కుతుబ్‌షాహీల పాలకమండలి ఎలా ఉండేది?
కేంద్రప్రభుత్వం
-రాజు/సుల్తాన్: ఆ కాలపు రాజ్యాలన్నింటిలాగే గోల్కొండ కూడా రాచరికపు పద్ధతినే అనుసరించింది. సుల్తాన్ రాజ్యపు సర్వాధికారి. అయితే ఉదారుడు, నీతిమంతుడుగా ఉండాలని మతగ్రంథాలు ఆదేశిస్తున్నాయి.
-అలాంటి భావనే పాశ్చాత్యులకూ ఉండేది. సుల్తాన్‌కు ప్రజలను పాలించే దైవికమైన హక్కు ఉందని మహ్మదీయులూ భావిస్తారు. తమను జిల్లుల్లా (దైవానికి ప్రతిరూపం)గా భావించుకునేవారు. ఈ విశేషణాన్ని సుల్తాన్ మహ్మద్ తన కవితానామముద్రగా ఉపయోగించుకున్నాడు. హైదరాబాద్ సమీపంలో ఓ గ్రామాన్ని జిల్లుల్లాగూడగా పిలుచుకున్నాడు.
-కుతుబ్‌షాహీ సుల్తానుల జీవనశైలి గొప్పగా ఉండేది. అరుదుగా గాని తన మందిరాలను వదిలి బయటకు రాడు.
-పాలించే సుల్తాన్ మరణించిన వెంటనే అధిక జాప్యం జరుగకుండా కొత్త సుల్తాన్‌ను ప్రకటించేవారు. అందువల్ల దైనందిన పరిపాలన కుంటుపడకుండా ఉండటమే కాకుండా అవాంఛనీయ పరిస్థితులకు అవకాశం లేకుండా పోయేది.
-ఇబ్రహీం కుతుబ్‌షా మరణం తర్వాత పదిహేనేండ్లు కూడా నిండని మహ్మద్ కులీకుతుబ్‌షాకు పట్టం కట్టడానికి దర్బారు కుట్రలే కారణమని చరిత్రకారుల అభిప్రాయం.
-సింహాసనం అధిష్టించే సమయంలో పొరుగు రాజులు స్నేహపూర్వకంగా తమ దూతలను పంపేవారు.
-సుల్తాన్ కులీ హత్య తర్వాత.. జంషెద్ పాలకుడయ్యాడు. ఆయనను అభినందించిన ఒకే ఒక్క దక్కనీ సుల్తాన్ నిజాంషాహీ పాలకుడు బుర్హాన్ నిజాంషా. అతడు తన ప్రతినిధిగా షాతాహీర్ను గోల్కొండకు పంపాడు.
-ఆ తర్వాత జంషెద్, ఇబ్రహీంలు బీజాపూర్‌పై కంటే అహ్మద్‌నగర్‌పై మొగ్గుచూపడానికి అది నాంది అయ్యింది. పట్టాభిషేకం కోసం కొలువుదీరిన దర్బారుకు రాజ్యంలోని ప్రముఖులు, పౌర, సైనిక అధికారులు హాజరవుతారు. నగరంలో ఏనుగులు, ఒంటెలపై తిరుగుతూ సందేశ వాహకులు కొత్త సుల్తాన్ పేరును ప్రకటిస్తారు.
-కుతుబ్‌షాహీల దర్బారులు ఎంతో విలాసంగా అలంకరించి ఉండేవి. సుల్తాన్ కులీ జీవితకాలంలో దర్బార్ నిరాడంబరంగా ఉండేది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో ఓ పెద్ద దర్బార్ భవనం దౌలత్‌ఖానా అలీని నిర్మించారు.
-హాలు పక్కన సచివాలయం, బంజారాల భవనాలుండేవి. హైదరాబాద్ నగర నిర్మాణం జరిగి దాద్‌మహల్, ఖుదా దాద్‌మహల్ లాంటి అద్భుత కట్టడాలు నిర్మించాక, అక్కడ కూడా దర్బార్ జరిగేది. సుల్తాన్, మంత్రులు, పండితులతో సంప్రదింపులు జరిపే సభా భవనాలు ఉండేవి.
పాలక మండలి/మజ్లిస్ దివాన్దారి/మజ్లిసెఖాన్
-మొదట్లో సుల్తాన్ క్లిష్ట సమయంలో తన ఇష్టులు, సమర్థులు అనుకున్న అమీరులతో సంప్రదింపులు జరిపేవాడు. ఆ తర్వాత అది ఓ పాలకమండలి ఏర్పాటుకు దోహదపడింది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలోని సలహామండలిని మజ్లిస్ కింగాష్ అనేవాళ్లు.
-అత్యవసర విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికే సుల్తాన్ ఆ మండలిని సమావేశపరిచేవాడు. అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో మజ్లిస్-ఇ-దివాన్-దారి సమావేశం ప్రతిరోజూ జరిగేది. మజ్లిస్‌లోని కొందరిని సుల్తాన్ రాయబారులుగా నియమించేవాడు.
-ఐన్-ఉల్-ముల్క్ సైనిక వ్యవహారాలు నిర్వహించే మంత్రిగా యూసఫ్‌షా అనే సభ్యుడు బాధ్యతలు నిర్వహించాడు. తర్వాత అతడు మొఘల్ చక్రవర్తి జహంగీర్ దర్బార్‌లో కుతుబ్‌షాహీ దూతగా పనిచేశాడు. కేంద్రప్రభుత్వంలో పీష్వా, ఐన్-ఉల్-ముల్క్, మీర్‌జుమ్లా మొదలైనవారికి విశేషాధికారాలు ఉండేవి.
-పీష్వా/వకీల్/ప్రధానమంత్రి: గోల్కొండ రాజ్యంలో సుల్తాన్ తర్వాత శక్తిమంతమైన మంత్రి పీష్వా లేదా దివాన్. ఇతడు సుల్తాన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడై ఉండేవాడు. మేధావి, పరిపాలనా వ్యవహారాల్లో పూర్తి అనుభవం ఉన్న వ్యక్తులనే ఈ ఉన్నతపదవిలో సుల్తాన్ నియమించేవాడు.
-గోల్కొండ రాజ్య పీష్వాలుగా పనిచేసినవారిలో ముస్తఫాఖాన్ అర్బిస్తానీ (ఇబ్రహీం కుతుబ్‌షా కాలం), షేక్-మహ్మద్-ఇబ్నేఖాతూన్ (అబ్దుల్లా కుతుబ్‌షా కాలం) పీష్వా పదవులు నిర్వహించి విశేష గౌరవం పొందారు.
-పీష్వా జీతం 12 వేల హొన్నులు. తానీషా కాలంనాటికి పీష్వా పదవి దివాన్‌గా మారింది. మాదన్న గోల్కొండ సుల్తాన్ చివరి దివాన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
-పీష్వా సలహాలను సుల్తాన్ గౌరవించేవాడు. పీష్వా సుల్తాన్ పేరిట రాచవ్యవహారాలు చక్కబెట్టడమేకాక పండితులు, కవులు, అమీరులతో పరివేష్టించి ఉండేవాడు. రాజ్యంలో వారపు సెలవుదినం మంగళవారం. ఆ రోజుల్లో పీష్వా విదేశీ రాయబారులతో కలిసి ఉద్యానవనాల్లో కాలంగడిపేవాడు.
-మీర్ జుమ్లా (ఆర్థికశాఖ మంత్రి): పీష్వా తర్వాత పెద్ద అధికారి అయిన ఇతన్ని అమీరె-జుమ్లా అని పిలిచేవారు. ఇతనికి జుమ్లతుల్ ముల్క్ అనే బిరుదు ఉంది. దీంతో అతని శాఖని జుమ్లతుల్-ముల్కీ అని అంటారు. అతడి బాధ్యత ఆదాయ, ద్రవ్యసేకరణ, వినియోగం.
-ఓ రకంగా అతడిని ఆర్థికమంత్రిగా భావించవచ్చు. సైనిక వ్యవహారాల శాఖ లెక్కలను కూడా ఇతడు తనిఖీచేసేవాడు. కాబట్టి అతడి అధికారాలు, విస్తృతంగా, ఒక్కోసారి పీష్వాను మించికూడా ఉండేవి. అందువల్లే ఈ పదవి గోల్కొండ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యాన్ని వహించింది.
-వీరిలో కొంతమంది తమ పరిధిని దాటి పీష్వా అధికార పరిధిలోకి ప్రవేశించారు. మీర్జామహ్మద్ అమీన్, ముల్లా తాకీ, మీర్ మహ్మద్ సయీద్, మహ్మద్ కులీ, అబ్దుల్లాల కాలంలో గొప్ప విత్తమంత్రులుగా పనిచేసి, పీష్వా పదవినే మరుగుపరిచేట్టు చేశారు.
-వజీరు: పీష్వాకు విధుల్లో సాయంచేయడానికి 12 మంది వజీర్లు ఉండేవారు. బహమనీ వంశ స్థాపకుడి కాలం నుంచి వజీరు అనే పదం కనిపిస్తుంది. మధ్యలో ఈ వ్యవస్థ అంతరించినప్పటికీ, అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో ఈ పదవిని పునరుద్ధరించారు.
-వజీర్లకు ధీషౌకత్ అనే బిరుదు ఉండేది. అంటే ఘనత వహించినవారని అర్థం. ప్రతి మంత్రికి రాజధానికి దూరంగా జాగీరు ఉండేది. మంత్రుల నడత విషయంలో రాజు ఎంతో జాగ్రత్తపడేవాడు.
-ఐన్-ఉల్-ముల్క్: కేంద్రప్రభుత్వ నిర్వహణలో సైన్యవ్యవహారాలను చూసే మంత్రి. సేనల నియామకం, శిక్షణ, యుద్ధ వ్యూహాల రచన, తరఫ్ స్థాయి సేనాధిపతులు, దుర్గాధిపతుల నియామకం ఇతని విధులు.
-సమకాలీన చరిత్రకారుడైన నిజాముద్దీన్ సైదీ దృష్టిలో కుతుబ్‌షాహీల కేంద్ర మంత్రివర్గంలో ఐన్-ఉల్-ముల్క్ ప్రముఖుడు. అతడు సుల్తాన్‌కు నమ్మినబంటు. సైఫ్‌ఖాన్, మనూర్ఖాన్-హదాషీ పేరుగాంచిన ఐన్-ఉల్-ముల్క్లు.
-నజీర్: ఇతడు సామ్రాజ్యంలోని ప్రజల్లో నీతి, నియమాలను, సుల్తాన్‌పై భక్తిని, గౌరవాన్ని, శాసనాలపై గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించేవాడు. శాంతిభద్రతలు, చట్టాల అమలు ఇతని విధులు. మహ్మద్ కులీ కాలంలో అబూతాలీబ్, అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో మీర్ ఖాసిం నజీర్ పదవులను సమర్థవంతంగా నిర్వహించాడు.
-మజుందార్: గోల్కొండ రాజ్య ఆదాయ, వ్యయాలన్నింటినీ తనిఖీ చేసే మంత్రి మజుందార్. ఇతడి కార్యాలయ ఉద్యోగులు ప్రతిశాఖ జమాఖర్చులను లెక్కించేవారు. హిందువులనే ఈ పదవిలో నియమించారు. అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో నారాయణరావు ఈ పదవిని నిర్వహించాడు.
-దబీర్: ఇతడి కార్యాలయాన్ని దివానె-ఇన్షా అని వ్యవహరించేవారు. సుల్తాన్ తరఫున తరఫ్దార్లకు, ఇతర శాఖలకు ఫర్మానాలను పంపడం, అనువాదం చేయించడం ఇతని ముఖ్య విధులు. సుల్తాన్, మంత్రివర్గం అంగీకరించిన ఫర్మానాలకు ముద్ర (అధికార ముద్ర) వేయించడం ఇతని కార్యాలయ విధి.
-సుల్తాన్ మహ్మద్ కాలంలో కాజీముజఫర్ అలీ, అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో మౌలానా ఓవైసీ దబీర్ బాధ్యతలు నిర్వహించారు. దబీర్ కార్యాలయంలో ముఖ్య ఉద్యోగి షురుహ్నవీస్.
-కొత్వాల్: పోలీస్ శాఖ పెద్ద కొత్వాల్. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ ఇతని ప్రధాన విధి. ఫ్రెంచి యాత్రికులైన ట్రావెర్నియర్, థెవ్నాట్, బెర్నియర్లు గోల్కొండ పట్టణంలో పోలీస్‌శాఖ క్రమశిక్షణతో పనిచేసేదని, విదేశీ, స్వదేశీ వ్యాపారులు నిశ్చింతగా వ్యాపారం చేసేవారనీ, నగరంలోకి ప్రవేశించే ప్రతివ్యక్తిని నిశితంగా తనిఖీ చేసేవారని, ఆ తర్వాత కొత్తవారి కదలికలపై నిఘా ఉంచేవారని రాశారు. టంకశాలకు ఇతడే అధిపతి. కొన్ని సందర్భాల్లో న్యాయాధీశునిగా విధులు నిర్వహించాడు.
-సర్ఖేల్: కేంద్రస్థాయి మంత్రుల్లో సర్ఖేల్ ఒకడు. సర్ఖేల్ అంటే గ్రూపు నాయకుడు. రాజధానిలో ముఖ్య రెవెన్యూ అధికారైన ఇతని ఆధీనంలో జిల్లాలు, రాష్ర్టాలు ఉండేవి. సర్ఖేల్ తూర్పు తీరంలోని విదేశీ వర్తక సంఘాల కార్యకలాపాలపై నిఘా ఉంచి వారిని అదుపులో పెట్టేవాడు. వారి వ్యాపారాన్ని రక్షించేవాడు.
-సర్ఖేల్ పదవికి గౌరవం చేకూర్చిన వారిలో మహ్మద్-తకి-షఫీరుల్-ముల్క్, మీర్జా రోజ్బిహాన్, సయ్యద్ ముజఫర్ ముఖ్యులు.
-హవల్దార్లు: ఇతడు ప్రభుత్వ భాండాగారాలను, గుర్రాలు, ఏనుగుశాలలను నిర్వహించేవాడు.
రాష్ట్ర పరిపాలన
-కుతుబ్‌షాహీలు బహమనీ సుల్తానుల్లానే పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టాన్ని తరఫ్ లేదా సిమ్త్లుగా విభజించారు. అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో ఆరు తరఫ్‌లుండేవి. రాష్ర్టాల పాలకులు 1630 తర్వాత తరఫ్‌దార్‌లు సుల్తాన్ ఆదేశాలను ధిక్కరించడం, ఫర్మానాలు సరిగ్గా అమలు చేయలేదని, కేంద్ర ఆదేశాలను లెక్క చేయలేదని, మచిలీపట్నం సిమ్త్ అధికారి సుల్తాన్ పంపిన కానుకలను, వస్ర్తాలను తిరిగి పంపి ఫర్మానాను అమలు చేయలేదని, హైదరాబాద్‌కు రావాలన్న సుల్తాన్ ఆదేశాన్ని బేఖాతరు చేశాడని డచ్ కంపెనీ రికార్డుల వల్ల తెలుస్తున్నది. బెల్లంకొండ, వినుకొండ, కొండపల్లి, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి 22 సిమ్త్ (సీమ)లు వీరి రాజ్యంలో ఉన్నాయని చరిత్రకారులు పేర్కొన్నారు.
-తానీషా కాలంలో మొత్తం 37 సర్కారులు, 517 పరగణాలు ఉండేవి. రేవు పట్టణంలో ఉన్నతాధికారిని షాబందల్ అనేవారు. భూమిశిస్తు వసూలుచేసే అధికారాన్ని వేలం పాటలో అందరికంటే ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధపడినవారికే ఇచ్చేవారు. ఈ రకమైన హక్కులను కొన్నవారిని ముస్తజీర్లు అనేవారు.
స్థానిక పాలన
-పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టాలను సర్కార్లుగా విభజించారు. వీరి అనేక ఫర్మానాల్లో దేశ్‌పాండే, తానేదార్, దేశ్‌ముఖ్, స్థలకర్ణి మొదలైన రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల పేర్లు ప్రస్తావించి ఉన్నాయి.
-వీరికాలంలో గ్రామమే పరిపాలనా వ్యవస్థకు తొలిమెట్టు. గ్రామస్థాయిలో పెద్ద మఖుద్దమ్. కులకర్ణి గ్రామ అకౌంటెంట్. దేశ్‌పాండే పరగణాస్థాయి లకౌంట్స్ అధికారి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు