సమాన అవకాశాలు.. హక్కుల పరిరక్షణ
దివ్యాంగులు-హక్కులు
దివ్యాంగుల (సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, పూర్తి భాగస్వామ్యం) చట్టం-1995ను 1 జనవరి 1996 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. వికలాంగులకు సమానావకాశాలు కల్పించేందుకు, జాతీయ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని ఏర్పరిచేందుకు ఉద్దేశించిన అతిముఖ్యమైన అడుగుగా ఈ చట్టాన్ని అభివర్ణిస్తారు. విద్య, ఉద్యోగాలు, వృత్తి విద్య శిక్షణ, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి, ప్రోత్సాహకర పరిస్థితులు, వికలాంగులకు పునరావాసం, నిరుద్యోగభృతి, ప్రత్యేక బీమా వంటి అంశాలతో కూడిన చట్టం వారి అభ్యున్నతికి దోహదపడుతుంది.
వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, పూర్తి భాగస్వామ్యం) చట్టం-1995
- వికలాంగత్వం ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం, మాతాశిశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టడం.
- వికలాంగ బాలలకు 18 సంవత్సరాల వయస్సు నిండేంత వరకు ఉచిత విద్యను, పాఠ్య పుస్తకాలను, వసతిని అందించేందుకు ప్రత్యేక పాఠశాలలకు చేరుకునేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను కల్పించడం, పరీక్ష, శిక్షణా విధానాలను వారికి అనుకూలంగా తయారు చేయడం, ఆర్థిక ప్రోత్సాకాలు, స్కాలర్షిప్లను అందించాలి. బధిరులందరికీ ఒకే భాష అమలులో ఉండే విధంగా చూడాలి. వికలాంగులకు విద్య, శిక్షణ ఇచ్చేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలి. వికలాంగులకు కనీసం 3 శాతం సీట్లు రిజర్వ్ చేసే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం.
- ప్రభుత్వోద్యోగాల్లో తీవ్రమైన వికలాంగత్వం కలవారికి 3 శాతం రిజర్వేషన్లు, తక్కువ వికలాంగత్వం కలిగిన వారికి 1 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం, వారికి ఉద్యోగ ప్రవేశాల్లో వయోపరిమితిని పెంచడం, ఉద్యోగాలను క్రమపద్ధతిలో నిరంతరం కల్పించడం, వారికి ఆరోగ్య, రక్షణ సౌకర్యాలను కల్పించడం, ఉద్యోగ నిర్వహణలో వికలాంగులైన వారికి అదే సంస్థలో వారు చేయగలిగిన ఉద్యోగం కల్పించడం.
- పేదరిక నిర్మూలనా పథకాల్లో కనీసం 3 శాతం వికలాంగులకు కేటాయించడం. సాంఘిక భద్రత కల్పించడం.
- వారికి గృహ, వ్యాపార, ఆరోగ్య సౌకర్యాలను, నివాస స్థలాలను ఏర్పాటు చేయడం, వారికవసరమైన కృత్రిమ అవయవాలను తయారు చేసి అందజేయడం, మరింత అధునాతన కృత్రిమ అవయవాలకు పరిశోధనలను ప్రోత్సహించడం.
- బహిరంగ స్థలాల్లో వారికి ఎదురయ్యే వివక్ష నుంచి రక్షణ కల్పించడం. బస్సులు, రైళ్లు, విమానాల వంటి వాహనాల్లో వారు ఎక్కేందుకు, ప్రయాణించేందుకు అనువుగా అనుకూలమైన సౌకర్యాలు కల్పించడం. వారికి ప్రత్యేకంగా సీట్లను కేటాయించడం.
- వికలాంగ ఉద్యోగులకు ప్రత్యేక బీమా సౌకర్యాలు కల్పించడం, వికలాంగుల అభ్యున్నతికి కృషి చేసే ప్రభుత్వేతర సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించడం.
- ఈ చట్టం ద్వారా వారికి కల్పించిన ప్రత్యేక హక్కులు సరిగా అమలు చేయకపోయినా, ఉల్లంఘించినా వారికి సాంత్వన చేకూర్చేందుకు ప్రత్యేకంగా నియమించిన అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్లలోనూ, పంచవర్ష ప్రణాళికలోనూ వారికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు.
- ప్రభుత్వంలోని అన్ని శాఖలు, కంపెనీలు, సంస్థలు ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీరికి కోటా మంజూరు చేసే క్రమంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సూత్రం వర్తిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం 8 అక్టోబర్ 2013న స్పష్టం చేసింది.
1995 వికలాంగుల చట్టం ప్రకారం వైకల్యంలో రకాలు
- పాక్షికంగా చూపు కోల్పోవడం
- పూర్తిగా చూపు కోల్పోవడం
- కుష్టు వ్యాధి
- మాట/వినికిడి లోపం గలవారు
- మానసిక రుగ్మతలు
- శారీరక లోపం గలవారు
- బుద్ధి మాంద్యం
దేశంలోని దివ్యాంగుల వివరాలు
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా దివ్యాంగుల సంఖ్య 2.68 కోట్లు ఉండగా అందులో దాదాపు 8.5 శాతం మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు తేలింది. వీరిలో 12,24,456 మంది పురుషులు కాగా 10,42,148 మంది మహిళలు. వీరిలో అత్యధిక మంది కదలికకు సంబంధించి వైకల్యాన్ని ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది.
- దివ్యాంగుల్లో 8.5 శాతం మంది పట్టభద్రులు: దేశంలోని దివ్యాంగుల్లో కేవలం 8.5 శాతం మందే పట్టభద్రులున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2.68 కోట్ల మంది దివ్యాంగుల్లో 1.46 కోట్ల (54.5 శాతం) మంది అక్షరాస్యులు. డిగ్రీ, ఆపై విద్య అభ్యసించిన పురుషులు 9 శాతం కాగా మహిళలు 7.7 శాతం. దశాబ్దం క్రితం దివ్యాంగుల్లో అక్షరాస్యుల శాతం 49.3 శాతంగా ఉంది.
- రాజ్యాంగ 7వ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితాలో అంగవైకల్యం(Disability) అనే అంశం ఉంది.
దీన్దయాళ్ వికలాంగుల పునరావాస పథకం - ఈ పథకం కింద వికలాంగుల సంక్షేమ నిర్దేశిత పాఠశాలలు, వృత్తి విద్యా కేంద్రాలు, పోప్ హోమ్, కమ్యూనిటీ పునరావాస కేంద్రాలు పనిచేస్తున్నాయి.
- మానసిక, శారీరక వికలాంగులకు అవసరమైన సహాయ పరికరాలను అందిస్తున్నారు.
- కేంద్ర ప్రభుత్వం వికలాంగుల పరిశోధనలకు ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ప్రతినెల రూ. 20,000 పారితోషికం ఇస్తుంది.
నోట్: 1985లో జీవో-1995 ద్వారా వికలాంగులకు మిగులు భూముల్లో 5 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. కాని అది ఇంకా అమలు కాలేదు. - దివ్యాంగులకు పునరావాస సేవలను అందించాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం, సాధికారత శాఖ అనేక స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందిస్తుంది.
- మానసిక వైకల్యం, వైకల్యాల జాతీయ ట్రస్టు వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తుంది.
- దేశం మొత్ంత మీద 216 జిల్లా పునరావాస కేంద్రాలు వికలాంగులకు సేవలందిస్తున్నాయి.
- డిజెబిలిటీ అఫైర్స్ శాఖ నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వికలాంగ విద్యార్థులకు 2500 స్కాలర్షిప్స్ను అందిస్తుంది. ఈ స్కాలర్షిప్లు రెండు రకాలు. అవి ఎ. స్కాలర్షిప్ స్కీం (ట్రస్ట్ ఫండ్) బి. స్కాలర్షిప్ స్కీం (నేషనల్ ఫండ్).
స్కాలర్షిప్ స్కీం (ట్రస్ట్ ఫండ్) - ఈ స్కీం పరిధిలో 2000 స్కాలర్షిప్స్ ఇస్తారు. గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చదువుతున్నవారు వీటికి అర్హులు.
- వీటిలో 30 శాతం స్కాలర్షిప్స్ను బాలికలకు కేటాయించారు. ఒకవేళ బాలికలు లేని పక్షంలో వీటిని బాలురకు ఇస్తారు.
- దరఖాస్తుదారులు అకడమిక్ ఇయర్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో చదివేవారికి మెయింటెనెన్స్ అలవెన్స్ కింద ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ, పీజీ విద్యార్థులకు చెల్లిస్తారు.
- అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ, పీజీ విద్యార్థులకు పుస్తకాలు/స్టేషనరీ అలవెన్స్ కింద స్కాలర్షిప్స్ చెల్లిస్తారు.
- వికలాంగ విద్యార్థులకు అవసరమైన పరికరాలు (హియరింగ్/కళ్లు/ట్రై సైకిళ్లు/ఆర్టిఫిషియల్ లెగ్స్/హ్యాండ్స్) తదితరాలు కొనుగోలు చేయడానికి ధన సహాయం చేస్తారు. జీవితంలో ఒకసారి మాత్రమే దీన్ని అందజేస్తారు.
స్కాలర్షిప్ స్కీం (నేషనల్ ఫండ్)
- ఉన్నత/ప్రొఫెషనల్/టెక్నికల్ విద్యార్హతలు ఉన్నవారికి వీటినిస్తారు.
- డిగ్రీస్థాయిలో ప్రొఫెషనల్ కోర్సులు, డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులు చేస్తూ హాస్టల్లో ఉండేవారికి, డేస్కాలర్లకు వేర్వేరుగా ఉంటుంది.
- ప్రొఫెషనల్ కోర్సులు చదివే బధిర/అంధ విద్యార్థులకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ తీసుకోవడానికి నిధులను సమకూరుస్తారు.
11వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన సమయంలో వైకల్యాన్ని కూడా ఓ మానవ హక్కుల సమస్యగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ DRG ఒక భారీ ప్రచార ఉద్యమాన్ని నిర్వహించింది. దీంతో ‘సామాజిక న్యాయం’ అనే అధ్యాయంలో వైకల్యానికి తగిన ప్రాధాన్యం కల్పించడమే గాక వికలాంగులను కూడా ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకోవడానికి 4 అంచెల కార్యచరణ ప్రణాళికను 11వ ప్రణాళిక రూపొందించింది. అవి - 1. సంబంధిత మంత్రిత్వ శాఖలు, శాఖల మధ్య బాధ్యతల సక్రమ పంపిణీ.
2. 11వ పంచవర్ష ప్రణాళిక ఆమోదం పొందిన 6 నెలల్లోగా సంబంధిత మంత్రిత్వ శాఖలు నియమ నింబంధనలను కచ్చితంగా రూపొందించాలి.
3. సంబంధిత మంత్రిత్వ శాఖలు 1995 నాటి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్లో చెప్పినట్లు తమ వార్షిక ప్రణాళికలో కనీసం 3 శాతం తగ్గకుండా వికలాంగుల సంక్షేమానికి వెచ్చించాలి.
4. వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటుచేసి పురోగతిని ఎప్పటికప్పుడు, నిరంతరం పర్యవేక్షించేలా సమీక్ష వ్యవస్థ ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. - పంచవర్ష ప్రణాళిక కృషి వల్లనే వికలాంగుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ పనిచేస్తున్నాయి.
వైకల్యం-కొన్ని ముఖ్యాంశాలు
- ప్రపంచ జనాభాలో 15 శాతం మంది లేదా కనీసం వంద కోట్ల మంది ఏదో ఒక రకమైన వైకల్యంతో ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వైకల్యంపై విడుదల చేసిన ప్రపంచ నివేదికలో వెల్లడించింది. ఈ లెక్కన భారతీయుల్లో 15 కోట్ల మంది ఏదో ఒక వైకల్యంతో ఉన్నట్లు తెలియజేసింది.
క్రాస్డిజేబిలిటీ మూవ్మెంట్ ఇన్ ఇండియా:
- 1993లో డిజేబుల్డ్ రైట్స్ గ్రూప్ (DRG) అనే పేరుతో భారతదేశంలోనే మొట్టమొదటి క్రాస్ డిజేబిలిటీ అనే సంస్థ వైకల్యం ఉన్నవారందరి హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టింది.
- వికలాంగుల గణన: భారతదేశపు జనాభా గణన 1872 నుంచే మొదలైనా వికలాంగుల జనాభాను మాత్రం 1981లో అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం జరుపుకొన్న తర్వాత లెక్కల్లో చేర్చారు. అయితే మళ్లీ 1991 జనాభా లెక్కల్లో వికలాంగుల జనాభా గణన ఆపేశారు. దీంతో 1999లో ప్రభుత్వంపై DRG కొన్ని నెలలపాటు తీవ్రమైన ఉద్యమం చేసింది. దీంతో వైకల్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఒక ప్రశ్నను జనాభా గణనలో చేర్చారు. 2001 జనాభా లెక్కల ప్రకారం వికలాంగులు 2.1 కోట్ల మంది. అంటే జనాభాలో 2.1 శాతం మాత్రమే. ఈ లెక్క చాలా తప్పు అని 11వ పంచవర్ష ప్రణాళికా పత్రం అంగీకరించి జనాభాలో కనీసం 5-6 శాతం మంది వికలాంగులు ఉంటారని తెలిసింది.
- 2011 జనాభా లెక్కల్లో వికలాంగుల గురించి కచ్చితమైన అంచనా పొందడం కోసం నేషనల్ సెంటర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ (NCPEDP), నేషనల్ డిజేబిలిటీ నెట్వర్క్ (NDN) సంస్థలు జనాభా లెక్కల్లో వైకల్యంపై ప్రశ్నలకు ప్రాధాన్యం కల్పించేందుకు జనాభా లెక్కలను సేకరించే ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడానికి 2010లో ఒక ప్రచారాన్ని నిర్వహించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగులు 2,68,10,557 (2.2శాతం) మంది ఉన్నారు.
Previous article
కౌటిల్యుని నోట.. ఖనిజ సంపద మాట
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు