భారతీయ జీవశాస్త్రవేత్తలు
జీవశాస్త్ర పరిజ్ఞానం మానవజాతి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నది. ఆహార, ఆరోగ్య సమస్యల పరిష్కారం నుంచి అంతరిక్షయానం వరకు ఎన్నో అద్భుతాలు శాస్త్రవిజ్ఞానంవల్లే సాధ్యమయ్యాయి. ఇందుకు ఎంతో మంది స్వదేశీ, విదేశీ శాస్త్రవేత్తలు తమవంతు కృషిచేశారు.
ఎం.ఎస్. స్వామినాథన్
-స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త. ఈయన పూర్తిపేరు మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. కుంభకోణం పట్టణంలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసి, కేరళలోని త్రివేండ్రం యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ పొందారు. అనంతరం తమిళనాడు వ్యవసాయ కళాశాల నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్) పూర్తిచేశారు.
-దేశంలో ఆహారకొరతను అధిగమించడం కోసం స్వామినాథన్.. గోధుమ, వరి సంకర రకాలతోపాటు ఆలుగడ్డ, నార రకాలను ఉత్పత్తి చేశారు. వ్యవసాయంలో ఆధునిక మార్గాలను ప్రవేశపెట్టారు. ఈయన కృషివల్ల స్వాతంత్య్రం అనంతరం కొన్నేండ్లలోనే దేశంలో ఆహారోత్పత్తి పెరిగింది. ఈ దశను హరిత విప్లవం అంటారు.
-దేశంలో వ్యవసాయరంగ అభివృద్ధి కోసం, అధిక ఆహారోత్పత్తి కోసం స్వామినాథన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
-స్వామినాథన్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ICAR)కు డైరెక్టర్ జనరల్‌గా, ఫిలిప్పైన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశారు. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు
పంచానన్ మహేశ్వరి
-పంచానన్ మహేశ్వరి 1904 నవంబర్ 9న రాజస్థాన్‌లో జన్మించారు. అలహాబాద్‌లోని ఎవింగ్ క్రిస్టియన్ కళశాలలో చదివారు. 1925లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, 1931లో డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు పూర్తిచేశారు.
-1934లో బెంగళూరులోని భారతీయ విజ్ఞానశాస్త్ర అకాడమీ గౌరవ సభ్యులయ్యారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈయన వృక్షాల పిండోత్పత్తి శాస్త్రంలో విశేష కృషి చేశారు. ఈయనను వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్ర్తానికి పితామహుడిగా కీర్తిస్తారు.
-పరిస్థానిక ఫలదీకరణం అనే పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతిలో వృక్షాల ఫలదీకరణాన్ని పరీక్షనాళికలో జరుపుతారు. ఇది వృక్షాల ప్రజననంలో, ఆర్థిక, అనువర్తిత వృక్షశాస్ర్తాల అభివృద్ధికి తోడ్పడింది. పరిస్థానిక ఫలదీకరణ పద్ధతితో సహజంగా సంకరణం గావించబడని మొక్కలను సంకరణం చేయించి, కొత్త రకాల మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. పంచానన్ మహేశ్వరి 1966 మే 18న ఢిల్లీలో మరణించారు.
డా. యల్లాప్రగడ సుబ్బారావు
-యల్లాప్రగడ ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త. 1895 జనవరి 12న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. రాజమండ్రిలో మెట్రిక్యులేషన్, మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్యవిద్య పూర్తిచేశారు.
-ఫోలిక్ ఆమ్లం, టెట్రా సైక్లిన్లు, క్యాన్సర్ నిరోధక ఔషధాలను ఉత్పత్తిచేసే పద్ధతులను యెల్లాప్రగడ అభివృద్ధి చేశారు. బోదకాలు, టైఫాయిడ్, పాండు రోగం మొదలైన వ్యాధులను పూర్తిగా నిర్మూలించగల మందులను కనుగొన్నారు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అనే ఔషధం ఫైలేరియాసిస్ నివారణకు ఉపయోగపడింది. అందుకే ఈయనను అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు (Wizard of the wonder Drug) అంటారు.
-టెట్రాసైక్లిన్లవల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎంతోమంది ప్లేగు వ్యాధి నుంచి రక్షించబడ్డారు. టెట్రాసైక్లిన్‌ను ప్రపంచానికి సుబ్బారావు ఇచ్చిన బహుమానంగా కీర్తిస్తారు. ఈయన అనారోగ్యంతో 1948 ఆగస్టు 9న అమెరికాలో మరణించారు.
హరగోవింద్ ఖొరానా
-ఖొరానా ఇండో-అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త. 1922 జనవరి 9న పంజాబ్ రాష్ట్రంలోని రాయపూర్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు. లాహోర్ విశ్వవిద్యాలయం నుంచి 1943లో బీఎస్సీ, 1945లో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. 1945 నుంచి 1948 వరకు అమెరికాలోని లివర్‌పూల్ యూనివర్సిటీలో పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టాపొందారు. ఆ తర్వాత రెండేండ్లు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో పరిశోధనలు సాగించారు.
-1951-1952లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లాలకు సంబంధించిన పరిశోధనలు చేశారు. ఈయన కృత్రిమ జీన్‌ను సృష్టించారు. ఈ ఆవిష్కరణ జెనెటిక్ ఇంజినీరింగ్ అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారితీసింది. జన్యుస్మృతిని వెలుగులోకి తెచ్చిన వారిలో ఈయన ఒకరు.
-ఈయన జన్యువును కృత్రిమంగా ల్యాబొరేటరీలో సంశ్లేషణ చేశారు. జన్యుశాస్త్రంలో, అణు జీవశాస్త్రంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈయన మరో ఇద్దరు శాస్త్రవేత్తలు మార్షల్, రాబర్ట్ హోలీలతో సంయుక్తంగా 1968లో నోబెల్ బహుమతి అందుకున్నారు. తన 89వ ఏట 2011 నవంబర్ 9న అమెరికాలో మరణించారు.
బీర్బల్ సాహ్నీ
-బీర్బల్ సాహ్నీ 1891 నవంబర్ 14న పశ్చిమ పంజాబ్ రాష్ట్రం (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) షహరాన్‌పూర్ జిల్లాలోని బెహరా పట్టణంలో జన్మించారు. విద్యాభ్యాసం లాహోర్ యూనివర్సిటీలో జరిగింది. లండన్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. అనంతరం లక్నో యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు.
-పురావృక్షశాస్ర్తానికి సాహ్నీ విశేష సేవలు చేశారు. లక్షల ఏండ్ల క్రితం జురాసిక్ రాక్షసబల్లుల కాలానికి చెందిన ఎన్నో వృక్ష శిలాజాలను తన పరిశోధనల ద్వారా నిర్దిష్టంగా లెక్కగట్టి ప్రకటించారు. ఆయన కృషి ఫలితంగా వృక్షజాతుల, శిలాజాల అధ్యయనం కోసం ప్రత్యేక విభాగం ఏర్పడి విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగింది.
-భూగర్భ శాస్త్రవేత్త కూడా అయిన సాహ్నీ భూమి ఒకప్పుడు ఒకే ఖండంగా ఉందని, కాలక్రమేణ రోదసిలో చోటుచేసుకున్న అనేక భౌతిక, రసాయన మార్పుల కారణంగా భూమిమధ్య నీరు ఏర్పడి 5 ఖండాలుగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు.
-సాహ్నీ పరిశీలనలు ఖండాల కదలిక సిద్ధాంతానికి రుజువులను ఇచ్చాయి. ఖండాలు ఒకదానికి ఒకటి దూరంగా జరుగుతున్నాయన్నదే ఖండాల కదలిక సిద్ధాంతం.
-1917లో ప్రొఫెసర్ స్టివార్ట్తో కలిసి బీర్బల్ సాహ్నీ భారతీయ గోండ్వానా వృక్షాల మీద విస్తృత పరిశోధనలు చేశారు. దేశంలోని వృక్షజాతుల మీదనేగాక పాశ్చాత్య దేశాల్లో పెరిగే వృక్షజాతుల లక్షణాల మీద కూడా లోతైన అధ్యయనం చేశారు. ఈయన 1949 ఏప్రిల్ 10న పుణెలో మరణించారు.
సర్ రోనాల్డ్ రాస్
-రాస్ ప్రముఖ ఆంగ్లో-ఇండియన్ శాస్త్రవేత్త. 1857 మే 13న ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో జన్మించారు. తండ్రి సర్ గ్రాంట్ రాస్ బ్రిటిష్ ఇండియా ఆర్మీలో పనిచేసేవారు. 8 ఏండ్ల వయసులో విద్యాభ్యాసం కోసం ఇంగ్లండ్ వెళ్లిన రాస్.. 1875-80 మధ్య లండన్‌లోని సెయింట్ బార్తొలోమ్ హాస్పిటల్లో వైద్యవిద్య పూర్తిచేశారు.
-1881లో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సభ్యత్వం పొంది ఇండియన్ మెడికల్ సర్వీస్‌లో చేరారు. ముందుగా మద్రాస్‌లో, అనంతరం హైదరాబాద్‌లో మలేరియాపై పరిశోధనలు చేశారు. ఆ రోజుల్లో భారత్, ఆఫ్రికా దేశాల్లో మలేరియా అతి భయంకరమైన వ్యాధి. ఆయా దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా వ్యాధి సోకి అనేక వేలమంది మరణించారు.
-దోమలు మలేరియా వ్యాధిని ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేస్తాయని రోనాల్డ్ రాస్ కొనుగొన్నారు. దీనివల్లే దోమ తెరలు వాడటం, దోమలు పెరిగే ప్రాంతాల్లో డీడీటీ చల్లడం ద్వారా మలేరియాను అదుపులో ఉంచవచ్చన్న ముఖ్య విషయం తెలిసింది.
-మలేరియా పరాన్నజీవి జీవితచక్రానికి సంబంధించి చేసిన పరిశోధనకుగాను రాస్కు 1902లో నోబెల్ బహుమతి లభించింది. రాస్ 1932 సెప్టెంబర్ 16న తన 75వ ఏట లండన్‌లో మరణించారు.
సలీం మొయినుద్దీన్ అబ్దుల్ అలీ
-1896 నవంబర్ 12న బొంబాయిలో జన్మించారు. బొంబాయి, బర్మాల్లో విద్యాభ్యాసం సాగింది. ఉన్నత విద్యను అభ్యసించలేదు.
-శాస్త్ర ప్రపంచంలో ఈయనను సలీం అలీ అంటారు. ఈయనకు చిన్నప్పటి నుంచి పక్షులను పరిశీలించడమంటే సరదా. ఆర్నిథాలజీకి సంబంధించి దేశంలో ఈయనే అగ్రగణ్యుడు.
-హైదరాబాద్, కొచ్చిన్, గ్వాలియర్, తిరువాన్కూర్, ఇండోర్, భోపాల్‌లలో స్థానిక సంస్థానాధీశుల సాయంతో ఆయా సంస్థానాల్లో ఉన్న పక్షులు, వాటి సహజసిద్ధ నివాసస్థలాల గురించి అధ్యయనం చేశారు.
-పక్షుల పరిశోధనలో చేసిన కృషికిగాను సలీం అలీ అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చే పాల్గెట్టి అవార్డు కూడా సలీం అలీకి లభించింది. సలీం అలీని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈయన 1987 జూన్ 20న ముంబైలో మరణించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు