క్యాంపస్ ప్లేస్మెంట్ పొందేందుకు చిట్కాలు..
నేటి పోటీ ప్రపంచంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. దశాబ్దం క్రితం చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఉద్యోగవేట మొదలుపెట్టేవారు. ఇప్పుడు నచ్చిన కోర్సులో చేరుతూనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కృషిచేస్తున్నారు. మెరికల్లాంటి ఉద్యోగుల కోసం అనేక సంస్థలు కూడా కాలేజీల నుంచే తమకు కావాల్సిన టాలెంట్‌ను వెతికిపట్టుకుంటున్నాయి. ఆ వేదికలే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. మంచి పేరున్న కాలేజీల్లో చురుకైన విద్యార్థులకు కంపెనీలు ఎంత వేతన ప్యాకేజీలు ఇచ్చేందుకైనా వెనుకాడటంలేదు. అయితే, ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లపై మారుతున్న టెక్నాలజీ, ప్రపంచ ఆర్థిక స్థితిగతులు ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ల తీరుతెన్నులపై నిపుణ సలహాలు, సూచనలు..
ఈ స్కిల్స్ మీలో ఉన్నాయా?
-కొత్త నైపుణ్యాలను అందుకొని, వాటిని వేగంగా అచరణలో పెడుతూ లక్ష్యాలను అందుకోగలిగేవారికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుంది. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకునేవారిపట్ల ఇంటర్వ్యూయర్లు ఆసక్తి చూపుతారు. కాబట్టి వేగంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అనేది క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు కీలకంగా భావించాలి.
-ఓ ఎంప్లాయీగా కేటాయించిన పనికే పరిమితం కాకుండా సవాళ్లను స్వీకరించే సాహసం కూడా కలిగిఉండాలి. ఎవరైతే పనిచేయడానికి ముందుకువస్తారో అలాంటి వ్యక్తులు కచ్చితంగా కంపెనీ లక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కంఫర్ట్ జోన్‌కే పరిమితం కాకుండా సవాళ్లు స్వీకరించేవారి వైపు ఇంటర్వ్యూయర్లు ఆసక్తి కనబరుస్తారు.
-ఔత్సాహిక అభ్యర్థుల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. సమస్య ఏదైనా పరిష్కారమార్గాల కోసం అన్వేషించగలుగుతారు. అలాంటి అభ్యర్థులు కంపెనీ విశ్వాసం పొందగలుగుతారు. నిజాయితీ, పట్టుదల, కష్టపడేతత్వం ఉన్న అభ్యర్థులు అనేక ప్రయోజనాలు పొందగలుగుతారు.
-ఇంటర్వ్యూయర్లను ఆకర్షించే అంశాల్లో టీమ్ వర్క్ ఒకటి. సహోద్యోగులతో కలిసి పనిచేస్తూ, అర్థం చేసుకుంటూ సంస్థను ప్రభావితం చేయగలిగే స్పిరిట్‌ను కూడా కలిగి ఉండాలి.
-భావ వ్యక్తీకరణ అనేది చాలా ముఖ్యమైంది. అభ్యర్థి ఇంటర్వ్యూ సెలక్షన్స్‌లో భాషపై పట్టు సాధించడం ముఖ్యం.
ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని
-మీ గురించి చెప్పండి? ( పేరు, అర్హతలు, కెరీర్ ప్లాన్స్)
-ఇష్టాయిష్టాలు (అభిరుచులు, అలవాట్లు)
-బలాలు బలహీనతలు (లిజనింగ్ స్కిల్స్, హై ఎనర్జీ లెవల్స్, ఎబిలిటీ, బెస్ట్ ఫీడ్‌బ్యాక్)
-లక్ష్యాలు (ఉదా: భవిష్యత్తులో కంపెనీ సీఈవో స్థాయికి ఎదగడం)
-గత ఐదేళ్లలో సాధించిన విజయాలు
-రోల్‌మోడల్ ఎవరు (తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు)
-జీవితంలో మరిచిపోలేని సందర్భం (స్కూలింగ్, కాలేజ్ డేస్‌లో మరిచిపోలేని విషయం)
-స్కూల్, కాలేజీ లైఫ్‌కు మధ్య తేడా (మెచ్యూరిటీ, మెంటల్ గ్రోత్, బాధ్యతలు, కెరీర్ ప్లాన్)
-టీమ్‌తో కలిసి పనిచేయగలరా (బృందంతో విజయాలు సాధించడం)
-భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివేందుకు ప్లాన్ చేస్తున్నారా?
-సక్సెస్ అంటే?
బెస్ట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
చదువుతోపాటు ఉద్యోగ అవకాశాలనూ పొందేందుకు చాలామంది విద్యార్థులు బెస్ట్ కాలేజీలను ఎంచుకుంటారు. కానీ మెరుగైన విద్యావకాశాలు అందిస్తూ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే కాలేజీలను సెలక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ప్లేస్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే కాలేజీల్లో చదువును కొనసాగించడం ద్వారా భారీ ప్యాకేజీల్లో వేతనాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నిపుణుల అభిప్రాయం.
-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)
-బిట్స్, అమృత, వీఐటీ, మణిపాల్ వంటి విద్యాసంస్థల్లో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసినవారికి క్యాంపస్ ప్లేస్మెంట్లలో భారీ వేతనాలు ఇస్తూ ఎంపిక చేసుకుంటున్నాయి.
ప్రిపరేషన్‌ను త్వరగా ప్రారంభించండి
చాలామంది స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు ఎంపిక కాకపోవడానికి ప్రధాన కారణం ప్రిపరేషన్‌ను ఆలస్యంగా ప్రారంభించడం. ప్లేస్‌మెంట్‌కు కొద్దిరోజుల ముందు ప్రిపేర్ కావడమనేది సరైంది కాదని ఇంటర్వ్యూయర్ల అభిప్రాయం. కాబట్టి సెకండియర్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అనేక ప్రయోజనాలు పొందుతారు. ముందుగా సంసిద్ధం కావడంతో ఒత్తిడి దూరమై కాంపిటీషన్లో ముందుంటారు. ముందే ప్రిపేరై ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూయర్లు అడిగే ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానాలు ఇవ్వగలుగుతారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పొందడంలో ముందుంటారు.
ప్రాథమికాంశాలు బలంగా
చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే సరైన బేసిక్ లేకపోవడమే. బేసిక్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇంజినీరింగ్ బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్టులను తప్పనిసరిగా రివైజ్ చేస్తుండాలి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ అయితే ఎలక్ట్రికల్ నెట్‌వర్క్‌ను అనాలసిస్ చేయడం, ఫీల్డ్వర్క్తోపాటు థియరీపై స్కిల్స్ కలిగి ఉండాలి. ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రతి అంశం తెలిసి ఉండటం ఆ అభ్యర్థికి ఎంతో అవసరం. ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నప్పుడే పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్, రాతపరీక్షలో ప్రతిభ చూపించగలుగుతారు. అభ్యర్థులకు ప్రధాన సబ్జెక్టులతో పాటు బేసిక్స్ కూడా అవసరం.
సబ్జెక్టులపై పట్టుందా?
ఉదాహరణకు.. ఐటీ సెక్టార్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ రంగంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డిమాండ్ దృష్ట్యా క్యాంపస్ ప్లేస్మెంట్లకు ఐటీ విభాగానికి చెందిన కంపెనీలే ఎక్కువగా రిక్రూట్మెంట్స్ నిర్వహిస్తుంటాయి. కాబట్టి ఆయా కంపెనీలు ఆశించే స్కిల్స్ మీలో ఉన్నాయా.. లేదా? చెక్ చేసుకోవాలి. ఐటీపై పట్టున్నవారికే (సీ-లాంగ్వేజ్, డాటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్) ఇంటర్వ్యూయర్లు మొగ్గు చూపుతుంటారు. ఈ సబ్జెక్టులోని ప్రధాన టాపిక్స్ పూర్తిగా నేర్చుకొని ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ మల్టీపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నప్పటికీ ఒక్క సబ్జెక్టుపై పట్టు లేకపోవడం ప్రతికూలతకు దారితీస్తుంది. ఏదైనా ఒక లాంగ్వేజ్‌పై పట్టు సాధించడం కూడా ముఖ్యం. సీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (Dennis.M.Ritchie) బుక్‌లోని సమస్యలను సాల్వ్ చేయడం ద్వారా సీ ప్రోగ్రామింగ్‌లో స్కిల్స్ పొందవచ్చు.
సాల్వ్ ది ప్రాబ్లమ్స్
కొన్ని కంపెనీలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్మెంట్లలో భాగంగా రాతపరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. అందులో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్దిపాటి సమయంలోనే ఫాస్ట్‌గా ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేసే స్కిల్స్ ఉండాలి. అందుకోసం ప్రతిరోజు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్‌ను సాధన చేస్తుండాలి. అయితే ఒక బుక్ నుంచి కాకుండా వివిధ రకాల మ్యాథమెటిక్స్ బుక్స్ నుంచి ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తుండటం ద్వారా పట్టు సాధిస్తారు. ముఖ్యంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్‌పై పూర్తి అవగాహన ఉండాలి. ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తుండటమే కాకుండా ఇతరులకు బోధించడం ద్వారా కూడా సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. ప్రిపరేషన్ సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ కఠినమైన ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల మరింత పట్టు సాధించవచ్చు.
ముందే తెలుసుకోండి
క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందే తెలుసుకోవాలి. గతంలో ప్లేస్‌మెంట్‌కు హాజరైన సీనియర్నో, ప్లేస్మెంట్ అధికారినో వివరాలను అడిగి తెలుసుకోవడం చాలా అవసరం. ఏయే కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించనున్నాయో (ఉదా: ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఎబీబీ, ఎల్ అండ్ టీ వంటివి) ఆయా కంపెనీల సమాచారం, సాధారణంగా కంపెనీలు అడిగే ప్రశ్నలేంటి? వంటివి తెలుసుకోవడం ద్వారా ప్లేస్మెంట్ ఎంపికకు మార్గం సుగమమవుతుంది.
ఇష్టమైన సబ్జెక్టు ఏమిటి?
క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూయర్లు అడిగే ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి ఇష్టమైన సబ్జెక్టు ఏమిటి? అని. కాబట్టి మీకు ఇష్టమైన సబ్జెక్టు ఏంటో చెప్పేముందు నిజంగా ఆ సబ్జెక్టుపై ఆసక్తి ఉందనే నమ్మకం ఇంటర్వ్యూయర్లకు కల్పించాలి. ఆ సబ్జెక్టుపై వారు అడిగిన ప్రశ్నకు సమాధానం కరెక్ట్ అయినా, తప్పయినా ధైర్యంగా చెప్పగలగాలి. అప్పుడు ఆ సబ్జెక్టుపై పట్టు ఉందని ఇంటర్వ్యూయర్లు నమ్ముతారు. ఇష్టమైన సబ్జెక్టుతో పాటు సబ్జెక్టుకు సంబంధించిన అంశాల్లోనూ ఇంటర్వ్యూయర్లు ప్రశ్నలు అడుగుతారు.
ప్రొఫెషనల్‌గా..
ఇంటర్వ్యూకు డ్రెస్‌కోడ్ ముఖ్యమనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూయర్లు అభ్యర్థి డ్రెస్‌కోడ్‌ను పరిశీలిస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో కావాలి.
-డ్రెస్సు శుభ్రంగా ఉతికి ఐరన్ చేసుకోవాలి.
-అసౌకర్యంగా ఉన్న దుస్తులు, షూ వేసుకోవద్దు, ఎందుకంటే అవి ఇంటర్వ్యూ సమయంలో ఏకాగ్రతను దెబ్బతీస్తాయి.
-నలిగిపోయిన, సరిగా ఉతకని బట్టలను వేసుకుంటే నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తాయి.
-దుస్తుల రంగులు ఆకట్టుకునేలా ఉండాలి.
-షూ శుభ్రంగా ఉండాలి. చూడగానే ప్రొఫెషనల్‌గా కనిపించాలి.
-సిన్సియర్ లుక్ కనిపించాలంటే హుందాగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. శరీరానికి అతికినట్లుగా ఉండాలి
-అమ్మాయిలు ప్యాంట్‌సూట్స్ తరహా ైస్టెల్ ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. పెన్సిల్ కట్ స్కర్ట్స్ వేసుకున్నా బాగుంటుంది.
-కార్పొరేట్ కల్చర్‌కు అనుగుణంగా దుస్తుల ఎంపిక ఉండాలి.
ప్లేస్‌మెంట్‌కు ముందు
-కంపెనీల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం
-భవిష్యత్తు ప్రయోజనాలు ఏంటి?
-సాధారణంగా ఇంటర్వ్యూయర్లు అడిగే ప్రశ్నలేంటి?
-క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగే ప్రక్రియపై సరైన అవగాహన
-క్యాంపస్ ప్లేస్మెంట్ ముఖ్య ఉద్దేశాలేంటి?
పర్సనల్ ఇంటర్వ్యూలో
-హుందాగా ఉండటం
-డ్రస్ అప్పియరెన్స్
-మానసికంగా సంసిద్ధంకావడం
-బాడీ లాంగ్వేజ్
-క్రమశిక్షణగా ఉండటం
-ఇంటర్వ్యూయర్లు అడిగే ప్రశ్నలకు చురుగ్గా సమాధానాలివ్వడం
-ఉద్యోగానికి కావాల్సిన ప్రాథమిక అర్హతలు
గ్రూప్ డిస్కషన్స్
-ఆలోచనలను పంచుకోవడం
-ఇతరులతో కమ్యూనికేట్ కావడం
-మీదైన స్టయిల్లో సమాధానాలివ్వడం
-ఆమోదమైన అంశాల పట్ల సానుకూలంగా స్పందించడం
-త్వరగా సమస్యలను పరిష్కరించే నేర్పు కలిగి ఉండటం
క్యాంపస్ ప్లేస్మెంట్ విధానం
-ప్రీ ప్లేస్మెంట్ టాక్ (పీపీటీ)
-రెజ్యూమే పరిశీలన, తుది ఎంపిక
-ఆప్టిట్యూడ్ టెస్ట్
-గ్రూప్ డిస్కషన్
-పర్సనల్ ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూయర్లతో ముఖాముఖి
-ఫైనల్ సెలక్షన్
-చివరగా ఆఫర్ లెటర్ పొందడం
రిజెక్ట్ కావడానికి కారణాలు
-ప్లేస్‌మెంట్‌పై అవగాహన లేకపోవడం
-ఉత్సాహం చూపించకపోవడం
-సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం
-భవిష్యత్తు పట్ల కచ్చితమైన అభిప్రాయం లేకపోవడం
-ఇంటర్వ్యూయర్లు అడిగిన ప్రశ్నలకు చురుగ్గా సమాధానాలు ఇవ్వలేకపోవడం
ఇంటర్న్‌షిప్‌తో మరిన్ని అవకాశాలు
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసినవారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. చివరి సెమిస్టర్ కంటే ముందే ఏదైనా ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తోపాటు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇది కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటర్న్‌షిప్‌తో ప్లేస్మెంట్తోపాటు పేరొందిన సంస్థల్లో భారీ ప్యాకేజీల్లో వేతనాలు పొందవచ్చు. ఇంటర్న్‌షిప్ చేయడానికి చాలా కంపెనీలు ఆహ్వానం పలుకుతున్నాయి. అభ్యర్థులు www.internshala.com లేదా మరికొన్ని వెబ్సైట్లకు రెజ్యూమేను ఫార్వర్డ్ చేసి ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు