Indian Polity | పౌరసత్వ రూపకల్పన.. పార్లమెంటుకు అధికారం
పౌరసత్వం అర్థ వివరణ
- పౌరసత్వం అనే పదం ఆంగ్లభాషలోని ‘citizenship’ అనే పదానికి అనువాదం. సిటిజన్‌షిప్ అనే పదం లాటిన్ భాషలోని ‘సివిస్’, ‘సివిటాస్’ అనే పదాల నుంచి ఉద్భవించింది. సివిస్ అంటే పౌరులు అని అర్థం. సివిటాస్ అంటే నగరం అని అర్థం.
- ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో పౌరసత్వ భావన మొదటిసారి అవతరించిందని చెప్పవచ్చు. ప్రపంచ యుద్ధాల తర్వాత ఏర్పడిన జాతీయ రాజ్యాల నేపథ్యంలో పౌరసత్వం అనే భావన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
- ఆధునిక దేశాల్లో ప్రజలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. పౌరులు, విదేశీయులు.
- పౌరులకు ఆ రాజ్యంలో పౌర, రాజకీయ హక్కులను కల్పిస్తారు. విదేశీయులకు మానవతా దృష్ట్యా కొన్ని పౌర హక్కులను మాత్రమే కల్పిస్తారు. కాబట్టి పౌరసత్వం అనే హోదా రాజ్యం పౌరులకు కల్పించిన రాజకీయ పౌర హక్కుల ప్రాతిపదికపైన గుర్తించబడుతుంది.
పౌరసత్వం-రాజ్యాంగ ప్రకరణలు-పార్లమెంటు చట్టాలు - రాజ్యాంగంలోని రెండో భాగంలో ప్రకరణ 5 నుంచి ప్రకరణ 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పొందుపరిచారు.
- దేశ విభజన నేపథ్యంలో రాజ్యాంగం తయారు కావడం చేత పౌరసత్వానికి సంబంధించిన సమగ్ర అంశాలను పొందుపరచడానికి ఆనాటి పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుచేత పౌరసత్వానికి సంబంధించిన ఇతర అన్ని అంశాలను రూపొందించటానికి రాజ్యాంగం పార్లమెంటుకు అధికారాన్ని కల్పించింది.
- రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకుని పార్లమెంటు పౌరసత్వ చట్టాన్ని 1955లో రూపొందించింది.
- ఈ చట్టాన్ని 1957, 1960, 1985, 1986, 2003, 2005, 2015, 2016, 2017, 2019లో సవరించారు.
- పౌరులకు ప్రత్యేక హక్కులు
- భారత రాజ్యాంగంలో కొన్ని పదవులు, హక్కులు భారతీయ పౌరులకు మాత్రమే కల్పించబడ్డాయి. ఉదాహరణకు ఉన్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అలాగే ఇతర ప్రజా పదవులకు భారతీయ పౌరులు అర్హులు.
పౌరులకు వర్తించే ప్రత్యేక స్వాధికారాలు - ప్రకరణ 15 ప్రకారం పౌరులను జాతి, మత, కుల, లింగ, పుట్టుక ప్రాతిపదికలపై వివక్ష చూపొద్దు.
- ప్రకరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు భారత పౌరులే అర్హులు.
- ప్రకరణ 19 ప్రకారం, భావ వ్యక్తీకరణ, సంచార, స్థిర నివాస, సంఘాలు ఏర్పర్చుకునే స్వేచ్ఛ పౌరులకే పరిమితం.
- ప్రకరణ 29 ప్రకారం, సాంస్కృతిక విద్యా హక్కులు పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
- భారతదేశంలో నివసించే విదేశీయులకు పౌరులతో సమానంగా కల్పించబడిన హక్కులు
- ప్రకరణ 14- చట్టం ముందు అందరూ సమానులే
- ప్రకరణ 20- అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ
- ప్రకరణ 21- జీవించే హక్కు
- ప్రకరణ 21A – విద్యా హక్కు
- ప్రకరణ 22- అక్రమ అరెస్టులకు రక్షణ
- ప్రకరణ 23- పీడనాన్ని నిరోధించే హక్కు
- ప్రకరణ 24- బాలకార్మిక వ్యవస్థ రద్దు
- ప్రకరణ 25- మత స్వేచ్ఛ
- ప్రకరణ 27- మత ప్రాతిపదికపైన పన్ను విధింపుపై ఆంక్షలు
- ప్రకరణ 28- ప్రత్యేక మత బోధన చేయొద్దు
- పౌరసత్వ ప్రాతిపదిక- రాజ్యాంగ ప్రకరణలు
- రాజ్యాంగంలో 5 నుంచి 11 వరకు గల ప్రకరణల ప్రకారం కింది వారిని పౌరులుగా పరిగణిస్తారు.
- ప్రకరణ 5 ప్రకారం.. 1950, జనవరి 26 అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి దేశంలో నివసించే పౌరులు భారతీయులే.
- రాజ్యాంగం అమలు నాటికి ముందు ఐదు సంవత్సరాల నుంచి భారత్‌లో నివసించే వారు కూడా భారతీయులే. అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో జన్మించిన వారందరూ భారతీయులే.
- ప్రకరణ 6 ప్రకారం.. పాకిస్థాన్ నుంచి ఇండియాకు వలస వచ్చినవారు 1948, జూలై 19 వరకు తమ పేర్లను సంబంధిత కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకున్నచో వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ పద్ధతిలో పౌరసత్వాన్ని పొందేవారు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పౌరులుగా నమోదై ఉండాలి.
- ప్రకరణ 7 ప్రకారం.. పాకిస్థాన్‌కు వలసవెళ్లి తదనంతర కాలంలో తిరిగి భారతదేశానికి వచ్చి 1948, మార్చి 21వ తేదీలోగా కమిషనరేట్ల వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నవారికి భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే వీరందరూ భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం భారతీయులై ఉండాలి.
- ప్రకరణ 8 ప్రకారం.. తల్లిదండ్రులు, మాతామహులు, పితామహులు కనీసం ఒకరైనా భారతీయ సంతతికి చెంది ఉన్నట్లయితే అలాంటివారు రక్త సంబంధం ప్రాతిపదికన భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.
l ప్రకరణ 9 ప్రకారం.. భారతీయ పౌరులు స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందితే, సహజంగానే భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. - ప్రకరణ 10 ప్రకారం.. దేశ పౌరులుగా పరిగణింపబడేవారు భారతదేశ పౌరులుగా కొనసాగుతారు. వాటికి సంబంధించిన నియమాలను పార్లమెంటు రూపొందిస్తుంది.
- ప్రకరణ 11 ప్రకారం.. పౌరసత్వానికి సంబంధించిన అన్ని అంశాలపై అంటే పౌరసత్వం పొందే పద్ధతులు, రద్దు చేసే పద్ధతులపై పార్లమెంటుకే అంతిమ అధికారం ఉంటుంది.
భారతదేశంలో పౌరసత్వాన్ని పొందే పద్ధతులు
- భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం కింది పద్ధతుల్లో పొందవచ్చు.
పుట్టుక ద్వారా పౌరసత్వం - 1950, జనవరి 26 తర్వాత, 1987, జూలై 1 లోపల దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడవుతాడు. దీన్నే లాటిన్ భాషలో Jus-Soli (Right of the Soil) అంటారు.
- 1987, జూలై 1 తర్వాత దేశంలో పుట్టినవారు భారత పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరుడై ఉండాలి.
- 1994, డిసెంబర్ 3న చేసిన సవరణ ప్రకారం తల్లిదండ్రులిద్దరు కూడా భారతీయ పౌరులై ఉంటేనే వారి పిల్లలకు భారత
పౌరసత్వం వస్తుంది.
గమనిక: దేశంలో పని చేస్తున్న విదేశీ రాయబారుల పిల్లలకు పుట్టుకతో పౌరసత్వం రాదు.
వారసత్వం ద్వారా పౌరసత్వం - 1950, జనవరి 26 తర్వాత, 1992, డిసెంబర్ 10 లోపు దేశం బయట జన్మించిన వారి తండ్రి భారతీయ పౌరుడైతే ఆ సంతానానికి భారతీయ పౌరసత్వం వస్తుంది. దీన్నే లాటిన్ భాషలో Jus-sanguinis (Right of blood) అంటారు.
- అయితే 1992, డిసెంబర్ 10 తర్వాత జన్మించిన వారికి భారత పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారతీయ పౌరుడై ఉండాలి. వారి పుట్టుకను భారత విదేశాంగ శాఖలో ఒక సంవత్సరం లోపల నమోదు చేయాలి.
- ఒకవేళ పుట్టిన దేశంలో కూడా పౌరసత్వం వస్తే మేజర్ అయిన తర్వాత భారత పౌరసత్వాన్ని వదులుకోవాలి.
రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం - కొన్ని వర్గాలవారు భారత ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొంది ఉంటారు. వారి రిజిస్ట్రేషన్ సంబంధిత అధికారి ముందు జరిగి ఉండాలి.
- భారత సంతతికి చెందినవారు భారతదేశంలో ఏడు సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉండాలి.
- భారతీయ పౌరులను వివాహం చేసుకున్న విదేశీయులకు కూడా భారత పౌరసత్వం వస్తుంది. అయితే వారు ఏడు సంవత్సరాలు భారతదేశంలో సాధారణ నివాసి అయి ఉండాలి.
- భారత పౌరుల మైనర్ పిల్లలు పూర్తి వయస్సు, సమర్థత కలిగిన వ్యక్తి అయి ఉండాలి.
సహజీకృత పౌరసత్వం - భారత ప్రభుత్వం రూపొందించిన చట్టాలకు లోబడి నిర్ణీత అర్హతలు కలిగి దరఖాస్తు చేసుకున్న విదేశీయులకు భారత పౌరసత్వం కల్పించబడుతుంది. అయితే వారు కింది అర్హతలు కలిగి ఉండాలి.
1. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం ఉండాలి.
2. సత్ప్రవర్తన కలిగి ఉండాలి.
3. అంతకుముందు కలిగి ఉన్న విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి.
4. దరఖాస్తు సమర్పించే తేదీకి ముందు 12 నెలల నుంచి దేశంలో నివసించి ఉండాలి లేదా భారత ప్రభుత్వ సర్వీసులో ఉండాలి లేదా ఈ 12 నెలల కాలంలో రెండూ కలిపి కూడా ఉండవచ్చు.
5. పైన పేర్కొన్న 12 నెలల ముందు కాలంలో గడిచిన 14 సంవత్సరాల్లో కనీసం 11 సంవత్సరాల పాటు అతడు దేశంలో నివసించి ఉండాలి లేదా భారత ప్రభుత్వ సర్వీసు చేసి ఉండాలి. - అయితే పై అర్హతలను కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయించవచ్చు. విదేశాలకు చెందిన మేధావులకు, శాస్త్రవేత్తలకు, గొప్ప వ్యక్తులకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది.
భూభాగాల విలీనం ద్వారా - భారత భూభాగంలోకి ఏదైనా ప్రాంతం విలీనమైతే ఆ ప్రాంత ప్రజలకు భారత పౌరసత్వం లభిస్తుంది. (పాండిచ్చేరి, గోవా భారత్‌లో చేరడం)
- పౌరసత్వాన్ని రద్దు పరిచే విధానం
- భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం పౌరులు కింది పద్ధతుల్లో పౌరసత్వాన్ని కోల్పోతారు.
- స్వచ్ఛంద రద్దు లేదా పరిత్యాగం- భారతీయులు ఎవరైనా స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని వదులుకోవచ్చు. అతని ప్రకటన నమోదైన వెంటనే పౌరసత్వం రద్దవుతుంది. అయితే భారతదేశం యుద్ధంలో నిమగ్నమైన కాలంలో అతని పౌరసత్వానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నిలిపివేయడం జరుగుతుంది. ఒక పౌరుడు తన పౌరసత్వాన్ని పరిత్యాగం చేసినప్పుడు మైనర్ బాలల పౌరసత్వం కూడా పోతుంది. అయితే వారు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత తిరిగి భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.
- సమాపనం/తొలగించుట- ఏ రకమైన ఒత్తిడికి, ప్రభావానికి, నిర్బంధానికి గురి కాకుండా ఒక వ్యక్తి తనంతట తానుగా వేరొక దేశం పౌరసత్వాన్ని పొందితే అతనికి భారత పౌరసత్వం వెంటనే అంతమవుతుంది. అయితే భారతదేశం యద్ధంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఇది వర్తించదు.
- బలవంతంగా రద్దు చేయడం లేదా విహీనత- పౌరులు ఎవరైనా దేశద్రోహానికి పాల్పడినా, రాజ్యానికి విధేయత ప్రకటించకపోయినా, యుద్ధ సమయంలో శత్రు దేశాలకు సహాయపడినా, దేశ సాధారణ పౌరుడిగా ఉండి ఏడు సంవత్సరాల పాటు విదేశాల్లో నివసించి ఉన్నా, పౌరసత్వాన్ని పొందిన ఐదు సంవత్సరాల లోపు ఏ దేశంలోనైనా రెండు సంవత్సరాల శిక్షను అనుభవించి ఉన్నా పౌరసత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తారు. భారత పౌరసత్వాన్ని తప్పుడు పద్ధతి ద్వారా పొందినప్పుడు కూడా రద్దవుతుంది.
- ఒక సాధారణ పౌరుడు నిరవధికంగా ఏడు సంవత్సరాలు విదేశాల్లో నివసించినప్పుడు కూడా రద్దవుతుంది. అయితే విదేశంలో ఉన్న విద్యార్థికి అంతర్జాతీయ సంస్థల్లో పని చేస్తున్న వ్యక్తులకు భారత కాన్సులేట్ వద్ద సంవత్సరానికి ఒకసారి రిజిస్టర్ చేసుకునేవారికి ఇది వర్తించదు.
భారత పౌరసత్వ స్వభావం- ఏక పౌరసత్వం
- సమాఖ్యల్లో సాధారణంగా ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఉదాహరణకు అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంది.
- దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉన్నప్పటికీ ఏకపౌరసత్వాన్ని కొనసాగించారు. అందువల్ల ఈ లక్షణాన్ని సమాఖ్య విరుద్ధ లక్షణంగా పరిగణిస్తారు.
- భారతదేశంలో ఏకపౌరసత్వం ఉన్నప్పటికీ, ద్వంద్వ పౌరసత్వంలోని పరిమితులు ఉన్నాయనే విమర్శ ఉంది.
పరిమితులు - దేశంలో ఎక్కడ జన్మించినా ఒకే పౌరసత్వాన్ని పొందుతారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇతరత్రా కొన్ని విషయాల్లో పుట్టుక, స్థిర నివాసం ప్రాతిపదికపైన కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించారు.
ఉదా- నిబంధన 16 ప్రకారం.. స్థిరనివాస ప్రాతిపదికపైన లోకల్, నాన్‌లోకల్ అని వర్గీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక మినహాయింపులు ఇస్తున్నారు. - జమ్మూకశ్మీర్‌లో జన్మించిన వారికి శాశ్వత నివాసం ఏర్పరచుకున్నవారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అక్కడ స్థానికేతరులకు శాశ్వతంగా నివాసం ఏర్పరచుకునే హక్కు లేదు.
- ఆదివాసి ప్రాంతాల్లో నివసించే వారికి కూడా కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు.
- కెనడా సమాఖ్యవలె భారతదేశంలో కూడా ఏక పౌరసత్వాన్ని కొనసాగించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడటం.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Next article
General Science | ఇనుమును సంగ్రహించే కొలిమి పేరు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు