జాతీయ అంశాలు రాజ్యాంగ అంశాలు
ఎన్నికల సంఘం
- ఈ ఏడాది ఎన్నికల సంఘం చాలా సందర్భాల్లో వార్తల్లో ఉంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు వివిధ రాష్ర్టాలకు ఎన్నికలు జరిగాయి.
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం
- రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా జాతీయ స్థాయిలో పోరాడనుంది భారత రాష్ట్ర సమితి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయి పార్టీగా మారింది. ఈసీ గుర్తింపు కూడా లభించింది. దీంతో దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీల సంఖ్య తొమ్మిదికి చేరింది.
రాష్ట్రపతి: అధికార పక్షం తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున యశ్వంత్‌సిన్హా పోటీ చేశారు. జూలై 18న ఎన్నికలు జరిగాయి. ద్రౌపది ముర్ము విజయం సాధించారు. భారత 15వ రాష్ట్రపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక జన్మించిన వారిలో తొలి రాష్ట్రపతి ఆమె. అలాగే మహిళల్లో రెండో రాష్ట్రపతి. గిరిజనుల తరఫున రాజ్యాధినేత పదవిని అధిష్ఠించిన తొలి వ్యక్తి ఆమె. ఇప్పటి వరకు రాష్ట్రపతి అయిన వాళ్లలో అతి చిన్న వయస్కురాలు కూడా. ద్రౌపదిముర్ము ఒడిశా రాష్ర్టానికి చెందిన వారు.
ఉపరాష్ట్రపతి: ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఆగస్ట్ 6న నిర్వహించారు. అధికార పక్షం తరఫున జగ్దీప్ ధన్కడ్, విపక్షాల తరఫున మార్గరెట్ ఆల్వా పోటీ చేశారు. జగ్దీప్ ధన్కడ్ విజయం సాధించారు. ఆయన రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన వ్యక్తి. గతంలో పశ్చిమబెంగాల్‌కు గవర్నర్‌గా కూడా విధులు నిర్వహించారు.
వివిధ రాష్ర్టాల ఎన్నికలు
- ఫిబ్రవరి, మార్చి నెలల్లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో, నవంబర్, డిసెంబర్ నెలల్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో ఎన్నికలు నిర్వహించారు. గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, గుజరాత్ రాష్ర్టాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం దక్కించుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
డీవై చంద్రచూడ్: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబర్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. భారత న్యాయ చరిత్రలో ఇలా తండ్రీకొడుకులు ప్రధాన న్యాయమూర్తులు అయిన తొలి సందర్భం ఇదే. అలాగే వైవీ చంద్రచూడ్ భారత్‌లో సుదీర్ఘ కాలం ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిన వ్యక్తి.
రాజ్యాంగబద్ధ సంస్థల్లో నియామకాలు
మనోజ్ సోని: యూపీఎస్సీ చైర్మన్‌గా మనోజ్ సోని జూన్ 28న ప్రమాణం చేశారు.
రాజీవ్ కుమార్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ మే 15న ప్రమాణం చేశారు. ఆయన 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్.
విజయ్ సంపాల: జాతీయ ఎస్సీ కమిషన్‌కు చైర్మన్‌గా విజయ్ సంపాల రెండోసారి నియమితులయ్యారు. ఈ కమిషన్ గురించి ఆర్టికల్ 338లో పేర్కొన్నారు.
న్యాయ వ్యవస్థ
ఆగస్ట్ 26 వరకు జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత బాధ్యతలను స్వీకరించిన ఉదయ్ ఉమేశ్ లలిత్ నవంబర్ 9న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి డీవై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
ప్రత్యక్ష ప్రసారాలు: సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్ష ప్రసారాన్ని సెప్టెంబర్ 27న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఈ తేదీన ప్రారంభమైనా, ప్రయోగాత్మకంగా ఆగస్ట్ 26న ప్రత్యక్ష ప్రసారం చేశారు.
పదవీ విరమణ పొందిన వారికి సదుపాయాలు: పదవీ విరమణ పొందిన ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులకు పలు ప్రయోజనాలను కల్పించనున్నారు. ఇంట్లో పనిచేసేందుకు వ్యక్తిని నియమిస్తారు. అలాగే వాహన డ్రైవర్ కూడా ఉంటారు. ప్రతి నెలా ఇంటర్నెట్, ఫోన్ బిల్లులకు రూ.4200 ఇస్తారు. పదవీ విరమణ పొందిన ప్రధాన న్యాయమూర్తికి అదనంగా పలు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. అవి- అయిదు సంవత్సరాలు వ్యక్తిగత భద్రతను కల్పిస్తారు (పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులకు మూడు సంవత్సరాలు మాత్రమే). అలాగే ప్రధాన న్యాయమూర్తికి జీవితకాల సచివాలయ సిబ్బంది ఉంటుంది.
ఎఫ్ఏఎస్టీఈఆర్: ఫాస్టర్‌కు ఇది సంక్షిప్త రూపం. దీన్ని విస్తరిస్తే- ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మార్చి 31న ప్రారంభించారు. కోర్ట్ ఉత్తర్వులను వేగంగా, ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంబంధిత వ్యక్తులకు చేరవేసేందుకు ఉద్దేశించింది ఇది. ఆర్టికల్ 21ని అమలు చేసేందుకు దీన్ని తీసుకొచ్చామని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
వార్తల్లో ప్రదేశాలు
హైదరాబాద్: నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని మే 14న ప్రారంభించారు. అలాగే దేశంలో గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్‌ను హైదరాబాద్‌లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. దేశంలోనే తొలిసారి అకౌస్టిక్స్ కెమెరాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు.
ఇక్రిశాట్: తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో ఇక్రిశాట్ ఉంది. దీని పూర్తి రూపం- ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రోపిక్స్. దీన్ని ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయ్యింది. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ ఈ పరిశోధన సంస్థకు వచ్చి రెండు ప్రయోగశాలలను ప్రారంభించారు. అలాగే అదే రోజున, హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీన్ని సమతామూర్తి విగ్రహంగా పేర్కొంటారు. లోహంతో తయారై, కూర్చునే భంగిమలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం ఇది.
లఢక్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని లఢక్‌లోని లేహ్‌లో ఏర్పాటు చేశారు. మే 17న ఐటీ ఎనేబుల్డ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ సెక్టార్‌ను కూడా ఇక్కడే ప్రారంభించారు. అలాగే లేహ్‌లోని విమానాశ్రయాన్ని దేశంలోనే మొదటి కార్బన్ తటస్థ విమానాశ్రయంగా మార్చనున్నారు.
వడోదర: గుజరాత్లో వడోదరలో ఉన్న నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ యూనివర్సిటీని గతిశక్తి విశ్వవిద్యాలయంగా మారుస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. దీనికి తొలి చాన్స్‌లర్‌గా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యవహరించనున్నారు.
పల్లి పంచాయతీ: దేశంలోనే ఇది తొలి కార్బన్ తటస్థ పంచాయతీగా మారింది.
మహిం చర్చ్: భారత్‌లో ఇది తొలి కార్బన్ తటస్థ ప్రార్థన ఆలయంగా గుర్తింపు పొందింది. మహారాష్ట్రలో ఉంది.
మొథెరా గ్రామం: ఈ గ్రామంలో అన్ని ఇళ్లకు సౌరశక్తి ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. దేశంలో ఈ ఘనతను సాధించిన తొలి గ్రామం అని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 9న ప్రకటించారు.
ఆరావళి జీవ వైవిధ్య పార్క్: దేశంలో మొట్టమొదటి ఓఈసీఎం సైట్‌గా ఆరావళి జీవ వైవిధ్య పార్క్‌ను ఎంపిక చేశారు. ఓఈసీఎం అంటే అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్మెంట్ సైట్ అని అర్థం. ఏ ఇతర ఒప్పందాల్లో భాగం కాకుండా జీవ వైవిధ్య పరంగా ముఖ్యమైన వాటిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వింగ్ నేచర్ అనే సంస్థ ఓఈసీఎం సైట్‌గా గుర్తిస్తుంది.
ఇండోర్: 2023లో 17వ ప్రవాస భారతీయ దినోత్సవం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించనున్నారు. అలాగే దేశంలో మొదటి స్మార్ట్ అడ్రస్‌ల సిటీ నగరంగా ఇండోర్ నిలిచింది.
బుర్హాన్పూర్: మధ్యప్రదేశ్‌లోని ఒక జిల్లా. జిల్లాలోని అన్ని పంచాయతీలకు పైపుల ద్వారా నీటిని అందిస్తున్న దేశంలో తొలి జిల్లాగా రికార్డు నమోదు చేసింది.
ముఖ్యమైన తీర్పులు
హత్యకేసు దోషుల విడుదల: రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలని నవంబర్ 11న సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది. వీళ్లు మొత్తం ఆరుగురు ఉన్నారు. మూడు దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్నారు.
హిజాబ్: పాఠశాలల్లో డ్రస్ కోడ్ ఉన్న దృష్ట్యా హిజాబ్ ధరించడం సరికాదంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు బెంచ్‌లో ఉన్న న్యాయమూర్తులు పరస్పర విరుద్ధమైన తీర్పును వెలువరించారు.
గర్భవిచ్ఛిత్తి: దేశంలో మహిళల గర్భ విచ్ఛిత్తి హక్కుకు సంబంధించి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. గర్భం దాల్చిన 20 నుంచి 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకొనే హక్కు మహిళలందరికీ సమానంగా ఉంటుందని, ఇందులో వివాహితులు, అవివాహితులు అంటూ వివక్ష చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పేర్కొన్న సమానత్వ హక్కుకు విరుద్ధం అని కోర్టు వెల్లడించింది.
సెక్షన్ 124ఏ అమలు నిలిపివేత: సెక్షన్ 124ఏ రాజద్రోహానికి సంబంధించింది. వివాదాస్పదమైన చట్టం ఇది. దీని అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. మే 11న ఈ తీర్పు వెలువడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేసి తదుపరి నిర్ణయం తీసుకొనేవరకు అమలు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
రిజర్వేషన్ల అంశాలు
రిజర్వేషన్లకు సంబంధించి 103వ రాజ్యాంగ సవరణతో పాటు వేర్వేరు రాష్ర్టాల్లో వేరు మార్పులు జరిగాయి. వాటిని పరిశీలిస్తే..
103వ రాజ్యాంగ సవరణ: పరస్పర విరుద్ధ తీర్పు 104వ రాజ్యాంగ సవరణ చట్ట సమీక్షపై సుప్రీంకోర్టు వెలువరించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ను కల్పిస్తూ చేసిన సవరణ చట్టం ఇది. 10% ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు. ఈ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమే అని ముగ్గురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా, ప్రధాన న్యాయమూర్తితో సహా మరొకరు దీనికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. అంటే 3:2తో 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే అని తీర్పు వెలువడింది.
జార్ఖండ్: రాష్ట్రంలో స్థానికులకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల్లో స్థానికులకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తూ 2016లో ఆ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆగస్ట్ 2న సమీక్షించి కొట్టివేసింది. స్థానికులకు 100% రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలోని 16(2)కు విరుద్ధం అని కోర్టు పేర్కొంది. ఆ తర్వాత జార్ఖండ్‌లో రిజర్వేషన్‌ను 77 శాతానికి పెంచుతూ ఈ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఛత్తీస్‌గఢ్: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతులకు విద్య, ఉద్యోగాల్లో 58% రిజర్వేషన్ కల్పిస్తూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సెప్టెంబర్ 19న ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదని ఈ తీర్పులో కోర్టు పేర్కొంది.
మార్పులు-చేర్పులు
జెండా నియామవళి: ఉదయం ఆరు తర్వాత సాయంత్రం ఆరు లోపల పతాకావిష్కరణ నిబంధన ఉంది. అయితే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నేపథ్యంలో ఈ నిబంధనలో మార్పును తీసుకొచ్చారు. ఏ సమయంలో అయినా పతాకాన్ని ఎగురవేసేలా నిబంధనను సడలించారు.
పర్యావరణ చట్టం: 1986, నవంబర్ 19న పర్యావరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులో జరిమానాతో పాటు జైలు శిక్షల అంశం కూడా ఉంది. అయితే తాజాగా నిబంధనల్లో మార్పులు తెచ్చారు. అధికంగా జరిమానాలు విధించేలా విధానాన్ని తయారు చేశారు.
కర్తవ్య పథ్: ఢిల్లోఈని రాజ్ పథ్ పేరును మార్పు తీసుకొచ్చి, కర్తవ్య పథ్‌గా మార్చారు.
సామాజిక అంశాలు
ఎస్టీ జాబితా: హిమాచల్‌ప్రదేశ్‌లోని హట్టి, తమిళనాడులోని నారికొవరన్, కురివిక్కరన్, ఛత్తీస్‌గఢ్‌లోని బింజియా సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి శాసన ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
మాతృమరణాల రేటు: దేశంలో క్రమంగా మాతృమరణాల రేటు తగ్గుతూ ఉంది. 2015-17 కాలంలో మాతృమరణాలు రేటు 122 ఉండగా, 2016-18లో 113, 2017-19లో 103, 2017-19లో 97గా నమోదయ్యింది.
బేటీ బచావో బేటీ పఢావో: ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. జన్మించినప్పుడు ఉండే బాల బాలికల నిష్పత్తిని పెంచడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. అలాగే పథకంలో మరిన్ని అంశాలు చేర్చారు. మహిళలు శాస్త్ర-సాంకేతిక, ఇంజినీరింగ్, గణిత అంశాలను చదివేలా ప్రోత్సహించడం, జన్మించినప్పుడు ఉండే లింగ నిష్పత్తి ప్రతి సంవత్సరం రెండు పాయింట్లు పెంచడం, సంస్థాగత జననాలను 95% పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
సదస్సులు-సమావేశాలు
ఈ గవర్నెన్స్: ఈ-గవర్నెన్స్‌పై 24వ జాతీయ సమావేశం జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో ఈ-గవర్నెన్స్ ప్రాధాన్యాన్ని పెంచడం ద్వారా పారదర్శకతను కల్పించడం, సత్వరం సమస్యలను పరిష్కరించడం, అవినీతి రహిత పాలనను అందించాలని సదస్సులో నిర్ణయించారు.
స్మార్ట్ సిటీస్ కాన్ఫరెన్స్: స్మార్ట్ సిటీస్- స్మార్ట్ అర్బనైజేషన్ పేరుతో సూరత్‌లో ఏప్రిల్ 18 నుంచి 20వ తేదీ వరకు సమావేశాన్ని నిర్వహించారు. నగరాలను పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దడంతో పాటు సుస్థిరాభివృధ్ధి, తేలికగా రుణ లభ్యత ఉండే నగరాలుగా తీర్చి దిద్దాలని నిర్ణయించారు.
తిరువనంతపురం డిక్లరేషన్: మహిళా శాసన సభ్యుల సమావేశం మే 26, 27 తేదీల్లో కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ఇది కూడా భాగమే. సమావేశం అనంతరం తిరువనంతపురం ప్రకటన వెలువడింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ డిక్లరేషన్ వెలువడింది.
90వ ఇంటర్‌పోల్ సమావేశం: 90వ ఇంటర్‌పోల్ సాధారణ సభ సమావేశం అక్టోబర్ 18 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించారు. పరిశోధన వ్యవస్థలు మరింత సమర్థంగా పని చేయాలని నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకొనేందుకు అన్ని దేశాలు కలిసి రావాలని కూడా సమావేశంలో పలు దేశాల సభ్యులు పిలుపునిచ్చారు. 91వ సమావేశం ఆస్ట్రియా దేశంలోని వియన్నాలో నిర్వహించాలని నిర్ణయించారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ, 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు