రావోయ్ నేస్తం-విడవవోయ్ చాదస్తం
ఆకాశానికి నక్షత్రాలు, సముద్రానికి కెరటాలు, మొక్కకి పుష్పాలు, పసిపాపకు చిరునవ్వు ఎంతటి అందాన్ని చేకూరుస్తాయో కావ్యానికి అలంకారాలు అంతటి అందాన్ని చేకూరుస్తాయి.
-స్త్రీకి అలంకరించిన సొమ్ములే అలంకారాలు అందుకే కావ్యాలను కాంతాసమ్మితాలు
-ప్రపంచంలో ఏ వస్తువైనా కానీ, అందంగా తయారు కావడానికి వ్యక్తి ప్రయత్నం ఉంటుంది.
-సరస్వతికి అలంకరించిన సొమ్ములే అలంకారాలు ఒకవేళ ఆ సరస్వతికి సొమ్ములే కనుక లేనట్లయితే ఆ సరస్వతి ఒక విధవ లాంటిది అనే ప్రస్తావన అగ్నిపురాణంలో ఉంది.
అలంకారాలు రెండు రకాలు
1. అంతర్గత అలంకారాలు
2. బహిర్గత అలంకారాలు
అలంకారాలు రెండు రకాలు
1. శబ్ధాలంకారాలు 2. అర్థాలంకారాలు
-శబ్ధాలంకారాలు: శబ్ధం ప్రధానమైంది. శబ్ధాన్ని ఆశ్రయించుకొని ఉన్న అలంకారాలు
శబ్ధాలంకారాలు మూడు రకాలు
1. అనుప్రాస అలంకారం
2. యమక అలంకారం 3. ముక్తపదగ్రస్తం
అనుప్రాస అలంకారం
-ఒక అక్షరం లేదా అక్షరాల సముదాయం కానీ, పదం కానీ మళ్లీ మళ్లీ వచ్చినట్లయితే అది అనుప్రాస అలంకారం.
-అనుప్రాస అలంకారాలు నాలుగు రకాలు
1. వృత్యానుప్రాస అలంకారం
2. చేకానుప్రాస అలంకారం
3. లాటానుప్రాస అలంకారం
4. అంత్యానుప్రాస అలంకారం
–వృత్యానుప్రాస అలంకారం: హల్లులు పలుమార్లు ప్రయోగించే అలంకారం
-ఒకటి కాని, రెండు కాని, మూడు కాని అంతకంటే ఎక్కువ హల్లులు మాటిమాటికి ప్రయోగించిన అలంకారం.
ఉదా: ఓ సరోజా! ప్రతిరోజు ఒక రోజా నీ శిరోజాన మజామజాగా రంజిల్లుతుంది.
-అడుగులు తడబడ బుడతడు నడవచ్చెన్.
-లక్ష బక్షాలు భుజించెడి లక్ష్మయ్యకు ఒక బక్షం భుజించడం ఒక లక్ష్యమా
-అక్కడగాక ఇక్కడగాక మరెక్కడ
-నేను నిన్నానని నేనన్నానా నా నాన్న నా నాన్నే నీ నాన్న నీ నాన్నే
-చిటపట చిటపట మెటికలు విరుచుచు చిటికెలు వేయు – బొటిమిన వేలా
–చేకానుప్రాస అలంకారం: హల్లుల జంట అవ్యవధానం అర్థభేదం.
-అర్థభేదంతో కూడుకున్న హల్లుల జంట అవ్యవధానంగా ప్రయోగించిన అలంకారం చేకానుప్రాస అలంకారం.
ఉదా: నిప్పులో పడిన కాలు కాలుతుంది
-నీటిలో పడిన తేలు తేలుతుంది
-తమ్ముడికి చెప్పు చెప్పులు జాగ్రత్త అని
-సుందర దరహాసం ఓరాజా నీది శుభంకర కరము
లాటానుప్రాస: హల్లులు జంట అవ్యవధానం తాత్పర్య భేదం
-తాత్పర్య భేదంతో కూడుకున్న హల్లుల జంట అవ్యవధానంగా ప్రయోగించిన అలంకారం లాటానుప్రాస
ఉదా: కమలాక్షు నర్చించు కరములు, కరములు
-శ్రీనాథ వర్ణించు జిహ్వ, జిహ్వ (ఆంధ్రమహాభాగవతం, ప్రహ్లాద చరిత్ర, బమ్మెర పోతన)
-మానవత్వం కలిగిన మనిషి మనిషి
గమనిక: చేకానుప్రాసలో, లాటానుప్రాసలో జంట పదాలు అవ్యవధానంలో ప్రయోగించబడతాయి. జంట పదాలు విడివిడిగా చదివినట్లయితే అది తాత్పర్యభేదమని, దాని ముందు వర్ణంతోకాని, దాని తర్వాత వర్ణంతోగాని లేదా దాని ముందు పదంతోకాని, తర్వాత పదంతోకాని అనుసంధానమై పలకబడితే అర్థభేదమని భావించాలి.
–అంత్యానుప్రాస అలంకారం: వాక్యాల చివర ఒకే విధమైన అక్షరం వచ్చునట్లు ప్రయోగించిన అలంకారం అంత్యానుప్రాస అలంకారం.
ఉదా: ఏ రాపిడీ లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది.
-ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది. (ప్రపంచ పదులు-సి.నా.రె)
రావోయ్ నేస్తం విడవవోయ్ చాదస్తం
-రాజ్యాలను ఏలినారు వేలవేల రాజులు చివరికి ఎవరు ఉంచారు కులసతికి గాజులు
–యమకాలంకారం: హల్లులు జంట వ్యవధానం అర్థభేదం
-అర్థభేదంతో కూడుకున్న హల్లుల జంట, వ్యవధానంగా ప్రయోగించిన అలంకారం యమకాలంకారం
ఉదా: కోడితో పకోడి చేయవచ్చు
-పురము నందు అంతఃపురం కలదు
-హారిక నీకు జో హారిక
-విందు అరవిందు ఇంటిలో
–ముక్తపదగ్రస్తం: ముక్త అంటే వదిలివేసిన పదం. గ్రస్తం అంటే గ్రహించడం
-వాక్యం చివరన వదిలివేసిన పదాన్ని తర్వాత వాక్యంలో గ్రహించి చెప్పిన అలంకారం.
ఉదా: 1. వేయి నదుల వెలుగు
వెలుగు గల హంస
హంస నడకల చిలుక
చిలుక పలుకుల పాప
పాప నవ్వుల మూట
2. అల్లంత గట్టు గట్టు మీద చెట్టు
చెట్టు మీద పిట్ట, పిట్ట కట్టె గూడు
3. చుట్టూర కంప
కంపలో పెంకు
పెంకులో శంఖం
శంఖంలో తీర్థం
తీర్థం తాగితే మోక్షం
అర్థాలంకారాలు
-అర్థం ప్రధానమైనవి.
-అర్థాన్ని ఆశ్రయించుకుని ఉన్న అలంకారాలు అర్థాలంకారాలు.
అతిశయోక్తి అలంకారం
-అతిశయోక్తి అంటే ఆశ్చర్యం
-ఒక వస్తువు వాస్తవిక స్థితిని ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్పిన అలంకారం అతిశయోక్తి అలంకారం. లేదా గోరంతను కొండంతగా చేసి చెప్పిన అలంకారం అతిశయోక్తి అలంకారం.
ఉదా: మా ఊళ్లో సముద్రమంత చెరువున్నది
-అరవిందు తాటి చెట్టంత పొడవున్నాడు
-మా పొలంలో బంగారం పండుతుంది
-మా బావిలోకి దిగినట్లయితే పాతాళవాసుల సంభాషణలు వినవచ్చు
స్వభావోక్తి అలంకారం:
-ఒక వస్తువు జాతి గుణం క్రియాదులకు ఉన్నది ఉన్నట్లుగా చేసి చెప్పబడిన అలంకారం స్వభావోక్తి అలంకారం.
ఉదా: ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నంత సేపు విద్యార్థులు శ్రద్ధగా వింటారు.
-హనుమంతుడు తోకతో లంకను తగలబెట్టాడు.
-ఆ వనంలోని లేళ్లు చెవులు రిక్కించి, చెంగు చెంగుమని ఎగురుచున్నవి.
శ్లేషాలంకారం
-శ్లేష అంటే అనేక రకాల అర్థాలు.-శ్లేషాలంకార చక్రవర్తి చేమకూర వెంకటకవి (విజయ విలాసం)
ఉదా: మావిడాకులు తెచ్చి ఇవ్వండి
-వాడి కత్తి కావాలి
-పతివ్రతకు పరపతితో పని ఏమున్నది
-నేను నీ కుమారుడను అవును నీవు నా కుమాడువే మారుడు అంటే మన్మథుడు లేదా ప్రతిరూపం
-రాజు కువలయానందకరుడు
-వివరణ: రాజు అంటే ప్రభువు, చంద్రుడుకువలయం అంటే భూమి, కలువలు
ఉపమాలంకారం
-ఉపమాన, ఉపమేయాల మధ్య చక్కని సాదృశ్యమైన పోలికను వర్ణించిన అలంకారం ఉపమాలంకారం
-ఉపమాలంకారంలో 4 ధర్మాలు ఉంటాయి.
1. ఉపమేయం: పోల్చడానికి సిద్ధంగా ఉన్న వస్తువు
2. ఉపమానం: పోల్చడానికి తీసుకునే వస్తువు
3. ఉపమ వాచకం: వలె, వోలె, లాగా, విధముగా, భంగి
4. సమాన ధర్మం: ఉంది, ఉంటుంది
-కాళిదాసు ఎక్కువగా ఉపమాలంకారం ఉపయోగించి కావ్యాలను రచించాడు.
ఉదా: లేగదూడ పాలు తాగుతున్నంతసేపు తల్లి ఆవు కదలక మెదలక ఒక పాశానం వలె నిలబడి ఉన్నది.
-ఉపమేయం: తల్లి ఆవుఉపమానం పాశానం
-ఉపమవాచకం: వలె
-సమాన ధర్మం: నిలబడి ఉండటం
-అని అనంతామాత్యుడు భోజరాజీయంలో అన్నాడు.
-ద్రౌపది చేతిలోని తలవెంట్రుకలు నల్లని తాచుపాము వలె నిగనిగలాడుచున్నవి.
ఉదా: ఆ తోటలోని పిల్లలు సీతాకోకచిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు.
-ఈ అగ్ని ప్రళయం వలె దిక్కులన్నింటా వ్యాపిస్తున్నది.
ఉపమాలంకారం రెండు రకాలు
1. పూర్ణోపమ అలంకారం
2. లుప్తోపమ అలంకారం
గమనిక: పోల్చడానికి తీసుకున్న వస్తువు ధర్మాన్ని చెప్పినట్లయితే పూర్ణోపమలంకారం అంటారు. సమాన ధర్మం లోపిస్తే లుప్తోపమ అలంకారం అంటారు.
-ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది (లుప్తోపమ)
-ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది (పూర్ణోపమ)
ఉత్ప్రేక్షాలంకారం
-ఉపమాన, ఉపమేయాల మధ్య ఊహ ప్రధానంగా ఉన్న అలంకారం
-ఉపమేయ ధర్మాన్ని, ఉపమాన ధర్మం చేత ఊహించి చెప్పిన అలంకారం ఉత్ప్రేక్షాలంకారం
ఉదా: ఆ ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లు ఉన్నవి.
-ఆ వచ్చే బాలుడు నడిచే కొండే అన్నట్లు ఉన్నాడు.
-ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లున్నది.
-ఈ ఎండ మండే కొలిమే అన్నట్లున్నది.
-ద్రౌపది చేతిలోని తలవెంట్రుకలు నల్లని తాచుపామే అన్నట్లున్నవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు