పరమత సహనం.. పజారంజకం.. గోల్కొండ రాజ్యం
తెలంగాణ చరిత్ర
- కాకతీయుల పతనానంతరం బహమనీ సుల్తాన్లు శతాబ్దంన్నర కాలం పాలించారు. మహమ్మద్బీన్ తుగ్లక్ విధానాలతో విసిగిపోయిన అమీర్లు హసన్గంగూ నాయకత్వంలో గుల్బర్గా నుంచి బయలుదేరి సుల్తాన్ సైన్యాలను ఓడించి దౌలతాబాద్ను ఆక్రమించారు. తర్వాత హసన్ గంగూను దక్కన్ సుల్తాన్గా ఎన్నుకున్నారు. హసన్గంగూ బహమనీ రాజ్య స్థాపకుడు. తర్వాత కాలంలో బహమనీ రాజ్యం బీదర్, బీరార్, బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ అనే ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. 1528 తర్వాత ఈ రాజ్యాలన్నీ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి.
కుతుబ్షాహీలు
- బహమనీ సుల్తాన్ మూడో మహమ్మద్షా కాలంలో గుల్భర్గా చేరిన కులీ- కుతుబ్-ఉల్-ముల్క్ సుల్తాన్ కొలువులో చేరాడు. బహమనీ సామ్రాజ్యంలో అంతర్భాగమైన గోల్కొండ తరఫ్కు పాలకునిగా 1492లో నియమించబడ్డాడు. 1518లో స్వాతం త్య్రాన్ని ప్రకటించుకున్నాడు. కుతుబ్షాహీలు షియా శాఖకు చెందినవారు. వీరు తెలంగాణ మాతృభాష అయిన తెలుగును, స్థానిక ప్రజల సంస్కృతిని ఆదరించి గౌరవించారు. హైదరాబాద్ విశిష్ట సంస్కృతికి బీజాలు వేసి పాలకులకు, ప్రజలకు మార్గదర్శకులుగా నిలిచారు.
- నేటి తెలంగాణలో వారు నిర్మించిన కట్టడాలు, ప్రోత్సహించిన పరమత సహనం సజీవంగా దర్శనమిస్తాయి. వీరి రాజ్యంపై మొఘల్ చక్రవర్తుల దాడులు అక్బర్ అనంతరం ప్రారంభమయ్యాయి. చివరికి ఔరంగజేబు రాజ్యవిస్తరణ కాంక్ష గోల్కొండ సుల్తానుల సార్వభౌమత్వాన్ని క్రీ.శ.1687 లో అంతమొందించింది.
ఆధారాలు
- కుతుబ్షాహీల చరిత్రను తెలుసుకోవడానికి పర్షియన్, అరబిక్, ఉర్దూ, తెలుగు, ఫ్రెంచి భాషల్లో ఆనాటి పండితులు చరిత్ర కారులు, కవులు, సుల్తానులు బాటసారులు మొదలైనవారు రాసిన అనేక గ్రంథాలు రచనలు ఎంతో ఉపకరిస్తున్నాయి. కుతుబ్షాహీలు జారీ చేసిన ఫర్మానాలు కూడా ఎంతో చార్రితక విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.
- కుతుబ్షాహీల పాలన కాలం 1512 నుంచి 1687. వీరిలో మొదటివాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా, వీరిలో సుప్రసిద్ధుడు ఇబ్రహీం కులీ కుతుబ్షా. వీరి కాలంలో పారశీ అధికార భాషగా ఉండేది. గోల్కొండ కోటకు సుల్తాన్ కులీ కుతుబ్షా తరఫ్గా ఉన్న కాలంలోనే మరమ్మతులు చేయించి రక్షణ శ్రేణులు, పౌర, జన నివాస ప్రాంతాలను నిర్మించి దుర్బేద్యమైన దుర్గంగా రూపొందించి స్వతంత్ర కుతుబ్షాహీ రాజ్యాన్ని 1512లో స్థాపించాడు. ఇతనికి శ్రీకృష్ణ దేవరాయలు, సాళువ రాయలు సమకాలికులు.
- ఇతను విజయనగర, రెడ్డి, గజపతి రాజ్యాలపై దండెత్తాడు. ఖమ్మం మెట్టు యుద్ధంలో గజపతి అధికారి అయిన సీతాపతి/సితాబ్ఖాన్ను ఓడించాడు.
- కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ రెండో ఈజిప్ట్గా ప్రసిద్ధి చెందింది. గోల్కొండ కోట పరిసరాల్లో అహ్మద్ నగర్ అనే కొత్త నగరాన్ని నిర్మించాడు. అతడు చేసిన యుద్ధాల వల్ల గోల్కొండ రాజ్యం తెలంగాణలోని వరంగల్, నల్లగొండ నుంచి తీరాంధ్రలోని మచిలీపట్నం వరకు విస్తరించింది.
- సుల్తాన్ కులీకి ఆరుగురు కొడుకులు వీరు హైదర్ అలీ, కుతుబుద్దీన్, జంషీద్ కులీ, అబ్దుల్ కరీం, దౌలత్కులీ, ఇబ్రహీం కులీ కుతుబ్షా. సుల్తాన్ చివరి రోజుల్లో సింహాసనానికై పోరాటం మొదలైంది. జంషీద్కులీ కుట్ర పన్ని తండ్రిని హత్యచేయించి ఐదేళ్ల పాటు గోల్కొండను పాలించాడు. గోల్కొండ రాజ్య భూభాగాలపై బీజాపూర్ సుల్తానులు విజయనగర రాజులు దండెత్తారు. ఇతని పాలనా కాలంలోనే పరిపాలన వ్యవస్థకు నాంది పడింది. ఇతని మంత్రుల్లో కమాలుద్దీన్ అర్థిస్థానీ ముఖ్యుడు సుల్తాన్ అధినేతగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. వీరిలో వకీల్, పీష్వా, మీర్-జుమ్లా ముఖ్యులు.
- ఇబ్రహీం కులీ కుతుబ్షా విజయనగర చక్రవర్తి సదాశివరాయలు ప్రధాని అయిన అళియరామ రాయల మద్ధతుతో గోల్కొండ చేరి శత్రువులను ఎదిరించి సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రముఖ చరిత్రకారుడు హరున్ఖాన్ షేర్వాణి తన ప్రసిద్ధ రచన ‘హిస్టరీ ఆఫ్ కుతుబ్షాహీ డైనాస్టీ’లో ఇబ్రహీం పాలనా కాలాన్ని ‘ది కింగ్డం ఎట్ ఇట్స్ హైట్’ అని అభివర్ణించాడు. ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో గోల్కొండ రాజ్యం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. పేరు ప్రతిష్ఠలు ప్రపంచం నలుమూలలా వ్యాపించాయి. ఈయన కాలంలోనే విజయనగర రాజులతో కృష్ణానదీ తీరాన రాక్షస తంగడి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అళియ రాయలు మరణించాడు.
- ఇబ్రహీం కులీ కుతుబ్షా మరణానంతరం మూడో కొడుకు మహమ్మద్ కులీ కుతుబ్షా సింహాసనం అధిష్టించాడు. అతడు గొప్ప కళాభిమాని. హైదరాబాద్ నిర్మాత ఇతడే. ప్రముఖ చరిత్ర కారుడు హెచ్.కె. షేర్వాణి రచన ‘హిస్టరీ ఆఫ్ కుతుబ్షాహీ డైనాస్టీ’లో అతని కాలాన్ని ‘కల్చరల్ ఆఫ్ లిఫ్ట్గా’ వర్ణించాడు.
- మహమ్మద్ కుతుబ్షాహీకాలంలో నిర్మిం చిన హైదరాబాద్ నగరం విశిష్ట మిశ్రమ సంస్కృతికి కేంద్రంగా రూపుదిద్దుకుంది. మొఘల్, పర్షియా పాలకులతో ఇతడు స్నేహపూర్వక దౌత్య సంబంధాలను నెలకొల్పాడు. ఇరాన్ దేశం నుంచి అనేక మంది కవులు, కళాకారులు వర్తకులు, మేధావులు ‘అఫాకీలు’ (వలసదారులు)గా వచ్చి స్థిరపడ్డారు. వీరిలో ముఖ్యుడు మీర్ మోమిన్ అస్ర్తాబాదీ. ఇతడు తన తెలివి తేటలతో పీష్వా పదవి చేపట్టాడు. హైదరాబాద్ నగర నిర్మాణ ప్రణాళికను, చార్మినార్, దాని పరిసరాల, కూడళ్ల నిర్మాణ ప్రణాళికను రూపొందించాడు.
- మహమ్మద్ కులీ కుతుబ్షా మరణా నంతరం మహమ్మద్ కుతుబ్షా సింహాసనం అధిష్ఠించాడు. ఇతడు శాంతి ప్రియుడు. యుద్ధాలు, వ్యూహాలు, కుట్రలు కుతంత్రాలు దౌత్యనీతిలో ఇతనికి అనుభవం లేదు. అందువల్ల అతని ప్రధానమంత్రి మీర్- మోమిన్- అస్ర్తాబాదీ ఇతని మరణం తర్వాత గోల్కొండ ప్రధాని పదవి చేపట్టిన అల్లమా – ఇబన్ ఇ – కాతూన్ అమూలీ రాజ్య పరిరక్షణ బాధ్యతలు నిర్వహించారు. ఇతని కాలంలోనే అనేక చెరువులు, భవంతులు నిర్మించారు. మాసాహిబా తలాబ్(చెరువు) పేర్కొనదగినది.
- సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా మరణానంతరం అబ్దుల్లా కుతుబ్షా పన్నెండేళ్ల చిన్న వయస్సులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలంలోనే షాజహాన్, ఔరంగజేబులు తరచూ దండయాత్రలు చేశారు. 1636లో షాజహాన్ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షాను ఓడించి గోల్కొండను మొఘల్ సామంత రాజ్యంగా మార్చాడు.
- గోల్కొండ కుతుబ్షాహీల్లో చివరి వాడు. అబుల్ హసన్ తానీషా. ఇతను ఔరంగజేబుకు శివాజీకి సమకాలికుడు. పరమత సహనం కలవాడు. అక్కన్న, మాదన్న, కంచర్ల గోపన్న అతని అధికారులుగా పనిచేశారు. జౌరంగజేబు దండయాత్రలను చివరి వరకు ఎదిరించాడు. ప్రజల రక్షణ కోసం చివరి వరకు పోరాడాడు. మొఘల్ సేనలను సుమారు 18 నెలలపాటు ఎదిరించిన ధీశాలి.
- 1687లో ఔరంగజేబు గోల్కొండను వశపరచుకున్నాడు. అబుల్ హసన్ తానిషాను బీదర్, అక్కడి నుంచి దౌలతాబాద్లో బందీగా ఉంచారు. 12 ఏండ్లు బందీగా
పరిపాలన
- జీవించిన తానిషా 1999లో దౌలతాబాద్లోనే మరణించాడు. గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగమై సుమారు 37 సం.ల మొఘలుల ప్రత్యక్షపాలన కింద ఉన్నది.
- కుతుబ్షాహీల పరిపాలనా వ్యవస్థలో రాజు/ సుల్తానే కేంద్ర బిందువు. వీరు తమను భగవంతుని ప్రతిరూపంగా జల్లుల్లాగా ప్రకటించుకొన్నారు. ముఖ్యంగా కులీ కుతుబ్షా అతని అల్లుడు, వారసుడైన మహమ్మద్ కుతుబ్షాలు ఈ సిద్ధాంతాన్ని విశ్వసించారు.
- కుతుబ్షాహీల కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలో మజ్లిస్ ఇ-దివాన్-దారీ లేదా మంత్రి పరిషత్ వ్యవహారాల్లో కీలకపాత్ర నిర్వహించేది. ఇది అత్యంత శక్తిమంతులైన మంత్రుల, అధికారుల సభ. అన్ని సందర్భాల్లో మజ్ల్లిస్ నిర్ణయాలను అమలు చేసేవారు.
ప్రాక్టీస్ బిట్స్
1. గోల్కొండ రాజ్యంలో సుల్తాన్ తర్వాత శక్తిమంతమైన మంత్రి ఎవరు?
ఎ) పీష్వా బి) మీర్ జుమ్లా
సి) ఎ, బి డి) ఎవరూ కాదు
2. కుతుబ్షాహీల కాలంలో కేంద్ర పరిపాలనా వ్యవస్థలో పీష్వా తరువాత ముఖ్యమైన హోదా అధికారం ఎవరిది?
ఎ) నజీర్ బి) మజుందార్
సి) దబీర్ డి) మీర్జుమ్లా
3.ఆర్థిక శాఖ మంత్రి అయిన మీర్జుమ్లా విధులేవి?
ఎ) ప్రభుత్వ కోశాగారానికి రావల్సిన పద్దులను క్రమబద్ధంగా వసూలు చేయించడం
బి) వివిధ శాఖల అవసరాలను సుల్తాన్ అనుమతితో ఖర్చులకై చెల్లించడం
సి) సైనిక వ్యవహారాల శాఖ లెక్కలు తనిఖీ చేయడం డి) పైవన్నీ
4. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో సైన్య వ్యవహారాలను చూసే మంత్రిని ఏమని పిలిచేవారు?
ఎ) నజీర్ బి) మజుందార్
సి) ఐయిన్ ఉల్ ముల్క్ డి) కొత్వాల్
5. గోల్కొండ రాజ్య ఆదాయ, వ్యయాలన్నింటినీ తనిఖీచేసే మంత్రి ఎవరు?
ఎ) నజీర్ బి) మజుందార్
సి) ఐయిన్ ఉల్ ముల్క్ డి) కొత్వాల్
6. సుల్తాన్ తరపున తరఫ్దార్లకు ఇతర శాఖలకు ఫర్మానాలను పంపడం, అనువాదం చేయించడం, సుల్తాన్, మంత్రి వర్గం అంగీకరించిన ఫర్మానాలను ముద్ర వేయించడం వంటి వ్యవహారాలను చూసే అధికారిని ఏమని పిలిచేవారు?
ఎ) దబీర్ బి) మజుందార్
సి) ఐయిన్ ఉల్ ముల్క్ డి) కొత్వాల్
7. గోల్కొండ సామ్రాజ్యంలోని ప్రజల్లో నీతి నియమాలను, సుల్తాన్ పట్ల భక్తిని, శాసనాల పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టడం, శాంతిభద్రతలు, చట్టాల అమలు ఎవరి విధులుగా ఉండేవి?
ఎ) నజీర్ బి) మజుందార్
సి) ఐయిన్ ఉల్ ముల్క్ డి) కొత్వాల్
8. సైన్యవ్యవహారాలను చూసే ఐయిన్-ఉల్-ముల్క్ విధువేవి?
1) సేనల నియామకం
2) శిక్షణ, యుద్ధ వ్యూహాల రచన
3) తరీఫ్స్థాయి సేనాధిపతుల నియామకం
4) దుర్గాధిపతుల నియామకం
ఎ) 1, 2 బి) 1, 2, 3, 4
సి) 3, 4 డి) 2, 3
9. పోలీసు శాఖ అధిపతి అయిన కొత్వాల్ విధులేవి?
1) టంకశాలకు అధిపతి
2) పోలీసు శాఖను క్రమశిక్షణతో పనిచేయించటం
3) శాంతిభద్రతల పరిరక్షణ
ఎ) 1 మాత్రమే బి) 1, 2
సి) 1, 2, 3 డి) పైవేవీకాదు
10. కేంద్రస్థాయి మంత్రుల్లో ఒకరైన సర్ఖేల్ (గ్రూప్ నాయకుడు) ప్రధాన విధులేవి?
1) ముఖ్య రెవెన్యూ అధికారి
2) జిల్లాలు- రాష్ర్టాలు ఇతని ఆధీనంలో ఉండేవి
3) తూర్పు తీరంలోని విదేశీ వర్తక సంఘా ల కార్యకలాపాలపై నిఘా ఉంచి వారిని అదుపులో పెట్టడం
ఎ) 1 మాత్రమే బి) 1, 2
సి) 1, 3 డి) 1, 2, 3
11. ప్రభుత్వ భాండాగారాలను, గుర్రాలు, ఏనుగు శాలలను నిర్వహించే వ్యక్తిని ఏమని పిలిచే వారు?
ఎ) సర్ఖేల్ బి) హవల్దార్
సి) కొత్వాల్ డి) నజీర్
12. రేవు పట్టణంలో ఉన్నతాధికారిని ఏమనేవారు?
ఎ) ‘షాబందర్’ బి) హవల్దార్
సి) కొత్వాల్ డి) నజీర్
13. కుతుబ్షాహీలు పరిపాలన సౌలభ్యం కోసం రాష్ర్టాన్ని వేటిగా విభజించారు?
ఎ) తరఫ్లు బి) సిమ్త్లు
సి) సర్కార్లు డి) పైవన్నీ
14. గోల్కొండ చరిత్రలో మొదటిసారిగా తెలుగువాడు, తెలంగాణ ప్రాంత నివాసి అయిన ఎవరికి గోల్కొండ రాజ్య పదవి లభించింది?
ఎ) అక్కన్న బి) మాదన్న
సి) పొదిలి లింగన్న డి) కంచర్ల గోపన్న
15. హైదరాబాద్ నగరంలో మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించిన ప్రజా వైద్యశాల ఏది?
ఎ) దారుల్-షిఫా బి) ఖుదాదాల్ మహల్
సి) నయాఖిల్లా డి) పైవేవీకాదు
సమాధానాలు
1-ఎ, 2-డి, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ, 7-ఎ, 8-బి, 9-సి, 10-డి 11-బి, 12-ఎ, 13-డి, 14-బి, 15-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు