ఫార్మాకోర్సుల్లో ప్రవేశాలు!
ఫార్మా…
నేడు ప్రపంచాన్ని కాపాడుతున్న రంగాల్లో అతి ప్రధానమైన రంగం. ఫార్మా కెరీర్‌ను ఎవర్‌గ్రీన్‌గా చెప్పవచ్చు. ఫార్మా రంగం వైద్యంలో అంతర్భాగం. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 లాంటి కొత్త కొత్త వైరస్లు, అనేక రకాల వ్యాధులతో ప్రపంచ ఆరోగ్యరంగం ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. దీంతో ఫార్మాసంస్థల డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. మన దేశంలో ఔషధాల తయారీలో నిపుణులను తయారుచేసే సంస్థల్లో ప్రఖ్యాతిగాంచినవి నైపర్. దేశంలోని నైపర్ క్యాంపస్‌లలో పీజీ, పీహెచ్డీ కోసం నిర్వహించే నైపర్ జేఈఈ-2021 నోటిఫికేషన్ వివరాలు సంక్షిప్తంగా..
నైపర్
ఇంజినీరింగ్ విద్యకు ఐఐటీలు, మెడికల్ విద్యకు ఎయిమ్స్ పేరుగాంచినట్లే ఫార్మా విద్యకు దేశంలో నైపర్లు ప్రఖ్యాతి చెందినవి. ప్రపంచంలో భారతీయ ఫార్మా రంగసేవలు విశేషమైనవి. కొవిడ్ టీకా ప్రపంచంలోని యాభైకిపైగా దేశాలకు అందించి కోట్లాదిమంది జీవితానికి భరోసా కల్పించింది భారతీయ ఫార్మా రంగం. ఔషధ ఉత్పత్తుల పరిమాణం, విలువల పరంగా ప్రపంచంలోని టాప్ 10 దేశాలలో భారత్ ఒకటి. కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటుచేసిన సంస్థే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్). 1998లో మొదటి నైపర్ క్యాంపస్‌ను ఎస్ఏఎస్ నగర్ (మొహాలి)లో ప్రారంభించారు. తర్వాత 2007, 2008లో మరో ఆరు నైపర్లను ప్రారంభించారు. 2021 నైపర్ జేఈఈని హైదరాబాద్‌లోని నైపర్ నిర్వహిస్తుంది.
నైపర్ క్యాంపస్‌లు
అహ్మదాబాద్
గువాహటి
హాజీపూర్
హైదరాబాద్
కోల్‌కతా
రాయ్‌బరేలీ
మొహాలీ
కోర్సులు, స్పెషలైజేషన్లు
పీజీలు: ఎంఫార్మసీ, ఎంటెక్ (ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ), ఎంఎస్ (ఫార్మసీ), ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్).
ఎంఎస్ ఫార్మసీలో బయో టెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివైజ్‌లు, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మా కో ఇన్ఫర్మాటిక్స్, ట్రెడిషనల్ మెడిసిన్, రెగ్యులారిటీ టాక్సికాలజీ, మెడికల్ డివైజెస్, రెగ్యులేటరీ అఫైర్స్, క్లినికల్ రిసెర్చ్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎంఫార్మసీలో ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్ స్పెషలైజేషన్లను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.
ఎవరు అర్హులు?
కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ ఉత్తీర్ణత లేదా కొన్ని కోర్సులకు బీవీఎస్సీ, ఎంబీబీఎస్, నిర్దేశిత విభాగాల్లో ఎమ్మెస్సీ, బీటెక్ ఉత్తీర్ణులు. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం, పీహెచ్‌సీలకు 50 శాతం ఉండాలి. ప్రస్తుతం పైన పేర్కొన్న కోర్సులు ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు జీప్యాట్ /గేట్ /నెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. జీప్యాట్ స్కోర్ వ్యాలిడిటీ మూడేండ్లు.
పీహెచ్‌డీలు
బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివైజెస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మా కో ఇన్ఫర్మాటిక్స్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ).
అర్హతలు
ఈ విభాగాలను మూడు రకాలుగా విభజించారు. అవి కెమికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్. సంబంధిత విభాగాల్లో ఎంఎస్, ఎంటెక్, ఎమ్మెస్సీ తదితర పీజీలు చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్-జేఆర్ఎఫ్ అర్హత సాధించినవారు లేదా ఆ పరీక్షలకు హాజరై ఇంటర్వ్యూ నాటికి ఫైనల్ ఫలితాలను సమర్పించాలి.
నైపర్ జేఈఈ పరీక్ష విధానం
నైపర్లోని పీజీ కోర్సులన్నింటికి ఒకటే పరీక్ష.
ఈ పరీక్ష కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (ఆన్లైన్) విధానంలో నిర్వహిస్తారు.
ఇందులో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష వ్యవధి 2 గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.
ప్రశ్నలను బీఫార్మసీ, సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ సబ్జెక్టుల నుంచి ఇస్తారు.
జనరల్ ఆప్టిట్యూడ్ నుంచీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇందులో ప్రతిభ చూపిన వారికి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మాత్రం బృంద చర్చలు, ముఖాముఖి నిర్వహిస్తారు.
నోట్: ఎంబీఏ (ఫార్మా) అహ్మదాబాద్, హైదరాబాద్, ఎస్ఏఎస్ నగర్ (మొహాలీ) క్యాంపస్‌ల్లో మాత్రమే ఉంది.
ప్లేస్‌మెంట్స్
దేశంలోని ఏడు నైపర్ క్యాంపస్‌లకు అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ పీజీ, పీహెచ్డీ కోర్సులను పూర్తిచేసినవారికి దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఫార్మారంగంలో పరిశోధకులుగా, సైంటిస్టులుగా చేయవచ్చు. సన్‌ఫార్మా, బయోకాన్, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జీఎస్కే, అబాట్ ఇండియా, నొవార్టీస్ వంటి ప్రముఖ సంస్థలు మంచి ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ ఇస్తున్నాయి.
హైదరాబాద్ నైపర్
కొత్త ఔషధాల పరిశోధన, ఫార్ములా అభివృద్ధికి సంబంధించి పేటెంట్ హక్కులను పొందడంలో హైదరాబాద్ కేంద్రం ముందంజలో ఉంది. జాతీయ, అంతర్జాతీయ, ఫార్మా పరిశోధన సంస్థలు, ఫార్మా కంపెనీలతో నైపర్‌కు పలు ఒప్పందాలు ఉన్నాయి. అధునాతన పరికరాలతో కూడిన ల్యాబ్, గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రత్యేక హాస్టల్ సదుపాయం ఉంది.
ఇక్కడ ప్రతి ఏటా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతాయి. ఇక్కడ కోర్సులు పూర్తి చేసిన వారు అంతర్జాతీయ సంస్థల్లో మంచి స్థానాల్లో ఉద్యోగావకాశాలు పొందారు.
పీహెచ్డీ రాతపరీక్ష
పీహెచ్‌డీకి రాత పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది.
మొత్తం 170 ప్రశ్నలు ఉంటాయి. 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. కెమికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ఎంఎస్ (ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్ (ఫార్మా), ఎంవీఎస్సీ, ఎండీ, ఎంఎస్సీ స్థాయిల్లో ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జనరల్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కులను తగ్గిస్తారు.
రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారు ఇంటర్వ్యూకి హాజరుకావాలి. దీనికి 15 మార్కులు కేటాయించారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 8 పరీక్షతేదీ: జూన్ 5
(పీజీ, పీహెచ్‌డీలు రెండింటికీ వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు)
రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్సైట్: http://www.niper.nic.in
వెబ్సైట్: http://www.niperhyd.ac.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు