ్ (20 సీట్లు)ను అందిస్తుంది. బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ కోర్సులు దేశంలో ఇంకా ఎన్నో కళాశాలలో ఉన్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/డేటాసైన్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ లో ఒక విభాగం. సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే పనులు చేయగల స్మార్ట్ యంత్రాలను నిర్మించడానికి సంబంధించింది. ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ సైన్స్. టెక్నాలజీ సంబంధిత ప్రతి రంగంలోనూ దీని వల్ల ఎంతో పురోగతి సాధ్యపడుతుంది.
డేటాసైన్స్: ఇది ఒక బిగ్ డేటా యుగం. వ్యాపార సంస్థల దగ్గర ఎంతో సమాచారం ఉంది. డేటాసైన్స్ అంటే శాస్త్రీయ పద్ధతులు, ఆల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ ద్వారా డేటాను అనలైజ్ చేయడం. ఒక సంస్థ తమ దగ్గర ఉన్న సమాచారం నుంచి సరైన సమాచారాన్ని వేరుచేసి దానిలో ఉన్న సారాన్ని సేకరించడం. ఆ ఇన్ఫర్మేషన్ను బట్టి తగిన వ్యాపార నిర్ణయం తీసుకోగలరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటాసైన్స్ వంటి కోర్సులు ఐఐటీ హైదరాబాద్ (27 సీట్లు), ఐఐటీ జోధ్‌పూర్ (42), ఐఐటీ బిలాయ్ (20), ఐఐఐటీ ఆంధ్రప్రదేశ్ (30), ఐఐఐటీ నయా రాయ్‌పూర్ (21), ఐఐఐటీ ధార్వాడ (75) కాలేజీల్లో ఉంది.
ఫిబ్రవరి 2020లో విడుదల చేసిన ఒక ప్రెస్ రిపోర్ట్ ఆధారంగా నూతన టెక్నాలజీల్లో ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభించాలని ఒక సూచన చేశారు. ఇందులో కొన్ని కోర్సులు ఎలక్టివ్‌గా లేదా ఇతర బ్రాంచీలతో కలిపి కూడా కొన్ని కళాశాలల్లో ప్రవేశపెట్టారు.
సైబర్ సెక్యూరిటీ: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయాలంటే ఇప్పటికే చాలామందికి ఒక ఆందోళన ఉంటుంది. కొనుగోలుదారుల ఇన్ఫర్మేషన్ చోరీ అన్న వార్త చదివినప్పుడు అమ్మో ఎలా మరి? అన్న భయం పీడిస్తుంది. కిరాణా కొట్టు నుంచి అంతరిక్షం వరకు కంప్యూటర్, అంతర్జాలంతో అనుసంధానమైన ఈ యుగంలో మనం కంప్యూటర్‌కి దూరంగా ఉండలేం. అందుకే సైబర్ క్రైమ్‌ని అరికట్టడానికి సైబర్ లా, సైబర్ సెక్యూరిటీ వంటివి ఎక్కువ ప్రాధాన్యంలోకి వచ్చాయి. సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్ పరికరాలు, నెట్వర్క్, డేటాను అనధికారికంగా ఎవరు ఉపయోగించకుండా చూసుకోవడం, వారికి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవడం, సైబర్ దాడిని నిరోధించడం. ఈ కోర్స్ కంప్యూటర్ సైన్స్‌తో కలిపి కొన్ని కళాశాలల్లో ప్రవేశ పెట్టారు.
రోబోటిక్స్: మనిషికి సహాయపడే పరికరాలను తయారుచేసే యంత్రాన్ని, మనిషి వలే పనిచేసే పరికరాన్ని తయారు చేయడం రోబోటిక్స్ ఉద్దేశం. మార్స్ గ్రహంపై మనిషి ఇంకా కాలు మోపలేదు. ఈ మధ్యనే నాసాకు చెందిన పర్సివరెన్స్ రోవర్ మార్స్‌పై అడుగు పెట్టింది. అది ఒక రోబోట్. మనిషి వెళ్లడానికి శ్రేయస్కరం కాని, తెలియని ప్రదేశానికి కూడా పంపవచ్చు. రోబోటిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్. రోబోటిక్స్ అంటే రోబోట్ రూపకల్పన, నిర్మాణం, ఉపయోగించడం. ఇది ఒక ఎలక్టివ్‌గా మెకానికల్ ఇంజినీరింగ్ వంటి బ్రాంచీల్లో ప్రవేశ పెట్టారు.
ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (ఐఓటీ): ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ అంటే వివిధ పరికరాలను అంతర్జాలంతో అనుసంధానం చేయడం. అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్, ఆపిల్ వాచ్, బేబీ మానిటర్స్, వీడియో డోర్‌బెల్స్ ఇవన్నీ ఉదాహరణలే. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ వల్ల, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రక్ ఫ్లీట్ మేనేజ్మెంట్ వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ కోర్స్ కంప్యూటర్ సైన్స్‌తో కలిపి కొన్ని కళాశాలల్లో ప్రవేశ పెట్టారు.
ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR)/ వర్చువల్ రియాలిటీ (VR)
ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది డిజిటల్ ప్రపంచం, భౌతిక అంశాల సంపూర్ణ సమ్మేళనం ద్వారా ఒక కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడం. మొబైల్ లేదా డెస్క్‌టాప్ కోసం AR సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసిన యాప్స్ ద్వారా డిజిటల్ విభాగాలను వాస్తవ ప్రపంచంలో కలుపుతారు. ఉదాహరణకు స్పోర్ట్స్ టెలికాస్ట్ చేసిన స్కోర్ బోర్డు, 3డీ ఫొటోలు, సందేశాలు. ఈ-మెయిళ్లు పాప్ అవుట్ చేయడానికి ‘ఏఆర్’ సాంకేతికత సహాయపడుతుంది. వర్చువల్ రియాలిటీ అనేది కంప్యూటర్ సృష్టించిన వాస్తవికత అనుకరణ, ఒక ప్రత్యామ్నాయ ప్రపంచం. ఇది 3డీ సినిమాలు, వీడియోగేమ్‌లలో ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్లు, హెడ్సెట్లు, చేతి తొడుగులు వంటి ఇంద్రియ పరికరాలను ఉపయోగించి వీక్షకుడిని ఒక కృత్రిమ ప్రపంచంలో ముంచెత్తడానికి ఉపయోగపడుతుంది.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ: బిట్ కాయిన్, డిజిటల్ కరెన్సీ గురించి వినుంటారు. అంతకు ముందు డిజిటల్ కరెన్సీని ఎవరు ఎక్కువగా నమ్మకపోయేవారు. ఎందుకంటే డేటాబేస్‌ని ఎవరైనా వారికి అనుగుణంగా మార్చుకుంటారేమోనని. బిట్ కాయిన్ ఉపయోగించే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వల్ల్ల దీనిని హ్యాక్ చేయడం సులువు కాదు. బ్లాక్‌చెయిన్ సమాచారాన్ని రికార్డ్ చేసే ఒక విధానం, అది ఆ సమాచారాన్ని మార్చడం లేదా హ్యాక్ చేయడం కష్టతరం లేదా అసాధ్యం చేసే విధంగా సమాచారాన్ని భద్రపరుస్తుంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అనేది లావాదేవీల డిజిటల్ లెడ్జర్, ఆ ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్ సిస్టమ్స్ మొత్తం నెట్వర్క్ పొందుపరుస్తుంది. బ్లాక్‌చెయిన్‌లో ప్రతిసారి కొత్త లావాదేవీలు జరిగినప్పుడు ప్రతి లావాదేవీ రికార్డ్ ప్రతి పాల్గొనే లెడ్జర్‌కు జోడించబడుతుంది. దీనివల్ల హ్యాకింగ్ కష్టతరం. ఈ కోర్స్ కంప్యూటర్ సైన్స్‌తో కలిపి కొన్ని కళాశాలల్లో ప్రవేశ పెట్టారు.
Sirisha Reddy
Director – Academics
Gyanville Academy
+91 76759 62248
www.gyanville.in
IITJEE | CLAT | IIM IPM
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు