రాజ్యాంగం – చారిత్రక పరిణామాలు
ప్రపంచ దేశాల్లో ఆధునిక రాజ్యాల అవతరణకు మూలాధారం రాజ్యాంగం. ఆధునిక రాజ్యాల రాజకీయ ప్రక్రియా విధానాన్ని సూచించే నియమ నిబంధనల సముదాయ రూపంలో ఒక అత్యున్నత చట్టం ఉంటుంది. దీన్నే రాజ్యాంగం అంటారు.
-క్రీ.పూ. 384-322 కాలానికి చెందిన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అప్పటికే ఉన్న 156 రాజ్యాంగాలను అధ్యయనం చేసి రాజ్యాంగ భావనను వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వాలను శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించి రాజనీతిశాస్త్ర పితామహుడు అయ్యాడు. భారత రాజ్యాంగ ఆవిర్భావానికి కొన్ని చట్టాలు దోహదపడ్డాయి. రాజ్యాంగ నిర్మాణ పరిణామ క్రమాన్ని బీసీ రావత్ 6 దశలుగా అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నారు. అవి..
Iవ దశ (1600-1773)
-మొదటి ఎలిజబెత్ మహారాణి 1600, డిసెంబర్ 31న ఈస్టిండియా కంపెనీకి వ్యాపారం చేసుకునేందుకు రాయల్ చార్టర్ (ఏదైనా ఒక సంస్థ లేదా సంఘాల ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీచేసే అనుమతిపత్రాన్ని చార్టర్ అంటారు) ద్వారా అనుమతించారు. దీంతో దేశంలో వ్యాపారం చేసుకునే క్రమంలో దేశంపై కంపెనీ పాలనాధికారాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కంపెనీ బెంగాల్, బొంబాయి, మద్రాసు రాష్ర్టాలను స్వాధీనం చేసుకుంది.
-ఈస్టిండియా కంపెనీ చేస్తున్న అవినీతిని బయటపెట్టేందుకు బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బుర్గాయిక్ అధ్యక్షతన ఒక కమిటీని రహస్యంగా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కంపెనీ అవినీతి పెరిగిపోయిందని నివేదిక ఇచ్చి, కంపెనీ కార్యక్రమాలను క్రమబద్దం చేయమని సిఫారసు చేసింది.
IIవ దశ (1773-1858)
రెగ్యులేటింగ్ చట్టం (1773):
రెగ్యులేటింగ్ అంటే క్రమబద్దం చేయడం. వ్యాపారరీత్యా భారతదేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీని క్రమబద్దం చేయడంతో పాటు దాని కార్యక్రమాలను నియంత్రించడానికి చేసిన మొదటి చట్టం కాబట్టి దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. దీన్ని దేశానికి సంబంధించి మొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా కూడా పేర్కొంటారు. అంతవరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్టిండియా కంపెనీకి మొదటిసారిగా రాజకీయ, పరిపాలన, అధికారాలు లభించాయి.
-ఈ చట్టాన్ని 1773, మే 18న అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ విలియం లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వహణ మండలిని ఏర్పాటు చేశారు.
-ఆ విధంగా మొదటి గవర్నర్ జనరల్‌గా నియమితులైనవారు వారెన్ హేస్టింగ్స్. కార్యనిర్వహణ మండలిలోని నలుగురు సభ్యులు 1) క్లావెరింగ్ 2) బార్వెల్ 3) ఫిలిప్ ఫ్రాన్సిస్ 4) మాన్సన్.
-1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్‌ను కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఎంఫే, న్యాయమూర్తులు రాబర్ట్ చాంబర్స్, సీజర్ లైమెస్టర్, జాన్ హైడ్.
పిట్స్ ఇండియా చట్టం (1784):
రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్ ఈ చట్టాన్ని ప్రతిపాందించడంతో దీన్ని పిట్స్ ఇండియా చట్టం అని వ్యవహరిస్తారు. ఈ చట్టాన్ని చేసిన సమయంలో గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్.
-ఇంగ్లండ్‌లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక నూతన విభాగాన్ని ఆరుగురు సభ్యులతో ఏర్పాటుచేసి కంపెనీ రాజకీయ, సైనిక, రెవెన్యూ వ్యవహారాలను దీనికి అప్పగించారు. ముగ్గురు డైరెక్టర్లతో నియమించిన ఒక రహస్య కమిటీ ఈ బోర్డు ఆదేశాలను భారతదేశానికి చేరవేసేది. ఈ కోర్ట్ ఆఫ్ డెరెక్టర్స్ వాణిజ్య వ్యవహారాలకే పరిమితమైంది.
చార్టర్ చట్టం (1793):
ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేశారు. కంపెనీకిగల వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరో 20 ఏండ్లు పొడిగించారు. బోర్డు కార్యదర్శిని పార్లమెంట్లో కూర్చోవడానికి అనుమతించారు. ఈ చట్టం సమయంలో గవర్నర్ జనరల్ కారన్‌వాలీస్.
-భారతీయుల హక్కులు, ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ చేసే నిబంధనలకు చట్టాలతోపాటుగా సమాన విలువు ఉంటుంది.
చార్టర్ చట్టం (1813):
దీని ద్వారా ఈస్టిండియా కంపెనీ చార్టర్‌ను మరో 20 ఏండ్లు పొడిగించారు. తేయాకు, చైనాతో వ్యాపారం మినహా కంపెనీకి వర్తకంపైగల గుత్తాధిపత్యాన్ని తొలగించి ప్రతి బ్రిటన్ పౌరుడికి వర్తకం చేసుకునే అవకాశం కల్పించి కంపెనీని కేవలం పరిపాలనాపరమైన సంస్థగా మార్చారు.
-భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి ఏడాది రూ. లక్ష కేటాయించేలా ఏర్పాటు చేశారు. సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. ఈస్టిండియా కంపెనీలో భారతీయులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
-ఈ చట్టం ద్వారా భారత్‌కు క్రిస్టియన్ మిషనరీలు రావడానికి అనుమతించడంతో చర్చిలు, విద్యాలయాలు, ఆస్పత్రులు స్థాపితమయ్యాయి. దీంతో మతమార్పిడులకు అవకాశం ఏర్పడింది.
చార్టర్ చట్టం (1833):
దీని ద్వారా ఈస్టిండియా కంపెనీ చార్టర్‌ను మరో 20 ఏండ్లు పొడిగించారు. ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి భారత్ గవర్నర్ జనరల్‌గా మారింది. దీంతో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారత మొదటి గవర్నర్ జనరల్ అయ్యాడు.
-ఈస్టిండియా కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి పరిపాలనా సంస్థగా మార్చారు. యూరోపియన్లు భారత్‌కు వలసవచ్చేందుకు, భూమి, ఆస్తులు సంపాదించుకునేందుకు ఉన్న నియంత్రణలను తొలగించి వారికి పూర్తిస్వేచ్ఛ కల్పించారు. దీంతో బ్రిటిష్ వలసరాజ్య స్థాపనకు చట్టబద్దత కల్పించినట్లయ్యింది.
-భారతీయ పాలనలో కోవనెంటెడ్ పోస్టుల్లో మెరిట్ కలిగిన భారతీయులను నియమించాలని రాజారామ్మోహన్ రాయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సివిల్ సర్వీసుల నియమకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డెరెక్టర్స్ వ్యతిరేకించడంతో కొంతమేరకు పురోగతి సాధించింది.
-భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్‌ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
చార్టర్ చట్టం (1853):
చార్టర్ చట్టాల్లో ఇది చివరిది. ఈసారి కంపెనీ పాలనను పొడిగించలేదు. బ్రిటన్ పార్లమెంట్ అనుమతి ఉన్నంతవరకు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశం కల్పించారు. దీంతో కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని సూచించినట్లయ్యింది.
-గవర్నర్ జనరల్ సాధారణ మండలి అధికారాలను శాసన, కార్యనిర్వహణ విధులుగా విభజించారు. శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం మొదటిసారిగా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని మినీ పార్లమెంట్ అంటారు.
మాదిరి ప్రశ్నలు
1. పార్లమెంటులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ఎంపికైనవారు?
1) శరద్ పవార్ 2) దిగ్విజయ్ సింగ్ 3) వెంకయ్యనాయుడు
4) మల్లికార్జున ఖర్గే
2. ఎవరికి ప్రోత్సాహం అందిచడం కోసం సామాజిక మాధ్యమం గూగుల్ సాల్వ్ ఫర్ ఇండియాను ప్రారంభించింది?
1) ఇంజినీర్స్ అండ్ డెవలపర్స్
2) ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ డెవలపర్స్
3) డిజైనర్స్ అండ్ డెవలపర్స్
4) ఏదీకాదు
3. కెనడాలో జరుగనున్న టెడ్ (టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, డిజైన్) టాక్స్‌లో మాట్లాడనున్న మొదటి భారతీయ నటుడు ఎవరు?
1) షారుఖ్ ఖాన్ 2) అమితాబ్ బచ్చన్ 3) రణ్వీర్ సింగ్ 4) ఆమిర్ ఖాన్
4. ప్రపచంలో తొలిసారిగా లోహాల తవ్వకంపై నిషేధం విధించిన దేశం ఏది?
1) పాకిస్థాన్ 2) ఎల్‌సాల్వెడార్
3) కెన్యా 4) లిబియా
5. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2017లో ఉత్తమ చిత్రంగా జ్యూరీ ప్రైజ్‌ను గెలుచుకున్న చిత్రం ఏది?
1) కోర్ట్ 2) న్యూటన్
3) పార్చుడ్ 4) పెడ్లర్స్
6. ఆసియా 7వ వార్షిక అవార్డుల్లో భాగంగా రైజింగ్ స్టార్ పురస్కారానికి ఎంపికైన బాల నటుడు?
1) సన్నీ పవార్ 2) హర్షలీ మల్హోత్రా
3) ఆయుష్ మహేష్ ఖేడేకర్
4) విజయ్ శేఖర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు