జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్స్ వాయిస్
ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా !
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రపంచంలో అత్యంత కష్టమైన పరీక్షల్లో ఒకటి. అలాంటి పరీక్షలో టాప్ ర్యాంక్‌లు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి దేశంలో ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మన రాష్ర్టానికి చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఆల్ ఇండియా 4వ ర్యాంక్ సాధించిన సంతోష్‌రెడ్డి, బాలికల విభాగంలో ఆల్ ఇండియా 2వ ర్యాంక్ సాధించిన భావన నమస్తేతో పంచుకున్న విషయాలు…
ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్ సాధించిన సంతోష్‌రెడ్డి నమస్తేతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లో…మాది యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం నారాయణగిరి గ్రామం. నాన్న చంద్రశేఖర్ రెడ్డి రైతు. అమ్మ గృహిణి. అన్న రమణారెడ్డి బీటెక్ చదువుతున్నాడు.
చదువు వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి వరకు చదివాను. ఐదు నుంచి పది, ఇంటర్ నల్లకుంటలో చదివాను.
ఆరోతరగతి నుంచే..
అమ్మానాన్నలు కష్టపడి చదివించారు. ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో చిన్నప్పటి నుంచే అటువైపు అడుగులు వేయించారు. దీనికి సంబంధించి ఆరోతరగతి నుంచే ప్రారంభించాను. ఎనిమిదో తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాను. స్కూల్లో చెప్పిన ప్రతి పాఠాన్ని ఆకళింపు చేసుకునేవాడిని. ప్రతీది కాన్సెప్ట్ బేస్డ్గా చదివాను. ఇంటర్లో పూర్తి స్థాయిలో ఐఐటీ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలపై శ్రద్ధ పెట్టాను. కాలేజీలో లెక్చరర్స్ చెప్పిన ప్రతి అంశాన్ని కూలంకషంగా చదివాను, కాన్పెస్ట్‌ను అర్థం చేసుకుని, వాటిని బాగా ప్రాక్టీస్ చేశాను.
ఎగ్జామ్‌లో స్ట్రాటజీ
ఎగ్జామ్‌లో బలాలు, బలహీనతల ఆధారంగా స్ట్రాటజీని ఎంపిక చేసుకున్నాను.
పరీక్షలో కెమిస్ట్రీ బిట్స్ మొదట పూర్తిచేశాను. తర్వాత మ్యాథ్స్, ఆ తర్వాత ఫిజిక్స్ బిట్స్‌ను పూర్తి చేశాను.
భవిష్యత్తులో పరీక్ష రాసేవారికి..
ఏ పోటీ పరీక్ష రాసే వారైనా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలను పాటించడంవల్లనే ఈ విజయం సాధించాను. ఆ అంశాలు..
ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరంతరం ఒకటే లక్ష్యంతో చదవాలి.
ప్రతిరోజు కనీసం 10-12 గంటలు చదవడం మంచిది.
వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయాలి.
ప్రతి టెస్ట్ రాసి వదిలి వేయకుండా ఆ టెస్ట్‌లో మనం చేసిన తప్పులను చూసుకుని ఎర్రర్ అనాలసిస్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్యూచర్లో అటువంటి తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడతాం.
స్థిరమైన లక్ష్యంతో, స్థిరమైన మనస్సుతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
ముఖ్యంగా పరీక్ష సమయంలో మొబైల్స్‌కు దూరంగా ఉండాలి.
జేఈఈ విషయంలో మ్యాథ్స్ బిట్స్‌ను స్పీడ్‌గా చేయాలి. దీనికోసం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటేనే వీటికి సరైన జవాబులను గుర్తించగలుగుతాం. కాన్సెప్ట్ అర్థం చేసుకుని అప్లికేషన్ టైప్ ప్రశ్నలను సాల్వ్ చేయడం ఎక్కువగా చేయాలి. కెమిస్ట్రీ ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. సాధ్యమైనన్ని సార్లు కెమిస్ట్రీని రివిజన్ చేయాలి.
విజయం వెనుక
తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల సహకారంతో ఈ విజయం సాధించాను. యాభై నుంచి వందలోపు ర్యాంక్ వస్తుందనుకున్నాను. కానీ నాలుగో ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది.
ప్యూచర్..
ప్రస్తుతానికి ఐఐటీ బాంబేలో సీఎస్ఈలో చేరడం. ఆ తర్వాత మంచి ఉద్యోగం చేయాలన్నదే ఆశయం.
రామస్వామి సంతోష్‌రెడ్డి
జేఈఈ అడ్వాన్స్డ్ 4వ ర్యాంక్
సివిల్స్‌కు ప్రిపేర్ కావడమే లక్ష్యం: పల్లె భావన
జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బాలికల విభాగంలో ఆలిండియా రెండో ర్యాంకు, సౌత్ ఇండియా లెవల్లో మొదటి ర్యాంకు, జేఈఈ మెయిన్స్ బాలికల విభాగంలో
ఆలిండియా నాలుగో ర్యాంకు సాధించింది పల్లె భావన. ఆమె నేపథ్యం ఆమె మాటల్లో తెలుసుకుందాం..
కుటుంబం
మాది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని లింగవారిగూడెం గ్రామం. తల్లిదండ్రులు శేఖర్‌రెడ్డి, సరళ. వ్యవసాయ కుటంబం. అన్నయ్య ప్రణయ్ రెడ్డి ట్రిపుల్ ఐటీ శ్రీసిటీ చెన్నైలో బీటెక్ సెకండియర్ ఇయర్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేదానిని. 1 నుంచి 5 వరకు చౌటుప్పల్‌లో, 6 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్‌లోని వనస్థలిపురం, ఇంటర్ మాదాపూర్‌లో చదివాను.
ర్యాంకు రావడం ఎలా ఉంది?
జేఈఈ అడ్వాన్స్‌లో బాలికల విభాగంలో ఆలిండియా రెండో ర్యాంకు, దక్షిణ భారత్‌లో మొదటి ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో 4వ ర్యాంకు సాధించండం చాలా సంతోషంగా ఉంది. జేఈఈ అడ్వాన్స్‌లో 283 మార్కులు, మెయిన్స్‌లో 99.9934737 శాతం వచ్చాయి. మంచి ర్యాంకు వస్తుందనుకున్నాను. కానీ 2వ ర్యాంకు వస్తుందని అనుకోలేదు.
ఇష్టంగా చదివాను
రోజుకు 12 గంటలు కష్టంగా కాకుండా ఇష్టంగా చదివాను. ప్రతిరోజు ఉదయం న్యూస్ పేపర్ చదవడం అలవాటు. టైం టేబుల్ ప్రకారం చదవడం, కాలేజీ మెటీరియల్, ఎన్సీఆర్టీ, షార్ట్ నోట్స్‌లు, మాక్ టెస్టులు రాయడం వల్ల ఫైనల్ పరీక్షలు బాగా రాయగలిగాను. ఉపాధ్యాయులు ప్రమీల, స్రవంతి, కృష్ణకుమార్ల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉత్తమ ర్యాంకు సాధించాను.
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి
జేఈఈ అడ్వాన్స్, మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేవారు మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. ఎన్సీఆర్టీ మెటీరియల్‌ని బాగా చదవాలి. ప్రీవియస్ అడ్వాన్స్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. అధ్యాపకులతో ఇంటరాక్ట్ అయి ఉండి డౌట్స్‌ను ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవాలి.
లక్ష్యం ఏంటి?
ఐఐటీ కంప్యూటర్ సైన్స్ బాంబేలో పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ కావడం నా లక్ష్యం.
-షేక్ పాష, సంస్థాన్ నారాయణపురం రిపోర్టర్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు