ప్రభుత్వ కొలువు.. ప్రణాళికతో చదువు
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ప్రతి నిరుద్యోగికి తన కలను సాకారం చేసుకునేందుకు అవకాశం వచ్చింది. కాబట్టి పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సమయం వృథా చేయకుండా పోటీపడాలనుకుంటున్న ఉద్యోగం కోసం సరైన ప్రణాళిక వేసుకుని, కావాల్సిన పుస్తకాలను సేకరించి చదివినట్లయితే విజయం సొంతమవుతుంది. గ్రూప్-1, 2, 3, 4, టీచర్, పోలీస్ ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉండనున్నాయి. వాటిలో కొన్ని జోనల్ పోస్టులు, కొన్ని జిల్లా పోస్టులు ఉంటాయి. భారీగా ఖాళీలను భర్తీ చేయనుండటంతో పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధైర్యం వద్దు, సహనం కోల్పోవద్దు. సిలబస్‌పై అవగాహన తెచ్చుకుని, మంచి పుస్తకాలను ఎంపికచేసుకుని ప్రణాళికతో, ఇష్టంగా కష్టపడి చదివితే తప్పకుండా విజయం వరిస్తుంది.
సలహాలు, సూచనలు
- ఎంత చదువుతున్నామన్నది కాదు, సిలబస్‌లో ఉన్నది చదువుతున్నామా లేదా అన్నది చూసుకోవాలి.
చదివిన విషయాలు ఎంతవరకు గుర్తుంచుకుంటున్నారో మనల్ని మనం పరీక్షించుకోవాలి. - చాలా విషయాలను సులభమైన రీతిలో గుర్తుంచుకోవడానికి కోడ్లు సొంతంగా తయారు చేసుకోవాలి.
అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలను తక్కువ సమయంలో ఛేదించడానికి షార్ట్‌కట్ మెథడ్స్ బాగా సాధన చేయాలి. - పోలీస్ ఉద్యోగం కోసం నిర్వహించే పరీక్షల్లో ప్రతిసారీ ప్రశ్నల కఠినత్వాన్ని పెంచుతున్నారనే విషయాన్ని గమనించాలి.
- గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ప్రశ్నల సరళిని గమనించి వాటికి అనుగుణంగా ప్రిపరేషన్ చెయ్యాలి.
సిలబస్ ప్రకారం ఏ అంశాలు ముందుగా చదవాలో, వేటికి ప్రాముఖ్యం ఉందో, గత పరీక్షల్లో ఏ అంశాల నుంచి ప్రశ్నలు అడిగారో తెలుసుకుని చదవాలి. - గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే నిత్యజీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
- జీవశాస్త్రంలో వృక్ష స్వరూప శాస్త్రం, వృక్ష ఆవరణ శాస్త్రం, సూక్ష్మజీవులు, వ్యాధులు, మానవ శరీరధర్మశాస్త్రం, పోషణ, కణశాస్త్రం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయని గమనించవచ్చు.
అంశాల వారీగా విశ్లేషణ
పోషణ: విటమిన్లు-వాటి రసాయన నామాలు, లోపిస్తే వచ్చే వ్యాధులు, స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలు, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, లిపిడ్స్, పోషకాహార లోప వ్యాధులు అనే అంశాలపై అవగాహన ఉండాలి.
మాదిరి ప్రశ్న
కృష్ణ అనే విద్యార్థి కంటి చూపునకు సంబంధించిన లోపంతో బాధపడుతున్నాడు. వైద్యుడిని సంప్రదించగా విటమిన్-ఎ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చాడు. కింది వాటిలో దేన్ని సూచిస్తావు?
1) జామ 2) బొప్పాయి
3) నారింజ 4) టమాట
సమాధానం: (2) బొప్పాయి
సూక్ష్మజీవులు – వ్యాధులు
బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, శైవలాలు, ప్రొటోజోవన్ల సాధారణ లక్షణాలు, సూక్ష్మజీవుల వ్యాధులు, వ్యాధుల లక్షణాలు, వ్యాక్సిన్లు, సూక్ష్మజీవ నాశకాలు. బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులను గుర్తుంచుకోవడానికి సొంతంగా కోడ్లు తయారు చేసుకోవాలి.
మాదిరిప్రశ్న
లాటిన్ భాషలో కరోనా అంటే అర్థం?
1) వైరస్ 2) విషం
3) చెడుగాలి 4) కిరీటం
సమాధానం: (4) కిరీటం
కణశాస్త్రం
వివిధ రకాల కణాంగాలు, వృక్ష కణజాలం, జంతు కణజాలం, కణ విభజన వంటి అంశాలు చూసుకోవాలి.
మాదిరిప్రశ్న
కింది వాటిని జతపర్చండి.
1. రిక్తిక ఎ. ప్రొటీన్ల సంశ్లేషణ
2. లైసోజోమ్‌లు బి. వృక్ష కణంలో మాత్రమే
3. మైటోకాండ్రియా సి.కణం-ఆత్మహత్యాకోశాలు
4. రైబోజోమ్‌లు డి. స్వయం ప్రతిపత్తిగల కణాంగం
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
సమాధానం: (3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
జ్ఞానేంద్రియాలు
కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, జ్ఞానేంద్రియాలకు కలిగే వ్యాధుల గురించి చదువుకోవాలి.
మాదిరిప్రశ్న
కంటిలోగల దండాలు, కోనులు అనే కణాలు సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే వర్ణద్రవ్యాల ఉత్పత్తికి ఏ ఆహారపదార్థాలు అవసరం?
1) క్యారెట్ 2) బచ్చలికూర
3) బొప్పాయి 4) పైవన్నీ
సమాధానం: (4) పైవన్నీ
వృక్ష స్వరూపశాస్త్రం
వివిధ రకాల మొక్కలు, వాటి ఉత్పత్తులు, లాభాలు, మొక్కల శాస్త్రీయ నామాలు, మొక్క భాగాలు, వాటి విధులు, మొక్కలపై పరిశోధనలు చేసే వివిధ సంస్థలు (IARI, ICRI, NIN, ICRISAT, CCRI, CRRI), కిరణజన్య సంయోగక్రియ, వృక్ష హార్మోన్లు (ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, అబ్‌సైసిక్ ఆమ్లం, ఇథిలిన్) మొదలైనవి చదవాలి. గత పరీక్షల్లో ఈ విభాగం నుంచి అత్యధిక ప్రశ్నలు అడిగారు.
మాదిరిప్రశ్న
అర్ధశుష్క పంటలపై పరిశోధన చేసే ICRISAT అనే అంతర్జాతీయ సంస్థ ఎక్కడ ఉంది?
1) న్యూయార్క్ – అమెరికా
2) న్యూఢిల్లీ – భారతదేశం
3) ముంబై – భారతదేశం
4) హైదరాబాద్ – భారతదేశం
సమాధానం: (4) హైదరాబాద్
మొక్కలు – జంతువుల వర్గీకరణ
మొక్కల వర్గీకరణ, జంతువుల వర్గీకరణ, జీవవైవిధ్యం, అంతరించిపోతున్న జీవజాతులు, రెడ్ డాటా బుక్, IUCN, UNESCO, WWF సంస్థలు.
మాదిరిప్రశ్న
కింది వాటిని జతపర్చండి.
1. ఈస్ట్ ఎ. సయనో బ్యాక్టీరియా
2. అజోల్లా బి. శైవలం
3. నాస్టాక్ సి. శిలీంధ్రం
4. క్లోరెల్లా డి. టెరిడోఫైటా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సమాధానం: (2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
వృక్ష ఆవరణశాస్త్రం
పర్యావరణం, జీవ అనుఘటకాలు, నిర్జీవ అనుఘటకాలు, వివిధ రకాల కాలుష్యాలు, జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాల గురించి నేర్చుకోవాలి.
మాదిరిప్రశ్న
1986లో చెర్నోబిల్ శక్తి ఉత్పాదిత కేంద్రం నుంచి విడుదలైన విషవాయువులవల్ల చాలామంది మరణించారు. ఈ కేంద్రం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది.
1) రష్యా
2) చైనా
3) బ్రిటన్
4) ఉక్రెయిన్
సమాధానం: (4) ఉక్రెయిన్
జీవశాస్త్రంలో ఆధునిక ధోరణులు
జీవసాంకేతిక శాస్త్రం, జన్యుపరివర్తిత మొక్కలు, వివిధ రకాల విప్లవాలు, వ్యవసాయంలో అవలంభిస్తున్న నూతన పద్ధతులు, వివిధ రకాల కల్చర్ల (ఎపికల్చర్, సెరికల్చర్) గురించి చదువుకోవాలి.
మాదిరిప్రశ్న
ఆపరేషన్ ఫ్లడ్ కింది వాటిలో దేనికి సంబంధించినది?
1) హరిత విప్లవం
2) శ్వేత విప్లవం
3) వెండి విప్లవం
4) గులాబీ విప్లవం
సమాధానం: (2) శ్వేత విప్లవం
మానవ శరీరధర్మశాస్త్రం
జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, కండర వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థల వంటి మానవ శరీరంలో జరిగే జీవక్రియల గురించి చదవాలి.
ఈ విభాగం నుంచి చాలా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఈ వ్యవస్థలకు సంబంధించిన చిత్రాలను ఆధారంగా చేసుకుని చదివితే సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంది.
మాదిరిప్రశ్న
మానవ శరీరంలో ఒంటరిగా ఉండే ఎముక ఏది, దాని ఆకారం ఎలా ఉంటుంది?
1) హనువు – U
2) స్టేపిస్ – S
3) ఫీమర్ – L
4) స్టెర్నం – T
సమాధానం: (1) హనువు – U
నిత్యజీవితానికి అన్వయించుకుని చదివితే జీవశాస్త్రం సులభం
పోలీస్ పరీక్షల్లో జీవశాస్త్రంలో చాలా సులభంగా మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది.
జనరల్ స్టడీస్ విభాగంలో ప్రతిసారీ జీవశాస్త్రం నుంచి 10 నుంచి 14 ప్రశ్నలు అడుగుతున్నారు.
2016 తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 11 ప్రశ్నలు
2016 తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్‌లో 8 ప్రశ్నలు
2018 తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 12 ప్రశ్నలు
2018 తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్‌లో 12 ప్రశ్నలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు