బాలలకు హక్కులేముంటాయ్..?
బాలలు అంటే 18సంవత్సరాలలోపు వారు. బాలల హక్కులను తొలిసారిగా నానాజాతి సమితి 1924లో ప్రకటించింది. పుట్టుకతోనే బాలలకు హక్కులు ఉంటాయని వాటిని ప్రతి రాజ్యం గుర్తించి కాపాడాలని పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థను, బానిసత్వాన్ని, పిల్లల వ్యభిచారాన్ని, పిల్లల క్రయవిక్రయాలను నిషేధించాలని పేర్కొంది. 1945 అక్టోబర్ 24న ఏర్పడిన ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 10న విశ్వమానవ హక్కులను ప్రకటించింది. దీనిలో బాలల హక్కులు కలిసి ఉన్నాయి. 1959 నవంబర్ 20న ఐక్యరాజ్యసమితి బాలల హక్కులను ప్రకటించింది. (నవంబర్ 20ని బాలల హక్కుల దినోత్సవంగా జరుపుతారు)
- జాతి, మత, అంతస్తు, భాష, సంపద, జనన విచక్షణలు పాటించరాదు.
- పిల్లలు పుట్టినప్పుడే స్పష్టమైన జాతీయత ఉండాలి.
- పిల్లలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి.
- పిల్లలకు సాంఘిక భద్రత, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలి.
- ప్రాథమిక దశ వరకు పిల్లలకు ఉచిత విద్యను అందించాలి.
- పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో సక్రమంగా పెరగాలి.
- పిల్లలను జాతి, మతాలకు దూరం గా పెంచాలి.
- రక్షణ, ఆపద సమయంలో పిల్లలకు ప్రథమ స్థానం కల్పించాలి.
- పిల్లలు నిర్లక్ష్యానికి, దోపిడీకి గురి కాకుండా చూడాలి.
- చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ CRCబాలల హక్కుల ఒడంబడిక-
- 1979వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంవత్సరం గా ప్రకటించింది.
- 1979 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పోలెండ్ దేశంలో సమావేశమై బాలల హక్కులపై ఒక ముసాయిదాను రూపొందించింది. దీనినే CRC అంటారు.
ఈ CRCని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1989 నవంబర్ 20న ఆమోదించింది. అందుకే నవంబర్ 20ని బాలల హక్కుల పరిరక్షణ దినంగా జరుపుకొంటారు. CRC 1990 సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. CRC పై భారత్ 1992 డిసెంబర్ 11న సంతకం చేసింది. మొదటి భాగంలో 1-41 నిబంధనలు కలవు. 18 సంవత్సరాల్లోపు పిల్లలకు హక్కులు అమలు చేయడానికి అనుసరించాల్సిన మార్గాలను పేర్కొన్నారు.
రెండో భాగంలో 42-45 నిబంధనలు కలవు. CRC ని ఆమోదించిన దేశాల బాధ్యత గురించి పేర్కొన్నారు.
మూడో భాగంలో 46-54 నిబంధనలు కలవు. CRC అమలు, అమలు చేయడంలో ఐక్య రాజ్యసమితి, ప్రధాన కార్యదర్శి, భద్రతామండలి పాత్ర గురించి పేర్కొన్నారు.
CRC బాలల హక్కులను 4 రకాలుగా పేర్కొన్నారు. అవి.
1. మనుగడ పొందే హక్కు (Right Survive)
బిడ్డ జీవించడానికి కావాల్సిన ఆరోగ్యం పౌష్టికాహారం జీవన మనుగడకు సంబంధించిన హక్కు. ఐక్యరాజ్యసమితి ఒడంబడికలోని ప్రకరణ (6)లో బాలలందరికీ జీవించే హక్కు ఉంది. అందుకే పిల్లల సంక్షేమానికి, అభివృద్ధికి రాజ్యం కృషి చేస్తుంది. ప్రకరణ 24 రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు వారికి ఉంది. వారి రోగ నివారణకు, పౌష్టికాహారాన్ని తల్లుల కోసం అందించి ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య జాగ్రత్తలను బాలలకు తల్లిదండ్రులకు తెలుపుతుంది.
2. రక్షణ పొందే హక్కు (Right Protection)
బిడ్డ పుట్టకముందు, తర్వాత పొందాల్సిన రక్షణను తెలియజేస్తాయి. దీని ప్రకారం 2, 19, 32, 33, 34, 36, 37, 38, 39, 40 ప్రకరణలో తెలిపారు.
ప్రకరణ 2: జాతి, వర్గం, వంశం, సాంఘిక పునాది లాంటి అనేక వివక్ష లేకుండా పిల్లలందరూ సమానమైన హక్కులు పొందాలి.
ప్రకరణ 19: పిల్లల భౌతిక, మానసిక హింస, ప్రమాదం, బూతు సంస్కృతి నుంచి రాజ్యం రక్షణ కల్పిస్తుంది. వారి సంరక్షణకు, తల్లిదండ్రులకు, పిల్లలకు సహకరిస్తూ సాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ప్రకరణ 32: రాజ్యంలో పిల్లలను ఆర్థిక అసమానతల నుంచి, సామర్థ్యపు విరోధమైన అంటే విద్యకు భంగం కలిగించే మత్తు పదార్థాలు, మానసిక వ్యాధులను కలిగించే పదార్థాల నుంచి బాలలను రక్షిస్తుంది.
ప్రకరణ 34: వ్యభిచారం, అసభ్యకర చిత్రాలు, చట్టవిరుద్ధమైన లైంగిక అలవాట్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ప్రకరణ 35: బాలలను అమ్ముకోకుండా, అపహరించకుండా రక్షణ కల్పిస్తుంది.
ప్రకరణ 37: పిల్లలను హింసాకరమైన, క్రూరమైన, నిర్ణయాత్మకమైన శిక్షల నుంచి కాపాడుతుంది. 18 సంవత్సరాల లోపు బాలలను పెద్దశిక్షలకు గురిచేయడం, నిర్భంచడం, చట్టానికి విరుద్ధంగా వారి స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగించడం, వారి కుటుంబం నుంచి స్వతంత్రతను కోల్పోవడం, వీటన్నింటిని రాజ్యం నిరోధిస్తుంది.
ప్రకరణ 38: యుద్ధ సమయాల్లో పిల్లలను రక్షించే బాధ్యత రాజ్యానిదే. 15 సంవత్సరాలోపు వారిని మిలిటరీ బలవంతపెట్టడాన్ని రాజ్యం అడ్డుకుంటుంది.
ప్రకరణ 39: రాజ్యం బాలలకు ఆరోగ్యాన్ని, ఆత్మాభిమానాన్ని, హోదాను కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. వారికి జాతీయ, మానసిక సాంఘిక పరమైన విషయాల్లో దృష్టిని సారించడానికి అవకాశం కల్పిస్తుంది.
ప్రకరణ 40: బాలలు ఇతరుల స్వాతంత్య్రానికి, హక్కులకు భంగం కలిగించే పని చేసినా, లేదా చట్టవిరుద్ధమైన పని చేసినా, వారు మానసిక పరంగా తెలుసుకునేలా శిక్షిస్తుంది. పరిస్థితులకనుగుణంగా వారికి జాగ్రత్తను మార్గాన్ని, విద్యను, వృత్తిపరమైన ట్రైయినింగ్ కార్యకలాపాలను ఉపయోగకరంగా ఉండే సంస్థలను ఏర్పాటు చేస్తుంది.
3. అభివృద్ధి చెందే హక్కు (Right to Development)
బిడ్డ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి మూర్తి మత్వాన్ని పొందడానికి కావాల్సిన హక్కు. ఇవి ఐక్యరాజ్యసమితి ఒడంబడికలో ని ప్రకరణలు 28, 29, 31లో తెలిపారు.
ప్రకరణ 28: పిల్లలకు చదువుకునే హక్కు ఉంది. రాజ్యం వారికి ప్రాథమిక విద్యను అందివ్వడం చాలా అవసరం.
ప్రకరణ 29: బాలల విద్య వారి వ్యక్తిత్వానికి, స్వభావానికి సూచికగా, స్నేహభావంతో ఈ సంఘంలో ఒక బాధ్యతాయుత జీవితానికి ఈ బాలలు సిద్ధమవుతారు.
ప్రకరణ 31: బాలలు తమ వయస్సుకు తగినట్లుగా అన్ని విషయాల్లో చురుకుగా పాల్గొనే హక్కు ఉంది. రాష్ట్రం వారి సాంస్కృతిక, కళాత్మక అవకాశాలకు సమానతను కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది.
4. పాల్గొనే హక్కు (right to Particpation)
స్వేచ్ఛగా భావ ప్రకటన చేసుకునే విధంగా, న్యాయ పరిపాలనల అంశాల్లో బిడ్డ భావాలను గౌరవించే విధానానికి సంబంధించింది. ఇవి ఐక్యరాజ్యసమితి ఒడంబడికలోని ప్రకరణలు 13, 14, 15, 16, 17లో పొందుపరిచారు.
ప్రకరణ 13: జాతీయ రక్షణశాఖ జోక్యం కల్పించు కున్నప్పుడు తప్ప ఎప్పుడైనా పిల్లలు తమ భావాలను స్వతంత్రంగా చెప్పే హక్కు ఉంది.
ప్రకరణ 14: తల్లిదండ్రులతో లేదా సంరక్షకులతో ఉన్నప్పుడు వారికి సొంత ఆలోచన న్యాయబద్ధత కలిగి ఉండే హక్కు ఉంది.
ప్రకరణ 15: పిల్లలు ఇతరులతో సహవాసం చేసే స్వతంత్రపు హక్కు, శాంతి సమూహంగా ఏర్పడే స్వతంత్రపు హక్కు ఉంది. ఇది ప్రజారక్షణ, జాతీయ సంరక్షణ శ్రద్ధతో ఒక హద్దుగా ఉంటుంది.
ప్రకరణ 16: బాలల వ్యక్తిగత, కుటుంబం, ఇంటి విషయాల్లో జోక్యం లేకుండా, వారి గౌరవానికి, అభిప్రాయానికి హాని కలగకుండా రక్షణ పొందే హక్కు ఉంది. చట్టం ఈ హక్కును కాపాడుతుంది.
ప్రకరణ 17: బాల కార్మికులకు జాతీయ, అంత ర్జాతీయ పరంగా ప్రవేశం ఉంది. పిల్లల మనస్సుకు హాని చేసే సమాచారం కాకుండా తన భాషలో పుస్తకాలను ప్రచురించడానికి, వారి ప్రయోజనం కోసం సమాచారాన్ని వ్యాపింపజేయడానికి రాజ్యం ప్రోత్సహిస్తుంది.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను 2007 మార్చిలో ఏర్పాటు చేశారు. ఇది ఒక చట్టపరమైన సంస్థ. దీనికి సంబంధించి పార్లమెంటు 2005లో బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించింది. 18సంవత్సరాల వయస్సు లోపల బాలలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ సంఘం తొలి చైర్మన్ శాంతాసిన్హా.
ఎన్సీపీసీఆర్ విధులు
- బాలల కోసం అమలవుతున్న వివిధ రక్షణలను, సౌకర్యాలను పరిశీలించి సమీక్ష చేసి తగిన సిఫారసులను చేస్తుంది.
- బాలల హక్కులు, మతఘర్షణ, గృహహింస, లైంగికదాడులు, వేధింపులు మొదలైన సమస్యలపై తగిన పరిష్కారాలను సూచిస్తుంది.
- బాలల హక్కులకు సంబంధించిన ఒప్పందాలను, చట్టాలను, పథకాలను, కార్యక్రమాలను అధ్యయనం చేసి సమర్థవంతంగా అమలు చేయడానికి సిఫారసులు చేస్తుంది.
- బాలల హక్కులపై పరిశోధన, హక్కులపై అవగాహన కల్పించడానికి సెమినార్లు, చర్చావేదికలు నిర్వహిస్తుంది.
- బాల నేరస్థుల జైళ్లను సందర్శించి వారికి కల్పిస్తున్న వసతులపై ప్రభుత్వాలకు నివేదికలు ఇస్తుంది.
- బాలల హక్కులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది.
- కమిషన్కు సివిల్ కోర్టుకు ఉన్న ఇతర అధికారాలు ఉంటాయి.
బాల కార్మిక చట్టాలు
- చైల్డ్ యాక్ట్ 1933 – కనీస వయస్సు 15 – పిల్లల శ్రమను తాకట్టు పెట్టే ఒప్పందం నిషేధం.
- ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 – కనీస వయస్సు 14 – ఇంధనంతో 10 మంది కంటే ఎక్కువ మంది కార్మికులతో నడిచే ఫ్యాక్టరీలు / ఇంధనం లేకుండా 20 మందితో నడిచే ఫ్యాక్టరీలు
- ఫ్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951 – కనీస వయస్సు 14 – తేయాకు, కాఫీ, రబ్బరు, సింకోరా, యాలకులు వంటి 5 హెక్టార్ల తోటలు 15 మంది వ్యక్తులు పనిచేసేవి.
- మైన్ యాక్ట్ – కనీస వయస్సు 16/18 – భూగర్భ గనులు అన్ని రకాల పనులు
- బీడీ, సిగార్ వర్కర్ యాక్ట్ 1986 – కనీస వయస్సు 14 – పరిశ్రమ ఆవరణలో బీడీల తయారీ కేంద్రాలు
- బాల కార్మిక చట్టం 1986 – కనీస వయస్సు 14 – షెడ్యూల్లోని కొన్నిరకాల వృత్తులు, పనులు
- ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1986 – కనీస వయస్సు 14 – అన్ని రకాల షాపులు, దుకాణాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు