జానపద కళలు
యక్షగానం
యక్షగానం క్రీ.శ. 13వ శతాబ్దం నాటికే ఎంతో వైభవాన్ని సంతరించుకుంది. పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణలో యక్షగానం గురించి ఉంది. ఇందులో ‘నా దట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు, నాడెడు వార’ని వివరించాడు.
ఈ కళారూపం ‘కురవంజి’ లేదా ‘కొరవంజి’ అనుసరణ వచ్చిందని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. యక్షగానం మొట్టమొదట గానరూపంలో ఉండి క్రమక్రమంగా సంవాదరూపాన్ని సంతరించుకుంది.
- తెలుగులో రాసిన తొలి యక్షగానం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన ‘సౌభరిచరిత్రం’. సౌభరిచరిత్రం లభించని కారణంగా ఈ కళారూపంలో మొట్టమొదటగా కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవ విజయాన్ని తొలి తెలుగు యక్షగానంగా పేర్కొన్నారు.
- జక్కుల జాతివారు గానం చేసే కళనే ‘యక్షగానం’ అంటారు. సీతాకల్యాణం, ఉషాపరిణయం వంటి పౌరాణిక గాథలు యక్షగానంలో కనిపిస్తాయి. పురాణేతిహాసాల్లో ఒక ప్రసిద్ధమైన కథను నృత్యసంగీతంలో వినికిడి చేయడం యక్షగాన శైలి.
- ఈ కళ పుట్టిల్లు కర్ణాటక. అయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రలో కూడా దీనికి ఆదరణ ఉన్నది. తెలంగాణలో ధర్మపురి శేషాచల కవి, యాముజాల శేషాచల కవి, మద్దమ కవి మొదలైన వారు యక్షగానంలో తమ సేవలను అందించారు.
- యక్షగానాన్ని తెలంగాణ ప్రజలు ‘వీధిభాగోతం’ అని పిలుస్తారు. తిరునగరి రామాంజనేయులు పోలీసు చర్య తర్వాత ఒక వీధి భాగవతాన్ని రాశారు.
- తెలంగాణ యక్షగాన పితామహుడుగా ప్రసిద్ధి చెందిన కవి ‘చెర్విరాల భాగయ్య’. ఈయన రచనల్లో ముఖ్యమైనవి కనకతార, కాంతామతి చరిత్ర, అల్లిరాణి, రంభరంపాల, మాయాసుభద్ర మొదలైనవి.
- సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్‌తేజ రచించిన యక్షగానం ‘వీర తెలంగాణ’.
- యక్షగాన సాహిత్యంపై మొదటిసారి పరిశోధన చేసిన వాళ్లలో డా. ఎస్వీ జోగారావు ముఖ్యులు.
చిందు యక్షగానం
చిందు అనే కులం వారు ప్రదర్శించేది చిందు యక్షగానం. చిందు అంటే అడుగు. అడుగులు వేసే పద్ధతిలో ప్రత్యేక వైవిధ్యం గల యక్షగానమే చిందు యక్షగానం.
చిందు యక్షగానంలో సామాన్యంగా ఎల్లమ్మ చరిత్ర, లవకుశ, విప్రనారాయణ చరిత్రలను చెబుతారు. దీనిలో ఎల్లమ్మ పాత్ర ధరించి ఆ పాత్రకు వన్నెతెచ్చిన కళాకారిణి చిందు ఎల్లమ్మ.
గొంధళి
గొంధళి అని పిలుస్తున్న జానపద కళా పూర్వరూపం కుండలి. కుండలి అంటే కుండల ఆకారంలో గుండ్రంగా వేదిక మధ్య తిరుగుతూ ప్రదర్శించే కళ.
సాహిత్య గ్రంథాల్లో గొంధళి శాస్త్రీయ నృత్య రూపకంగా కాకుండా దేశీ నృత్య ప్రదర్శన కళగా ఆదరించబడిన జానపద కళ. దేశీయ కళలను మొట్టమొదట ప్రస్తావించినది హాలుని ‘గాథాసప్తశతి’.
నన్నయ ‘ఆంధ్రమహాభారతం’ మొదలు ప్రధాన తెలుగు సాహిత్య కళగా అభివర్ణించారు. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో గొంధళి కళాకారులు ఉన్నారు.
ఈ గొంధళిని కుండలినా పుష్పగంది అనే సుందరి ప్రదర్శించిందని చాలామంది కవులు తెలిపారు. కానీ పాల్కురికి కాకతీయుల కాలంలో పురుషులు ప్రదర్శించారని తన బసవపురాణంలో పేర్కొన్నాడు.
గొందెల నర్సింహారావు బృందం తుల్జాభవాని కథలో పాత్రలను అభినయించారు. అయితే తుల్జాభవాని కథ శివాజీ దండయాత్ర సమయంలో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు విస్తరించింది.
ఒగ్గుకథ
ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపుమే ‘ఒగ్గుకథ’ ఈ ఒగ్గుకథ జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన కళారూపం.
ఒగ్గు అనే వాయిద్యం శివుడి ఢమరుకాన్ని పోలి ఉంటుంది. కురుమ కులానికి చెందిన పురోహితులైన వీరశైవారాధకులు ప్రదర్శించిన కళారూపమే ఈ ఒగ్గుకథ. ఒగ్గుకథను చెప్పేవారు దీక్ష తీసుకుంటారు. దీక్ష అంటే శివుని శరణువేడుట.
ఒగ్గు దీక్షను స్వీకరించిన వారు మల్లన్న, బీరన్న కథలు చెపుతారు. ఇవే కాకుండా ఎల్లమ్మ కథ, శివకుమారుని కథ, బల్లూరి కొండయ్య కథ, మౌనధారి కథ మొదలైనవి చెబుతారు.
తెలంగాణ ప్రాంతంలో ‘గొల్లసుద్దులు’ అత్యంత ప్రచారంలో ఉన్న ఒగ్గుకథలు. కోయ తెగలోని చందా వంశస్థులు తెలంగాణలో మేడారం రాజ్యం కోసం పోరాడిన వీర వనిత సమ్మక్క కథ చెబుతారు.
శారద కథలు
శారద కథ కేవలం వృత్తిగాయకులు పాడే గానక కళారూపం. వీటిని వీరముష్టులు, జంగాల వారు పాడుకుంటారు. వీరు వాయించే తంబూరు పేరు ‘శారద’ కాబట్టి దీనిని ‘శారదకళ’ అంటారు. వీరిని ‘శారదకాండ్రు’ అంటారు.
తెలంగాణకు సంబంధించి సర్వాయి పాపన్నగౌడ్, సదాశివారెడ్డి వీరగాథలు చెబుతారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు లేదా కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురు కలిసిఈ పాట పాడుతూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ యాచిస్తూ వెళ్తుంటారు.
వీరు మున్నూరు, ముత్తరాశి మొదలైన కులాల నుంచి ఉద్భవించిన జాతుల్లో శారదకాండ్రు జాతి ఒకటని బిరుదురాజు రామరాజు తన జానపద వాజ్మయంలో ఉదహరించారు.
ముఖ్యంగా శారద కథలో చారిత్రక, సాంఘిక, పౌరాణిక కథలు గానం చేస్తారు.
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు