నయా ట్రెండ్.. పార్ట్ ఓనర్షిప్!
- మహానగరాల్లో సరికొత్త విధానం
- స్థిరాస్తుల కొనుగోలుద్వారా సుస్థిర ఆదాయం
స్థిరాస్తుల కొనుగోలు, పెట్టుబడుల్లో నయా ట్రెండ్ మొదలైంది. ఇప్పటివరకూ 100%, 50:50 ఉన్న షేర్.. ఇప్పుడు 2%, 5% కూ వచ్చేసింది. మహానగరాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో వ్యక్తిగతంగా కొనుగోలు చేయడం భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తిలో కొంత భాగాన్ని మాత్రమే కొనుగోలు చేయడం, దానిద్వారా సుస్థిర ఆదాయం పొందడమనేది ‘నయా ట్రెండ్’గా మారింది. విదేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఈ ‘పార్ట్ ఓనర్షిప్’ విధానం.. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ మహానగరంలోవిస్తరిస్తున్నది.
- అమెరికాలో నివాసముండే అరుణ్‌కుమార్, హైదరాబాద్‌లోని కమర్షియల్ స్పేస్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్నాడు. అయితే, ఒకేసారిగా భారీస్థాయిలో కాకుండా గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లోని ఓ కమర్షియల్ భవనంలో 1000 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశాడు. దానిద్వారా నెలనెలా కొంత మొత్తంలో స్థిర ఆదాయాన్ని పొందుతున్నాడు.
- సంజీవరెడ్డినగర్‌కు చెందిన కళ్యాణ్, నగర శివారులో నిర్మిస్తున్న రిసార్ట్, వీకెండ్ హోమ్స్ ప్రాజెక్టులో కొంత భాగాన్ని కొనుగోలు చేశాడు. తనకు అవసరమైనప్పుడు అక్కడ ఒకటి, రెండు రోజులు సేదతీరుతూ, మిగతా సమయంలో దాన్ని అద్దెకు ఇస్తున్నాడు. దీని ద్వారా సుస్థిరమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
.. ఇలా అరుణ్‌కుమార్, కళ్యాణ్ మాత్రమే కాదు భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేందుకు అనేకమంది ఆసక్తి చూపుతున్నారు. నివాస సముదాయాలతోపాటు కమర్షియల్ ప్రాజెక్టుల్లోనూ ‘పార్ట్ ఓనర్షిప్’ను కలిగి, స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ఇలా నగరంలో ప్రైమ్ ఏరియాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలితోపాటు బేగంపేట, సికింద్రాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో చేపడుతున్న భారీ వ్యాపార భవనాల్లో ‘పార్ట్ ఓనర్షిప్’ మార్గంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇన్నాళ్లూ విదేశాలకే పరిమితమైన ఈ ట్రెండ్.. హైదరాబాద్ నగరంలోనూ క్రమంగా విస్తృతమవుతున్నది.
100 చ.అ. నుంచి..
‘ఎంత పెట్టుబడికి అంత లాభం.. ఆదాయం’ అనేలా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు తమ భారీ ప్రాజెక్టుల్లోకి ‘పార్ట్ ఓనర్షిప్’ను ఆహ్వానిస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వందల సంఖ్యలో ఉండగా, అక్కడ 20నుంచి 30 అంతస్తుల్లో భారీ కమర్షియల్ భవనాలను నిర్మిస్తున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు కనీసం 100 చదరపు అడుగుల స్థలాన్నికూడా విక్రయిస్తున్నాయి. ఏరియాను బట్టి, నిర్మాణ సంస్థనుబట్టి చదరపు అడుగుకు రూ. 5వేల నుంచి రూ.20వేల దాకా ధర నిర్ణయిస్తున్నాయి. ఇలా.. ఒక్కొక్కరూ 100 చదరపు అడుగుల నుంచి 1000, 2000 చదరపు అడుగుల స్థలాన్ని రూ.5 లక్షలు మొదలుకొని రూ.4 కోట్ల దాకా ‘పార్ట్ ఓనర్షిప్’కింద పెట్టుబడులు పెడుతున్నారు. భవనాల నిర్వహణనుకూడా ఆయా కంపెనీలే చూస్తూ.. కొనుగోలుదారులకు రిస్క్ లేకుండా, పెట్టుబడికి అనుగుణంగా అద్దెలు చెల్లిస్తున్నాయి.
‘కమర్షియల్’తోనే..
హైదరాబాద్ మహానగరంలో నివాస, వ్యాపార సముదాయాల ద్వారా అద్దెలరూపంలో ఆదాయం సంతృప్తికరంగానే ఉంది. అయితే, నివాస గృహాలద్వారా వచ్చే ఆదాయం 3 శాతం ఉంటే, కమర్షియల్ భవనాల ద్వారా 6-8 శాతం ఆదాయం వస్తుంది. అందుకే, చాలామంది కమర్షియల్ భవనాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితోనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పొంది, స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. సర్వీసు అపార్ట్మెంట్లు, హాస్టల్ భవనాలు, ఇతర చిన్నసైజు భవనాలనుకూడా నలుగురైదుగురు కలిసి కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇలాంటి పెట్టుబడులు నగరంలో ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. పర్యాటక ప్రాంతాలు, వీకెండ్ కేంద్రాలు, రిసార్టులు, క్లబుల్లోనూ పెట్టుడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతున్నది. ఇక్కడకూడా పెట్టుబడిపై మంచి లాభాలు వచ్చే అవకాశమున్నది. దీంతో ఇక్కడ స్థిరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా తమకు కావాల్సినప్పుడు కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ప్రాంతాల్లో ప్రవాస భారతీయులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
స్థిరమైన ఆదాయం
హైదరాబాద్‌లోని కమర్షియల్ ప్రాపర్టీలలో కొంత వాటాను కొనుగోలు చేసే విధానం ఇప్పుడిప్పుడే మొదలైంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లు, సెజ్‌లలోని భారీ భవనాల్లో కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి, నెలనెలా ఆదాయం పొందేవారి సంఖ్య పెరుగుతున్నది. దీనివల్ల స్థిరమైన ఆదాయంతోపాటు ఆస్తికి భద్రతకూడా ఉంటున్నది. బంగారం, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకు వడ్డీల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు రెంటల్ గ్యారెంటీకూడా ఇస్తున్నాయి. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలదాకా పెట్టుబడి పెడితే, భవనంలోని కొంత స్థలాన్ని వారి పేరున రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు వచ్చిన అద్దెను పంచుతున్నాయి.
చెరుకు రామచంద్రారెడ్డి, రియల్ ఎస్టేట్ నిపుణులు
బరిగెల శేఖర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు