కరెంట్ అఫైర్స్-28-07-2021
ఆకాశ్ క్షిపణి
ఒడిశాలోని అబ్దుల్ కలాం ప్రాంగణం నుంచి ఆకాశ్ క్షిపణిని జూలై 21న డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఆకాశంలోకి పరీక్షించారు. దీని పరిధి 60 కి.మీ. ధ్వనికంటే 2.5 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఎంఆర్‌సామ్ క్షిపణి
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే మధ్యశ్రేణి తొలి క్షిపణి (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్-ఎంఆర్‌సామ్) వాయుసేనలో జూలై 20న చేరింది. 70 కి.మీ. దూరంలోని లక్ష్యాలను శబ్ద వేగాన్ని మించిన వేగంతో దూసుకెళ్తుంది. ఇజ్రాయెల్‌తో కలిసి డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ మిసైళ్లను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేస్తుంది.
ఎంపీఏటీజీఎం
‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (ఎంపీఏటీజీఎం)ను డీఆర్డీవో జూలై 21న విజయవంతంగా పరీక్షించింది. శత్రుదేశ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే సత్తా ఉన్న ఈ మిసైల్‌ను ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఎంపీఏటీజీఎం రకాల్లో మూడో తరానికి చెందిన ఈ మిసైల్‌ను ఎక్కడికైనా మోసుకెళ్లవచ్చు.
తొలి బర్డ్ ఫ్లూ మరణం
హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు జూలై 21న బర్డ్ ఫ్లూతో మరణించాడు. దేశంలో బర్డ్ ఫ్లూతో వ్యక్తి మరణించడం ఇదే తొలిసారి. న్యుమోనియా, లుకేమియా సమస్యలతో బాధపడుతున్న సుశీల్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడ నిర్వహించిన వైద్యపరీక్షలను పుణెలోని జాతీయ వైరాలజీకు పంపించగా అక్కడ బర్డ్ ఫ్లూగా తేలింది.
ఆదర్శసాగరిక
గుంటూరు జిల్లాలోని నాగార్జున కొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదర్శసాగరిక జాబితాలో కేంద్ర పర్యాటక శాఖ జూలై 21న చేర్చింది. వీటిలో వైఫై, ఇంటర్నెట్ సౌకర్యం, ఎగ్జిబిషన్ లైటింగ్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో భాగంగా కడప జిల్లాలోని గండికోటకు స్థానం కల్పించారు.
నేవీ విన్యాసాలు
బంగాళాఖాతంలో జూలై 20న ప్రారంభమైన భారత్-బ్రిటిష్ నేవీ విన్యాసాలు 22న ముగిశాయి. బ్రిటన్‌కు చెందిన హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ యుద్ధనౌక పాల్గొంది. వార్షిక కొంకణ్ పేరుతో ఈ విన్యాసాలు నిర్వహించారు.
యూనివర్సిటీల సదస్సు
హర్యానాలోని సోనిపట్ వద్ద ఉన్న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో వరల్డ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీల సదస్సును జూలై 22న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ‘యూనివర్సిటీ ఆఫ్ ది ఫ్యూచర్: బిల్డింగ్ ఇన్స్టిట్యూషనల్ రెసిలెన్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమ్యూనిటీ ఇంపాక్ట్’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించారు.
అంతర్జాతీయం
విశ్వాస పరీక్షలో గెలిచిన దేవ్బా
నేపాల్ నూతన ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఆ దేశ పార్లమెంట్లో జూలై 18న నిర్వహించిన విశ్వాస పరీక్షలో గెలిచారు. 275 సభ్యులున్న పార్లమెంటులో 249 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. దేవోబాకు అనుకూలంగా 165 ఓట్లు వచ్చాయి.
మంకీ బీ వైరస్
చైనాలో తొలిసారి ‘మంకీ బీ వైరస్’ సోకి 53 ఏండ్ల వైద్యుడొకరు మరణించినట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) జూలై 18న వెల్లడించింది. 1932లో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. కోతులకే సోకే ఈ వైరస్ అత్యంత అరుదుగా మనుషులకు సోకుతుంది. బీ వైరస్ ఉన్న కోతులు కరవడం, రక్కడం, వాటి శరీరంపై గాయాల ద్వారా ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది.
బెజోస్ అంతరిక్ష యాత్ర
జూలై 20న బెజోస్‌తో అంతరిక్షయాత్రలో పాల్గొన్న 82 ఏండ్ల మహిళ వేలీ ఫంక్, 18 ఏండ్ల ఒలివర్ డెమెన్ ప్రపంచంలోనే అతిపెద్ద, అతిపిన్న వయస్సు వ్యోమగాములుగా గుర్తింపు పొందారు. ఈ యాత్రలో బెజోస్ సోదరుడు మార్క్ బెజోస్ ఉన్నారు. ఈ నలుగురు 11 నిమిషాల్లో 105 కి.మీ. వరకు ప్రయాణించి భూమికి తిరిగివచ్చారు.
కరేజ్ అండ్ సివిలిటీ
అమెజాన్ వ్యవస్థాపకుడు, బ్లూ ఆరిజన్ సంస్థ స్థాపకుడు జెఫ్ బెజోస్ జూలై 21న ‘కరేజ్ అండ్ సివిలిటీ’ పేరుతో కొత్త అవార్డును నెలకొల్పారు. ఈ ప్రారంభ పురస్కారానికి స్పెయిన్‌కు చెందిన మానవతావాది, ప్రఖ్యాత చెఫ్ జోస్ ఆండ్రీస్, అమెరికాకు చెందిన రాజకీయ వార్తల వ్యాఖ్యాత వాన్ జోన్స్ ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద చెరో రూ.745 కోట్లు అందుకోనున్నారు.
జీ-20 సమావేశం
ఇటలీలోని నపోలి నగరంలో జీ-20 దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూలై 22న నిర్వహించారు. ఈ సమావేశంలో అమెరికా, రష్యాలో కొనసాగుతున్న అటవీ కార్చిచ్చులు-పశ్చిమ, యూరప్‌లో వరదలు వంటి పరిస్థితులపై చర్చించారు. జీవవైవిధ్యం, మహాసముద్రాల రక్షణ, సర్కిల్ ఎకనామిక్స్‌ను ప్రోత్సహించడం, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించే ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. 1999, సెప్టెంబర్ 25న జీ-20 ఏర్పడింది.
3డీ ఉక్కు వంతెన
ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ముద్రిత పాదచారుల ఉక్కు వంతెను ఆమ్స్టర్డామ్ నగరంలోని ఔడెజిజ్డ్స్ అచ్టెర్బుర్గ్వాల్ కాలువపై నిర్మించారు. ఈ వంతెనను జూలై 22న నెదర్లాండ్స్ రాణి మార్సిమా ప్రారంభించారు.
వార్తల్లో వ్యక్తులు
దానిష్ సిద్దిఖీ
ఆఫ్ఘనిస్థాన్ కాందహార్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో తాలిబన్లు, ప్రభుత్వ దళాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చిత్రీకరించడానికి వెళ్లిన భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ జూలై 16న హత్యకు గురయ్యారు. పులిట్జర్ అవార్డు అందుకున్న ఆయన రాయిటర్స్ వార్తా సంస్థలో చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
బషర్ అసద్
సిరియా దేశ అధ్యక్షుడిగా బషద్ర్ అసద్ జూలై 17న ప్రమాణం చేశారు. మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఆయన 95.1 శాతం ఓట్లు సాధించారు. ఆయన ఈ పదవిని చేపట్టడం వరుసగా ఇది నాలుగోసారి. ఆ దేశాధ్యక్ష పదవి ఏడేండ్లు ఉంటుంది. 1970లో ఆయన తండ్రి హఫీజ్ సైనిక తిరుగుబాటు ద్వారా అధికార పగ్గాలు చేపట్టారు. 2000లో ఆయన మరణించడంతో బషర్ అధ్యక్షుడయ్యారు.
వైదేహి డోంగ్రే
జూలై 20న నిర్వహించిన మిస్ ఇండియా యూఎస్ఏ-2021 పోటీల్లో మిషిగన్‌కు చెందిన వైదేహి డోంగ్రే విజేతగా నిలిచారు. ప్రస్తుతం ఈమె బిజినెస్ డెవలపర్‌గా పనిచేస్తుంది. 30 రాష్ర్టాల నుంచి 61 మంది పాల్గొన్న ఈ పోటీలో తొలి రన్నరప్‌గా జార్జియాకు చెందిన ఆర్షి లాలాని నిలిచారు.
జూకంటి జగన్నాథం
తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రదానం చేస్తున్న సి.నారాయణరెడ్డి (సినారె) పురస్కారం 2021కు గాను కవి జూకంటి జగన్నాథం జూలై 20న ఎంపికయ్యారు. జూలై 29న తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్తంగా నిర్వహించనున్న సినారె 90వ జయంతుత్సవంలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద రూ.25 వేల నగదు అందజేస్తారు.
ఎల్లూరి శివారెడ్డి
తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్, సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి జూలై 21న ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.1,01,116 నగదును అందజేస్తారు. ఆయన 1945, ఏప్రిల్ 7న మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్లూరు గ్రామంలో జన్మించారు.
క్రీడలు
విశ్వనాథన్ ఆనంద్
జూలై 18న నిర్వహించిన స్పార్క్సెన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్‌తో జరిగిన నాలుగు రౌండ్ల పోటీలో ఆనంద్ 2.5-1.5తో గెలిచాడు. ‘క్యాజ్లింగ్’ మూవ్ లేకుండా ఈ పోటీలను నిర్వహించారు.
హామిల్టన్
జూలై 19న నిర్వహించిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సాధించాడు. ఈ టైటిల్‌ను ఆయన గెలవడం ఇది ఎనిమిదోసారి. మొత్తంగా 99వ టైటిల్ విజేత. 7 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్నాడు. బ్రిటన్ అత్యున్నత అవార్డు నైట్‌హుడ్‌ను అందుకున్నారు. ఈ ఏడాదిలో అతడికిది నాలుగో టైటిల్.
బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్స్
2032 ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) జూలై 21న ఎంపికచేసింది. 2024 ఒలింపిక్స్ పారిస్‌లో, 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలో మూడో అతిపెద్ద నగరమైన బ్రిస్బేన్ క్వీన్స్లాండ్ రాష్ర్టానికి రాజధాని. ఆస్ట్రేలియాలో తొలిసారి 1956లో మెల్బోర్న్లో, రెండోసారి 2000లో సిడ్నీలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించారు. దీంతో అమెరికా తర్వాత మూడు వేర్వేరు నగరాల్లో ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశం దక్కిన దేశం ఆస్ట్రేలియానే.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు