భారత జాతీయోద్యమం
1885 నుంచి 1947 వరకు మూడు దశల్లో భారత జాతీయోద్యమం జరిగింది.
1) 1885 నుంచి 1905 వరకు మితవాద దశ
2) 1905 నుంచి 1919 వరకు అతివాద దశ
3) 1919 నుంచి 1947 వరకు గాంధీ యుగం
మితవాద దశ
- మొదటి 20 సంవత్సరాలు జాతీయ కాంగ్రెస్‌ను మితవాదులు నడిపారు.
- మితవాద నాయకుల్లో సురేంద్ర నాథ్ బెనర్జీ, దాదాభాయ్ నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, ఆనందాచార్యులు ముఖ్యమైనవారు.
- మితవాదులు దేశానికి స్వాతంత్య్రం కావాలని కోరలేదు. దేశ క్షేమం దృష్ట్యా కొన్ని రాజకీయ, సాంఘిక, ఆర్థిక సంస్కరణలు అవసరమని మాత్రమే వారు కోరారు.
- వీరు ఆంగ్లేయులకు వ్యతిరేకులు కారు. పైగా వీరికి బ్రిటిష్ వారి న్యాయబుద్ధి పట్ల, చిత్త్త ద్ధి పట్ల అచంచల విశ్వాసం ఉంది. దేశ పురోగతికి ఆంగ్ల పాలన అవసరమని వీరు భావించారు.
- అందుకే వారు తమ కోర్కెలను రాజ్యాంగబద్ధమైన శాంతియుత మార్గం ద్వారా బ్రిటిష్ వారికి విన్నవించి ప్రజాహిత సంస్కరణలు పొందడానికి ప్రయత్నించారు. ఇవి పొందడంలో వారు ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన మొదలైన విధానాలను అనుసరించారు.
- ప్రభుత్వం వీరి విన్నపాలను పెద్దగా పట్టించుకొనేది కాదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఏదో ఒక పెద్ద నగరంలో మూడు రోజుల పాటు జరిగే వార్షిక సమావేశాల్లో దేశానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించి తీర్మానాలు చేసేవారు.
- అయితే కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండేది.
మితవాదుల సాంఘిక విజయాల్లో ప్రధానమైనవి
- వీరు తమ ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా దేశ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడంలో కొంతమేరకు విజయాన్ని సాధించారు.
- ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో ప్రాంతీయ, జాతి, మత, కుల, సంకుచిత భావాలను తొలగించి జాతీయ భావాలను, ప్రజాస్వామిక భావాలను వ్యాపింపజేశారు.
- అందువల్లనే ఈ మితవాద కాలాన్ని జాతీయోద్యమంలో బీజదశగా వర్ణిస్తారు.
- మితవాద కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన ప్రయత్నాల వల్లనే 1892 బ్రిటిష్ ఇండియా కౌన్సిల్ చట్టంను ప్రవేశపెట్టారు.
- ఈ చట్టం వల్ల కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్య పెరిగింది. బడ్జెట్‌ను చర్చించే హక్కు, కొన్ని విషయాల గురించి ప్రశ్నలడిగే హక్కులు సభ్యులకు ఈ చట్టం వల్ల లభించాయి.
- బ్రిటిష్ ఆర్థిక విధానాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజలకు వివరించడం మితవాద నాయకుల విజయాల్లో ముఖ్యమైంది.
- దాదాభాయ్ నౌరోజీ, ఆర్సీ దత్త తమ రచనల ద్వారా విజయవంతంగా ఈ పనిని నిర్వహించేవారు.
- బ్రిటిష్ పరిపాలన ‘శాశ్వతంగా పాతుకుపోయి, నిత్యం పెరుగుతూపోయే ఒక విదేశీ దురాక్రమణ అని దాదాభాయ్ నౌరోజీ ప్రకటించారు.
- దాదాభాయ్ నౌరోజీ తన గ్రంథమైన ‘పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’లో సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. దీన్నే ‘డ్రెయిన్ సిద్ధాంతం’ అని కూడా అంటారు.
- మితవాద నాయకుల కృషివల్ల బ్రిటిష్ పార్లమెంట్ 1886లో ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’ను ఏర్పాటు చేసింది. 1893లో బ్రిటిష్ పార్లమెంట్ కామన్స్ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు లండన్‌లోనూ, భారతదేశంలోనూ ఒకేసారి ఐసీఎస్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు అంగీకరించారు.
- వీరి డిమాండ్ మేరకు బ్రిటిష్ ప్రభుత్వం 1895లో వేల్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
- అతివాద నాయకులతో తమకు బెంగాల్ విభజన విషయంలో ఏర్పడిన విభేదాలను తొలగించడానికి కొందరు మితవాద నాయకులు చేసిన కృషి ప్రశంసనీయమైంది. కానీ 1907లో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ నుంచి అతివాదుల బహిష్కరణ తప్పలేదు. అయినా జాతీయోద్యమాన్ని కాంగ్రెస్ సంస్థను మరోసారి విచ్ఛిన్నం కాకుండా కాపాడిన ఘనత మితవాదులది.
- ఈ విధంగా మితవాదులు భారత జాతీయ కాంగ్రెస్‌లో, భారత జాతీయోద్యమంలో 1885-1905 మధ్య కాలంలో ఆ తర్వాత కాలంలోనూ తక్కువగా అంచనా వేయడానికి వీలు ఇవ్వని నిర్మాణాత్మకమైన పాత్రను పోషించారు.
అతివాద యుగం
- జాతీయ కాంగ్రెస్ శాంతియుత విధానం, రాజ్యాంగబద్ధ పద్ధతులు, మితవాద ధోరణి ఆంగ్ల ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపలేదు. అందువల్ల కాంగ్రెస్‌లోని అతివాద వర్గం తీవ్రవాద ధోరణితో ప్రభుత్వంతో తలపడి, కోర్కెలను సాధించుకోవాలనే అభిప్రాయానికి వచ్చింది.
- నాటి అతివాద నాయకుల్లో లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్ ముఖ్యులు.
- పోరాడితే గాని రాజకీయ హక్కులు లభించవని తిలక్ పేర్కొన్నారు.
- 1905 నాటి నుంచి కాంగ్రెస్‌లో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువయ్యాయి. క్రమంగా మితవాదుల ప్రభావం తక్కువై, అతివాదుల ప్రభావం ఎక్కువైంది.
- మితవాద, అతివాదుల మధ్య భేదాభిప్రాయాలకు కారణాలు
మితవాదులు నాటి ఆంగ్ల ప్రభుత్వంతో సహకరించాలని అంటే అతివాదులు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. - అతివాదులు విదేశీ వస్తు బహిష్కరణకు ప్రాముఖ్యం ఇవ్వగా, మితవాదులు బహిష్కరణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు.
- మితవాదులు శాంతియుత రాజ్యాంగబద్ధ పద్ధతుల్లోనే కోర్కెలను సాధించాలని ప్రయత్నించగా అతివాదులు ప్రజా ఉద్యమాల ద్వారా పోరాట పద్ధతులతో స్వరాజ్యం సాధించాలని భావించారు.
- బంకించంద్ర చటర్జీ సంవత్సరానికి మూడు రోజులు సమావేశం జరిపే కాంగ్రెస్ సంస్థ యాచకత్వ విధానాన్ని అపహాస్యం చేస్తూ తీవ్ర పదజాలంతో మితవాదులను విమర్శించారు.
- తిలక్ 1896లో కేసరి పత్రికలో కాంగ్రెస్ నాయకులు గత 12 సంవత్సరాలుగా గొంతుకలు పోయేటట్లు కేకలు పెట్టినా ప్రభుత్వంపై ఏ మాత్రం ప్రభావాన్ని కనబరచలేకపోయారని విమర్శించారు. కప్పలు బెకబెకమన్నట్లే తప్ప ఎలాంటి ఫలితం లేదని మితవాదుల్ని విమర్శించారు.
- 1897లో అమరావతిలో జరిగిన కాంగ్రెస్ సమావేశాన్ని అశ్వనీకుమార్ దత్ ‘మూడురోజుల తమాషా’గా వర్ణించారు.
- మితవాదులు కూడా అతివాదులను విమర్శించారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ గోఖలే అతివాదులను విమర్శిస్తూ ‘పిచ్చి ఆస్పత్రి వెలుపల ఉన్న పిచ్చివారు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారని, మాట్లాడుతారని’ పలికారు.
- అతివాదుల ప్రాబల్యం ఎక్కువ కావడానికి దారితీసిన పరిస్థితులు
1892 చట్టం జాతీయవాదులను తృప్తిపరచలేదు. దీనివల్ల భారతీయులకు పరిపాలనాధికారాలు ఏ మాత్రం లభించలేదు. - 1896 నుంచి 1901 వరకు దేశంలో అనేక ప్రాంతాలు కరవుకు గురయ్యాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేగాకుండా ఇదే సమయంలో రాజదర్బార్ నిర్వహించడానికి కర్జన్ చూపిన ఉత్సాహం, సైనిక వ్యయాన్ని తగ్గించడానికి ఏ మాత్రం ప్రయత్నించకపోవడంతో జాతీయ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు.
- బంకించంద్ర చటర్జీ, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అరబింద్ ఘోష్‌ల రచనలు నాటి యువతరాన్ని ప్రభావితం చేశాయి.
- బంకించంద్ర చటర్జీ తన ‘ఆనంద్ మఠ్’ నవలలో దేశ భక్తికి ప్రాముఖ్యం ఇచ్చి, దేశం కోసం ఏ త్యాగం అయినా చేయడానికి సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
- వివేకానందుని బోధనలు తమకెంతగానో స్ఫూర్తినిచ్చాయని లాలా లజపతి రాయ్, బిపిన్‌చంద్ర పాల్ పలికారు. భారతీయ వైభవాన్ని గుర్తుచేసి జాతీయ ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చిన దయానంద సరస్వతి బోధనలు నాటి నాయకులను అతివాదం వైపు మళ్లించింది.
- అరబిందో ఘోష్ రచనలు ప్రత్యక్షంగా అతివాద సిద్ధాంతాన్ని బలపరిచాయి.
బెంగాల్ విభజన – వందేమాతర ఉద్యమం
- బెంగాల్ విభజనను అతివాద నాయకులు జాతీయ సమస్యగా అభివర్ణించారు. వీరు మితవాదులను భిక్షకులుగా విమర్శించారు. అతివాదులు స్వరాజ్య సాధన ఉద్యమం లక్ష్యం అని పేర్కొన్నారు.
- పరిపాలనా సౌలభ్యం పేరుతో అతిపెద్దదైన బెంగాల్ రాష్ర్టాన్ని లార్డ్ కర్జన్ 1905లో రెండు రాష్ర్టాలుగా విభజించాడు. అవిభక్త బెంగాల్ ఒక శక్తి. బెంగాల్‌ను విభజిస్తే బలహీనమవుతుంది. ‘మన పరిపాలనలో ప్రతిఘటించే బలమైన ప్రత్యర్థులను బలహీనపరచడమే మన ముఖ్య లక్ష్యం’ అని ఆనాటి భారత ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి రిస్లే ప్రకటించాడు. ఈ చర్య వల్ల బెంగాల్లో హిందువులు, మహమ్మదీయులు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలు వేరయ్యాయి. ఈ విభజన 1905, అక్టోబర్ 16న బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీన్ని బెంగాల్ రాష్ట్రమంతా శోకదినంగా పాటించారు.
- కాంగ్రెస్‌లోని అతివాదులు, మితవాదులు కలిసి విభజనను వ్యతిరేకిస్తూ 1905 ఆగస్టు 7న కలకత్తాలోని టౌన్ హాలులో జరిగిన పెద్ద నిరసన ప్రదర్శనలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు.
- ఈ ఉద్యమాన్నే వందేమాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అన్నారు. బెంగాల్ విభజన ప్రకటన నిశ్చేష్టులను చేసిందని సురేంద్రనాథ్ బెనర్జీ రాశారు. ఈ నిర్ణయం బెంగాలీలను ఘోరంగా అవమానపరిచిందని, దగా చేసిందని ప్రకటించారు.
- కృష్ణకుమార్ మిత్ర తన సంజీవని వార పత్రిక ద్వారా విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘ఆత్మ శక్తి’ సిద్ధాంతం తెలుపగా, సొంతంగా పరిశ్రమలను స్థాపించుకోవాలని పీసీ రాయ్ బెంగాల్ కెమికల్స్ ఫ్యాక్టరీని స్థాపించగా, విద్యాపరంగా సతీష్ ముఖర్జీ డాన్ సొసైటీని ఏర్పాటు చేశారు.
- ఈ సమయంలోనే ఠాగూర్ శాంతినికేతన్‌తో పాటు జాతీయ విద్యాలయాలు వెలిశాయి. బెంగాల్‌లోని జాతీయ కాలేజీకి అరబిందో ఘోష్ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. తూర్పు, పశ్చిమ బెంగాల్, బీహార్లలో అనేక జాతీయ విద్యాలయాలు వెలిశాయి. కృష్ణకుమార్ మిత్రి ‘యాంటీ సర్క్యులర్ సొసైటీ’ని స్థాపించి, అశ్వనీదత్ ‘స్వదేశీ బాంధవ్ సమితి’ ఈ స్వదేశీ ఉద్యమాన్ని వ్యాపింపజేశారు.
- వందేమాతర ఉద్యమం కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొట్టమొదటి ప్రజా ఉద్యమం. బంకించంద్ర చటర్జీ వందేమాతరం గేయం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అన్నారు.
- అమృత బజార్, సంజీవని, హితవాది, వసుమతి లాంటి ప్రాంతీయ భాషా పత్రికలతో పాటు ఆంధ్ర దేశంలో కృష్ణా పత్రిక లాంటివి బెంగాల్ విభజనను తీవ్రంగా నిరసించాయి. లండన్ టైమ్స్, మాంచెస్టర్ గార్డియన్ లాంటి విదేశీ పత్రికలు కూడా బెంగాల్ విభజనను నిరసిస్తూ వెలువడ్డాయి. వందేమాతర ఉద్యమం బెంగాల్‌కు పరిమితం కాక, దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగిన క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మళ్లింది.
- ఈ ఉద్యమం బెంగాల్ నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంలో బిపిన్‌చంద్ర పాల్ ప్రముఖ పాత్ర పోషించారు. ఈయన మద్రాస్, ఆంధ్ర ప్రాంతాల్లో పర్యటించారు. మద్రాస్‌లో సుబ్రహ్మణ్య అయ్యర్, చిదంబరం పిైళ్లె, ఆంధ్ర ప్రాంతంలో ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు ఈ ఉద్యమాన్ని నడిపారు.
- పంజాబ్‌లో భగత్ సింగ్ మేనమామ అయిన అజిత్ సింగ్ అంజుమాన్ మెహబత్ వాటన్ అనే సంస్థను, భారతమాత అనే పత్రికను నడిపి ఈ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. మహారాష్ట్ర ప్రాంతంలో ఈ ఉద్యమాన్ని బాలగంగాధర్ తిలక్ నిర్వహించారు.
- ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను, బ్రిటిష్ యాజమాన్యంలో ఉన్న విద్యాలయాలను బహిష్కరించారు. దేశంలో మొదటిసారి మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. బహిష్కరణోద్యమం జరుగుతున్న సమయంలోనే నాయకులు నిర్మాణాత్మక ఆలోచనలతో స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించారు. వందేమాతర ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపిన నాటి అతివాద నాయకుల్లో ముఖ్యులు తిలక్, బిపిన్‌చంద్ర పాల్, లాలా లజపతి రాయ్, అరబిందోఘోష్ ముఖ్యులు.
మాదిరి ప్రశ్నలు
1. స్వదేశీ అన్న పదాన్ని మొదటిసారి ఉపయోగించింది?
1) స్వామి దయానంద సరస్వతి
2) స్వామి వివేకానంద
3) బాలగంగాధర్ తిలక్
4) బిపిన్‌చంద్ర పాల్
2. పంజాబ్‌లో ‘అంజుమాన్ మెహబత్ వాటన్’ అనే సంస్థను స్థాపించింది?
1) భగత్ సింగ్
2) లాలా లజపతి రాయ్
3) అజిత్ సింగ్ 4) లాలా హరదయాళ్
3. కింది వాటిలో సరైనవి?
1) భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు- ఉమేశ్ చంద్ర బెనర్జీ
2) భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు
– జార్జ్ యూల్
3) 1 4) 1, 2
4. ‘కాంగ్రెస్ పతనం కావడానికి సిద్ధంగా ఉంది. నేను భారతదేశంలో ఉండగానే అది ప్రశాంతంగా కళ్లు మూయడానికి సహాయపడాలని నా కోరిక’ అని అన్నది?
1) కారన్ వాలీస్ 2) కర్జన్
3) మింటో 4) వెల్లస్లీ
5. భారతదేశ సంపద బ్రిటిష్ విధానం వల్ల ఇంగ్లండ్‌కు తరలిపోతుందని వివరించిన మొదటి భారతీయ నాయకుడు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) రమేశ్ చంద్రదత్
3) బిపిన్ చంద్రపాల్
4) అరబిందో ఘోష్
సమాధానాలు
1-1, 2-3, 3-4,
4-2, 5-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు