UPSC Success Stories | నాన్న ప్రోత్సాహంతో విజయం
సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజం
2022 సివిల్స్ ఫలితాల్లో ఆల్ఇండియా మూడో ర్యాంకు
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించడానికి ఎంతకాలమైనా ఎదురుచూడవచ్చని నిరూపించింది. అందుకే నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమైనా కలత చెందకుండా ధైర్యంతో ముందడుగు వేసింది. ప్రతి ఒటమినీ గెలుపునకు నాందిగా మార్చుకుంది. ఆమెను ఐఏఎస్‌గా చూడాలనుకున్న తండ్రి కోరికను నెరవేర్చింది. ఐదోసారి లక్ష్యాన్ని చేరుకుని విజయ బావుటా ఎగురవేసింది. ఏకంగా ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించి ఔరా అనిపించింది. ఆమే నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి. సివిల్స్ సాధించడానికి ఆమె ప్రిపరేషన్ విశేషాలు పంచుకున్నారు.
విద్యాభ్యాసం ఎక్కడ?
నాన్న ఐపీఎస్ కావడం వల్ల నా చదువు చాలా ప్రాంతాల్లో సాగింది. 6 నుంచి ఇంటర్, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ హైదరాబాద్‌లోనే పూర్తి చేశాను. ప్లేస్మెంట్ వచ్చినప్పటికీ ఐఏఎస్ కావాలన్న మా నాన్న ఆశయాన్ని, చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు ఉద్యోగం చేయకుండా సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యాను.
కోచింగ్ తప్పనిసరిగా తీసుకోవాలా?
ఢిల్లీలోని వాజీరాం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నప్పటికి కోచింగ్ అవసరం లేకున్నా చదవొచ్చని ఇంటికి వచ్చాను. నాన్న మహబూబ్‌నగర్ ఏఎస్పీగా పనిచేస్తున్న కాలంలో అక్కడే ఉండి చదివాను. ప్రస్తుతం నారాయణపేట ఎస్పీగా పనిచేస్తుండటంతో ఏడాది కాలంగా ఇక్కడే ఉంటూ ప్రిపేరయ్యాను. గతంలో నాలుగు సార్లు పరీక్ష రాసినా ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావడంతో ఎంపిక కాలేదు. ఐదో సారి పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్‌తో పరీక్ష రాశాను. అనుకున్నది సాధించాను. తమ్ముడు సాయి వికాస్ కూడా యూపీఎస్సీ 2022లో ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)లో ఆల్ ఇండియా స్థాయిలో 12వ ర్యాంక్ సాధించి, మే 22న ముంబైలో ఉద్యోగంలో చేరాడు.
మీకు స్ఫూర్తి ఎవరు?
అమ్మానాన్న, తమ్ముడు. ముఖ్యంగా నాన్న. ప్రజలకు సేవ చేయడానికి ఐఏఎస్ మంచి ప్లాట్‌ఫాం అని నాన్న తరుచూ చెబుతుండేవారు. నాన్న మీద ప్రేమతో ఐఏఎస్ సాధించాలని లక్ష్యం పెట్టుకొని సాధించాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
ఇంటి వద్దనే ఉండి ఇంటర్నెట్లో అవసరమైన పూర్తి మెటీరియల్‌ను డౌన్లోడ్ చేసుకొని నాకు అనుగుణంగా తయారు చేసుకున్నాను. అందుకు అవసరమైన కంప్యూటర్, ప్రింటర్లను నాన్న ఏర్పాటు చేశారు.
రోజూ ఎన్ని గంటలు చదివారు?
అందరూ 12 నుంచి 18 గంటలు చదవాలేమో అనుకుంటారు. కానీ ఏకాగ్రతతో తక్కువ సమయంలోనే ఎక్కువ నాలెడ్జ్ పొందొచ్చు. మొదటిసారి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువసేపే చదివేదాన్ని. ఈసారి మాత్రం ఏడు నుంచి ఎనిమిది గంటలు చదివాను. నా ఆప్షనల్ సబ్జెక్టు ఆంత్రోపాలజీ.
ఫెయిల్యూర్‌ను ఎలా జయించారు?
నాలుగు సార్లు ప్రయత్నించినా అనుకున్న లక్ష్యం నెరవేరకపోయే సరికి చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ అందరిలా దిగులు చెందలేదు. దాన్ని అధిగమించేందుకు యోగా, టెన్నిస్, రన్నింగ్ వంటి వాటితో పాటు ఇష్టమైన సినిమాలు, సీరియల్స్ చూసేదాన్ని. ఎవరైనా సరే ఒకసారి ఫెయిల్ అయ్యామని చదవడం ఆపేస్తే అనుకున్నది సాధించలేరు.
ఐఏఎస్‌గా దేనికి ప్రాధాన్యతనిస్తారు?
మహిళలు, విద్యా రంగం. దేశం ఎంత అభివృద్ధి సాధించినా నేటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంకా చదువులో, ఇతర రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వారి ఆర్థిక పురోగతి కోసం కృషి చేస్తా. చదువుకుంటే ఏదైనా సాధించొచ్చు. అందుకోసం నాణ్యమైన విద్య అందించేలా పాలన సాగిస్తా.
ఆలిండియా 3వ ర్యాంక్ వస్తుందని ఉహించారా?
తప్పకుండా ఈసారి ర్యాంక్ వస్తుందని నమ్మకం ఉండేది. కానీ ఆలిండియా 3వ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. ఈ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది.
సహకరించిన స్నేహితులు?
ఇదివరకు ఐఏఎస్‌కు ఎంపికైన నిఖిల్‌తో పాటు అంకిత, దీక్షిత సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. మేం ఆరుగురం ఫ్రెండ్స్. ఈసారి పరీక్షలు రాస్తే అందులో నాతో పాటు పవన్ దత్త, జయసింహారెడ్డి, అక్షయ్దీపక్ ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
సివిల్స్‌కు ప్రిపేరవుతున్నవారికి మీరిచ్చే సలహాలు, సూచనలు?
ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి. ఒక లక్ష్యం నిర్దేశించుకొని దానికనుగుణంగా పనిచేయాలి. అందుకోసం ఏం అవసరమో ముందుగానే గుర్తించాలి. మనకు కావాల్సిన మెటీరియల్‌ను మనమే తయారు చేసుకోవాలి. అందుకు ఇంటర్నెట్ను ఉపయోగించాలి. గత ప్రశ్నపత్రాలను సేకరించి ప్రిపేర్ కావాలి. లక్షల మంది రాసే సివిల్స్‌ను ఒక్కసారికే సాధిస్తా అని అనుకోవద్దు. లాంగ్ టైం లక్ష్యం పెట్టుకొని సన్నద్ధం కావాలి. అంతేకానీ.. ఒకసారి సెలెక్ట్ కాకపోతే దిగులు చెందొద్దు. ఒత్తిడిని జయించాలి. అందుకు చదువు మధ్యలో ఆటలకు ప్రాధాన్యమివ్వాలి.
– కే నవీన్ కుమార్, నారాయణ్‌పేట
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు