దోమ కాటే టీకా!
- దోమల ద్వారా టీకాల పంపిణీ
- నేరుగా రక్తంలోకి వ్యాక్సిన్
- పదేండ్ల క్రితం ప్రయోగాత్మకంగా రుజువు చేసిన జపాన్ పరిశోధకులు
- కరోనా టీకాల పంపిణీకి కీటక సాయం?
- పరిమితులున్నాయంటున్న నిపుణులు
యుద్ధంలో విజయం సాధించడానికి గ్రీకులు, రోమన్లు శత్రు సైన్యంపై తేనెటీగలు, తేల్లను ప్రయోగించేవారట. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా విమానాలతోనే గాకుండా గబ్బిలాల సాయంతో కూడా బాంబులను విసిరినట్టు ఆధారాలు ఉన్నాయి. దేశంలో కరువు తాండవిస్తుండటంతో పావురాల కాళ్లకు విత్తన సంచులను కట్టి.. విస్తారంగా పంటలు పండించిన దక్షిణాఫ్రికన్ల వినూత్న ప్రణాళికలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి దోమలు ఒక వారధులుగా మారనున్నాయా? దశాబ్దం క్రితం జపాన్ పరిశోధకులు చేసిన ఓ పరిశోధన ఈ కొత్త ఆలోచనలకు జీవం పోస్తున్నది.
ఇరవై ఏండ్ల క్రితం ఆఫ్రికా, ఆసియా, అమెరికా, దక్షిణ ఐరోపాలోని పలు దేశాల్లో ‘లెయిష్మెనియాసిస్’ అనే చర్మ వ్యాధి పెద్దఎత్తున ప్రబలింది. ఎడారిలో ఉండే కొన్ని ఈగలు, కీటకాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ప్రొటోజోవా వర్గానికి చెందిన ఓ పరాన్నజీవి వల్ల కలిగే ఈ వ్యాధి సోకిన వారి చర్మం దద్దుర్లతో నిండిపోతుంది. రక్తస్రావం జరిగి తీవ్ర అనారోగ్యం కలుగుతుంది. అయితే, ఈ వ్యాధిని తగ్గించడానికి ‘ఎస్పీ 15’ అనే వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో పంపిణీ చేశారు. అయితే, కొన్ని ఆఫ్రికా దేశాల్లోని ట్రైబల్ ఏరియాలకు ఈ టీకాను పంపిణీ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇంగ్లీష్ మందులను వేసుకోవడానికి అక్కడి ప్రజలు ఆసక్తి చూపకపోవడం, రవాణా తదితర అంశాలే దీనికి కారణం. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అక్కడి ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. దీంతో జపాన్ పరిశోధకులు ‘దోమలను’ రంగంలోకి దించారు.
దోమలను కుట్టించి..
మనిషిని కుట్టి రక్తం పీల్చేముందు దోమలు ఓ రకమైన సలైవా (లాలాజలాన్ని) స్రవిస్తాయి. కుట్టినప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఇది సాయపడుతుంది. దీంతో దోమలు మనిషి రక్తాన్ని ఆటంకంలేకుండా పీలుస్తాయి. ఆఫ్రికా దేశాల్లోని అడవి ప్రాంతాల్లో దోమలు ఎక్కువ. అందుకే వాటి లాలాజలంలో చాలాకాలం జీవించేట్టు వీలుగా ఎస్పీ 15లో కొన్ని మార్పులు చేసి అక్కడి దోమల్లోకి ఈ టీకాను ఎక్కించి ఆ దోమలను వ్యాక్సినేటర్‌లుగా పిలిచారు. ఈ వ్యాక్సినేటర్లు కలిసే దోమలు, అవి పెట్టే గుడ్లలో కూడా ‘ఎస్పీ 15’ వ్యాక్సిన్ మూల పదార్థం ఉండేలా చూసుకున్నారు. ఇలా అసంఖ్యాకంగా మారిన వ్యాక్సినేటర్ దోమలు అక్కడి ప్రజలను కుట్టడం వల్ల.. వాటి లాలాజలంలోని ఎస్పీ15 వ్యాక్సిన్ అక్కడి ప్రజల శరీరాల్లోకి ప్రవేశించింది. క్రమంగా లెయిష్మెనియాసిస్ వ్యాధి కట్టడి జరిగింది. ఈ వివరాలు ‘ఇన్సెక్ట్ మాలిక్యులర్ బయాలజీ’లో కూడా ప్రచురితమయ్యాయి.
ఇప్పుడు ఆ టెక్నిక్ పనిచేస్తుందా?
ఎస్పీ15 వ్యాక్సిన్‌ను పంపిణీ చేసినట్టు.. ఫైజర్, మోడెర్నా, కొవిషీల్డ్, కొవాగ్జిన్ వంటి టీకాలను కూడా దోమలు/కీటకాల ద్వారా మనుషులకు ఇంజెక్ట్ చేయాలని పలువురు సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇది అంత సులువుగా జరుగకపోవచ్చు. ఒక టీకా తయారీకి కనీసం దశాబ్దకాలం పడుతుంది. కరోనా వ్యాక్సిన్‌ను ఏడాది వ్యవధిలోనే అభివృద్ధి చేశారు. కాబట్టి దీనికి చాలా పరిమితులు ఉన్నాయి. ఇతర జీవుల సలైవాలో ఈ వ్యాక్సిన్ పనితీరుపై ప్రయోగాలు జరుగలేదు. ఎస్పీ15 వ్యాక్సిన్‌లో కొన్ని మార్పులను చేసిన పరిశోధకులు దాన్ని తీసుకునే మోతాదులో ఎలాంటి పరిమితులను విధించలేదు. దీంతో ఒక వ్యక్తిని ‘ఎస్పీ15’ ఇంజెక్ట్ చేసిన దోమలు ఎన్నిసార్లు కుట్టినప్పటికీ ప్రమాదం జరుగలేదు. కరోనా కట్టడికి ప్రస్తుతం రెండు డోసుల టీకాను వైద్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. దోమల ద్వారా ఈ టీకాను పంపిణీ చేస్తే, ఒక వ్యక్తి శరీరంలోకి రెండు డోసుల కంటే ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ ఇంజెక్ట్ అయ్యే అవకాశమున్నది. కాబట్టి, ప్రస్తుతానికైతే, కరోనా టీకాలను దోమలు/కీటకాల ద్వారా పంపిణీ చేయడం కుదరకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఆ అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు అంటున్నారు.
-నేషనల్ డెస్క్
- Tags
- bite
- byte
- corona vaccine
- mosquito
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు