కాకతీయుల పరిపాలన-ముఖ్యాంశాలు
రాష్ట్రకూటులకు సేనాధిపతులుగా, చాళుక్యులకు రాష్ట్ర పాలకులుగా, దుర్గాధిపతులుగా సేవలందించిన కాకతీయులు స్వతంత్రులై అనుమకొండ, ఓరుగల్లు రాజధానులుగా సుమారు 3 శతాబ్దాలకుపైగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలను పరిపాలించారు.
-శాతవాహనుల తర్వాత ఆంధ్ర దేశాన్నంతా ఏకఛత్రాధిపత్యం కిందకు తీసుకొచ్చినవారు కాకతీయులు. కాకతీయుల పుట్టుక లేదా ఉనికిని తెలుసుకోవడానికి అనేక శాసనాలు, సాహిత్య రచనలు కొంతమేరకు ఉపయోగపడుతున్నాయి. కాకతీయుల గురించి మొదటిసారిగా వేంగి చాళుక్య రాజు దానార్ణవుడు వేయించిన మాగల్లు శాసనం (క్రీ.శ.956)లో ప్రస్తావించారు. ఈ శాసనం ప్రకారం కాకర్త్య గుండ్యన విజ్ఞప్తిమేరకు దానార్ణవుడు నతవాడి విషయంలోని మాగల్లు గ్రామాన్ని దొమ్మన శర్మ అనే బ్రాహ్మణుడికి దానం చేశాడు.
-కాకతి: కాకతీపురం అనే గ్రామం వారి స్వస్థలం కావడంవల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఈ వాదనను చాలామంది అంగీకరించలేదు. వినుకొండ వల్లభాచార్యుడు తన క్రీడాభిరామంలో కాకతిమ్మకు సైదోడు ఏకవీర అని పేర్కొన్నాడు. అంటే ఓరుగల్లులో కాకతి, ఏకవీర అనే గ్రామదేవతలను కలిపి పూజించారని ఈ దేవత పేరుమీదుగానే వీరు కాకతీయులుగా పిలువబడ్డారని ఈ గ్రంథం వివరిస్తుంది.
-విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణంలో కాకతీర్నామ దుర్గా భజయంతీ ఇతి కాకతీయ అని పేర్కొన్నాడు. కాకతి అంటే దుర్గాశక్తి అని, ఆ శక్తిని ఆరాధించడం వల్ల కాకతీయులయ్యారని తెలిపాడు.
-16వ శతాబ్దం తొలి భాగానికి చెందిన షితాబ్‌ఖాన్ (సీతాపతి) వేయించిన శాసనం.. ఢిల్లీ సుల్తానుల సైన్యాలు ఓరుగల్లు కోటలోని కాకతి విగ్రహాన్ని ధ్వంసం చేయగా, ఆ జగన్మాతృకను, కాకతి రాజ్య పద్మపీఠి అయిన ఆ దేవత విగ్రహాన్ని షితాబ్‌ఖాన్ పునఃప్రతిష్ఠించాడని పేర్కొంటుంది. ఈ విధంగా కాకతి అనే గ్రామ దేవతను ఆరాధించడంవల్లనే వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
పాలకులు
-1965లో బయ్యారం చెరువు శాసనాన్ని కనుగొనడం వల్ల వారికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శాసనాన్ని గణపతిదేవుడు పరిపాలించే కాలంలో అతని చెల్లెలు మైలాంబ తన బిరుదు మీదుగా నిర్మించిన ధర్మకీర్తి-సముద్ర అనే చెరువు స్థాపన సందర్భంగా వేయించింది. దీనిలో కాకతీయుల వంశవృక్షం గురించి ఉంది. దీని ప్రకారం కాకతీయుల మూల పురుషుడు వెన్నడు. ఇతను దుర్జయ వంశానికి చెందినవాడు. ఇతను రాష్ట్రకూటుల సేనాధిపతిగా ఉంటూ వేంగిచాళుక్యులపై దాడిచేశాడు. వెన్నడుకు సంబంధించిన 4వ తరం వాడు గుండ్యన. ఇతను రాష్ట్రకూట 2వ కృష్ణుడి తరఫున వేంగిచాళుక్య రాజు మొదటి భీమునికి వ్యతిరేకంగా నిరువధ్యపుర యుద్ధం (క్రీ.శ. 900) చేశాడు.
-ఈ యుద్ధంలో గుండ్యన మరణించాడు. ఇతని ధైర్య సాహసాలకు మెచ్చి రాష్ట్రకూట రెండో కృష్ణుడు గుండ్యన కుమారుడైన ఎర్రయను కొరవి ప్రాంతానికి పాలకుడిగా నియమించాడు. ఎర్రయ అనంతరం బేతయ తర్వాత 4వ గుండ్యన లేదా కాకర్త్య గుండ్యన కొరవి పాలకులయ్యారు.
కాకర్త్య గుండ్యన
-ఇతని కాలంలో వేంగిచాళుక్య రాజ్యంలో దానార్ణవుడు, రెండో అమ్మరాజుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో తనకు మద్దతు పలికిన కాకర్త్య గుండ్యనకు నతవాడి సీమను దానార్ణవుడు ఇచ్చాడు.
-గుండ్యన కాలంలో రాష్ట్రకూటులను ఓడించి కళ్యాణి చాళుక్యులు రాజ్యాన్ని స్థాపించగా గుండ్యన వీరి సామంతుడయ్యాడు.
-ముదిగొండ పాలకుడు బొట్టు బేతరాజు కళ్యాణి చాళుక్య రెండో తైలపుడి అనుమతి పొంది అతని సేనాని ఎర్రభూపతి సహాయంతో గుండ్యనను హతమార్చాడు.
-ఎర్రభూపతి భార్య కామసాని తన మేనల్లుడైన ఒకటో బేతరాజుపై (గుండ్యన కుమారుడు) జాలిపడి అనుమకొండ ప్రాంతాన్ని బేతరాజుకు ఇప్పించేటట్లు 2వ తైలపుని ఒప్పించి బేతరాజుని పాలకుడిని చేసింది.
-ఈ విధంగా అనుమకొండలో మొదటి బేతరాజు కాకతీయుల పాలనను ప్రారంభించాడు.
మొదటి బేతరాజు (క్రీ.శ. 995-1052)
-ఇతను పశ్చిమ (కళ్యాణి) చాళుక్యులకు సామంతుడు. అనుమకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
-చిన్నవాడు కావడంతో రాజ్య భారాన్ని ఇతని మేనత్త కామసాని, ఆమె భర్త విరియాల ఎర్రభూపతి చూసుకున్నారు.
-మొదటి బేతరాజు మంత్రి నారాయణయ్య శనిగరం (కరీంనగర్) వద్ద చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయానికి మరమ్మతులు చేసి శనిగరం శాసనాన్ని వేయించాడు.
-ఇతని బిరుదులు కాకతి పురాధినాథ, చోడాకా్ష్మపాల మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052-1076)
-ఇతను మొదటి బేతరాజు కుమారుడు. కాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు ఇతడి గురించి పేర్కొంటున్నాయి.
-ఈ శాసనాలు ప్రోలరాజు చక్రకూట విషయాన్ని చక్కదిద్దాడని, కొంకణ మండలాన్ని జయించాడని, భద్రంగపురాధీశ్వరుడిని తరిమాడని, పురాకుటాధీశుడైన గొన్నరాజును యుద్ధంలో సంహరించాడని తెలుపుతున్నాయి.
-ఇతని విజయాల్లో ఎక్కువశాతం తన సార్వభౌముని (కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడు) యుద్ధాలే ఉన్నాయి.
-ఇతను కేసముద్రం, జగత్కేసరి సముద్రం అనే చెరువులు తవ్వించాడు. వరాహ చిహ్నంతో నాణేలు ముద్రించాడు.
-ప్రోలరాజు బిరుదులు అరిగజకేసరి, కాకతి వల్లభ సమధీగత పంచమహేశబ్ద.
రెండో బేతరాజు (క్రీ.శ. 1076-1108)
-ఇతడు మొదటి ప్రోలరాజు కుమారుడు.
-6వ విక్రమాదిత్యుని దండయాత్రలో పాల్గొని సబ్బి మండలంలో 1000 గ్రామాలు, ముదిగొండ రాజ్యంలోని కొంత భాగాన్ని బహుమానంగా పొందాడు.
-రెండో బేతరాజు కాజీపేట శాసనాన్ని వేయించాడు. దీని ప్రకారం ఇతను గొప్ప యుద్ధవీరుడు.
-ఇతని ఆధ్యాత్మిక గురువు రామేశ్వర దీక్షితులు. అతని నుంచి రెండో బేతరాజు శైవదీక్షను పొందాడు.
-బేతరాజు పైజపల్లి అనే గ్రామానికి శివపురం అనే పేరుపెట్టి దాన్ని రామేశ్వర పండితునికి దానం చేశాడు.
-అనుమకొండలో తన తండ్రిపేరుతో ప్రోలేశ్వర ఆలయం, తన పేర బేతేశ్వరాలయాలను నిర్మించాడు.
-ఇతని సేనాని వైజ్జదండాధీశుడు గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇతను కరీంనగర్‌ను ఆక్రమించాడు.
-రెండో బేతరాజు బిరుదులు విక్రమ చక్రి, మహామండలేశ్వర, త్రిభువనమల్ల, చలమర్తిగండ.
దుర్గరాజు
-బేతరాజు పెద్ద కుమారుడు దుర్గరాజు. క్రీ.శ. 1108-1116 వరకు పరిపాలించాడు.
-ఇతను అనుమకొండ బేతేశ్వర శివాలయాన్ని రామేశ్వర పండితునికి దానం చేశాడు.
-ఇతని బిరుదులు త్రిభువనమల్ల, చలమర్తి గండ.
-ఇతనికి సంబంధించినది కాజీపేట దర్గా శాసనం ఒక్కటే.
రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116-1158)
-బేతరాజు రెండో కుమారుడు. తొలి కాకతీయుల్లో గొప్పవాడు. ఇతను తన కళ్యాణి చాళుక్యుల సామంతులతో యుద్ధం చేసి విజయం సాధించాడు.
-ఇతని కుమారుడైన రుద్రదేవుని ప్రసిద్ధ అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం ఈ విషయాన్ని బలపరుస్తుంది.
-రెండో ప్రోలరాజు చేతిలో కొలనుపాక పాలకుడైన పరమార జగ్గదేవుడు పరాజయం పొందాడు. క్రీ.శ. 1173లో కళ్యాణి చాళుక్య రాజు రెండో జగదేక మల్లుడు, రెండో ప్రోలరాజు సైన్యాలు కుండూరిపై దండెత్తి తైలపుణ్ణి ఓడించాయి.
-ప్రోలరాజు భీమ చోడుణ్ణి ఓడించి వధించాడు. శ్రీశైలం వరకు సైన్యాలను నడిపి అక్కడ విజయస్తంభాన్ని నాటాడు.
-ఇతని కాలం నుంచే పొలవాస ప్రభువులకు, అనుమకొండ ప్రభువులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది.
-ఇతని కాలంలోనే ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైంది.
-ప్రోలరాజు మహామంత్రి బేతనామాత్యుని భార్య మైలమ కడలవాయ బసదిని జైనుల కోసం నిర్మించింది.
-ఇతని బిరుదులు మహామండలేశ్వర, దారిద్య్ర విద్రావణ
రుద్రదేవుడు (1158-62 వరకు, 1163-1195 వరకు)
-కాకతీయ వంశ పాలకుల్లో రుద్రదేవుడి (మొదటి ప్రతాపరుద్రుడు) కాలానికి ప్రత్యేకత, చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇతడు 1158-62 వరకు సామంతరాజుగా, 1163-95 వరకు స్వతంత్ర రాజుగా పరిపాలించాడు.
-ఇతడి అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం (1163) రుద్రదేవుడు క్రీ.శ. 1163లో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని తెలంగాణలో మొదటిసారిగా విశాల రాజ్యాన్ని స్థాపించాడని తెలుపుతుంది.
-అనుమకొండ శాసనాన్ని అచితేంద్రుడు లిఖించాడు.
-రుద్రదేవుడు నగర పాలకుడైన (కరీంనగర్ నగునూర్) దొమ్మరాజును, పొలవాస (జగిత్యాల) పాలకుడైన రెండో మేడరాజు, మైలిగ దేవుడు, చోడోదయుడు మొదలైన వారిని యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని తెలంగాణలో నెలకొల్పాడని వేయి స్తంభాలగుడి శాసనం తెలుపుతున్నది.
-రుద్రదేవుడు కాలచూరి రాజ్యాన్ని ఆక్రమించి, కందూరి రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో విలీనం చేశాడు.
-రుద్రదేవుడు కందూరి ఉదయచోడుని కుమార్తె పద్మావతిని వివాహమాడి ఆ రాజ్యానికి అతన్ని సామంతునిగా నియమించాడు. ఈ వివాహం సందర్భంగా రుద్రదేవుడు రుద్రసముద్ర తటాకం అనే చెరువును తవ్వించాడు.
-ఇతని రాజ్యం ఉత్తరాన గోదావరి వరకు, పశ్చిమాన బీదర్ వరకు, దక్షిణాన శ్రీశైలం వరకు విస్తరించి ఉంది.
-రుద్రదేవుడు విజయాలకు సూచకంగా విజయశాసనాన్ని అనుమకొండలో వేయించి రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు.
-రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు.
-ఇతను 1182లో జరిగిన పల్నాడు యుద్ధంలో నలగామరాజుకు తన మద్దతు ప్రకటించాడు.
-ఇతని మంత్రి ఇనగాల బ్రహ్మారెడ్డి వేయించిన ద్రాక్షారామ శాసనం (1158) ప్రకారం రుద్రదేవుడు పరాక్రమశాలి.
-రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. విద్యాభూషణ బిరుదాంకితుడు.
-ఇతని మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్ శాసనం (1170) వేయించాడు. గంగాధరుడు అనుమకొండలో ఒక చెరువును, ప్రసన్న కేశవస్వామి గుడిని కట్టించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు