మేజర్ జనరల్ జేఎన్ చౌధరి మిలిటరీ పాలన
1948, సెప్టెంబర్ 18న హైదరాబాద్ రాజ్య మిలిటరీ గవర్నర్‌గా జయంతో నాథ్ చౌధరి బాధ్యతలు చేపట్టారు. ఇతనికి సహాయంగా చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్‌గా డీఎస్ బాక్లే, అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్‌గా డీఆర్ ప్రధాన్ నియమితులయ్యారు. చౌధరి కార్యనిర్వాహక మండలిలో నవాబ్ జైన్ యార్ జంగ్ బహదూర్, రాజా దొండేరాజ్ బహదూర్, జీవీహెచ్ కృష్ణారావు, సీవీఎస్ రావు, కాజిం యార్ జంగ్ సభ్యులుగా ఉన్నారు.
కానీ రాజ్యాధినేతగా పరిపాలన మొత్తం ‘హిజ్ ఎక్సలెన్సీ హైనెస్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్’ పేరుమీదుగానే జరిగేది. నిజాం 1950, జనవరి 26 నుంచి మాత్రమే రాజ్‌ప్రముఖ్‌గా నియమితులయ్యాడు. ఈ సమయంలో జేఎన్ చౌధరి చేసిన సంస్కరణల్లో మొదటిది, ప్రధానమైనది 1949, ఫిబ్రవరి 6న విడుదలైంది. ఆ ఫర్మానా ప్రకారం నిజాం సొంత ఆస్తిగా పరిగణించే సర్ఫేఖాస్, కరెన్సీ అయిన హోలి సిక్కా రద్దు అయ్యా యి. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారానికి బదులుగా ఆదివారం సెలవుదినంగా మార్చారు.
నిజాంకు చెందిన సర్ఫేఖాస్ భూములను భారత ప్రభుత్వం స్వాధీనపర్చుకొని నష్టపరిహారంగా రూ.3 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంలో ఉన్న జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయడంతో పెద్ద మొత్తంలో భూములు ప్రభుత్వాధీనంలోకి వచ్చాయి. అందువల్లనే భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ భూములున్న నగరంగా హైదరాబాద్ పేరొందింది. విద్యారంగంలో, పురాతత్వ శాస్త్రంలో చౌధరి కొన్ని మంచి పనులు చేశాడు. హైదరాబాద్ పురాతత్వ శాఖకు ఎక్కువ నిధులు మంజూ రు చేసి ఎల్లోర, అజంతా శిల్పాల పరిరక్షణకు, బీదర్ కోట మరమ్మతు చేయడానికి తోడ్పడ్డాడు. ఇంకా కొన్ని ప్రాచీన స్థలాల పునరుద్ధరణకు ఉదారంగా నిధులను సమకూర్చి పురాతత్వ శాఖను అభివృద్ధి చేశాడు.
అదేవిధంగా ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమంలో భాగంగా చౌధరి వివిధ గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించేవాడు. హైదరాబాద్ రాష్ట్రం నుంచి భారత రాజ్యాంగ పరిషత్‌కు ప్రజాప్రతినిధులను పంపించాడు. అప్పటి వరకు ఉర్దూ భాషలో జరుగుతున్న పరిపాలన భారత ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌లో మొదలయ్యింది. ఆ కాలంలో పౌర పరిపాలన శాఖ ‘సివిల్ అడ్మినిస్ట్రేట్’ అని మిలిటరీ గవర్నర్ కింద నెలకొల్పారు.
ఆ శాఖను చూసే అత్యున్నతాధికారిని చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని, తాలూక్దార్ (కలెక్టర్)ను సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని, దువ్వం తాలూక్దార్ (డిప్యూటీ కలెక్టర్)ను డిప్యూటీ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని, తహసీల్దార్‌ను అసిస్టెంట్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని పిలిచేవారు. చౌధరి తన 14 నెలల మిలిటరీ పాలనలో పరిస్థితులన్నీ కుదుటపడటానికి గాను కమ్యూనిస్టులను అణచివేసే వ్యూహం కింద రాష్ర్టాన్ని గడగడలాడించాడు.
కమ్యూనిస్టులు, ముస్లింలపై దాడులు
1947, సెప్టెంబర్ 11న కమ్యూనిస్టులు పరోక్షంగా కాంగ్రెస్ పరిపాలనకు వ్యతిరేకంగా, ప్రత్యక్షంగా నిరంకుశ నిజాం ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా రెండో దశ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చారు. ఈ దశలో కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా కొనసాగించినప్పటికీ నిజాంకు-భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన హైదరాబాద్ రాజ్య విలీనం అనే అంశంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో కమ్యూనిస్టుల బలం పెరగడం, రజాకార్ల దురంతాలు విపరీత స్థాయిలో మితిమీరిపోవడం, గ్రామాలను వదిలి పట్టణాలకు పరారైన భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు నెమ్మదిగా కాంగ్రెస్, మిలిటరీ పాలకుల సహాయ సహకారాలతో గ్రామాలకు చేరడం లాంటి మొదలైన కారణాల వల్ల హైదరాబాద్ రాజ్యంలో ప్రధానంగా తెలంగాణలో పరిస్థితులు చేజారే స్థాయికి ఎదిగాయి.
ఈ తరుణంలో 1948, సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు హైదరాబాద్ రాజ్యంపై ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ చర్యను చేపట్టడం వల్ల నిజాం లొంగిపోయాడు. తదనంతరం ఏర్పడిన జేఎన్ చౌధరి మిలిటరీ ప్రభుత్వం ఇంకా చాలదన్నట్లుగా 1948, సెప్టెంబర్ నుంచి 1949, డిసెంబర్ వరకు దాడులను కొనసాగించి ముఖ్యంగా కమ్యూనిస్టులనేవారు ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఊచకోతను కొనసాగించింది. ఇది 1951, అక్టోబర్ 21 వరకు అంటే సాయుధ పోరాటం విరమించే వరకు వెల్లోడి ప్రభుత్వంలో కూడా కొనసాగింది.
దీని ఫలితంగా దాదాపు 400 మంది కమ్యూనిస్టులు హతమయ్యారు. లక్షల మంది అరెస్టులు కావడం, వేల మంది జైళ్లలో మగ్గడం జరిగింది. ముఖ్యంగా రైతులపై కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించడానికి 1949, ఆగస్టులో జాగీర్దారీ విధానం రద్దు చట్టం ద్వారా జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేశారు. అదేవిధంగా భూ సంస్కరణల కోసం వ్యవసాయ కూలీల ఎంక్వైరీ కమిటీని కూడా నియమించారు. ఈ సమయంలో పోలీస్ చర్య వల్ల నిజాంతో పాటు రజాకార్లు, వారి నాయకుడు ఖాసిం రజ్వీ లొంగిపోయారు. కానీ రజాకార్లు లొంగిపోయే ముందు వారి ఆయుధాలను కమ్యూనిస్టులకు అప్పగించారనే తప్పుడు భావనతో మిలిటరీ గవర్నర్ కేంద్ర ప్రభుత్వ పరోక్ష అండదండలతో కమ్యూనిస్టులతో పాటు ముస్లింలపై దాడులను చేయడమే కాకుండా మారణ హోమాన్ని సృష్టించాడు.
చివరికి ప్రజా తీర్పు మేరకు ప్రభుత్వం ముస్లింలపై జరిగిన దాడులను విచారించడానికి 1949, అక్టోబర్‌లో పండిట్ సుందర్‌లాల్ కమిటీని నియమించింది.
కమిటీ.. చైర్మన్- పండిట్ సుందర్‌లాల్
సభ్యులు- 1) ఖాజీ అబ్దుల్ గఫార్, 2) మౌలానా అబ్దుల్ మిస్త్రీ
కార్యదర్శులు- 1) ఫరూక్ సీయర్, 2) సీవీ అంబుల్కర్
ఈ కమిటీ 1949, నవంబర్ 29న హైదరాబాద్‌తో పాటు 9 జిల్లాలు, 7 జిల్లా కేంద్రా లు, 21 పట్టణాలు, 23 గ్రామాలను సందర్శించి హిందువులు, ముస్లింలు, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులను కలిసి విచారణ జరిపిన నివేదికను 1949, డిసెంబర్ 21న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
నివేదికలోని అంశాలు
ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్‌పై జరిగిన పోలీస్ చర్య సమయంలో, తదనంతరం దాదాపు 27,000 నుంచి 40,000 మంది ప్రజలు మరణించారని పేర్కొంది.
వీరిలో 18,000 మంది వరకు రజాకార్లు బలంగా ఉన్న ఉస్మానాబాద్, గుల్బర్గా, బీదర్, నాందేడ్‌లలో మరణించారు.
రజాకార్ల నాయకుడైన ఖాసిం రజ్వీ స్వస్థలం లాతూర్‌లో దాదాపు 20 రోజుల పాటు దాడులు కొనసాగించి చాలామందిని హతమార్చాడు. ఈ దాడుల్లో భాగంగా దోపిడీలు, మానభంగాలు జరిగాయి.
ఈ దాడులు హైదరాబాద్ రాజ్యంలో లేని సరిహద్దు ప్రాంతాలు షోలాపూర్, నాగ్‌పూర్ వంటి ప్రదేశాలకు కూడా విస్తరించాయి. ఈ సమయంలో దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ దాడుల నుంచి కొన్ని ముస్లిం కుటుంబాలను పొరుగున ఉన్న హిందూ కుటుంబాలు కాపాడాయని నివేదికలో వెల్లడించడం జరిగింది.
నివేదికను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే 1949, డిసెంబర్ 31న జేఎన్ చౌధరిని తొలగించి, అతని స్థానంలో కేరళకు చెందిన ఐసీఎస్ ఆఫీసర్ ఎంకే వెల్లోడి నేతృత్వంలో పౌరపాలనను ఏర్పాటు చేసింది. కానీ ఆ నివేదికలోని పూర్తి అంశాలను ప్రభుత్వం ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. ప్రస్తుతం నివేదికను ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలోని లైబ్రరీలో భద్రపర్చారు. భారత ప్రభుత్వం సూచనతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వెల్లోడిని హైదరాబాద్ ముఖ్యమంత్రిగా నియమించాడు.
వెల్లోడి పౌరపాలన 1950, జనవరి 1 నుంచి 1952, జనవరి 31 వరకు జరిగింది. ఈ మంత్రిమండలిలో సభ్యులుగా ఎం శేషాద్రి, సీవీఎస్ రావు, నవాబ్ జైన్ యార్ జంగ్, బూర్గుల రామకృష్ణారావు, ఫూల్‌చంద్ ప్రేమ్‌చంద్ గాంధీ, వినాయక రావు కొరాట్కర్, వీబీ రాజు నియమితులయ్యారు. వీరితో పాటు రామానంద తీర్థ, మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి పార్లమెంట్‌కు నామినేట్ అయ్యారు.
వెల్లోడి పాలనలోని ముఖ్యాంశాలు
- సుందర్ లాల్ నివేదిక ప్రకారం జనరల్ చౌధరి స్థానంలో ముఖ్యమంత్రిగా నియమితులైన ఎంకే వెల్లోడి పౌరపాలనను కొనసాగించాడు.
- యూఎన్వో (1949)లో భారత ప్రతినిధి అయిన రామస్వామి మొదలియార్ హైదరాబాద్ రాష్ట్రంలో పౌర ప్రభుత్వం ఏర్పడి నిజాం కానిస్టిట్యూషనల్ నీడ్‌గా ఉన్నాడని ప్రకటించాడు.
- అదే సమయంలో బూర్గుల నరసింగరావు హైదరాబాద్ రాజ్యం అనేది లేదు. అక్కడ పౌర ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి హైదరాబాద్ స్వాతంత్య్రం అనే విషయాన్ని వదిలిపెట్టాలని యూఎన్వోకు సూచించాడు.
- అప్పటి వరకు హైదరాబాద్ రాజ్య భాషగా ఉన్న ఉర్దూ స్థానంలో తెలుగు, ఇంగ్లిష్ భాషలను ప్రవేశపెట్టడం వల్ల స్థానిక హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు దక్కకపోగా మద్రాస్ ప్రావిన్స్‌లోని ఆంధ్రులకు మంచి అవకాశం కల్పించారు.
- ఉర్దూ భాషలో ఉన్న భూ రికార్డులను ఇంగ్లిష్‌లోకి అనువదించడం వల్ల భూ హక్కుల్లో చాలా మోసం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా రికార్డులను నాశనం చేసి చాలావరకు హైదరాబాద్ రాష్ట్రంలోని భూములను కొల్లగొట్టడం జరిగింది.
- రాష్ట్ర విద్యావ్యవస్థలో తెలుగు భాషను ప్రవేశపెట్టి తెలుగు సంపూర్ణంగా వచ్చిన ఆంధ్రులకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టారు.
- ముఖ్యంగా ఎంకే వెల్లోడి ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టర్లను తొలగించి వారి స్థానంలో ఆంధ్రా అధికారులను చీఫ్ అడ్మినిస్ట్రేటర్ల పేరుతో నియమించింది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో తహసీల్దార్‌గా ఉన్న రామచంద్రరావును తీసుకొచ్చి హైదరాబాద్ జిల్లా చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.
- ఈ విధమైన నియామకాలు పొందిన ఆంధ్రా అధికారులు తమ బంధువులు, తమ ప్రాంతీయులను పెద్ద మొత్తంలో ఉద్యోగాల్లో నియమించుకున్నారు. వీరంతా లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం పెంచి పోషించారని పద్మజానాయుడు పార్లమెంట్లో ప్రస్తావించారు.
- పై విధంగా ఉద్యోగాలు పొందిన ఆంధ్రులు, తమ ఆధిపత్య ధోరణితో తెలంగాణ ప్రజలను చాలా చులకన భావంతో చూడటం, తమను తాము సంఘ సంస్కర్తలుగా భావించుకోవడం వంటి ప్రధానమైన కారణాలు ఆ తరువాత కాలంలో ముల్కీ ఉద్యమం రావడానికి దారితీశాయి.
మాదిరి ప్రశ్నలు
1. జేఎన్ చౌధరి మిలిటరీ పాలనలో చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసింది?
1) డీఆర్ ప్రధాన్ 2) డీఎస్ బాక్లే
3) రాజా దొండేరాజ్ బహదూర్
4) సీవీఎస్ రావు
2. పండిట్ సుందర్ లాల్ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
1) 1949, డిసెంబర్ 21
2) 1949, నవంబర్ 21
3) 1949, అక్టోబర్ 21
4) 1949, సెప్టెంబర్ 21
3. హైదరాబాద్ రాజ్యంలో వెల్లోడి పౌరపరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది?
1) 1950, జనవరి 1-1952, జనవరి 31
2) 1949, డిసెంబర్ 31-1952, జనవరి 31
3) 1950, జనవరి 1-1951, డిసెంబర్ 31
4) ఏదీకాదు
4. హైదరాబాద్ రాజ్యంలో నియమితులైన ఆంధ్రా అధికారుల లంచగొండితనాన్ని పార్లమెంట్లో ప్రస్తావించింది?
1) స్వామి రామానంద తీర్థ
2) కొండా వెంకట రంగారెడ్డి
3) పద్మజానాయుడు
4) బూర్గుల నరసింగరావు
5. హైదరాబాద్ రాష్ట్రంలో పౌర ప్రభుత్వం ఏర్పడి నిజాం ‘కానిస్టిట్యూషనల్ నీడ్’గా ఉన్నాడని యూఎన్వోలో ప్రకటించింది?
1) చక్రవర్తుల రాజగోపాల చారి
2) రామస్వామి మొదలియార్
3) వల్లభాయ్ పటేల్ 4) నెహ్రూ
6. జిల్లా కలెక్టర్లను తొలగించి, వారి స్థానంలో ఆంధ్రా అధికారులను చీఫ్ అడ్మినిస్ట్రేటర్ల పేరుతో నియమించింది?
1) ఎంకే వెల్లోడి 2) జేఎన్ చౌధరి
3) బూర్గుల రామకృష్ణారావు
4) పై అందరూ
7. ఎంకే వెల్లోడి ఏ రాష్ర్టానికి చెందిన ఐసీఎస్ అధికారి?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) కేరళ 4) ఢిల్లీ
సమాధానాలు
1-2, 2-1, 3-1, 4-3, 5-2, 6-1, 7-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు