నయా జోష్ నానో టెక్నాలజీ
టెక్నాలజీ రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నది. అందులో నానో టెక్నాలజీ పాత్ర చాలా ప్రత్యేకం. దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ఈ టెక్నాలజీ అనేక కొత్త ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా మారుతున్నది. ఇప్పటికే పలు కంపెనీలు నానోటెక్నాలజీని ఉపయోగించి తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న నానోటెక్నాలజీలో నిపుణుల అవసరం కూడా అంతే వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో నానో టెక్నాలజీ అంటే ఏమిటి? దానికి సంబంధించిన కోర్సులు, ఆయా కోర్సులను ఆఫర్ చేస్తున్న విద్యాసంస్థలు, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారం నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం…
నానోటెక్నాలజీ అంటే?
-నానోటెక్నాలజీని తెలుగులో సూక్ష్మసాంకేతిక శాస్త్రం అని పిలుచుకోవచ్చు. ఒక మీటర్లో బిలియన్ (కోటి) వంతును నానో మీటర్ అంటారు. అంటే కోటి నానోమీటర్లు కలిసి ఒక మీటర్ అవుతుంది. పదార్థాన్ని అంతటి సూక్ష్మపరిమాణానికి తీసుకొచ్చి జరిపే అధ్యయనాన్ని నానో టెక్నాలజీ అంటారు. నానో టెక్నాలజీ అనే భావాన్ని 1950లో అమెరికాకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ ఫెన్మాన్ ముందుకు తీసుకొచ్చారు. 1990 దశకంలో నానో టెక్నాలజీని ప్రత్యేక కోర్సుగా గుర్తించారు. దేశంలో సీఎస్ఆర్ రావు అనే రిసెర్చ్ ప్రొఫెసర్ నానోటెక్నాలజీ రంగంలో విశేష కృషిచేశారు.
ప్రత్యేకత
-నానో శాస్త్రవేత్తలు పదార్థాలను నానో మీటర్ పరిమాణానికి తీసుకొచ్చి వాటిపై పరిశోధనలు చేస్తారు. బంగారం వంటి పదార్థం సాధారణ పరిస్థితుల్లో రసాయనికంగా తటస్థంగా ఉంటుంది. కానీ దాన్ని నానో పరిమాణానికి తీసుకొచ్చినప్పుడు సమర్థవంతమైన రసాయన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. నానో మీటర్ స్థాయిలో పదార్థాల ప్రవర్తన ఆధారంగా శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు.
-ప్రముఖ రెడిమేడ్ గార్మెంట్స్ కంపెనీ లీ నానో టెక్నాలజీని ఉపయోగించి ముడతలు పడకుండా, మరకలు అంటుకోకుండా ఉండే వస్ర్తాలను తయారు చేస్తున్నది. సాధారణ వస్ర్తాలకు నానో స్థాయి కణాలను చేర్చడం ద్వారా ఇది సాధ్యమైంది. న్యూజెర్సీకి చెందిన ఇన్మాట్ కంపెనీ నానోటెక్నాలజీతో ఎక్కువ కాలం మన్నికగా ఉండే టెన్నిస్ బాళ్లను తయారు చేస్తున్నది.
-నూతన ఉత్పత్తుల తయారీకి మాత్రమే కాకుండా భవిష్యత్తులో శస్త్రచికిత్సలకు కూడా నానోటెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్సలు చేయవచ్చు. తక్కువ ఖర్చు, ఎక్కువ క్వాలిటీతోపాటు ఎన్నో ప్రయోజనాలున్న ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే.. భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
కావాల్సిన నైపుణ్యాలు
-నానో టెక్నాలజీ అనేది మేనేజ్మెంట్ ప్రొఫెషన్ కాదు. ఇది ఒక రిసెర్చ్ ఫీల్డ్. పరిశోధనలో భాగంగా నానో కణాల లక్షణాలను అధ్యయనం చేయాలి. వాటి నూతన నిర్మాణాలను కనుగొనాలి. కాబట్టి నానో టెక్నాలజీ కోర్సులు చదవాలనుకునేవారికి ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ప్రావీణ్యంతోపాటు మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం ఉండాలి. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ లాంటి అడ్వాన్స్డ్ పరికరాలతో పనిచేయగలగాలి. అన్నింటికి మించి పరిశోధనలు చేయాలనే తపన కలిగి ఉండాలి.
కోర్సులు – విద్యాసంస్థలు
బీఎస్సీ (నానోటెక్నాలజీ)
-ఇది మూడేండ్ల కోర్సు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు.
విద్యాసంస్థలు
-చెట్టినాడ్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CHRI)- కాంచీపురం (తమిళనాడు)
-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ స్టడీస్ (IMTS)- నోయిడా(యూపీ)
-లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)- జలంధర్ (పంజాబ్)
-ఎస్ఎన్ఆర్ సన్స్ కాలేజీ- కోయంబత్తూర్ (తమిళనాడు)
బీటెక్ (నానోటెక్నాలజీ)
-ఇది నాలుగేండ్ల కోర్సు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. జేఈఈ ర్యాంకు ఆధారంగా లేదా సొంత ఎంట్రెన్స్‌లతో ప్రవేశాలు కల్పిస్తారు.
విద్యాసంస్థలు
-భగవాన్ అరిహంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- సూరత్ (గుజరాత్)
-భగవంత్ యూనివర్సిటీ- అజ్మీర్ (రాజస్థాన్)
-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ స్టడీస్ (IMTS)- నోయిడా (యూపీ)
-కేఎస్ రంగస్వామి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ- నమక్కల్ (తమిళనాడు)
-శ్రీ గురుగ్రంథ్ సాహెబ్ వరల్డ్ యూనివర్సిటీ- ఫతేగఢ్ సాహెబ్ (పంజాబ్)
-ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ – కాంచీపురం (తమిళనాడు)
ఎంఈ (నానో టెక్నాలజీ)
-ఇది రెండేండ్ల కోర్సు. బీఈ లేదా బీటెక్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులో చేరవచ్చు. కొన్ని సంస్థలు ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నాయి.
విద్యాసంస్థలు
-చెన్నైలోని జీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నది.
పీహెచ్డీ (నానో టెక్నాలజీ)
-ఇది మూడేండ్ల కోర్సు. ఈ కోర్సును అందిస్తున్న విద్యాసంస్థలు..
-అమిటీ యూనివర్సిటీ- గుర్గావ్ (హర్యానా), ముంబై (మహారాష్ట్ర)
-అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానోటెక్నాలజీ- నోయిడా (యూపీ)
-జామియా మిలియా ఇస్లామియా (JMI)- జామియానగర్ (ఢిల్లీ)
-మెడిక్యాప్స్ యూనివర్సిటీ- ఇండోర్ (మధ్యప్రదేశ్)
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – కాలికట్ (కేరళ)
ఎమ్మెస్సీ (నానోటెక్నాలజీ)
-రెండేండ్ల కోర్సు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ప్రవేశాల ప్రక్రియ ఆయా విద్యాసంస్థలను అనుసరించి వేర్వేరుగా ఉంటుంది.
విద్యాసంస్థలు
-దేశంలోని 17 విద్యాసంస్థలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన సంస్థలు..
-అమిటీ యూనివర్సిటీ- గుర్గావ్ (హర్యానా)
-బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ యూనివర్సిటీ (BBAU)- లక్నో (యూపీ)
-ఆచార్య నాగార్జున యూనివర్సిటీ – గుంటూరు (ఏపీ)
-భారతీయార్ యూనివర్సిటీ- కోయంబత్తూర్ (తమిళనాడు)
-చౌదరి చరణ్‌సింగ్ యూనివర్సిటీ – మీరట్ (యూపీ)
-మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీ – ఉదయ్‌పూర్ (రాజస్థాన్)
పీజీ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ నానోటెక్నాలజీ
-ఇది మూడు నెలల సర్టిఫికెట్ కోర్సు. సైన్స్/ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సు చేయడానికి అర్హులు.
-మరికొన్ని కోర్సులు: పైన పేర్కొన్న కోర్సులతోపాటు డిగ్రీ స్థాయిలో ఐదేండ్ల కాలవ్యవధిగల బీటెక్+ఎంటెక్ (నానోటెక్నాలజీ), పీజీ స్థాయిలో రెండేండ్ల కాలవ్యవధిగల ఎంటెక్ (నానోసైన్స్ అండ్ టెక్నాలజీ), ఎంటెక్ (నానో మెడికల్ సైన్స్) కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎంటెక్ (నానోటెక్నాలజీ)
-ఇది రెండేండ్ల కోర్సు. బీఈ లేదా బీటెక్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. కొన్ని సంస్థలు ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్లు ఇస్తున్నాయి.
విద్యాసంస్థలు
-దేశవ్యాప్తంగా మొత్తం 56 సంస్థలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సంస్థలు..
-జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) – హైదరాబాద్ (తెలంగాణ)
-అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)- అలీగఢ్ (యూపీ)
-అమల్జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్- కొట్టాయం (కేరళ)
-అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానోటెక్నాలజీ- నోయిడా (యూపీ)
-అన్నా యూనివర్సిటీ- కోయంబత్తూర్ (తమిళనాడు)
-బిజూపట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (BPUT)- రూర్కెలా (ఒడిశా)
-జామియా మిలియా ఇస్లామియా (JMI)- జామియానగర్ (ఢిల్లీ)
-మంగళూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ (MITE)- మంగళూర్ (కర్ణాటక)
పీజీ డిప్లొమా ఇన్ నానోటెక్నాలజీ
-ఇది ఏడాది వ్యవధిగల డిప్లొమా కోర్సు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. అడ్మిషన్ల ప్రక్రియ ఆయా కాలేజీలను అనుసరించి వేర్వేరుగా ఉంటుంది.
విద్యాసంస్థలు
-అయ్య నాడార్ జానకి అమ్మాల్ కాలేజీ – శివగంగ (తమిళనాడు)
-గుల్బర్గా యూనివర్సిటీ – గుల్బర్గా (కర్ణాటక)
-యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ – న్యూఢిల్లీ
కెరీర్ ఎలా ఉంటుంది?
-అమెరికాలో నానో మెటీరియల్స్, నానో ఎలక్ట్రానిక్స్, నానో బయోటెక్నాలజీకి సంబంధించి 100 బిలియన్ డాలర్లకుపైనే వ్యాపారం జరుగుతున్నది. వైద్యరంగంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి నానో నిపుణులకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఉపాధినిచ్చే రంగాలు
-ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, మెటీరియల్ సైన్స్ ఇండస్ట్రీలు (టెక్స్టైల్స్, పాలిమర్స్, ప్యాకేజింగ్), ఆటో అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలు, క్రీడా సామగ్రి తయారీ, ఔషధ, సౌందర్య ఉత్పత్తుల తయారీ, బయోటెక్నాలజీ కంపెనీలు, మెడికల్ సైన్స్, ఆప్టోఎలక్ట్రానిక్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫుడ్‌సైన్స్ (క్వాలిటీ కంట్రోల్, ప్యాకేజింగ్), ఫోరెన్సిక్ సైన్స్ విభాగాలు, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సైనిక దళాలు వంటి రంగాల్లో నానోటెక్నాలజీ నిపుణులు ఉద్యోగాలు పొందవచ్చు.
హోదాలు
-నానో డివిజన్ మేనేజర్, పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ సైంటిస్ట్ (నానోటెక్నాలజీ), జూనియర్ రిసెర్చ్ ఫెలో, R+D అప్లికేషన్ టెక్నీషియన్, అసోసియేట్ రిసెర్చ్ ప్రొఫెసర్, నానోటెక్నాలజీ ఇంజినీర్, లా అండ్ పాలసీ ఎగ్జిక్యూటివ్, సీనియర్ నాలెడ్జ్ ఆఫీసర్, నానో మెటీరియల్స్ సర్ఫేస్ కెమిస్ట్ తదితర హోదాల్లో పనిచేయవచ్చు.
వేతనాలు
-కెరీర్ ప్రారంభంలోనే రూ. 3 నుంచి 5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. అనుభవం తర్వాత నెలవారీ వేతనం లక్షల్లో ఉంటుంది.
నోట్: అడ్మిషన్ల ప్రక్రియ వేర్వేరు విద్యాసంస్థల్లో వేర్వేరు సమయాల్లో ఉంటుంది. ఏ సంస్థలో ఎప్పుడు అడ్మిషన్లు జరుగుతాయనే వివరాల కోసం ఆయా కాలేజీలు లేదా యూనివర్సిటీల వెబ్సైట్లను సందర్శించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు