ఫ్రెంచి విప్లవం – పరిణామాలు
-1787లో 16వ లూయీ 145 మంది ఉన్న ప్రముఖుల సభను వర్సేలో సమావేశపరిచి ఆర్థిక సమస్యను పరిష్కరించడానికి.. మినహాయింపు లేకుండా ఉన్నతవర్గాలపై కూడా పన్నులు విధించడం తప్ప మరో మార్గం లేదని, అందుకు అంగీకరించమని అభ్యర్థించాడు. ప్రముఖుల సభ దాన్ని తిరస్కరించడమే కాకుండా, ఉన్నతవర్గాలపై పన్నులు విధించే అధికారం ఒక్క ఎస్టేట్స్ జనరల్‌కు మాత్రమే ఉందని ప్రకటించింది. ఫలితంగా ఎస్టేట్స్ జనరల్‌కు ఎన్నికలు జరిపి సమావేశపర్చడం తప్ప దారిలేదని స్పష్టమైంది.
–ఎస్టేట్స్ జనరల్ సమావేశం 1789: ఎస్టేట్స్ జనరల్ సమావేశమే విప్లవానికి తెరలేపింది. ఫ్రాన్స్ దేశపు పార్లమెంటునే ఎస్టేట్స్ జనరల్ అంటారు. 1614 నుంచి అంటే 175 ఏండ్లపాటు ఎస్టేట్స్ జనరల్ సమావేశం జరగలేదు. ఎస్టేట్స్ జనరల్‌లో ఉన్న మూడు సభలను ఎస్టేట్స్ అంటారు. మొదటి ఎస్టేట్‌లో మతాచార్యుల ప్రతినిధులు 300 మంది, రెండో ఎస్టేట్‌లో భూస్వాముల ప్రతినిధులు 300 మంది, మూడో ఎస్టేట్‌లో సామాన్యుల ప్రతినిధులు 600 మంది ఉంటారు. గతంలో ఎస్టేట్స్ జనరల్ సమావేశాలు జరిగినప్పుడు ఒక్కొక్క సభ్యుడికి ఒక ఓటు కాకుండా, ఎస్టేట్‌కు అంతటికి కలిపి ఒక ఓటు ఉండేది. ఫలితంగా 300 మంది సభ్యుల చొప్పున ఉన్న మొదటి, రెండు ఎస్టేట్లకు ఒక్కొక్క ఓటు ఉండగా, 600 మంది ఉన్న మూడో ఎస్టేట్‌కు కూడా ఒకే ఓటు ఉండేది.
మూడు ఎస్టేట్లు ఒకే చోట కాక, విడివిడిగా సమావేశమై నిర్ణయాలు తీసుకునేవి. ఏదైనా అంశం మీద చక్రవర్తి ఎస్టేట్ జనరల్ అభిప్రాయం కోరినప్పుడు ఒకే విధమైన ప్రయోజనాలున్న మొదటి, రెండు ఎస్టేట్లు ఒకవైపు ఓటు చేయగా, మూడో ఎస్టేట్ అందుకు భిన్నంగా ఓటువేసి ప్రతిసారి 2-1 తేడాతో ఓడిపోతుంది. ఈ నమ్మకంతోనే మినహాయింపు లేకుండా పన్నులు విధించాలని లూయీ కోరినప్పుడు ప్రముఖుల సభ ఎస్టేట్స్ జనరల్ సమావేశాన్ని డిమాండ్ చేసింది. 1789లో ఎస్టేట్స్ జనరల్‌కు ఎన్నికలు జరిగాయి. 1789లో ఎన్నికైన మూడో ఎస్టేట్ సభ్యులకూ 1614 నాటి సభ్యులకు పోలికే లేదు. 1789 నాటి సభ్యులు విప్లవ భావాలతో ప్రేరేపితులయ్యారు. తత్వవేత్తల రచనలతో ప్రభావితులయ్యారు. రాజ్యాంగ మార్పును కోరుకుంటున్న ప్రజల ద్వారా ఎన్నికయ్యారు.
ఎన్నికల ముందు ప్రజలు రూపొందించిన కాహియార్లు అనే కరపత్రాలతో ప్రతిఫలించిన ప్రజల అభీష్టాలను నెరవేర్చడానికి సంసిద్ధులయ్యారు. సభ్యుల్లో అధిక సంఖ్యాకులైన న్యాయవాదులు, న్యాయమూర్తులు, మేధావులు.. ఇంగ్లండ్‌లోని రాజ్యాంగబద్ధ రాచరికంపట్ల సానుభూతి ఉన్నవారు. వీరిలో మిరాబు, సయీస్లు ముఖ్యులు. వీరు జన్మతః ఉన్నతవర్గానికి చెందినవారైనా మూడో ఎస్టేట్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు వచ్చారు. అయితే కాహియార్లలో ప్రజలు రాచరికంపట్ల వ్యతిరేకతను కనబర్చిన దాఖలాలు మచ్చుకైనా లేవు. ప్రభుత్వంలో సమాజంలో మౌలికమైన, విప్లవాత్మకమైన సంస్కరణలు మాత్రమే వారు కోరుకున్నారు. సామాజిక అసమానతలు పోవాలని దేశం ఐక్యంగా, పటిష్టంగా ఉండాలని కాంక్షించారు.
1789 మే 5న లూయీ ఎస్టేట్ జనరల్‌ను వర్సే కోటలో విడివిడిగా సమావేశపర్చాడు. ప్రజాభీష్టం ప్రతిఫలించాలంటే మూడు ఎస్టేట్లు ఒకేచోట సమావేశం కావాలని, ఎస్టేట్‌కు ఒక ఓటు కాకుండా సభ్యునికి ఒక ఓటు ఉండాలని, మూడో ఎస్టేట్ సభ్యులు వాదించారు. తద్వారా ఎస్టేట్స్ జనరల్ జాతీయ లక్షణాన్ని సంతరించుకుంటుందని ఆశించారు. మొదటి, రెండు ఎస్టేట్లు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. ప్రతిష్టంభన ఏర్పడింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపలేదు. కాహియార్ల పరిశీలనకానీ, శాసన ప్రతిపాదనకాని జరగలేదు. చివరకు 1789 జూన్ 17న మూడో ఎస్టేట్ తనను జాతీసభగా ప్రకటించుకుంది. జాతీయ సభలో విలీనమై జాతీయ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా మొదటి, రెండు ఎస్టేట్లను ఆహ్వానించింది. వారిలో కొందరు అనుకూలురు జాతీయ సభలో చేరారు. మూడో ఎస్టేట్ జాతీయసభగా ప్రకటించుకోవడంతో విప్లవం ఆరంభమైంది.
–బాస్టిల్ పతనం : జాతీయసభ 1789 జూలై 8న నూతన రాజ్యాంగ రచన కోసం జాతీయ రాజ్యాంగ పరిషత్తును రూపొందించింది. రాజ్యాంగ పరిషత్తు తన కార్యక్రమాలను ప్రారంభించకముందే వాటిని అడ్డుకునేందుకు లూయీ సరిహద్దుల నుంచి సైన్యాలను పారిస్‌కు తరలించడం ప్రారంభించాడు. 20 వేల సైన్యం పారిస్‌ను చుట్టుముట్టింది. సైన్యాన్ని ఉపసంహరించాల్సిందిగా జాతీయసభ చేసిన విజ్ఞప్తిని లూయీ ఖాతరు చేయలేదు. పారిస్ ప్రజలు తమ ప్రయోజనాలు జాతీయసభతో ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నారు. ఈలోగా జాతీయసభకు అనుకూలంగా ఉన్నాడన్న కారణంతో ఆర్థికమంత్రి నెక్కర్ను లూయీ మళ్లీ తొలగించాడు. ఆగ్రహించిన ప్రజలు వీధుల్లోకి చేరి నెక్కర్ ఫొటోను ప్రదర్శిస్తూ..
జూలై 11, 12 తేదీల్లో పారిస్ నగర వీధుల్లో ఆందోళనలు జరిపారు. ప్రజలు సైనికులను తరిమేసి జూలై 14న పారిస్‌కు తూర్పున ఉన్న బాస్టిల్ కోట మీద దాడి చేశారు. బాస్టిల్ రాజకీయ ఖైదీలను నిర్బంధించి ఉంచే జైలు. ఒక చీకటి కుహరం. బూర్బన్ రాజుల నిరంకుశత్వానికి ప్రతీక. జైలు రక్షణ దళాలు బాస్టిల్‌ను కాపాడుకోలేకపోయాయి. బాస్టిల్‌ను ప్రజలు స్వాధీనం చేసుకొని ఏండ్ల తరబడి నిర్బంధంలో మగ్గుతున్న ఖైదీలను విడుదల చేశారు. బాస్టిల్ పతనం విప్లవ విజయ తొలి సంకేతం. బాస్టిల్ పతనాన్ని రాచరిక నిరంకుశ పతనంగా చరిత్రకారులు గుర్తించారు. ఈ సంఘటనతో ప్రజలు రాజును సమర్థించడం లేదని వారు జాతీయసభ పక్షాన నిలుస్తున్నారని స్పష్టమైంది. పారిస్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ప్రజలు ఎస్టేట్స్ జనరల్‌కు సభ్యులను ఎన్నుకున్న పారిస్ నగర ప్రజాప్రతినిధులతో పారిస్‌లో మున్సిపల్ ప్రభుత్వాన్ని ఏర్పర్చారు.
దాని రక్షణ కోసం 48 వేల మంది యువకులతో జాతీయ సైనిక దళాన్ని రూపొందించారు. పారిస్‌లో బూర్బన్ల తెల్లజెండా స్థానంలో మూడు రంగుల విప్లవజెండా ఎగిరింది. బెయిలీ నగర మేయర్ కాగా, లఫాయతే జాతీయ రక్షణ దళాధిపతి అయ్యాడు. తప్పని పరిస్థితుల్లో లూయీ ఈ పరిణామాలను అంగీకరించాడు. బాస్టిల్ పతన స్ఫూర్తి దేశం నలుమూలలకు పాకింది. గ్రామాల్లో కర్షకులు తిరుగుబాటుచేసి భూములను స్వాధీనం చేసుకున్నారు. భూస్వాముల కోటలు నేలమట్టమయ్యాయి. జూలై 14 ను ఫ్రెంచ్ జాతీయదినంగా పరిగణించారు.
–పారిస్ మహిళల ఆకలియాత్ర: 1789 అక్టోబర్ నాటికి పారిస్ నగరం తీవ్ర క్షామానికి గురైంది. తిండిలేక, ఆకలి తీరక ప్రజలు అలమటించారు. ఈ నేపథ్యంలో రాణి మేరి ఆంటోనెట్ ప్రభావంతో లూయీ జాతీయ సభను నిరోధించడానికి మళ్లీ సేనలను పిలిపించాడు. సేనల గౌరవార్థం అక్టోబర్ 1న వర్సేలో పెద్ద విందు ఇచ్చాడు. ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే రాజు విందులు చేసుకోవడం ఆగ్రహానికి కారణమైంది. రాణి మేరి జాతీయ విప్లవ పతాకాన్ని, అవమానపర్చిందనే వార్తలు కూడా అందాయి. అక్టోబర్ 5న పారిస్ నగరంలో ఒక విలక్షణ ఫ్రెంచి విప్లవం – పరిణామాలుదృశ్యం ఆవిష్కృతమైంది. ఆకలిగొన్న పారిస్ మహిళలు కర్రలు, ఆయుధాలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి గుంపులుగుంపులుగా పారిస్ నుంచి వర్సేకు బయలుదేరి మాకు బ్రెడ్డు కావాలి అంటూ నినదిస్తూ పన్నెండు మైళ్ల పొడవునా మహాప్రస్థానం చేశారు. ఆ నినాదంతో ఆర్తనాదం కలిసి ఉంది.
లఫాయతే నాయకత్వంలోని జాతీయ రక్షణ దళం వారి వెంట అండగా నడిచింది. వర్సే చేరుకున్న మహిళలు రాజభవనాన్ని చుట్టుముట్టారు. రాజు అంగరక్షక దళం విఫలం కావడంతో రాజును రక్షించే బాధ్యత లఫాయతే తీసుకోవాల్సి వచ్చింది. తెల్లవారాక రాజును, రాణిని, వారి పిల్లలను కోచ్ మీద కూర్చోబెట్టుకొని మహిళల ఊరేగింపు పారిస్‌కు తరలింది. ఈసారి బ్రెడ్డు తయారీదారుని, అతని భార్యను, వారికి సహకరించే పిల్లలను తెస్తున్నాం అంటూ నినదించారు. పారిస్ చేర్చిన రాజ కుటుంబాన్ని ట్వెలరీ భవనంలో ఉంచారు. నాటి నుంచి రాచ కుటుంబం ప్రజల బందీ అయింది. రాజ్యాంగ పరిషత్ కూడా రాజును అనుసరించి పారిస్ చేరుకోవడంతో పారిస్ నగరం ఫ్రాన్స్ రాజధాని అయింది.
ప్రభుత్వ ఉద్యోగులకు రాజు, జాతీయ సభల్లో ఎవరి ఆజ్ఞలు పాటించాలో అర్థం కాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. న్యాయవ్యవస్థ స్తంభించింది. రాజ్య యంత్రాంగం కుప్పకూలింది. విప్లవం గ్రామాలకు విస్తరించింది. కర్షకులు, ప్రజలు.. భూస్వాములు, మతాధికారుల ఇండ్లపై దాడులుచేసి విధ్వంసం సృష్టించారు. వారి ఇళ్లను లూటీ చేసి కొందరు భూస్వాములను హత్య చేశారు. భూస్వాముల్లో కొందరు తమ ఆస్తులను స్వచ్ఛందంగా ప్రజలకు సమర్పించగా, మరికొందరు దేశం విడిచి పారిపోయారు. ఫ్రాన్స్‌లో పురాతన వ్యవస్థ పతనమైంది. నూతన వ్యవస్థకు అంకురార్పణ జరిగింది.
టెన్నిస్‌కోర్టు శపథం
జాతీయసభ కార్యకలాపాలను నిరోధించడానికి సంకల్పించిన లూయీ మూడో ఎస్టేట్ సభ్యులు సమావేశమయ్యే భవనాన్ని మూసేసి సైనికులను కాపలా ఉంచాడు. జాతీయ సభ తన తొలి సమావేశం నిర్వహించడానికి 1789 జూన్ 20న అక్కడికి చేరుకున్నప్పుడు అది మూసి ఉండటం గమనించిన సభ్యులు ఆగ్రహంతో సమీపంలోనే ఉన్న టెన్నిస్కోర్టులో సమావేశమై చేతులు పైకెత్తి దేశానికి నూతన రాజ్యాంగం వచ్చేవరకు విడిపోం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమావేశమవుతాం అంటూ శపథం చేశారు. ఇది టెన్నిస్‌కోర్టు శపథంగా ప్రసిద్ధికెక్కింది.
ఈ చరిత్రాత్మక సమావేశానికి బెయిలీ అధ్యక్షత వహించాడు. మిరాబు, లఫాయతే, మీరా, డాంటన్, రాజ్స్పియర్ వంటి విప్లవ నాయకులు నాయకత్వం వహించారు. టెన్నిస్‌కోర్టు శపథాన్ని విప్లవ ఆరంభంగా పరిగణిస్తారు. రాజు అనుమతి లేకుండా అతని అభిమతానికి విరుద్ధంగా మూడో ఎస్టేట్ జాతీయసభగా ప్రకటించుకొని రాజ్యాంగాన్ని రూపొందించాలని నిర్ణయించడం రాచరిక నిరంకుశ అధికారాన్ని సవాలు చేసినట్లయింది. గత్యంతరంలేని పరిస్థితిలో నాలుగురోజుల తర్వాత లూయీ మూడు ఎస్టేట్ల సంయుక్త సమావేశానికి అంగీకరించాడు. ఎస్టేట్ జనరల్ జాతీయసభగా పరిణామం చెందింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు