దేశంలో మేటి విద్యా సంస్థలు!
దేశంలోని విద్యాసంస్థల్లో ఆయా ప్రమాణాల ప్రకారం ఉత్తమమైనవాటిని ఎంపిక చేసి ప్రతి ఏటా కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో ర్యాంకులను ప్రకటిస్తుంది.
టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రిసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, గ్రాడ్యుయేషన్ అవుట్‌కమ్స్ తదితర అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను కేంద్రం ప్రకటిస్తుంది.
విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెపొందించడానికి ఈ ర్యాంకింగ్ తోడ్పడుతుంది.
ఎన్ఐఆర్ఎఫ్
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఎంహెచ్ఆర్డీ 2015 సెప్టెంబర్ 29న ప్రారంభించింది.
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) ర్యాంక్ తగ్గింది. గతేడాది బెస్ట్ యూనివర్సిటీల్లో ఆరో స్థానంలో నిలిచిన హైదరాబాద్ యూనివర్సిటీ.. 2021 ర్యాంకుల్లో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. అయితే ఇంజినీరింగ్ కాలేజీల ర్యాంకింగ్‌లో మాత్రం ఐఐటీ హైదరాబాద్ గతేడాది వచ్చిన ఏడో స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లోని వసతులు, టీచింగ్, పనితీరు, రిసెర్చ్, ఫలితాలు వంటి పలు అంశాల ఆధారంగా కేంద్ర విద్యాశాఖ దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలకు ర్యాంకులు ప్రకటించింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ సంస్థ రూపొందించిన ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్ హ్యాట్రిక్ కొట్టింది. దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ఈ ఇన్స్టిట్యూట్ మరోసారి టాప్‌గా నిలిచింది. ఓవరాల్ కేటగిరీలో ఇంజినీరింగ్ కేటగిరీలోనూ వరుసగా మూడోసారి ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అలాగే రిసెర్చ్ సంస్థల కేటగిరీలో బెంగళూరు ఐఐఎస్సీ మొదటి స్థానంలో నిలిచింది. ఓవరాల్ కేటగిరీలోనూ రెండోస్థానంలో నిలిచింది.
11 కేటగిరీలు..
మొత్తం పదకొండు కేటగిరీల్లో యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓవరాల్ కేటగిరీ, యూనివర్సిటీ, మేనేజ్మెంట్, కాలేజ్, ఫార్మసీ, మెడికల్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఏఆర్ఐఐఏ (అటల్ ర్యాకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్), లా, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కేటగిరీల్లో ఈ ర్యాంకులను వెల్లడించింది. అయితే ఈ రిసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ విభాగాన్ని కొత్తగా ఈ ఏడాదే ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల పరిధిలోకి కేంద్రం తీసుకువచ్చింది.
ఎన్ఐఆర్ఎఫ్ దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులు ఇవ్వడం ఇది వరుసగా ఆరో ఏడాది. ఈ సంవత్సరం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాం కింగ్ పోటీలో మొత్తం 6 వేల యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు పోటీ పడ్డాయి.
రాష్ట్రంలో విద్యా సంస్థల ర్యాంకింగ్స్
రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల ర్యాంకులను గతేడాదితో పోల్చి చూస్తే…
ఓవరాల్ విభాగంలో ఐఐటీహెచ్‌కు 2020లో 17వ ర్యాంక్ రాగా ఈసారి 16వ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా హెచ్‌సీయూ గతేడాది 15వ ర్యాంకులో ఉండగా ఈ ఏడాది 17వ స్థానంలో నిలిచింది. ఓయూ 53వ స్థానం నుంచి 62కు పడిపోయింది. ఎన్ఐటీ వరంగల్ గతేడాది 46వ ర్యాంకు ఉండగా ఈసారి 59వ ర్యాంక్ సాధించింది. ఇంజినీరింగ్‌లో ఐఐటీ హైదరాబాద్ గతేడాది, ఈ ఏడాది 8వ స్థానంలోనే ఉంది. ఎన్ఐటీ వరంగల్ 19వ ర్యాంక్ నుంచి 23కు పడిపోయింది. అదేవిధంగా ఐఐఐటీహెచ్ 57 నుంచి 62కు, జేఎన్టీయూహెచ్ 57 నుంచి 62కు, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ గతేడాది 88వ ర్యాంక్‌లో ఉండగా ఈ ఏడాది 132వ సాన్థంలో నిలిచాయి.
ఇతర విభాగాల్లో ఫార్మసీ విద్యలో హైదరాబాద్ నైపర్ 6వ స్థానంలో నిలిచింది. అనురాగ్ యూనివర్సిటీ 61, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ 72వ ర్యాంక్‌లో నిలిచాయి.
ర్యాంకుల మదింపు ఇలా!
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇవ్వడానికి కొన్ని పేరామీటర్స్ను పరిగణనలోకి తీసుకుంటారు. అవి వరుసగా..
బోధన, అభ్యాసం, వనరులు
సంస్థలో మొత్తం విద్యార్థులు, వారిలో డాక్టోరల్ కోర్సులు చదువుతున్నవారు, ప్రొఫెసర్స్, విద్యార్థుల నిష్పత్తి. ఫ్యాకల్టీల్లో పీహెచ్డీ చేసినవారు, ఆర్థిక వనరులు, వాటిని ఉపయోగించిన విధానాలను ఈ కేటగిరీ కింద పరిశీలిస్తారు.
పరిశోధన, వృత్తి అభ్యాసం
మొత్తం ఎన్ని పరిశోధన పత్రాలు/పుస్తకాలు ప్రచురించారు. వాటి నాణ్యత ఎలా ఉంది, పేటెంట్ హక్కులు ఎన్నింటికి వచ్చాయి, చేపడుతున్న ప్రాజెక్ట్‌లు తదితరాలు
పట్టాలు తీసుకునేవారు
విద్యాసంస్థ నుంచి మొత్తం ఎంత మంది విద్యార్థులు చేరారు. వారిలో పట్టాలు సాధించినవారు అంటే విజయవంతంగా కోర్సులను పూర్తిచేసిన వారి సంఖ్య తదితర అంశాలు
వైవిధ్యం
విద్యాసంస్థలో ఇతర దేశాలు, రాష్ర్టాల విద్యార్థులు ఎంతమంది చేరుతున్నారు. ఆర్థికంగా వెనుకబడినవారు, మహిళలు, దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలు
పీర్ పర్సెప్షన్ (Peer Perception )
ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేస్తున్న నిపుణులు, ఉద్యోగులు ఏ విద్యాసంస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, వారి అభిప్రాయాలు తదితర అంశాలు.
ఇలా పై అంశాలకు పాయింట్లను కేటాయిస్తారు. ఆయా సంస్థలు సర్టిఫై చేసి సమర్పించిన పత్రాలను పరిశీలించి, అవసరమైన వాటికి తనిఖీ, థర్డ్ పార్టీ విచారణ చేసి తుది మదింపును చేస్తారు.
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు