కణాల కలబోత.. అవయవాల నిర్మాత
జంతు కణజాలాలు
మొక్కల కణజాలాల మాదిరిగానే జంతువుల్లో కూడా రకరకాల విధులు నిర్వహించడం కోసం వివిధ కణజాలాలుంటాయి. కొన్ని రకాల కణజాలాలు జీవి శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడతాయి. ఎముకలు, కండరాల చలనం కోసం కొన్ని రకాల కణాలు పనిచేస్తే మరికొన్ని ఇతర కణజాలాల మధ్య సంబంధాలు ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. వివిధ ఉద్దీపనలకు ప్రతిచర్యలను చూపే కణజాలాలు కొన్ని ఉంటాయి. జంతువుల్లో ప్రధానంగా 4 రకాల కణజాలాలుంటాయి.
ఉపకళా కణజాలం
ఇది జంతువుల లోపలి అవయవాలను, బయటి భాగాలను కప్పి ఉంచే కణజాలం. ఈ కణజాలం చర్మంపైన, నోటి కుహరంలో, రక్తనాళాలపైన, ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల్లో, వృక్క నాళాల్లో విస్తరించి ఉంటుంది. ఉపకళా కణజాలం వివిధ రకాలుగా ఉంటుంది. అవి..
శల్కల ఉపకళ: బల్లపరుపుగా పలుచని పొర కలిగిఉన్న ఉపకళా కణజాలాన్ని శల్కల ఉపకళ అంటారు. అన్నవాహిక నోటి లోపలి పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తుల వాయుగోణుల్లో ఈ ఉపకళ ఉంటుంది. చర్మంపై ఉన్న ఉపకళా కణజాలం అనేక వరుసల్లో ఉంటుంది. ఈరకపు కణజాలాన్ని స్తరిత ఉపకళా కణజాలం అంటారు.
ఘనాకార ఉపకళ: ఇవి మూత్రనాళాల్లో కనిపిస్తాయి. ఇవి లాలాజల గ్రంథులకు కూడా యాంత్రిక శక్తినివ్వడంలో సహాయపడతాయి.
గ్రంథి ఉపకళా కణజాలం: కొన్నిసార్లు ఉపకళా కణజాలం కొంత భాగం లోపలికి ముడుచుకుని పోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. కాబట్టి వీటిని గ్రంథి ఉపకళా కణజాలం అంటారు.
సంయోజక కణజాలం
- ఈ రకమైన కణజాలం అవయవాలను, కండరాలను కలిపి ఉంచుతాయి. ఇటువంటి కణజాలాలను సంయోజక కణజాలం అంటారు. శరీరంలోని వివిధ అంతర్భాగాలకు దృఢంగా చట్రంలా నిలిచి కావలసిన ఆధారాన్ని సమకూరుస్తుంది. ఒక కణజాలం నుంచి వేరొక కణజాలానికి పదార్థాల రవాణాలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా శరీర రక్షణ, శరీర కణాలను బాగుచేయడం, కొవ్వు పదార్థాలను నిల్వ చేయడంలో కూడా సహాయపడతాయి.
- ఏరియోలార్ కణజాలం వివిధ కణజాలాలను కలుపుతుంది. అవయవాలను వాటి స్థానాల్లో ఉంచడానికి తోడ్పడుతుంది. ఇందులోని కణాలను ఫైబ్రోబ్లాస్ట్లు అంటారు. ఈ కణాలు తంతుయుత పదార్థాన్ని స్రవిస్తాయి. ఇవి గాయాలైనప్పుడు గాయపడిన కణజాలం తిరిగి ఏర్పడటానికి తోడ్పడతాయి.
- ఎడిపోజ్ కణజాలం చర్మం కింద కొవ్వును నిల్వ ఉంచడానికి తోడ్పడే ఒక రకమైన సంయోజక కణజాలం. శరీరం నుంచి వేడి బయటకు పోకుండా ఈ కణాలు ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి.
- ఎముక మరోరకమైన సంయోజక కణజాలం. ఎముకలు శరీరానికి ఆకారాన్నివ్వడంలో సహాయపడతాయి. ఎముక కాల్షియం పాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్‌లతో ఏర్పడుతుంది. ఈ లవణాలను ఆస్టియోసైట్స్ కణాలు స్రవిస్తాయి. ఇవి అస్థి మజ్జలో ఉంటాయి.
- మృదులాస్థి వేరొక విధమైన సంయోజక కణజాలం. ఎముకలు కలిసే ప్రదేశాల్లో, పక్కటెముకల చివర, నాసికాగ్రం, చెవిడొప్ప, వాయునాళంలోనూ మృదులాస్థి కణజాలం ఉంటుంది. సొర చేప వంటి చేపల్లో అంతరాస్థిపంజరం మొత్తం మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది.
లిగమెంట్ లేదా సంధి బంధనం: ఒక ఎముకను మరొక ఎముకతో కలిపే సంయోజక కణజాలం. ఎక్కువ సంఖ్యలో తంతువులను కలిగిఉంటుంది. ఈ తంతువులు కొల్లాజెన్ అనే ప్రొటీన్‌తో నిర్మితమై ఉంటాయి. ఇవి స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటాయి.
టెంటాన్ లేదా స్నాయు బంధనం: కండరాలను ఎముకతో కలిపే నిర్మాణం. ఇవి కూడా కొల్లాజెన్‌తో నిర్మితమై ఉంటాయి. - రక్తం కూడా ఒకరకమైన సంయోజక కణజలామే. ఇందులో ప్లాస్మా వివిధ రకాల రక్తకణాలను కలిగి ఉంటాయి.
రక్త కణాలు మూడు రకాలు అవి…
ఎర్రరక్త కణాలు
- వీటినే ఎరిత్రోసైట్లు అని కూడా అంటారు.
- వీటిలో హిమోగ్లోబిన్ అనే వర్ణకం ఉండటం వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది.
- ఒక మిల్లీలీటరు మానవ రక్తంలో దాదాపు 5 మిలియన్ల ఎర్రరక్త కణాలుంటాయి.
- ఎర్ర రక్తకణాల జీవిత కాలం 120 రోజులు.
- ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ప్రక్రియను ఎరిత్రోపాయిసిస్ అంటారు.
- ఎర్ర రక్తకణాల పరిపక్వతకు ఫోలికామ్లం, సయనోకోబాలమిన్ విటమిన్లు అవసరం.
తెల్ల రక్తకణాలు
- వీటినే ల్యూకోసైట్లు అని కూడా అంటారు.
- ఎర్ర రక్తకణాలతో పోలిస్తే వీటి సంఖ్య తక్కువ.
- రక్తంలో తెల్ల, ఎర్ర రక్తకణాల నిష్పత్తి 1:500
- వీటి జీవితకాలం 12-13 రోజులు.
- తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ల్యూకోపాయిసిస్ అంటారు.
- తెల్ల రక్తకణాల్లో గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్ అనే రెండు రకాల కణాలుంటాయి.
- గ్రాన్యులోసైట్స్ మూడు రకాలు అవి ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్.
- ఎగ్రాన్యులోసైట్స్లో లింఫోసైట్లు, మోనోసైట్లు అనే రెండు రకాల కణాలుంటాయి.
రక్త ఫలకికలు
- వీటినే త్రాంబోసైట్లు అని కూడా అంటారు.
- వీటిలో కేంద్రకం ఉండదు.
- ఇవి సాధారణంగా ఒక క్యుబిక్ మిల్లీ లీటరుకు 2.5-4.5 లక్షలు ఉంటాయి.
- ఇవి రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
కండర కణజాలం
- కండరాలు అవయవాల కదలికలకు సహాయపడతాయి. కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. జీవుల పూర్వ చరమాంగాల కదలికలకు, శరీరంలోని పేగులు, హృదయం మొదలైన అనేక అంతర అంగాల కదలికకు కండరాలే కారణం. రక్తనాళాల్లో కూడా కొద్దిమొత్తంలో కండర కణజాలం ఉంటుంది. ఇవి రక్తనాళ వ్యాసాన్ని సవరిస్తూ క్రమబద్ధమైన రక్తప్రసరణకు సహాయపడతాయి.
- నిర్మాణం, అవి ఉన్న ప్రదేశం, విధులను అనుసరించి కండరాలు మూడు రకాలు. అవి.. 1. రేఖిత కండరాలు 2. అరేఖిత కండరాలు 3. హృదయ కండరాలు.
నాడీ కణజాలం
- శరీరంలో ఉండే అన్ని రకాల కణాల్లో నాడీ కణాలకు మాత్రమే పునరుత్పత్తి శక్తి లేదు. నాడీ వ్యవస్థలో ఏ రెండు కణాలు ఒకేవిధంగా ఉండవు. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి, విశ్లేషించి పంపడానికి నిర్దేశించిన కణాలు. నాడీ కణాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి..
1. కణదేహం (సైటాన్)
2. ఆక్సాన్ (తంత్రికాక్షం) 3. డెండ్రైట్లు
వృక్ష కణజాలాలు
ఏకకణ జీవుల్లో ఒకే కణం అన్ని విధులను నిర్వర్తిస్తుంది. అయితే బహు కణజీవుల్లో అనేక కణాలు ఉండి వివిధ రకాల పనులను నిర్వర్తిస్తాయి. సాధారణంగా మన చుట్టూ ఉండే వృక్షాలన్నీ బహుకణ జీవులే. జంతువుల్లాగే జరుపుకొంటాయి. అంతేగాక అవి కిరణజన్య సంయోగక్రియ జరిపి, వాటికి మాత్రమే కాకుండా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాటిపై ఆధారపడిన ఇతర జీవరాశులన్నింటికీ కావలసిన ఆహారాన్ని తయారుచేస్తాయి.
ఒకే నిర్మాణం కలిగిన కణాల సమూహాలు, ఒకేవిధమైన విధులు నిర్వహిస్తాయి. అటువంటి కణాల సమూహాన్ని కణజాలాలు అంటారు. ఇవి మొక్కల్లో పెరుగుదలకు, గాయాల మరమ్మతులకు, ఇతర విధులకు ఉపయోగపడతాయి. మొక్కల్లో ముఖ్యంగా నాలుగు రకాల కణజాలాలు ఉన్నాయి.
విభాజ్య కణజాలాలు
- మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించడానికి తోడ్పడతాయి. ఇవి తిరిగి మూడు రకాలు
- అగ్రవిభాజ్య కణజాలం: కాండం కొనభాగాల్లో ఉండి మొక్కల్లో పెరుగుదలకు ఉపయోగపడే కణజాలాన్ని అగ్రవిభాజ్య కణజాలం అంటారు.
పార్శ విభాజ్యకణజాలం: కాండంలో పార్శపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలాన్ని పార్శ విభాజ్య కణజాలం అంటారు.
మధ్యస్థ విభాజ్య కణజాలం: కాండం మీద శాఖలు ఏర్పడే చోటు, ఆకులు, పుష్పవృంతం పెరిగే చోట పెరుగుదలను కలిగించే కణజాలాన్ని మధ్యస్థ విభాజ్య కణజాలం అంటారు.
విభాజ్య కణజాలం- కణాల లక్షణాలు
- కణాలు చిన్నవిగా ఉండి, పలుచటి కణ కవచాన్ని కలిగి ఉంటాయి.
- ఇవి స్పష్టమైన కేంద్రకాన్ని, తగినంత జీవ పదార్థాన్ని కలిగి ఉండే కణాలు.
- కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి.
- కణాలు ఎప్పుడూ విభజన చెందే శక్తిని కలిగి ఉంటాయి.
త్వచ కణజాలం
- ఒక వరుస కణాలను కలిగి ఉంటుంది. కణ విభిన్నత చూపిస్తుంది. విభాజ్య కణజాలంలోని కణాలతో పోలిస్తే త్వచ కణజాలంలోని గోడలు దళసరిగా ఉంటాయి. ఎడారి మొక్కల్లో ఇవి బాగా దళసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి. ఆకు బాహ్య చర్మంలో చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. వీటిని పత్రరంధ్రాలు అంటారు. వీటిని ఆవరించి రెండేసి మూత్రపిండాకార రక్షక కణాలుంటాయి. వేరులో బాహ్య చర్మ కణాలు పొడవైన వెంట్రుకల వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి. వాటి విధులు, స్థానాన్ని బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా ఉంటుంది. అవి బాహ్య చర్మం లేదా బహిత్వచం, రక్షకకణాలు, బాహ్య చర్మ కేశాలు.
- నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్నజీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుంచి మొక్కల్ని రక్షించేది త్వచ కణజాలం. పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మంపైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దీన్నే బెరడు అంటారు. వాయు మార్పిడికి, బాష్పోత్సేకానికి అవసరమైన పత్ర రంధ్రాలు, నేల నుంచి నీరు లవణాల సంగ్రహణకు అత్యవరసరమైన మూలకేశాలు కూడా త్వచకణజాలం నుంచే ఏర్పడతాయి.
సంధాయక కణజాలం
ఈ కణజాలంలోని కణాలు పెద్దవిగా ఉండి ప్రస్ఫుటమైన కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. మొక్కల దేహంలో ఎక్కువ భాగం ఈ కణజాలంతోనే ఏర్పడుతుంది. సంధాయక కణజాలం ఆహారం నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కలకు బలాన్నివ్వడానికి ఉపయోగపడుతుంది. దీనిలో మూడు రకాలున్నాయి. అవి…
మృదు కణజాలం: ఈ కణజాలంలోని కణాలు మృదువులగా, పలుచని గోడలు కలిగి వదులుగా సంధించి ఉంటాయి. హరితరేణువులు కలిగిన మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం లేదా వాతాయుత కణజాలం అంటారు. నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలు నిల్వచేసే మృదు కణజాలాన్ని నిల్వ చేసే మృదు కణజాలం అంటారు.
స్థూలకోణ కణజాలం: మృదు కణజాలంలోని కణాలతో పోల్చితే స్థూలకోణ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి, పొడవుగా ఉంటాయి. ఇది యాంత్రిక ఆధారాన్నిచ్చే సజీవ కణజాలం.
దృఢ కణజాలం: కణాలు దళసరి గోడలను కలిగి ఉండి కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గరదగ్గరగా అమరి ఉంటాయి. అందువల్ల త్వచ కణజాలంతో పోలిస్తే సంధాయక కణజాలంలో పలు రకాల కణాలను చూడవచ్చు.
ప్రసరణ కణజాలం
రవాణాలో పాల్గొనే కణజాలాలే ప్రసరణ కణజాలాలు. ఇందులో ఎరుపు రంగులో కనిపించే కణజాలాలను దారు కణజాలాలు అంటారు. దానికి ఆనుకొని ఉన్న కణజాలాలను పోషక కణజాలాలు అంటారు. వేర్ల నుంచి సేకరించిన నీరు, ఖనిజ లవణాలు దారువు ద్వారా కిరణజన్య సంయోగక్రియతో తయారైన ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి. కాబట్టి వాటిని ప్రసరణ కణజాలాలు అంటారు. దారువు పోషక కణజాలం రెండూ కలిసి నాళికా పుంజాలను ఏర్పరుస్తాయి. ప్రసరణ కణజాలం యాంత్రిక ఆధారాన్నిస్తుంది. దారువులో పొడవైన దారు కణాలు, దారు నాళాలు, తంతువులు, మృదు కణజాలం ఉంటాయి. పోషక కణజాలంలో పొడవైన చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహ కణాలు, తంతువులు, మృదు కణజాలం ఉంటాయి. యూకలిప్టస్ చెట్లలో దాదాపు 200 అడుగులు, రోజ్‌వుడ్ చెట్లలో దాదాపు 330 అడుగుల ఎత్తుకు పోషకాలను ప్రసరణ కణజాలాలు సరఫరా చేస్తాయి.
ఏవీ సుధాకర్ ,స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్ లింగంపల్లి(మంచాల) రంగారెడ్డి జిల్లా
sudha.avanchi@gmail.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?