ఆంగ్లో-ఓరియంటల్ కళాశాలను ఎవరు స్థాపించారు?
గతవారం తరువాయి..
మేడం బ్లావట్స్కీ, కల్నల్ ఓల్కాట్ 1875లో న్యూయార్క్‌లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు.
1882లో ఈ శాఖ కార్యాలయాన్ని మద్రాస్ వద్దగల అడయార్‌కు మార్చారు.
ఈ సమాజ సభ్యులు అన్ని మతాలను దైవిక సంబంధమైన విజ్ఞానానికి చిహ్నాలుగా గౌరవించారు. బలవంతంగా మతమార్పిడి విధానాన్ని వీరు వ్యతిరేకించారు. హిందూమత పునరుద్ధరణ వీరి ఆశయం. పునర్జన్మను నిర్ణయించడంలో ఆత్మ దేహాంతర సిద్ధాంత ప్రభావాన్ని వారు నమ్మారు.
1889లో అనీ బీసెంట్ దివ్యజ్ఞాన సమాజంలో సభ్యత్వాన్ని స్వీకరించారు. వేదాలు, ఉపనిషత్తుల్లో విశ్వాసాన్ని ప్రకటించి, వేదాంతాన్ని ప్రచారం చేశారు.
ప్రాచీన భారతీయ సంస్కృతికి ఆకర్షితులై భారతదేశంలో స్థిరపడ్డారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం చేశారు. ఈమె చాలా విద్యాసంస్థలను ప్రారంభించారు.
1907లో ఓల్కాట్ చనిపోవడంతో అనీ బీసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలు అయ్యారు.
1898లో బెనారస్‌లో హిందూ కాలేజీని నెలకొల్పారు. అక్కడ హిందూ మతాలు, పాశ్చాత్య సైన్స్ సబ్జెక్టులు బోధించారు. అదే 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీ అయ్యింది.
అనీ బీసెంట్ విద్య, దివ్యజ్ఞాన సమాజం, రాజకీయాల గురించి చాలా పుస్తకాలు రాశారు.
1916లో హోంరూల్ లీగ్‌ను స్థాపించి, న్యూ ఇండియా, కామన్ వీల్ పత్రికలను ప్రారంభించారు.
భారత స్వాతంత్య్ర సమరంలో ఆమె నిర్వహించిన పాత్ర, ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలు ఆమె ప్రతిష్ఠను ఇనుమడింపజేశాయి.
రామకృష్ణ పరమహంస మహా విజ్ఞాని. ఉదార భావాలు కలవాడు. కాళీ భక్తుడు. మహ్మదీయ, క్రైస్తవ మతాచార్యులతో కలిసి స్వేచ్ఛగా చర్చలు జరిపారు.
అన్ని మతాలు ఒకే దేవుడిని చేరడానికి భిన్న మార్గాలను నమ్మాడు.
విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడమే రామకృష్ణుని దృష్టిలో మతం అని చెప్పవచ్చు.
రామకృష్ణ పరమహంస ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, స్వశక్తి పట్ల విశ్వాసాన్ని పెంపొందించారు.
కర్మకాండపై ఆధారపడకుండా ప్రార్థన ప్రాముఖ్యతను స్పష్టీకరించాడు.
మానవ సేవే మాధవ సేవ అని బోధించే సాంఘిక సంస్కరణలను సమర్థించారు.
రామకృష్ణ పరమహంస విశ్వవ్యాప్త ఆధ్యాత్మికతత్వం భారతీయుల్లో విశాల భావాల్ని పెంపొందించింది.
మానవాళి అభ్యుదయానికి పాటుపడటం కోసం, సమాజ సేవ కోసం వివేకానందుడు 1896లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు.
పాశ్చాత్య నాగరిక, నాస్తిక భావాల ప్రభావం నుంచి భారతదేశాన్ని కాపాడటమే ఈ సంస్థ ముఖ్య ఆశయం.
ఈ సంస్థ హిందూమతంలోని విగ్రహారాధనను, బహుదేవతారాధనను స్వీకరించింది.
దేశంలో పలు ప్రాంతాల్లో ఈ సంస్థ శాఖోపశాఖలుగా అల్లుకుంది. ఆస్పత్రులను, పాఠశాలలను, కళాశాలలను, గ్రంథాలయాలను, అనాథ శరణాలయాలను తెరిచి సమాజ సంక్షేమ సేవను కొనసాగిస్తుంది.
ముక్తిని సాధించుకోవడానికి, సాధన చేసుకోవడానికి, సమాజంలో మంచిని పెంచడానికి ఈ సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది.
అమెరికా, ఐరోపా ఖండాల్లోని చాలా నగరాల్లో రామకృష్ణ మఠం శాఖలను వేదాంత తత్వాన్ని ప్రజలకు విశదీకరించాలనే లక్ష్యంతో స్థాపించారు.
కరువు వల్ల, వరదల వల్ల ప్రజలు బాధపడుతున్నప్పుడు రామకృష్ణ మఠం చాలా సేవ చేసింది.
రామకృష్ణ పరమహంస మేటి శిష్యుడు వివేకానందుడు. సాంఘిక, మత రంగాల్లో గొప్ప సంస్కర్త.
రామకృష్ణ పరమహంస ఇచ్చిన గురూపదేశాన్ని వివేకానందుడు భారత్‌లోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా ప్రచారం చేశాడు.
వేదాంతం గురించి ఆయన చేసిన గంభీరోపన్యాసాలు, పాశ్చాత్యులను ప్రభావితం చేశాయి.
1893, సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మత మహాసభల్లో హిందూ మతం గురించి ఆయన చేసిన గంభీరోపన్యాసం, పాశ్చాత్య విజ్ఞానుల్లో సంచలనాన్ని రేకెత్తించింది.
స్వామి వివేకానంద తరచూ అమెరికా, ఇంగ్లండ్ మొదలైన దేశాల్లో పర్యటించి ఉపన్యసించాడు.
ఆ దేశాల్లో భారతదేశ రాయబారిగా వ్యవహరించాడు. నిస్వార్థంగా దేశ సేవకు అంకితమైన యువకులకు శిక్షణ ఇవ్వడానికి, బేలూరు వద్ద రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు.
వివేకానందుడు సాంఘిక న్యాయం, సంస్కరణల ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరిచాడు.
స్వశక్తిపైనే ఆధారపడటాన్ని ప్రబోధించాడు. పేదవారికి అండగా నిలిచాడు.
పేదరికాన్ని, మూఢ విశ్వాసాలను తీవ్రంగా ఖండించి, సామాజిక విద్యను ప్రోత్సహించాడు.
పేదవారికి సేవ చేయాలని ఉద్బోధించాడు.
జ్యోతిబా ఫులే మహిళా విమోచనకు, అస్పృశ్యత నివారణ కోసం, అంటరానివారి అభివృద్ధి కోసం ఒక పటిష్ఠమైన బ్రాహ్మణేతర ఉద్యమాన్ని నిర్వహించాడు.
ఫులే విద్యాభ్యాసం, స్వీయ అనుభవాలు, ఆనాటి సమాజంలో నెలకొన్న దురాచారాలను విమర్శించడానికి గల సాధికారతను కల్పించాయి.
దళితులను విముక్తులను చేసి, విద్య ద్వారా వారిని చైతన్యవంతులను చేసే లక్ష్యంతో జ్యోతిబా ఫులే 1873లో సత్యశోధక్ సమాజాన్ని స్థాపించాడు.
1884లో ‘దీనబంధు సర్వజనిక్ సభ’ అనే మరో సంస్థను కూడా స్థాపించారు.
1854లో జ్యోతిబా ఫులే బలహీన వర్గాలకు ఒక ప్రత్యేక పాఠశాల నెలకొల్పాడు. అదేవిధంగా వితంతువులకు సహాయమందించేందుకు ఒక అనాథ శరణాలయాన్ని కూడా స్థాపించాడు.
జ్యోతిబా ఫులే తన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేందుకు రెండు విమర్శణాత్మక గ్రంథాలు రచించాడు. అవి.. 1) సార్వజనిక్ సత్యధర్మ పుస్తక్ 2) గులాంగిరి
జ్యోతిబా ఫులే ఉద్యమ ముఖ్య లక్ష్యం సంఘంలో అట్టడుగున ఉన్న కులాలవారిని బ్రాహ్మణులు, వారి సంప్రదాయక గ్రంథాల ప్రభావం నుంచి తప్పించడం, ప్రజా బాహుళ్యాన్ని చైతన్యవంతులను చేసి, బ్రాహ్మణ ఛాందసవాదుల ఆధిపత్యంపై క్రమబద్ధమైన ప్రతిఘటనకు ఉద్యుక్తులను చేయడం. జ్యోతిబా ఫులే సొంత మాటల్లో ‘విద్య ద్వారా వారిని క్రమబద్ధమైన వ్యవస్థగా రూపొందించి, బడుగు వర్గాల వారిని ఐక్యం చేసి, వారిని తమ ఉనికి గుర్తించేలా చేయడం. ప్రాచీన బ్రాహ్మణేతర మత సంప్రదాయ పరిస్థితుల్లోకి వెళ్లడం. ఈ ఉద్యమం మహారాష్ట్రలో త్వరితగతిన కార్చిచ్చులా వ్యాపించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా జ్యోతిబా ఫులే సిద్ధాంతాల పట్ల ప్రభావితుడయ్యారు.
సమానత్వం, న్యాయం, ప్రాతిపదికలపై ఆధారపడిన నవసమాజ నిర్మాణానికి కృషి చేసిన మహానుభావుడు నారాయణ గురు.
ఈయన త్రివేండ్రంలోని నిరుపేద ఎఝువ కుటుంబంలో జన్మించాడు. కేరళ రాష్ట్రంలో మత సంస్కరణోద్యమానికి, సాంఘిక దృక్పథాన్ని కల్పించిన ఘనత నారాయణ గురుకు చెందుతుంది.
ఈయన తమిళ, మలయాళ, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడే కాక అనేక భక్తి గీతాలనూ రచించాడు.
వెనుకబడిన వర్గాల అనైతిక, కఠోర సంప్రదాయాలపై తిరుగుబాటు చేశాడు. మతం పేరిట నిర్వహించే జంతుబలును నిషేధించడంలో సఫలీకృతులయ్యారు.
సామాజిక, ఆర్థిక, విద్య, సాంస్కృతిక రంగాల్లో ఎఝువ కులానికి, ఇతర వెనుకబడిన వర్గాలు, ప్రజలు పురోగతిని సాధించేందుకు 1903లో శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగను స్థాపించారు.
వర్ణ వ్యవస్థ అడ్డుగోడలను ఛేదించడానికి, వర్గ రహిత, కుల రహిత సమాజాన్ని రూపొందించడానికి వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాడు.
దేవాలయ ప్రవేశ హక్కును సాధించడం కోసం అనేక ఉద్యమాలు చేశారు. లక్షలాదిమంది హృదయాల్లో నారాయణ గురు ఒక మత ప్రవక్త, పండితుడు, వేదాంతి, కవి, సంఘసంస్కర్తగా చెరగని ముద్ర వేశాడు.
నారాయణ గురు స్థాపించిన శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగ ఉద్యమం తన లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతమైందని చెప్పవచ్చు.
అహ్మదీయ ఉద్యమ స్థాపకుడు మీర్జా గులాం అహ్మద్‌ను ఇస్లాం మత సంరక్షకుడిగా పేర్కొంటూ ఆర్యసమాజం, క్రైస్తవ మత ప్రచారకుల దాడుల నుంచి ఇస్లాం మతాన్ని రక్షించేందుకు ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు.
1889లో తానే మత ప్రవక్తగా ప్రకటించుకొని, తాను హిందువులకు ఆరాధ్యుడైన కృష్ణుడు, ఏసుక్రీస్తులకు మరో అవతారంగా ప్రకటించుకొన్నాడు.
బ్రహ్మసమాజం మాదిరిగానే అహ్మదీయ మతం కూడా మానవాళికి చెందిన విశ్వమానవ సూత్రాలపై ఆధారపడి ఉంది. గులాం అహ్మద్ పాశ్చాత్యుల ఉదార భావాలు, హిందూ మత సంస్కరణోద్యమాల వల్ల ప్రభావితుడయ్యాడు.
ఆయన ముస్లిమేతరులపై జిహాద్‌ను వ్యతిరేకిస్తూ, అన్ని మతాల వారితో స్నేహ సంబంధాలు కాంక్షించాడు. ఈ ఉద్యమ ఫలితంగా భారతీయ ముస్లింలలో పాశ్చాత్య ఉదార విద్య వ్యాప్తి చెందడమే గాక, వారికోసం అనేక పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించారు.
పాశ్చాత్య భావాల ఫలితంగా మహ్మదీయుల్లో తొలి స్పందన వహాబీ ఉద్యమంగా ఆవిర్భవించింది.
ఈ ఉద్యమం ముఖ్యంగా పునరుజ్జీవ ఉద్యమం. మన దేశంలో వహాబి ఉద్యమ స్థాపకుడు రాయ్‌బరేలీకి చెందిన ఫకీర్ అహ్మద్ బెరిల్వీ.
అరబ్బు మత సంస్కర్త అబ్దుల్ వహాబి అనుచరులే వహాబీలు. మనదేశంలో వహాబి ఉద్యమం ప్రారంభంలో ఇస్లాం మత సంస్కరణోద్యమంగా ప్రారంభమై, ఆనాటికి మహ్మదీయ సంఘంలోకి చొచ్చుకొని వచ్చిన అవినీతిని దుయ్యబట్టింది.
చివరికి వహాబి ఉద్యమం వ్యవసాయిక తిరుగుబాట్లుగా, సిక్కులపై పవిత్ర యుద్ధంగా, పంజాబ్ ఆక్రమణ తర్వాత బ్రిటిష్ వారిపై యుద్ధ స్వరూపం దాల్చింది.
వహాబి ఉద్యమ నాయకుడైన సయ్యద్ అహ్మద్ లక్ష్యం ‘పంజాబ్ నుంచి సిక్కులను, బెంగాల్ నుంచి బ్రిటిష్ వారిని తరిమేసి, భారతదేశంలో ముస్లిం అధికారాన్ని పునఃప్రతిష్ఠాపన చేయడం.
అహ్మద్ తన అనుచరులకు సైనిక శిక్షణ ఇచ్చాడు. ఈ రహస్య ఉద్యమం కాబూల్, సరిహద్దు రాష్ర్టాలు, బెంగాల్, బీహార్, కేంద్ర రాష్ర్టాలకు విస్తరించింది. 1831లో అహ్మద్‌ను బ్రిటిషర్లు చంపారు. ఇతడి మరణం తర్వాత ఇతడి అనుచరులు వహాబి ఉద్యమాన్ని వాయవ్య సరిహద్దు రాష్ర్టాల్లో కొనసాగించారు.
1830-60 సంవత్సరాల మధ్య వహాబి ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిక్యతకు వ్యూహాత్మకంగా పెను సవాళ్లను విసిరింది. వహాబి ఉద్యమ తీవ్రతను, ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటిష్ వారు కఠినమైన చర్యలు తీసుకోవడంతో 1870 నాటికి ఈ ఉద్యమం అంతరించింది.
19వ శతాబ్దంలో మహ్మదీయులు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మొఘల్ సామ్రాజ్య పతనానంతరం రాజకీయాధికారాన్ని కోల్పోవడం వల్ల వారు నిరాశ చెందారు.
1857 తిరుగుబాటుకు మహ్మదీయులే ముఖ్య కారణమని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచివేసిన తర్వాత ముస్లిం వ్యతిరేక విధానాన్ని అనుసరించింది.
అందువల్ల ముస్లింలలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు తీవ్రంగా రగుల్కొన్నాయి.
మహ్మదీయులు తొలుత పాశ్చాత్య విద్యను వ్యతిరేకించారు. తర్వాత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేసిన కృషి వల్ల మహ్మదీయుల్లో పాశ్చాత్య భావాలు పెంపొందాయి.
మహ్మదీయుల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి, ఆధునిక విద్యను ప్రచారం చేయడానికి అలీఘర్ ఉద్యమం ప్రారంభమైంది.
అలీఘర్ ఉద్యమం మహ్మదీయుల్లో మొట్టమొదటి సారిగా చైతన్యాన్ని రేకెత్తించింది.
ఈ ఉద్యమం భారతదేశంలో ముస్లిం సమైక్యతకు మొదటి మెట్టు. ఇస్లాం పట్ల తమ విధేయత బలహీనపడకుండా ముస్లింలలో పాశ్చాత్య విద్యను ప్రచారం చేయడమే అలీఘర్ ఉద్యమ ముఖ్య లక్ష్యం.
ఈ ఉద్యమ ప్రభావం వల్ల భారతదేశంలో ముస్లింలకు ఉర్దూ జాతీయ భాష అయ్యింది.
ఈ విధంగా ముస్లిం విద్యావంతుల్లో ప్రత్యేక భాష, ప్రత్యేక భావాలు రూపొందాయి.
ఈ ఉద్యమం సంస్కరణలను ప్రవేశపెట్టాలని ఆశించింది. బహు భార్యత్వాన్ని, ఘోషా పద్ధతిని, విడాకుల పద్ధతిని ఖండించింది.
స్త్రీలు కూడా పాశ్చాత్య విద్యను అభ్యసించాలని కోరింది. అలీఘర్ ఉద్యమం ఖురాన్ సరళ వ్యాఖ్యానంపై ఆధారపడింది.
ఆధునిక ఉదారవాద సంస్కృతంలో ఇస్లాంను సమన్వయ పరచడానికి ఈ ఉద్యమం ప్రయత్నించింది.
అలీఘర్ ఉద్యమ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1876లో మహ్మదీయ ఆంగ్లో-ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు.
ఈ కళాశాల హైదరాబాద్ ప్రధాన మంత్రి సాలార్ జంగ్ ప్రోత్సాహంతో ముస్లింల కేంద్ర విద్యాసంస్థగా మారింది.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు